(Published in SURYA daily on 07-12-2019, Saturday)
ఒకానొక
కాలంలో జరిగిన సంఘటనలను గురించి చదువుతున్నప్పుడు అలా జరగడం సంభవమేనా, సంభవమైనా
సబబేనా అనే సందేహాలు కలగడం సహజం. ఇప్పుడు
చెప్పబోయే అలాంటి ఒక విషయం 1987 నాటిది. అంటే మూడు దశాబ్దాల పై చిలుకు కాలం,
కాలగర్భంలో కలిసిపోయింది. ఆనాడు
చిన్నపిల్లలుగా వున్నవాళ్ళు ఎదుగుతూ వచ్చి ఈరోజున ప్రౌఢవయసులో వుండివుంటారు. అప్పటి సంగతుల
మీద స్పష్టమైన అవగాహన ఉండడానికి అవకాశంలేని
అలాటివారి కోసమే, అలనాటి కాలమాన పరిస్తితులను గురించి ఈ చిన్న వివరణ.
వేగంగా
వెడుతూ రోడ్డు ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలను కాపాడడంలో హెల్మెట్ ధారణ చాలావరకు
ఉపకరిస్తుంది. సందేహం లేదు. ప్రధానంగా ద్విచక్రవాహనాలకు సంబంధించినంతవరకు ఇది
కాదనలేని వాస్తవం. అయితే ఆ నిబంధనను నాటి పోలీసు అధికారులు అమలు చేయడానికి ఎంచుకున్న
విధానాలపట్లనే ప్రజల్లో నిరసన పెద్ద
ఎత్తున వ్యక్తమైంది. కాకపొతే, ఇప్పట్లా ఇన్ని రకాల ప్రసార మాధ్యమాలు లేకపోవడంతో
జర్నలిస్టుల ఆందోళన కారణంగానే ఆ విషయం వెలుగులోకి వచ్చింది. నాటి పరిస్తితుల
నేపధ్యాన్ని ఒకసారి గమనంలోకి తీసుకుని పరిశీలిస్తే ఈ విషయంలో తలెత్తే అనుమానాలు ఓ
మేరకు నివృత్తి అయ్యే అవకాశం వుంది.
ద్విచక్ర
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్
ధరించాలనే నిబంధన విధించింది సాక్షాత్తూ నాటి
ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. హెల్మెట్ నిబంధన అమలు బాధ్యతను ఒప్పగించింది అత్యుత్తమ పోలీసుఅధికారిగా పేరు
తెచ్చుకున్న కే.ఎస్. వ్యాస్ గారికి.
విజయవాడలో
పనిచేసినప్పుడు వ్యాస్ గారు తనదైన వ్యవహార శైలితో ఆ నగరాన్ని (అప్పుడు పట్టణం)
శాంతి భద్రతలకు నిలయంగా మార్చారు. రౌడీలు, సంఘ విద్రోహ శక్తులకు సింహస్వప్నమై
నిలిచారు. నాకు తెలిసిన కుటుంబపెద్ద ఒకరు ఆ రోజుల్లో నాతో చెప్పారు, అల్లరి చిల్లరగా తిరిగే తన కొడుకు పెందలాడే బుద్ధిగా ఇంటికి వస్తున్నాడని, వ్యాస్ ఫోటో పెట్టుకుని
రోజూ దణ్ణం పెట్టుకుంటున్నామని. ఆయన సమర్ధతకు ఇదొక కితాబు. ముఖ్యమంత్రి
ఉద్దేశాన్ని కూడా శంకించాల్సిన పరిస్తితి కాదు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలను కట్టడి
చేయాలంటే హెల్మెట్ ధారణ అవసరమనే నిపుణుల అభిప్రాయం మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకుని
వుంటారు. అయితే వచ్చిన చిక్కల్లా ఆ నిబంధన అమలు తీరులోనే వచ్చింది.
ఇప్పుడు
చెప్పినా నమ్మేవాళ్ళు ఉంటారా అనే పద్దతిలో వ్యాస్ గారు తన కార్యాచరణ మొదలు
పెట్టారు. హెల్మెట్ ధరించని వారిని వెంటాడి పట్టుకోవడం కోసం ప్రతి ప్రధాన కూడలి
వద్దా ఒక పోలీసు బృందం మోటారు సైకిళ్ళపై సిద్ధంగా వుండేది. నిజానికి హెల్మెట్ ధరించనివాళ్ళు
దొంగలూ కాదు దోపిడీదారులూ కాదు. వారిని పట్టుకుని చలనాలు వసూలు చేయడానికి ఇంత భారీ
స్థాయిలో ఏర్పాట్లు అవసరమా అనేది అప్పుడు సామాన్య వాహనదారుల్లో తలెత్తిన ప్రశ్న.
పైగా పోలీసులు వారికి వేరే పనేమీ లేదన్నట్టు ఈ ఒక్క విషయం పైనే దృష్టి పెట్టారు.
నేను ఒక పోలీసు ఉన్నతాధికారిని అడిగాను.
‘సికిందరాబాదు స్టేషన్ నుంచి మీ పేరు చెప్పకుండా మీ భార్యపిల్లలను ఇంటికి ఆటోలో రమ్మనమని చెప్పండని. ఎగస్ట్రా డబ్బులు
అడగకుండా ఏ ఆటోవాడయినా వస్తే మేము ఈ హెల్మెట్
ఆందోళన విరమించుకుంటామని. అయన నవ్వేశాడు జవాబు చెప్పకుండా.
‘నాకు
హెల్మెట్ వుంది. ఈ సందులోనే మా ఇల్లు. మా అమ్మకు మందు కొనడానికి మందులషాపు పక్కనే
కదా అని తొందరలో హెల్మెట్ మరచిపోయి వచ్చాను. చూడండి లుంగీ మీదనే వున్నాను’ అన్నా
వినకుండా ట్రాఫిక్ పోలీసులు చలానాలు రాసిన
వార్తలు అనుదినం పత్రికల్లో వచ్చేవి. పోలీసుల అతి ఉత్సాహాన్ని వేళాకోళం చేస్తూ
పత్రికల్లో అనేక కార్టూన్లు వచ్చేవి. ఇవన్నీ సహజంగా ప్రభుత్వాన్ని చీకాకు
పెట్టేవే.
ఆ రోజుల్లో హైదరాబాదులో విలేకరుల సంఖ్యే నామమాత్రం. మళ్ళీ వారిలో ద్విచక్ర వాహనాలు వాడే వారిని
వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. హిందూ రాజేంద్ర ప్రసాద్ వంటి ఒకరిద్దరికి మాత్రం పాత
మోడల్ కార్లు ఉండేవి. పత్రికా విలేకరుల
జీత భత్యాలు అంతంతమాత్రం. ఎన్నోసార్లు బంకుల్లో డబ్బులు లేక అరలీటరు పెట్రోలు
కొట్టించుకుని సరిపుచ్చుకున్న సందర్భాలు
అనేకం. వీరు వృత్తిరీత్యా నగరంలో అనేక ప్రాంతాలు తిరగాల్సి వుంటుంది. బేగం పేట
ఎయిర్ పోర్ట్, అసెంబ్లీ, సచివాలయం ఇలా రోజంతా తిరుగుళ్ళే, వెంట తెచ్చుకున్న
హెల్మెట్ ని ఎక్కడన్నా మరచిపోవడానికి కానీ,
లేదా పోగొట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువ.
రాష్ట్ర రాజధానిలో సయితం రోడ్లు సరిగా ఉండేవి
కావు. ఇప్పుడు వున్నాయని కాదు. కాకపొతే అప్పటికంటే చాలా మెరుగు. అడుగడుగునా
గోతులు, మిట్టపల్లాలతో వుండే రోడ్లపై వేగంగా పోవడం అసాధ్యమని అధికారులకు,
మంత్రులకు ఎన్ని సార్లు విన్నపాలు చేసుకున్నా ఫలితం లేకపోయింది.
ఓ రోజు రేడియోలో పని ముగించుకుని ఇంటికి
వస్తుంటే అప్పుడే వర్షం పడి వెలిసినట్టు
వుంది. త్యాగరాయ గాన సభ దగ్గర పోలీసుల
హడావిడి కనిపించింది. హైదరాబాదు పోలీసు
కమీషనర్ టీ.ఎస్. రావు గారు అప్పుడే కారు
దిగి నిలబడ్డారు. నేను ఆయన వద్దకు వెళ్లి ‘ఒకసారి ఇటు రండి’ అని రోడ్డుపై పారుతున్న నీళ్ళల్లో నా కాలిని బలంగా ఆనించాను. దాదాపు మోకాలు దాకా
దిగిపోయింది. ‘సార్ ! ఇలాటి గుంతల రోడ్లపై
వేగంగా వెళ్ళడం ఎలా కుదురుతుందో చెప్పండ’ని అడిగాను. ఆయన తన సహజ ధోరణిలో చీకాకు
పడకుండా చిరునవ్వుతోనే జవాబు చెప్పారు. భావం ఏమిటంటే రోడ్ల నిర్వహణ తమ శాఖకు
సంబంధించింది కాదని. నిజమే! రోడ్ల నిర్వహణ పోలీసులది కాదు. ప్రజలకు సేవ చేయడంలో
ఎదురయ్యే లోపాలకు ప్రభుత్వ విభాగాలు ఒకరిపై మరొకరు నెపాలు మోపుకునే వెసులుబాటు
వుంది. కానీ పౌరులు మాత్రం ఏదో మిష చూపి
తప్పించుకోవడానికి వీలుండదు.
వాహనదారుల రక్షణకు హెల్మెట్ అవసరమే. కానీ
ఇదొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం అన్న పద్ధతిలో నాడు ఈ విధానం అమలు జరగడమే విమర్శలకు తావిచ్చింది. సరే హెల్మెట్లు ధరించడం
పౌరుల బాధ్యతే అనుకుందాం. మరి రోడ్లమీద స్పీడ్ బ్రేకర్లు వుంటాయి. దగ్గరికి వచ్చిన
దాకా అక్కడ స్పీడ్ బ్రేకర్ ఒకటి వున్నట్టు తెలవదు. నిజానికి నిబంధల ప్రకారం వాటి
మీద పసుపు నలుపు రంగు చారలు స్పష్టంగా కనిపించేటట్టు పెయింట్ వేయాలి. వాటికి
కొద్ది దూరంలో దగ్గరలో ‘స్పీడ్ బ్రేకర్ వున్నది జాగ్రత్త’ అనే సైన్ బోర్డు ఏర్పాటు
చేయాలి. ‘ఏవీ!ఇవేవీ ఎందుకు కనబడవు’ అంటే ‘నిధుల కొరత’ అంటారు, సామాన్యుల దగ్గర మాత్రం డబ్బు సంచులు మూలుగుతున్నట్టు అక్కడికక్కడే
ముక్కు పిండి జరిమానాలు వసూలు చేస్తారు. ఇదేమి న్యాయమో చెప్పండి. ఇదీ ఆరోజుల్లో మా
(జర్నలిస్టుల) వాదన.
ఈ నేపధ్యంలో, ఇంటలిజెన్స్ చీఫ్ హెచ్ జే
దొరగారికీ, పోలీసు కమీషనర్ టీ ఎస్ రావు గారికీ విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది.
ఎందుకంటే రామారావుగారికి చెప్పగల ధైర్యం ఎవ్వరికీ లేదు. ఒకరోజు పొద్దున్నే నేను
జూబిలీ హిల్స్ లోని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోయి హెల్మెట్ విషయంలో
జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులు గురించి
చెప్పాను. విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజూ అనేక చోట్లకు వెళ్ళాల్సి ఉంటుందని,
అసలే చాలీచాలని జీతాలతో వెళ్ళదీస్తున్న వారికి, హెల్మెట్ పోయినా, లేదా ఎక్కడయినా
మరచిపోయినా అంతంత డబ్బులు పోసి
కొనుక్కోవడం కష్టంగా ఉంటుందని చెప్పాను. ఆయన అంతా విని దొరగారికి ఫోను
చేసి, ఏదయినా చేయొచ్చేమో చూడమని చెప్పారు.
బహుశా ఆ మరునాడే అనుకుంటాను. 1987 జులై14 వ తేదీ. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగారి
తండ్రి, అప్పటి శాసనసభ్యులు అయిన ఎన్. అమర్ నాధ రెడ్డి
గారు అకస్మాత్తుగా మరణించడంతో అసెంబ్లీ వాయిదా పడింది. రేడియో వార్తలకు ఇంకా చాలా
వ్యవధానం వుండడంతో ఆంధ్రభూమిలో పనిచేసే నా మిత్రుడు సూర్యప్రకాష్ ను ఇంట్లో
దింపడానికి స్కూటర్ మీద విజయనగర్ కాలనీకి
బయలుదేరాను. మార్గం మధ్యలో ట్రాఫిక్ పోలీసు నాకు హెల్మెట్ లేదని ఆపాడు. దగ్గరలో వున్న హుమాయూన్
నగర్ పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్ళాడు. నా వెంట వచ్చిన సూర్యప్రకాష్ ఇంటికి
వెళ్లి, నన్ను పోలీసులు పట్టుకుపోయిన
విషయం ఇతర జర్నలిస్టులకు ఫోను చేసి చెప్పాడు. అంతే! బిలబిల మంటూ అనేకమంది
పాత్రికేయ సోదరులు అక్కడికి చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు మొదలు
పెట్టారు. నేను లోపల పోలీసు స్టేషన్ లో ఉన్నందువల్ల గమనించలేకపోయాను కానీ తరువాత
తెలిసినదేమిటంటే చాలామంది సీనియర్ పాత్రికేయులు కూడా అక్కడికి వచ్చి నాకు మద్దతుగా
నిలిచారని. వారిలో హిందూ రాజేంద్రప్రసాద్, ఎక్స్ ప్రెస్ సుందరం, జ్యోతి
వెంకట్రావు, క్రానికల్ రబీంద్ర నాథ్,సింహం, కన్నన్, పేట్రియాట్ ప్రభాకరరావు, న్యూస్
టైం కే.శ్రీనివాసరెడ్డి (ఇప్పుడు ఎడిటర్ తెలంగాణా టుడే), జర్నలిస్ట్ యూనియన్
నాయకులు కే. శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, కే.లక్ష్మారెడ్డి, నందిరాజు
రాధాకృష్ణ, లక్ష్మీ ప్రసాద్, జేబీరాజు
ఒకరా ఇద్దరా హైదరాబాదులో పేరుమోసిన పాత్రికేయులందరూ హుమాయూన్ నగర్ పోలీసు
స్టేషన్ కు చేరుకున్నారు. పరిస్తితిలోని తీవ్రత పోలీసులకు కూడా అర్ధం అయింది.
(అప్పటి హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ లో జర్నలిస్టుల ధర్నా)
మొత్తం మీద జర్నలిస్టుల ఆందోళన కారణంగా
ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో నన్ను
విడిచిపెట్టారు. కానీ మరునాడు విలేకరులు
అసెంబ్లీ కార్యకలాపాలను బహిష్కరించారు. ప్రెస్ గ్యాలరీ ఖాళీగా వుండడం
గమనించి స్పీకర్ జీ. నారాయణ రావు సభను వాయిదా వేసారు. అప్పుడు మద్రాసులో ఉన్న ముఖ్యమంత్రి రామారావు గారు వెంటనే స్పందించారు. సంఘటనతో
సంబంధం వున్న పోలీసు అధికారిని బదిలీ చేసారు. న్యాయ విచారణకు ఆదేశించారు. కొత్తగా హోమ్
మంత్రి బాధ్యతలు స్వీకరించిన
డాక్టర్ కోడెల శివప్రసాద్ రావుకు ఈ పరిణామాలు సహజంగానే ఇబ్బందికరంగా పరిణమించాయి.
హెల్మెట్ నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయలేదు కాని దాన్ని అమలు చేసే పద్ధతిలో కొంత
ఉదార వైఖరి చోటు చేసుకుంది. ఈ నడుమలో నాకు మాస్కో రేడియోలో ఉద్యోగం రావడం, నేను
కుటుంబంతో సహా సోవియట్ యూనియన్ వెళ్ళిపోవడం జరిగింది.
దరిమిలా
ఈ హెల్మెట్ అంశం రాజకీయ రంగును పులుముకుంది. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో
కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలలో హెల్మెట్ రద్దు అంశం కూడా చేర్చారు. ఆ ఎన్నికల్లో
టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే జరిగిన విజయోత్సవ సభలో హెల్మెట్ నిబంధనను రద్దు చేస్తున్నట్టు సభికుల హర్షధ్వానాల మధ్య
ప్రకటించారని ఆయనకు పీ ఆర్ ఓ గా పనిచేసిన జ్వాలా నరసింహారావు మాస్కోలో వున్న నాకు
ఫోనులో తెలియచేసాడు.
వాహనదారులకు రక్షణ కవచంలా ఉపయోగపడే హెల్మెట్
విషయంలో జర్నలిస్టులు ఇంత గొడవ పడడం సబబా
అన్న విమర్శలు కూడా వినపడ్డాయి.
కొన్ని సంఘటనలు అలా మన నిమిత్తం లేకుండా
జరిగిపోతుంటాయి. తప్పా ఒప్పా అనేది కొన్ని సందర్భాలలో కాలమే నిర్ణయిస్తుంది.
వెనక్కి తిరిగి చూసుకుంటే అత్యల్ప విషయాలుగా కూడా అనిపిస్తాయి. కాలం తెచ్చే మార్పు
ఇది.
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి