(Published in SURYA daily on
04-12-2019, Wdenesday)
“ఏవిటో ఈయన పాటా అర్ధం
కాదు, మాటా అర్ధం కాదు” అంటూ శంకరాభరణం
సినిమాలో వీధి అరుగుమీద సంగీతం పాఠాలు చెబుతూ శంకర శాస్త్రి గారిని ఎద్దేవా చేస్తూ
తనదయిన బాణీలో తెలుగు ప్రేక్షకులను ఆహ్లాదపరచిన పొట్టి (సంగీతం) మేష్టరు
గుర్తున్నాడా. గుర్తుంచుకోని ప్రేక్షకుడంటూ వుండరు. ఎందుకంటే ఒకే ఒక చిన్న
సన్నివేశంలో నటించి ప్రేక్షకులను అంత
గొప్పగా ఆకట్టుకున్న నటుడు కాబట్టి.
ఆ సినిమాకి, ఈ రేడియోకి ఏమిటి సంబంధం అంటే ఈ రేడియో శ్రీ గోపాలే ఆ
సంబంధం. పొతే, పేరులో వున్న ఈ శ్రీ
అనేది ఆయన పేరుకు ముందు గౌరవవాచకం కాదు, అసలు పేరులో భాగమే.
శ్రీ గోపాల్ తో నాకు పరిచయం వుంది. ఆయన ఎక్కడ వుంటే
అక్కడ ఉత్సాహం వెల్లివిరిసేది. మాటల పోగు. పరిచయం అయిన వారందరూ ఆయనకు స్నేహితులే. చొరవతో నలుగురిలో దూసుకుపోయే
తత్వం. మాటల్లో హాస్యం చిప్పిల్లేది.
‘నా పేరు బుడుగు, అసలు పేరు చాలా పొడుగు’ అని ముళ్ళపూడి వారన్నట్టు శ్రీగోపాల్ అసలు పేరు
కొంపెల్ల శ్రీ గోపాలకృష్ణమూర్తి. చేసే ఉద్యోగం ఒకటే అయినా ఆయన బహురూపి. రచయిత, కార్టూనిస్టు, ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
రంగస్థల, చలన చిత్ర నటుడు. ఇన్ని
కోణాలు ఉన్న మనిషి కాబట్టే ఆ శరీరం త్వరగా అలసినట్టుంది. విశ్రాంతి కోరుకుంది.
అందుకే, యాభయ్ ఏళ్ళు కూడా
నిండకుండానే నలభయ్ ఎనిమిదో ఏటనే ఆయనకు నిండు నూరేళ్ళు నిండాయి.
రేడియో పట్ల రేడియో కళాకారుల పట్లా స్వతహాగా అభిరుచి
పెంచుకున్న శ్రీ గుర్రం మధుసూదన్ సేకరించి పెట్టుకున్న సమాచార భాండాగారంలో శ్రీ
గోపాల్ వివరాలు కూడా వున్నాయి.
1938 జనవరి 20 వ తేదీన శ్రీ గోపాల్ కాకినాడలో
జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మే పట్టా పొందారు. పట్టాతో పాటు
స్వర్ణ పతకం సాధించారు. 1965 లో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ట్రాన్స్ మిషన్
ఎక్జిక్యూటివ్ (డ్యూటీ ఆఫీసర్) గా ఉద్యోగపర్వానికి శ్రీకారం చుట్టారు. అంతకుముందే
విద్యార్ధి దశనుంచే రాజకీయ కార్టూన్లు వేయడం మొదలు పెట్టారు. ఆలిండియా రేడియో
మద్రాసు, పోర్ట్
బ్లెయిర్(అండమాన్,నికోబార్) గోవా, విజయవాడ, కడప కేంద్రాలలో వివిధ
హోదాల్లో పనిచేశారు. ఆ రోజుల్లో కొత్తగా ప్రారంభించిన యువవాణి విభాగం అధిపతిగా
రేడియో మాధ్యమం పట్ల అభిరుచి వున్న అనేకమంది యువతీ యువకులకు ప్రోత్సాహం
కల్పించారు. ఆకాశవాణి ఏటా నిర్వహించే
పోటీల్లో నాలుగు సార్లు బహుమతులు అందుకున్నారు. ఎవరెస్ట్ విజేత టెన్సింగ్ నార్కే
గురించి ‘విక్రాంత గిరి శిఖరం’ పేరుతొ శ్రీ గోపాల్
సమర్పించిన రూపకానికి 1974 లో ప్రధమ బహుమతి లభించింది. గోదావరి నదిపై శ్రీ
బాలాంత్రపు రజనీకాంతరావు గారి నిర్వహణలో ‘కొండ నుండి కడలి దాకా’ అనే పేరుతొ శ్రీగోపాల్
సమర్పించిన రూపకం ఆయనకు చక్కటి పేరు తెచ్చింది. అలాగే భగవాన్ రమణ మహర్షి పై ఆయన
రూపొందించిన రూపకం రేడియో కార్యక్రమాలలో తలమానికంగా చెప్పుకుంటారు.
చలం నవల మార్తా ఆధారంగా పూర్ణ మానవుడు అనే పేరుతొ శ్రీ
గోపాల్ సమర్పించిన రేడియో నాటకానికి వార్షిక పోటీల్లో బహుమతి లభించింది.
1979 లో ఢిల్లీలో జరిగిన ఇండో అమెరికన్ డ్రామా ప్రొడ్యూసర్ల సదస్సుకు అప్పటి
ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీ గోపాల్ ప్రతినిధిగా ఎంపికయ్యారు.
జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన శంకరాభరణం చిత్రంలో
సంగీతం మాష్టారు దాసుగా శ్రీ గోపాల్ పాత్రపోషణ ప్రేక్షకులకు చిరకాలం
గుర్తువుంటుంది. ఆయన ఆ సినిమాలో ఆండాళ్ అనే పాపకు సంగీతం నేర్పుతూ, సంగీతం లో వేగం
పెరిగిందని, బ్రోచే వారెవరు రా అంటూ
ఆ పాటను విరిచి, విరిచి పాడుతుండగా, శంకర శాస్త్రిగారు
వచ్చి, ‘సంగీతాన్ని ఖూనీ
చెయ్యొద్దు దాసూ’ అని హెచ్చరిస్తారు.
మంచుపల్లకి, స్వాతిముత్యం, ఆలాపన, తాయారమ్మ
బంగారయ్య చిత్రాలలో కూడా ఆయన నటించారు.
1979 నుండి 82 వరకు హైదరాబాదు దూరదర్శన్ కేంద్రంలో
ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు.
కడప ఆకాశవాణిలో పనిచేస్తూ అనారోగ్యంతో 1986 మే 18న
హైదరాబాద్ లో శ్రీ గోపాల్ తుది శ్వాస విడిచారు.
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి