28, నవంబర్ 2019, గురువారం

రేడియో రోజులు - 28 - భండారు శ్రీనివాసరావు

(Published in SURYA daily on 29-11-2019, Friday)

రేడియో ఎవరు వింటున్నారు?

మంగళగిరి ఆదిత్య ప్రసాద్ అనేది ప్రసార భారతిలో కొత్తగా చేరి పనిచేసేవారికి ఒక అధికారి పేరు. కానీ సంగీత పరిజ్ఞానం కొద్దో  గొప్పో వున్నవారికి మాత్రం ఆయన ఒక సంగీత కారుడు. రేడియో అంటే సంగీతం అనుకునేవారు ఇలాటి అధికారులు రావాలని, వుండాలని కోరుకుంటారు. కాని ప్రసాద్ గారు మాత్రం రేడియో శ్రోతల సంఖ్య పెరగాలని కోరుకుంటూ వుంటారు. సందర్భం దొరికినప్పుడల్లా సమయం చూసుకుని తన మనసులోని మాటని బయట పెడుతుంటారు.




(మంగళగిరి ఆదిత్య ప్రసాద్)


"ఇప్పుడు రేడియోలు ఎక్కడ దొరుకున్నాయండీ" అనే ప్రశ్నకు జవాబు ఆయన వద్ద సిద్ధంగా వుంటుంది. అలా అడిగినవారికి ఒక చిన్న సైజు ట్రాన్సిస్టర్ రేడియో ఇచ్చి 'రేడియో దొరికింది కదా! ఇక వినండ'ని అంటుంటారని ఆయన గురించి మెచ్చుకోలుగా చెప్పుకునే ఒక  జోకు ప్రచారంలో వుంది.  కొన్నేళ్ళ క్రితం  ఆదిత్య ప్రసాద్ రాజభవన్ లో నాటి  గవర్నర్  నరసింహన్ గారిని కలుసుకున్నప్పుడు ఏకంగా వారికి ఒక చిన్ని  ట్రాన్సిస్టర్  రేడియోను  కానుకగా ఇచ్చారట. దాన్ని స్వీకరించిన గవర్నర్ ఎంతగానో సంతోషించారట.
2014 లో హైదరాబాదు రేడియో ప్రాంగణంలో డాక్టర్ పద్మనాభరావు గారు  రచించిన 'అలనాటి ఆకాశవాణి'  పుస్తక ఆవిష్కరణ సభలో ఆయనే ఈ విషయాన్ని మర్యాదకు భంగం కలగని రీతిలో చాలా మన్ననగా ప్రస్తావించారు. 'రేడియో ప్రచార సభ' ఆలోచన కూడా వారిదే.  
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ కే.వీ. రమణాచారి తమ ప్రసంగంలో   రేడియోతో తనకున్న  అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఆలిండియా సర్వీసులో చేరడడానికి ముందు ఆయన కొంతకాలం హైదరాబాదులో లెక్చరర్ గా పనిచేసారు. మధ్యాన్నం చాయ్ తాగడానికి ఆలిండియా రేడియో మీదుగా  వెళ్లివస్తుండేవారట. ‘ఆకాశవాణి – నిషేధిత ప్రాంతము’ అనే బోర్డు చూస్తూ జీవితంలో ఎప్పుడయినా రేడియో స్టేషన్ లోకి అడుగుపెట్టే అవకాసం వస్తుందా అని అనుకునేవారట. ఒకరోజు గేటు వద్ద సెంట్రీని మాటల్లో పెట్టి లోపల వరకూ వెళ్లారట కూడా. దరిమిలా ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా పలు పర్యాయాలు రేడియో రికార్దింగుల్లో, అలాగే ఒక రచయితగా కవిగా అనేకమార్లు రేడియో స్టేషన్ కు వచ్చినా ఆ తొలినాటి రేడియో ప్రవేశం మరపునపడలేదని గుర్తు చేసుకున్నారు. కేవీ రమణాచారి గారు.
సహజంగా హాస్య ప్రియులైన రమణాచారి చెప్పినట్టు ఈనాడు కావాల్సింది 'హాయ్ ఓయ్ రేయ్' అంటూ చెలరేగిపోయే మిర్చీ బజ్జీ శ్రోతలు కాదు. మంచి సంగీతాన్ని, మనిషికి కావాల్సిన విజ్ఞానాన్ని అందించే ఆకాశవాణి శ్రోతల సంఖ్య పెరగాలి. అందుకు నాందిగా ఆదిత్య ప్రసాద్ గారి మాదిరిగా ఒకరికొకరు చిన్న చిన్న రేడియోలు చిరుకానుకలుగా ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం రావాలి.
పోతే, రేడియో ఎవరు వింటున్నారు అని కదా మొదలు పెట్టింది.
ఇప్పటికీ పూర్వంలా ప్రతి ఇంట్లో రేడియో మోగుతూ ఉండకపోవచ్చు. కానీ నెట్లో రేడియో వినేవాళ్ళు బహు కొల్లలు.
నేను రేడియోలో పనిచేసే రోజుల్లో వార్తల్ని టైం ప్రకారం వినేవాళ్ళు నాకు తెలుసు. శ్రీ ఎం. సత్యనారాయణ రావు ఏ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శిగా పనిచేసే రోజుల్లో ఢిల్లీలో వారింట్లో కలుసుకున్నాను. చిత్రంగా నేను వెళ్ళిన సమయానికి ఆయన రేడియో వార్తలను చాలా శ్రద్ధగా వింటున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు. ఒకసారి రికార్డింగు పనిమీద ఇంటికి వెళ్లాను. కాసేపే ఆగి మొదలెడదా౦ అన్నారు. నాకు అర్ధం కాలేదు. ఒకటీ పది కాగానే పక్కనే వున్న ట్రాన్సిస్టర్ చేతిలోకి తీసుకున్నారు. ‘ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది.. అంటూ మొదలయ్యాయి. ఓహో! ఇందుకా ఆగమన్నది అని అప్పుడు బోధ పడింది.
మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ గా పనిచేసిన రోశయ్య గారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వార్తలు వినేవారు. మరో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా అలాగే మంచి రేడియో శ్రోత. ఉమ్మడి రాష్ట్రంలో  చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా వున్నప్పుడు   ఖమ్మం నుంచి రోడ్డు మార్గాన హైదరాబాదు వస్తూ మధ్యాన్నం రేడియో వార్తల టైం కాగానే డ్రైవర్ని కారు పక్కకు తీయమని చెప్పి వార్తలు వినేవారు. ఈవిషయాన్ని ఆయనే స్వయంగా నాకు చెప్పారు.
ఢిల్లీలో సెంటర్ ఫర్ మీడియా సర్వీసు అనే ప్రసిద్ధ సంస్థ సంస్థాపకులు డాక్టర్ ఎన్.   భాస్కర రావు చేతిలో ఎప్పుడూ ఒక చిన్న రేడియో వుంటుంది. ప్రతి రేడియో బులెటిన్ ను ఆయన శ్రద్ధగా వింటుంటారు.
ప్రస్తుతం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ప్రధాన పౌరసంబంధాల అధికారిగా పనిచేస్తున్న శ్రీ జ్వాలా నరసింహారావుకు రేడియో వార్తలు వినే అలవాటు వుంది. కారులో వెడుతున్నాకూడా  వార్తల సమయం కాగానే రేడియోపెట్టి వార్తలు వింటుంటారు.
ఈ జాబితాలో చివరన పేర్కొంటున్నప్పటికీ  రేడియో శ్రోతల్లో ప్రధముడుగా చెప్పాల్సిన వ్యక్తి కప్పగంతు శివరామ ప్రసాద్, రేడియో అభిమాని అనే బ్లాగు నడుపుతూ ఆకాశవాణి కళాకారుల అపురూప చిత్రాలను సేకరించడం ఆయన హాబీ.             
(ఇంకా వుంది)

3 కామెంట్‌లు:



  1. ఆయ్ మేము కూడా వింటూంటామండీ :)

    ఎక్కడుందీ రేడియో ? టీవీ తో పాయెన్ :)



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒక్కటైనా పనికివచ్చే వ్యాఖ్య ఉండదు. అన్నీ తింగరి మాటలే.

      తొలగించండి
  2. ఆదిత్య ప్రసాద్ గారు గొప్ప సంగీతాభిమాని. స్వయంగా వయొలిన్ కూడా వాయిస్తారు. సంగీత కార్యక్రమాలు జరపడం లో ఆయన సహకారం ఎనలేనిది.

    రిప్లయితొలగించండి