( Published in SURYA daily on 26-11-2019, Tuesday)
ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్
కొన్ని శబ్దాలు చెవుల్లో ఎప్పుడూ మార్మోగుతూనే ఉంటాయి. కొన్ని స్వరాలు
నాలుకపై నిరంతరం నాట్యం చేస్తూనే ఉంటాయి. కాలచక్రం గిర్రున తిరిగినా, కాలదోషం పట్టని కొన్ని అద్భుతాలు ఉంటాయి. అలాంటి
వాటిల్లో ఒకటి ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్. ప్రతి రోజూ ఉదయం రేడియోలో వినిపించే ఆ
సుస్వరం వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మాండలీన్, వయోలిన్, పియానో, కలగలసిన అద్భుతమైన ఆ రాగం పురుడు పోసుకుని ఇప్పటికి
ఎనభై ఏళ్ళు దాటింది. అయినా, నేటికీ ఆ ట్యూన్ స్మార్ట్ ఫోన్ లో రింగ్ టోన్‌గా వినిపిస్తోంది. వాట్సప్
గ్రూపుల్లో షేర్ అవుతూనే ఉంది.
ఇంతకీ ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్‌ని కంపోజ్ చేసిందెవరో తెలుసా..? ఆ సంగీతజ్ఞుడి పేరు వాల్టర్
కౌఫ్‌మన్. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన వ్యక్తి. 1934లో ముంబైకి వచ్చిన కౌఫ్‌మన్, బాంబే చాంబర్ మ్యూజిక్ సొసైటీలో పియానో
వాద్యకారుడిగా ఉండేవాడు. ఇండియన్ బ్రాడ్‌కాస్ట్ కంపెనీ విజ్ఞాపన మేరకు 1936లో ఒక ట్యూన్ కంపోజ్ చేసి ఇచ్చాడు కౌఫ్‌మన్. పాశ్చాత్య, శాస్త్రీయ సంగీతాల మేళవింపుగా దీనిని రూపొందించాడాయన. శివరంజని రాగం
ఆధారంగా దీనిని కంపోజ్ చేశారని చెబుతారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఈ
ట్యూన్‌ని మారుద్దామని కొందరు అన్నారట! అయితే, ఈ స్వరంలో ప్రణవనాదం అయిన ఓంకారం
ప్రతిధ్వనిస్తున్నట్టు ఉందనే అభిప్రాయంతో ఆ ట్యూన్ మార్చే ప్రయత్నాన్ని
విరమించుకున్నారట ఆకాశవాణి అధికారులు.
1934 లో
ఇండియాకు వచ్చిన పద్నాలుగేళ్ళపాటు ఈ దేశంలోనే వుండిపోయాడు. బాంబేలోని విల్లింగ్టన్
జింఖానాలో ప్రతి గురువారం నాడు ఒక సంగీత కచ్చేరీ ఇచ్చేవాడు. ఆయన బృందంలో ప్రపంచ
ప్రఖ్యాతి గాంచిన సంగీత విద్వాంసుడు
జుబెన్ మెహతా తండ్రిగారయిన మెహ్లీ మెహతా
వుండేవారు. ఆయన వయొలిన్ పైనా, కౌఫ్‌మన్
పియానో పైనా శ్రోతలను అలరిస్తూ వుండేవారు.
ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్
ట్యూన్ లో వయొలిన్ వాయించింది మెహ్లీ మెహతా అనేవారు కూడా లేకపోలేదు.
కౌఫ్‌మన్ సంగీతంలో దిట్ట. పూర్వపు జెకొస్లవాకియా దేశంలో 1907 లో జన్మించిన ఈ సంగీత కారుడు, బెర్లిన్
సంగీత కళాశాల నుంచి పట్టా పుచ్చుకున్నాడు. నాజీల బాధితుడిగా అతడు భారతదేశానికి ఓ
కాందిశీకుడుగా వచ్చాడు. ఇండియాకు వీసా దొరకడం చాలా సులభం కాబట్టి తాను ఈ దేశాన్ని
ఎంచుకున్నానని ఆయన చెప్పేవాడు.
1937 నుంచి 1946 వరకు
ఆల్ ఇండియా సంగీత విభాగంలో డైరెక్టర్ గా రేడియోలో పనిచేశాడు. ఈ దేశపు అతి గొప్ప సంగీత కళాకారులను గురించి
తెలుసుకోవడానికి ఈ ఉద్యోగం ఎంతగానో ఉపకరించిందని తను రాసిన ఒక పుస్తకంలో ఆయన వెల్లడించారు.
పాతతరానికి చెందిన అనేకమంది భారతీయ సంగీత విద్వాంసులు రేడియో వారు చెక్కుల రూపంలో ఇచ్చే ప్రతిఫలాన్ని తీసుకోవడానికి
ఇష్టపడేవారు కాదని, విచ్చు రూపాయలలో ఇస్తే సంతోషంగా తీసుకునేవారని, ఆ నాణేలను
జాగ్రత్తగా లెక్కపెట్టుకోవడానికి తమ వెంట ఎవరో ఒకరిని తోడు తెచ్చుకునేవారని తన
పుస్తకంలో పేర్కొన్నారు.
ఇండియా వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత 1957 లో అమెరికాలో స్థిరపడడానికి ముందు
కొన్నేళ్ళు ఇంగ్లాండ్ లో, కెనడాలో గడిపారు. 1984 లో కౌఫ్‌మన్ అక్కడే కన్ను మూశారు.
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి