21, నవంబర్ 2019, గురువారం

రేడియో రోజులు - 21 - భండారు శ్రీనివాసరావు

(Published in SURYA daily on 21-11-2019, Thursday)
వార్తలు చదువుతున్నది అద్దంకి మన్నార్  
“మన్నార్. అంటే మన  తెలుగు వాడేనా. కాకపొతే  తెలుగులో ఈయన చేత వార్తలు ఎందుకు చదివిస్తున్నారు? ఇంటి పేరు అద్దంకి కదా! తెలుగువాడే అనడానికి వేరే రుజువెందుకు?’
ఇలా సాగేవి చిన్నప్పుడు ఊళ్ళల్లో పంచాయతీ  రేడియో వింటూ చర్చలు.
అద్దంకి మన్నార్ పదహారణాల తెలుగువాడు.  పూర్తి పేరు అద్దంకి ఎంబెరు మన్నార్. మాటా, పలుకూ, ఆహార్యం ఇలా అన్నింటా తెలుగుతనం తొణికిస లాడేది. పైగా సంప్రదాయానికీ, ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేసే కుటుంబం నుంచి వచ్చిన వాడు.
మన్నార్ కుమారుడు అద్దంకి రాం కుమార్ కూడా రేడియోలోనే పనిచేసి రిటైర్ అయ్యాడు. తాను రూపొందించిన అనేక కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో సైతం పురస్కారాలు అందుకున్నాడు. నేను రేడియోలో పనిచేసిన రోజుల్లో మా వార్తా విభాగంలోనే పనిచేస్తూ అందరికీ తలలో నాలిక మాదిరిగా ఉండేవాడు. ఎప్పుడో పూర్వ కాలంలో  రేడియోలో తమ గొంతు వినిపించిన అనేక మంది ప్రసిద్దుల స్వరాలను రాం కుమార్ భద్రపరిచి ఉంచాడు. తండ్రికి నిజమైన వారసుడు అనిపించుకున్నాడు. 
ఆయన మన్నార్ గురించి చెప్పిన ఓ కధనం ఆసక్తిదాయకంగా వుంది.
“చాలా ఏళ్ళ క్రితం రాజీవ్ గాంధి ప్రధాన మంత్రిగా వున్నప్పుడు ఓసారి ఢిల్లీలోని పార్లమెంటు  భవనంలోని ఒక సమావేశ మందిరంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. భోజన విరామానికి కొద్దిసేపటికి   ముందు, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  ఎన్టీ రామారావు గారు కాసేపు అనర్ఘలంగా తెలుగులో ప్రసంగించారు. ఎన్టీఆర్ మాట్లాడిన అంశాలను రాజీవ్ గాంధి తనపక్కనే కూర్చున్న పీవీ నరసింహారావు గారిని అడిగి తెలుసుకున్నారు.
“భోజన విరామ సమయంలో పీవీ పనుపున ఇద్దరు అధికారులు పక్కనే వున్న రేడియో స్టేషన్ కు వెళ్ళారు. తెలుగు విభాగంలో అప్పుడు దుగ్గిరాల పూర్ణయ్య, అద్దంకి మన్నార్ కూర్చుని పనిచేసుకుంటున్నారు. అనువాదపు పని అని చెప్పగానే పూర్ణయ్య గారు నేను బులెటిన్ చూసుకుంటాను, మీరు వెళ్లండని మన్నార్ గారికి పురమాయించారు. మన్నార్ వెళ్లి పీవీ గారిని కలిసారు. భోజనాలు అయిన తర్వాత మళ్ళీ ఆయన (ఎన్టీఆర్) మాట్లాడతారు, అదేదో తెలుగులో రాసి తనకిమ్మన్నారు, పీవీ.  ఆయనతో ఉన్న చనువుతో మన్నార్, ‘అయ్యా. నేను ముక్కస్య ముక్క అనువాదం చేయలేను. అందులో ఎన్టీఆర్ గారిది గ్రాంధిక తెలుగు’ అనడంతో పీవీ నవ్వేశారు.
ఎన్టీఆర్  తో  మన్నార్ కి కూడా పరిచయం వుంది. తన ప్రసంగాన్ని తెలుగులో అనువదించేందుకు మన్నార్ ని పిలిపించారని ఎన్టీఆర్ కి  అర్ధం అయింది. భోజన విరామం తర్వాత ఆయన తెలుగు జోలికి పోకుండా మొత్తం ఇంగ్లీష్ లోనే ప్రసంగం పూర్తి చేశారు”
అద్దంకి మన్నార్ ఆకాశవాణి తరపున మాస్కో వెళ్లి రేడియో మాస్కోలో కొంతకాలం పనిచేశారు. ఆరోజులలో తన అనుభవాలను వివరిస్తూ ‘ప్రావ్దా’ అనే చిన్ని పుస్తకాన్ని రచించారు.     
మల్లాది సూరిబాబు గారు ఆంద్రభూమి పత్రికలో ధారావాహికంగా రాసిన వ్యాస పరంపర ఒకదానిలో అద్దంకి మన్నార్ గారి ప్రసక్తి వుంది. ఈ వ్యాసం చదివిన తర్వాతనే మన్నార్ న్యూస్ రీడర్ కాకముందు విజయవాడ రేడియో కేంద్రంలో కొన్నేళ్ళు అనౌన్సర్ గా పనిచేసిన విషయం తెలిసింది.
అందులో మల్లాది గారు ఇలా రాసారు.
“మాటల్లో గంభీరత, స్పష్టత, చక్కని శ్రుతి, మాధుర్యం ఎనౌన్సర్‌కుండవలసిన లక్షణాలు. మనిషి ఎదురుగా లేకుండా కంటికి కనిపించకపోయినా గొంతు మాత్రం చెవికి ఆకర్షణగా వినాలనిపించేలా వుండాలి.
ఎనౌన్సర్ వేరు. న్యూస్ రీడర్ వేరు. చదివే విధానంలో తేడా వుంటుంది. విజయవాడ రేడియో కేంద్రం ప్రారంభమైన తొలి రోజుల్లో 1959లో ఎనౌన్సర్‌గా చేరి న్యూస్ రీడర్‌గా ప్రసిద్ధుడైన ఎంబెర్ మన్నార్ ని  ఈతరం వారెరుగరు.
విలక్షణమైన గొంతు, 20 నిమిషాల్లో చదవవలసిన వార్తల్ని పదే పది నిమిషాల్లో వేగంగా అత్యంత స్పష్టంగా చదవగలిగిన ఏకైక వ్యక్తి ఈ అద్దంకి మన్నారు. స్వగ్రామం నూజివీడు సమీపంలోని చిన్న గ్రామం కానుమోలు. రేడియోకు కొన్ని ప్రమాణాలున్నాయి. బహిరంగంగా మనం ఇష్టపడి అభిమానించి ఎన్నుకున్న రాజకీయ నాయకులు చేసే ఉపన్యాసాల్లో తోలు తీస్తా, తాట తీస్తాలాంటి మాటలున్నా యథాతథంగా వార్తల్లో చెప్పరు. చెప్పకపోవటమే రేడియోకున్న గౌరవం. ఖండించారనో, గర్హించారనో, కొన్ని సున్నితమైన అందమైన పదాలు వాడి సరిపెట్టి, హుందాగా తప్పుకుంటారు. కల్పలత, చిత్రతరంగిణి లాంటి సినిమా పాటల కార్యక్రమాలను సమర్పించటంలో మన్నార్‌కు సాటి మరొకడు లేడనిపించుకున్న ఎనౌన్సర్ అనతికాలంలోనే న్యూస్ రీడరై, ఢిల్లీ నుంచి వార్తలు చదివేవాడు.
వార్తల లైవ్స్టూడియోలో కూర్చుని చివరి నిమిషంలో అందే వార్తనైనా అందంగా, అనువదించేసి, తొట్రుపాటు పడకుండా ఆ వార్త చదవటం మన్నార్ ప్రత్యేకతగా చెప్పేవారు. వార్తలు చదివే వారిలో నాటకీయతఉండదు. ఉండకూడదు కూడా. వార్తలను ఒక ప్రవాహంలా, ధారలా, సొగసుగా, స్పష్టంగా చదివి కీర్తిని మాత్రమే సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి అద్దంకి మన్నార్”
(మల్లాది సూరిబాబు గారికి కృతజ్ఞతలతో)
(ఇంకా వుంది)

1 కామెంట్‌:

  1. డాబర్ చ్యవన్ ప్రాశ్ తిని నువ్వు కూడా బలిశావు అని ఒక ఆకాశవాణి వాణిజ్య ప్రకటనలో చెప్పింది అద్దంకి మన్నారు అనుకుంటా.

    అది విని పడి పడి నవ్వుకునే వాళ్ళం.

    ఇంతకీ ఆయన విచిత్రమైన పేరు ఎలా పెట్టారో చెబితే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి