దిన దిన గండం నూరేళ్ళ
ఆయుస్సు మాదిరిగా నడుస్తోంది పోలవరం కధ. పేరులో మాత్రమె వరం వుండి శాపగ్రస్త
ప్రాజెక్టుగా మారిన ఈ పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం కంచికి చేరని కధలా సాగిపోతోంది. బాలారిష్టాల్లో
చిక్కుకుని విలవిలలాడుతోంది. వార్తల్లో మాత్రమే కనిపించే ఈ ప్రాజెక్ట్
వాస్తవరూపం దాల్చి, ఫలాలు అందించడానికి ఏండ్లూ పూండ్లూ పట్టేట్టు వుంది.
అనేక శంకుస్థాపన
ఫలకాలు మెడలో హారంలా మిగిలాయి కానీ ప్రాజెక్టు మాత్రం ప్రారంభోత్సవ ఫలకం కోసం ఇంకా
ఎదురుచూపులు చూస్తూనే వుంది.
ఎప్పుడో ఎనభయ్యవ
దశకంలో ఆ నాటి ముఖ్యమంత్రి టీ. అంజయ్య గారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం
పునాదిరాయి వేసినప్పటినుంచి ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు మారాయి. ముఖ్యమంత్రులు
మారారు. అసలు రాష్ట్ర స్వరూపమే మారిపోయింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయింది.
విభజన అనంతరం
ప్రాజెక్టులో కదలిక మొదలయింది. కొత్తగా ఏర్పడ్డ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి
సారధిగా చంద్రబాబు నాయుడు, దేశ సారధిగా నరేంద్ర మోడీ పగ్గాలు చెప్పడంతో కొత్త ఆశలు
చిగురించాయి. అప్పట్లో వాళ్ళిద్దరూ మంచి మిత్రులు కావడం, వారు ప్రాతినిధ్యం వహించే
టీడీపీ, బీజేపీలు రెండూ మిత్ర పక్షాలు కావడం, నిధుల కొరత ఉండదనే ధీమా ప్రబలడం
ఇవన్నీ మంచి శకునాలే అనుకున్నారు. పోలవరం అనుకున్న వ్యవధిలో పూర్తి కాగలదని ఆ
రెండు పార్టీల నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా నమ్మారు.
కాలం ఎప్పుడూ ఒకే
రీతిన సాగిపోతే ఇక ఆ కాలానికి మహిమ ఏముంటుంది?
ఆ కాలమహిమ కారణంగా
మిత్రుల నడుమ పొరపొచ్చాలు వచ్చాయి. ఆ మిత్రత్వం కూడా కడుపులో వుండి కాదు,
కావిలించుకుంటే వచ్చింది కాబట్టి ఆ స్నేహ బంధానికి కాలయాపన లేకుండానే కాలం చెల్లింది. ఆ రెండు పార్టీల నడుమ ఏర్పడ్డ బంధం
రాజకీయ కారణాల వల్ల కాబట్టి ఆ రాజకీయ కారణాలే ఆ బంధాన్ని తెగగొట్టాయి. రెండు
రాజకీయ పార్టీలు విడిపోతే దేశానికి వచ్చే నష్టం ఏమీ వుండదు. కాకపోతే ఆ ప్రభావం
పోలవరం వంటి ప్రాజెక్టుపై పడింది.
ఇచ్చిన నిధులకు
లెక్కలు అడిగారు ఢిల్లీ ఏలికలు. రాష్ట్రం పంపిన లెక్కలు కేంద్రం వారికి
రుచించలేదు. కొత్తగా నిధులు రాకపోగా రావాల్సిన నిధులు కూడా ఆపేశారు, కేంద్రం ఆంద్ర
ప్రదేశ్ రాష్ట్రంపై కక్ష కట్టింది అని ఆక్రోశించారు తెలుగు దేశం నాయకులు. నిధుల
దుర్వినియోగం జరుగుతోందని బీజేపీ శ్రేణుల ముక్తాయింపు.
ఈ లోగా కాంట్రాక్టర్
మారారు. కొత్త కాంట్రాక్టర్ రంగంలోకి వచ్చారు. వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే
ప్రాజెక్టును నామినేషన్ పద్దతిపై తోచిన వారికి కట్టబెడతారా అని ప్రతిపక్ష వైసీపీ
నేత హుంకరింపు.
ఇక్కడ కొంత
నేపధ్యాన్ని మననం చేసుకోవాలి.
రాష్ట్రం రెండుగా
విడిపోక ముందు అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్
రెడ్డి హయాములో పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును ట్రాన్స్ ట్రాయ్ సంస్థ
దక్కించుకుంది. విభజన అనంతర పరిణామాలు ప్రాజెక్టు నిర్మాణంపై దుష్ప్రభావాన్ని
చూపాయి. కాంట్రాక్టర్ చేతులు ఎత్తేయడంతో
తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రముఖ నిర్మాణ సంస్థ నవయుగ
సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి పనుల వేగం పెరిగింది. వారం వారం
ప్రతి సోమవారాన్ని ‘పోలవరం’గా ప్రకటించి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించే
వినూత్న కార్యక్రమం మొదలు పెట్టారు. ఆ పురోగతిని
ఆనాటి ప్రభుత్వం రాజకీయంగా వాడుకోవాలని చూసింది. రాష్ట్రం నలుమూల నుంచి ప్రత్యేక బస్సులు వేసి ప్రజలను తీసుకు
వెళ్లి ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని కళ్ళకు కట్టినట్టు చూపే ప్రచార
కార్యక్రమానికి తెర లేపింది. ఇది సహజంగానే ప్రతిపక్ష వైసీపీకి మింగుడు పడలేదు. ఆ రోజుల్లోనే
వైసీపీ నాయకుడు వై.ఎస్. జగన్ మోహన రెడ్డి తన పాదయాత్రలో అనేక సందర్భాలలో పోలవరం
అవినీతి గురించి పెక్కు సార్లు ప్రస్తావించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటానని
హెచ్చరించారు.
కధ ఇలా సాగుతూ ఉండగానే
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అప్పటివరకు పోలవరం ప్రాజెక్టును కొంతవరకు
పూర్తిచేసిన తెలుగు దేశం ప్రభుత్వం ప్రతిపక్ష పాత్రలోకి మారిపోయింది. పోలవరంలో
టీడీపీ పెద్దఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపణలు చేస్తూ వచ్చిన
వైసీపీ అధికారంలోకి వచ్చింది. అదీ ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీతో.
కధ మొదటికి వచ్చింది.
వైసీపీ అధినాయకుడు, కొత్త ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన రెడ్డి రెండు మాసాలు కూడా
గడవక ముందే పోలవరం ప్రాజెక్టు వ్యవహారాలు గురించి నిపుణుల కమిటీ వేయడం, అది
నివేదిక ఇవ్వడం, దాని ఆధారంగా ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న
కాంట్రాక్టర్ ను ఆ పని నుంచి తప్పుకోవాలని ఆదేశించడం ఆఘమేఘాల మీద జరిగిపోయింది.
నవయుగతో చేసుకున్న
ఒప్పందం ప్రధాన నిర్మాణ సంస్థ ట్రాన్స్
ట్రాయ్ తో కుదుర్చుకున్న ఒప్పందానికి విరుద్ధమని వైసీపీ భావించింది. కాంట్రాక్టర్
మార్పిడిలో తెలుగుదేశం ప్రభుత్వం భారీ ముడుపులకు తెర తీసిందని ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది. ట్రాన్స్ ట్రాయ్ మాత్రమే
చేపట్టాల్సిన పనులను ఈపీసీ విధానానికి వ్యతిరేకంగా నవయుగ సంస్థకు అప్పగించారని
నిపుణుల కమిటీ కూడా అభిప్రాయ పడింది.
‘పనులను ఈపీసీ కింద
అప్పగించాక అంచనాలు పెంచడం, 60 - సి కింద నోటీసులు జారీ చేయడం మార్గదర్శకాలకు విరుద్ధం అని పేర్కొన్నది. అంచేత ప్రాజెక్టు
పనులకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలని నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
ఈ కమిటీ సూచనలకు అనుగుణంగా
ప్రభుత్వం తరపున నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు తక్షణం పనులు నిలిపి వేయాలని
నిర్మాణ సంస్థ నవయుగ ను కోరారు. గత అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో అతి ఘోరమైన
పరాజయాన్ని మూటగట్టుకుని, నవనాడులు కుంగిపోయిన స్తితిలో ఉన్న తెలుగు దేశం పార్టీ
నాయకులకు ఈ పరిణామం కొంత ఉపశమనం కలిగించింది. రాష్ట్రానికి వరప్రసాదిని వంటి
పోలవరాన్ని పాలక పక్షం వైసీపీ అడుగడుగునా అడ్డుకుంటోందని, సంకుచిత రాజకీయ
ప్రయోజనాలకోసం రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను ఫణంగా పెడుతోందని ఒంటి కాలిపై నిలబడి
ఆరోపణాస్త్రాలు సంధించడం మొదలు పెట్టారు.
రివర్స్ టెండరింగ్
పేరుతొ పోలవరం ప్రాజెక్టు ను ఆలస్యం చేస్తే వ్యయం అంచనాలు బాగా పెరిగిపోవడమే
కాకుండా అనుకున్న వ్యవధిలో ప్రాజెక్టు పూర్తి చేయడం కష్టమని వారి వాదన.
పోలవరం వంటి భారీ
సేద్యపు నీటి ప్రాజెక్టులను ఎలాంటి అంతరాయాలు, అవరోధాలు లేకుండా పూర్తి చేయడం ఎంత
గొప్ప కాంట్రాక్టర్ కైనా సాధ్యం కాదు. సుదీర్ఘ కాలం సాగే నిర్మాణంలో అనేక ప్రకృతి
పరమైన అవరోధాలు ఏర్పడడం కద్దు. వర్షాకాలంలో నదీ ప్రవాహం బాగా పెరుగుతుంది.
తప్పనిసరిగా కొంత కాలంపాటు నిర్మాణ పనులను ఆపి వేయాల్సి వస్తుంది. కాబట్టి
ప్రాజెక్టు నిర్మాణం కుంటుపడుతుందని చెప్పే వాదనలో పస లేదు. పైగా పోలవరం పూర్తయ్యే
వరకు రైతులకు సేద్యపు నీటి ఇబ్బందులు లేకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు పట్టుబట్టి
నిర్మించిన పట్టిసీమ ఎలాగూ వుంది.
కోట్ల రూపాయలు
ఖర్చయ్యే ప్రాజెక్టు పనులను యేవో కొన్ని సాంకేతిక కారణాలు చూపించి నామినేషన్
పద్దతిపై కాంట్రాక్టర్లకు అప్పగించే విధానం మంచిది కాదు. అనుకున్న వ్యవధిలో
ప్రాజెక్టు పూర్తి చేయాలనే తపనను ఎవరూ అపార్ధం చేసుకోరు. పైగా హర్షిస్తారు కూడా.
అయితే అదే సమయంలో ప్రభుత్వం అనుసరించిన పద్దతులుఏమిటి అనే విషయాన్ని కూడా గమనంలోకి
తీసుకోక తప్పదు. నియమాలను, నిబంధనలను పాటించండి అని కోరే ప్రభుత్వాలు వాటిని
ఏర్పరచింది తామే అని మరవకూడదు.
ప్రజాధనం దుర్వినియోగం
కాకూడదు అనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన నిబంధనలు ఒక్కోసారి వింతగా
అనిపించవచ్చు.
‘ఇచ్చిన అప్పు, దానిపై
పేరుకు పోయిన వడ్డీల వసూలుకోసం అంతకంటే
ఎక్కువ మొత్తాలలో న్యాయవాదులకు ఫీజులు చెల్లించడంలో ఔచిత్యం ఏమిటని ఓసారి ఓ
బ్యాంకు ఉన్నతాధికారిని అడిగాను.
ఆయన ఇలా జవాబు
చెప్పారు.
“అప్పిచ్చిన మొత్తం
చిన్నదే కావచ్చు. దాన్ని వసూలు చేయడానికి పెట్టే ఖర్చు ఎక్కువే కావచ్చు. ఒక పైసా
ప్రభుత్వధనం కూడా దుర్వినియోగం కాకుండా
చూడాలనే మహత్తర లక్ష్యం అందులో దాగుంది. ఆ విషయాన్ని గమనంలో వుంచుకుంటే ఈ
అనుమానాలు రావు”
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి