6, జులై 2019, శనివారం

ప్రధానిగా రెండోటరంలో మోడీ మొదటి బడ్జెట్ – భండారు శ్రీనివాసరావు

(Published in SURYA telugu daily on 07-07-2019, SUNDAY today)

ఉరుములు లేవు మెరుపులు లేవు. అలా అని సాదా సీదాగా లేదు. మోడీ మార్క్ బడ్జెట్ కాదందామా అంటే అలానూ  లేదు. అలా అని ఔననడానికీ లేదు. కాకపొతే స్వతంత్ర భారతంలో ఒక మహిళా ఆర్ధిక మంత్రి లోకసభలో ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ గా ఈ ఘట్టానికి ఒక ప్రత్యేకత వుంది. (గతంలో శ్రీమతి ఇందిరాగాంధి ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో, అప్పటి ఆర్ధిక మంత్రి మొరార్జి దేశాయ్ రాజీనామా చేయడం వల్ల, 1970 – 71 బడ్జెట్ ని ఆవిడే ప్రవేశపెట్టారు)
షరా మామూలుగానే  సర్కారు వారు, వారి మిత్ర పక్షాల వారు 'ఆహా! ఏమి  బడ్జెట్!’ అన్నారు. ప్రతిపక్షాలవారు వారి పద్ధతిలోనే,  స్వరం పెంచి  బడ్జెట్ ని తూర్పారబట్టే ప్రయత్నం చేశారు.
దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకోసం బడ్జెట్ రూపకల్పనలో చాలా శ్రమ తీసుకున్నారనీ, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకోసం కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో వుంచుకుని బడ్జెట్ రూపొందించడం  నిజానికి ఆహ్వానించాల్సిన అంశమనీ పాలక పక్షం వారు సమర్ధించుకున్నారు. అన్ని రకాల  వర్గాలను మెప్పించేందుకోసం కాకుండా  దేశహితాన్ని, సర్వ జనుల శ్రేయస్సును  దృష్టిలో వుంచుకుని సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తయారు చేసింది కావడం వల్ల ఫలితాలు అందుబాటులో రావడానికి కొంతకాలం వేచి వుండాలని వారు సలహా ఇస్తున్నారు. ఈ వాదనను ప్రతిపక్షాలు అంగీకరించే పరిస్తితి ఎలాగూ వుండదు. అందువల్ల షరా మామూలుగానే కేంద్ర బడ్జెట్ పై ఖండన ముండన పర్వాన్ని అధికార ప్రతిపక్షాలు  యధాప్రకారం యధావిధిగా కొనసాగిస్తున్నాయి.
ఏ బడ్జెట్ అయినా సర్కారువారికి అంతా బాగున్నట్టే లెక్క. ప్రతిపక్షాల లెక్క వేరే. ఇందులో ఏముంది కొత్త సీసాలో పాత సారా అంటూ ఇక్ష్వాకుల కాలం నుంచి చెబుతున్న పడికట్టు పదాలే మళ్ళీ మళ్ళీ వల్లె వేస్తుంటారు. ఇప్పుడూ అదే జరుగుతోంది. గతంలో యూపీయే బడ్జెట్ల పట్ల ఎన్డీయే పెదవి విరిచినట్టే ప్రస్తుతం ఎన్డీయే బడ్జెట్ గురించి యూపీయే పక్షాలదీ అదే దోవ. ఇది చర్విత చరణంగా సాగుతూ వస్తున్న చరిత్రే.
మొదటి బడ్జెట్ కావడం కారణమేమో తెలియదు, ఈసారి మోడీ బడ్జెట్ లో  వరాల జల్లులు లేవు. పైగా వడ్డనలు బాగానే వున్నాయి. పాలక పక్షానికి సమర్ధించుకునే కారణాలు ఎలాగూ వుంటాయి. ఈసారి ఎన్నో దీర్ఘకాలిక ప్రణాళికలు పెట్టుకున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ అవసరమనుకున్నారు. లక్ష్యాలు పెద్దవిగా నిర్ణయించుకున్నారు. అంచేత కాస్త కఠినంగా అనిపించినా పరవాలేదనుకున్నారు. ఫలితమే శుక్రవారంనాడు ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్ పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్.
ఏ పని చేయాలన్నా ప్రభుత్వాలకు సొమ్ములు కావాలి. అందుకు వాటికి ముందున్న ప్రధాన మార్గం పన్నులు. పన్నుల వసూళ్లు సక్రమంగా జరిగి, ఎగవేతలను అరికట్టగలిగితే బడ్జెట్ లోటు తగ్గించుకోవచ్చని సర్కారు యోచన. కొత్త భారాలు మోపకుండా ఏదైనా చేసుకోండని సాధారణ ప్రజల అభిలాష. ఈరెంటికీ పొంతన కుదరడం అసాధ్యం.       
ఇంతకీ కేంద్ర  ఆర్ధిక మంత్రి, తెలుగింటి కోడలు అయిన శ్రీమతి నిర్మలా సీతారామన్ మోడీ పనుపున ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ గురించి సామాన్యులు ఏమనుకుంటున్నారు?
ఈ సామాన్యుల్లో రైతులు  వున్నారు. రైతు కూలీలు వున్నారు. రోజు కూలీలు వున్నారు. రోజు గడవని వారూ  వున్నారు. అసలు బడ్జెట్  అంటే ఏమిటో, దాని కధాకమామిషు ఏమిటో తెలియని అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వారే  ఎక్కువమంది వున్నారు. నిజానికి అలాటి వారికి బతుకుతెరువు గురించి  తప్ప బడ్జెట్ గురించి పట్టించుకునే తీరికా వుండదు, ఆ అవసరమూ వుండదు.

అయినా సరే, సామాన్యుడిని దృష్టిలో వుంచుకుని రూపొందించినదంటారు, బడ్జెట్ గొప్పగా వుందని పొగిడే పాలకపక్షం వారు, ఇక  ప్రతిపక్షాలవాళ్ళు మాత్రం సంపన్నులకోసం తయారు చేసిన బడ్జెట్ అని తీసిపారేస్తుంటారు. ఈ విషయాలు పక్కనబెడితే, నిర్మలా సీతారామన్ గారు ఈ ఇరువురి వాదనలకు మద్దతు ఇచ్చే విధంగా కసరత్తు చేసినట్టు కనబడుతోంది.
రెండో పర్యాయం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రభుత్వ పగ్గాలు స్వీకరించిన తరువాత తొలి పూర్తి స్థాయి  బడ్జెట్ కావడం, ఎన్నికలకు పూర్వం నుంచే సమాజంలోని అనేక వర్గాల వారు ఆయన దీక్షాదక్షతలమీద అపారమైన నమ్మకాలు  పెంచుకుని, ఆయనకే మరోమారు అధికారం కట్టబెట్టడం ఇవన్నీ బడ్జెట్ పై అంచనాలు బాగా పెరిగిపోవడానికి దోహదం చేసాయి. అంచనాలు ఆకాశం అంచులవరకు చేరడంవల్లే బడ్జెట్ వెలువడిన తరువాత ప్రాధమిక  ఆశలు నీరుకారిపోయాయన్న  అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.
గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రవేశపెట్టిన బడ్జెట్ లకు, మోడీ బడ్జెట్ కు స్తూలంగా తేడా ఏమీ లేదన్న భావన కూడా వుంది. ఆర్దిక సంస్కరణల విషయంలో ఈ రెండు కూటములకు మౌలికమైన తేడా లేదన్న అంశాన్ని  గమనంలో వుంచుకుంటే ఈ సందేహం తలెత్తదు అనేవాళ్ళు కూడా వున్నారు. మోడీ అయినా, మన్మోహన్ అయినా, జైట్లీ అయినా చిదంబరం అయినా, ఇప్పుడు నిర్మలా సీతారామన్ అయినా, అలాగే   ఎన్డీయే అయినా యూపీయే అయినా వారిని, వారి విధానాలను అదుపుచేసే లేదా నిర్దేశించే విదేశీ, స్వదేశీ శక్తులు ఒకటే కావడం ఇందుకు కారణం అని వాదించేవారు సైతం వున్నారు.
ఒకటి మాత్రం స్పష్టంగా గోచరిస్తోంది. ఎవరు ప్రారంభించినా సరే, మొదలు పెట్టిన ఆర్ధిక సంస్కరణలను మరింత పటిష్టంగా ఇంకా ముందుకు తీసుకువెళ్లాలనే పట్టుదల ఈ బడ్జెట్ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించింది. దీర్ఘకాలిక ప్రయోజనాలను సాధించాలంటే స్వల్పకాలిక ప్రయోజనాలను పణంగా పెట్టాలని సంస్కరణల వేగం పెంచాలని కోరుకునేవారు అంటుంటారు. ఈ క్రమంలో ఆర్ధికంగా వెనుకబడివున్న వర్గాలపై కొంత భారం పడే ప్రమాదం వుంది. అందుకే ఈ విషయంలో మోడీ మహాశయులవారు శషభిషలకు ఆస్కారం ఇవ్వడంలేదు. కొన్ని కఠిన నిర్ణయాలకు జాతిని సంసిద్ధం చేసే ప్రయత్నంలోనే ఆయన వున్నట్టుగా కానవస్తోంది. అందులో మరో అయిదేళ్ళు అధికారాన్ని దఖలు పరుస్తూ దేశ ప్రజలు అఖండమైన తీర్పు ఇచ్చిన తర్వాత వచ్చిన మొదటి బడ్జెట్. ఎన్నికలకు ముందయితే ఎంతోకొంత సర్దుబాటు చేసుకోవాల్సిన అగత్యం వుండేది. ఇప్పుడా అవసరం మోడీ గారికి లేదు. అంచేత ఈ తడవ ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని యావత్ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ తయారు చేసినా ఆయన్ని ప్రశ్నించేవారు లేరు.
అంచేతనే ఆదాయపు పన్ను గరిష్ట పరిమితుల విషయంలో వృద్ధులు, వేతన జీవుల ఆశలపై నీళ్ళు చల్లారు. పసిడి అంటే ముచ్చటపడే పడతులు సమృద్ధిగా వున్న దేశంలో, దిగుమతి చేసుకునే బంగారంపై సుంకాలను పెంచారు. సంపన్నులను కూడా వదిలిపెట్టకుండా వారిపై కూడా సుంకాల భారం మోపారు. ఏడాదికి లక్ష కరెంటు బిల్లు కట్టేవారిని ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవలసిన వారిలో చేర్చారు. రిటర్న్స్ దాఖలు చేయడానికి పాన్ నెంబరు లేకపోతె  ఆధార్ నెంబరుతో చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఏడాది వ్యవధిలో ఏ బ్యాంకు ఖాతా నుంచి అయినా సరే కోటి రూపాయలు వేసినా తీసినా రెండు శాతం టీడీఎస్ కట్టాలనే నిబంధన విధించారు. కట్టాల్సిన పన్ను ఎంత అనేది సర్కారే తెలుస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రీ ఫిల్డ్ ధరకాస్తు విధానాన్ని ప్రవేశ పెడతారు.
అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా పెట్రోలియం ధరల హెచ్చుతగ్గులకు జనం చాలాకాలంగా అలవాటు పడ్డారు.  ఆ విధానానికి అదనంగా ఈ బడ్జెట్లో పెట్రోలు, డీసెలు ధరలకు రూపాయి చొప్పున సెస్సు విధించారు.  మార్కెట్ ధరల్లో వచ్చే మార్పులతో సంబంధం లేకుండా ఏటి పొడుగునా నిలకడగా వుండే పెరుగుదల ఇది. బడ్జెట్లో పెంచింది రూపాయి అయినా వాస్తవంలో ఈ పెరుగుదల రెండున్నర రూపాయల వరకు ఉంటుందని కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగియక ముందే పెట్రోలు బంకుల్లో వసూలు చేసిన రేట్లు చెబుతున్నాయి.
ఆర్ధిక సంస్కరణలను రాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టి,  వాటి వేగాన్ని నియంత్రణ చేస్తూ పోవడంవల్ల సంస్కరణల  ఫలితాలు అనుకున్నంత త్వరగా అనుభవంలోకి రావడం లేదని వాటి సమర్ధకులు తరచూ చెబుతుంటారు. అది నిజమే కావచ్చు. కానీ మరికొన్ని వాస్తవాలను కూడా ఏలినవారు గమనంలో పెట్టుకోవాలి. పై పూత మెరుగులతో అభివృద్ధి చెందుతున్న సంపన్నదేశంగా కానవచ్చే మన దేశంలో కోట్లు పోగేసుకున్న  కుబేరులకంటే, ప్రతిపూటా పొట్ట  కూటికోసం అల్లాడే కుచేలుల  సంఖ్యే అధికం. జాతిని ముందుకు తీసుకుపోయే వేగంలో వారి బతుకులు మరింత ఛిద్రం కాకుండా చూడాల్సిన ధర్మం కూడా ఏలికల మీద వుంది. ఈ ధర్మాన్ని మరవనంతవరకు సంస్కరణల వడీ వేగం పెంచినందువల్ల ఇబ్బంది ఏమీ వుండదు.
ఏ బడ్జెట్ లక్ష్యం అయినా సర్వజన శ్రేయస్సు కావాలి. మోడీ బడ్జెట్ ఈ దిశగా సాగుతుంది అనుకుంటే దాన్ని స్వాగతించాలి.

5 కామెంట్‌లు:

  1. మీరు పడికట్టు పదాలు అంటే నవ్వొస్తుంది. మీ వ్యాసాలలో అవి విరివిగా వాడుతారుగా. అదేమీ తప్పుకాదు. చాదస్తం పాత్రికేయులు అవి వదులుకోలేరు.
    గత ఆరేళ్లుగా వచ్చిన బడ్జట్టులన్నీ వేతనజీవులకు వేదన కలిగించేవే.

    రిప్లయితొలగించండి
  2. తెలుగు మహిళా మంత్రి తెలుగు రాష్ట్రాలకు చిప్పలో చిల్లిగవ్వ కూడా వేయలేదు.

    రిప్లయితొలగించండి
  3. @అజ్ఞాత :నిజమే. సహవాస దోషం. రాజకీయులతో యాభయ్ ఏళ్ళ అనుబంధం మరి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజం చెప్పాలంటే మీకంటే రాజకీయ నాయకులే బెటర్!

      తొలగించండి