30, జూన్ 2019, ఆదివారం

హామీల అమలు దిశగా జగన్ తొలి అడుగులు – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA dated 30th June, 2019, SUNDAY)
ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన రెడ్డి పదవిని స్వీకరించి నేటికి సరిగ్గా నెల రోజులు. అయిదేళ్ళు పరిపాలించడం కోసం  ప్రజాతీర్పు పొందిన వ్యక్తి పనితీరును   ముప్పైరోజులకు కుదించి పోల్చిచూడడం సబబు అనిపించుకోదు. అయినా ఆయన ఏ దిశగా సాగుతున్నారు, ఏ మార్గంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అనేది స్థాలీపులాక న్యాయంగా పరిశీలించుకోవడానికి ఈ స్వల్ప కాలం అక్కరకు వస్తుంది.
తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనిపించుకునే నిర్ణయాలను ఎన్నింటినో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత నెల రోజులుగా ప్రకటిస్తూ వచ్చారు. పదవిని చేపట్టిన కొద్ది  గంటల్లోనే  డీజీపీతో సహా ఉన్నతాధికారుల బదిలీ ప్రక్రియ చేపట్టారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు నవరత్నాల పేరుతొ ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు సమర్దులయిన అధికారుల బృందాన్ని ఏర్పాటుచేసుకున్నారు.
ముందే రాసిపెట్టుకున్న స్క్రిప్ట్ మాదిరిగా జరిగేవన్నీ ఒక పద్దతి ప్రకారం చకచకా సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశం, మంత్రివర్గ నిర్మాణం, శాఖల పంపిణీ, స్పీకర్ ఎన్నిక, పదమూడు జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు, గ్రామ సచివాలయాల ఏర్పాటు, గత ప్రభుత్వం ఎన్నికలకు కొద్ది ముందు  అమలు చేసిన అన్నదాతా సుఖీభవ పధకం రద్దు, దాని స్థానంలో  రైతు భరోసా పధకం, పారిశుధ్య పనివారు, అంగన్ వాడీ మహిళల వేతనాల పెంపు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అనే వివక్ష లేకుండా  ఇంటర్ విద్యార్ధులకు కూడా అమ్మవొడి పధకం వర్తింపు,  పొరుగురాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తో సత్సంబంధాలు పెంపొందించుకునే ప్రయత్నాలు,  ఢిల్లీ యాత్రలు, ప్రధాని నరేంద్ర మోడీ ఇతర కేంద్ర మంత్రులతో భేటీలు ఇలా అలుపూసొలుపు లేని పనులతో, ప్రతి  రోజూ ఏదో ఒక కొత్త  నిర్ణయం ప్రకటిస్తూ  ముఖ్యమంత్రి జగన్  బిజీ బిజీగా వున్నారు. గతానికీ ఇప్పటికీ కొట్టవచ్చినట్టు కనబడుతున్న  తేడా ఒకటుంది. అది  ప్రచార ఆర్భాటంలో తగ్గుదల. అధికారుల సమీక్షా సమావేశాల్లో కొత్త ముఖ్యమంత్రి మార్కు మార్పు స్పుటంగా కానవస్తోంది. ప్రత్యేకంగా విలేకరుల సమావేశాలు అంటూ  నిర్వహించకుండా వారికి అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వమే విడుదల చేసే పద్దతిని కూడా ప్రవేశపెట్టినట్టు ఈ నెల రోజుల పాలన తీరుతెన్నులు చూసేవారికి అర్ధం అవుతోంది.
పార్టీ మార్పిళ్ల విషయంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ప్రజాస్వామ్య ప్రియులను ఎంతగానో అలరించింది. తమ పార్టీలోకి వేరేవారు ఎవరు రావాలన్నా ముందు పదవులకు రాజీనామా చేయాలని పునరుద్ఘాటించారు. అలా గీత దాటే వారిని ఏమాత్రం ఉపేక్షించకుండా వారిపై అనర్హత వేటువేయాలని కొత్తగా స్పీకర్ గా ఎన్నికయిన తమ్మినేని సీతారాంకు సభానాయకుడి స్థానం నుంచి  ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి సూచించడం ముదావహం. ప్రజాస్వామ్యానికి చెదపురుగుల్లా తయారయిన పార్టీ మార్పిళ్ళకు ఈ సాహసోపేత నిర్ణయం అడ్డుకట్ట వేస్తుందనడంలో సందేహం. చట్టంలోని లొసుగులను నిస్సిగ్గుగా వాడుకుంటూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వచ్చిన ఇతర పార్టీలు కూడా జగన్ సూచించిన ఈ విధానాన్ని పాటిస్తే, చట్ట సవరణ అవసరం లేకుండానే ఈ అనైతిక విధానాలను చాలావరకు నిర్మూలించవచ్చు.
అటు రాష్ట్ర పరిపాలకుడుగా, ఇటు  రాజకీయ పార్టీ అధినేతగా జగన్ మోహన రెడ్డి  తన రెండు చేతుల్లోను  పగ్గాలు ధరించి ముందుకు సాగుతున్నారనేది కూడా సుస్పష్టం. పాలనాపరంగా, రాజకీయంగా ఈ నెల రోజుల్లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఒకపక్క సెహభాష్ అనిపించుకునే ప్రకటనలు. మరో పక్క తొందర పడుతున్నారేమో  అనిపించే రాజకీయ నిర్ణయాలు.    
విచ్చలవిడిగా పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలనే గట్టి నిర్ణయానికి ఆయన వచ్చినట్టు తోస్తోంది. ఈ విషయంలో శషభిషలకు తావు లేకుండా ఏకంగా జిల్లా కలెక్టర్ల సమావేశంలోనే జగన్ మోహన రెడ్డి కుండబద్దలు కొట్టారు. సమావేశం జరుగుతున్న ప్రజావేదిక కట్టడమే ఒక అక్రమ నిర్మాణమని చెబుతూ, వీటి తొలగింపు అనేది ప్రజాజవేదికను నేలమట్టం చేయడంతోనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆ వేదిక సాక్షిగానే ఆదేశించారు. సదస్సు అలా ముగిసిందో లేదో  అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి ఆదేశాలను తుచ తప్పకుండా అమలు చేసింది. కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రజావేదిక కట్టడం కూల్చివేత కార్యక్రమాన్ని రాత్రికి రాత్రే  పూర్తిచేసింది. ఈ చర్య సహజంగానే   రాజకీయ వర్గాల్లోనే కాక సాధారణ ప్రజల్లో కూడా సంచలనాన్ని కలిగిస్తోంది.  అక్రమ నిర్మాణాలు చేసిన వారి గుండెల్లో అలజడి రేపుతోంది. కొందరు దీనికి రాజకీయ ఉద్దేశ్యాలు ఆపాదిస్తుంటే మరికొందరు తొందరపాటు చర్యగా పరిగణిస్తున్నారు. అయినా ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని, అక్రమనిర్మాణాలను ఎట్టి పరిస్తితిలోను అనుమతించేది లేదనీ, అవినీతి రహిత పాలనను అందించాలంటే   అక్రమార్కులపై కొరడా విదల్చక తప్పదనీ ముఖ్యమంత్రి మరోమారు స్పష్టం చేయడంతో ఈ విషయంలో ఆయన యెంత పట్టుదలగా వున్నారో అన్న సంగతి అర్ధం అవుతోంది. ఆయన అనుకున్నట్టుగానే కృష్ణానది కరకట్ట మీద నిబంధనలకు విరుద్ధంగా  అనేకమంది శ్రీమంతులు నిర్మించుకున్న భవంతులను కూల్చివేసే ప్రయత్నంలో అధికారులు తలమునకలుగా వున్నారు. అనేకమందికి నోటీసులు కూడా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివసిస్తున్న గెస్ట్ హౌస్ కూడా వీటిలో ఒకటి కావడం రాజకీయ కలకలం రేపుతోంది.  అవతల ప్రభుత్వం నిబంధనలకు లోబడి చర్యలు తీసుకుంటూ ఉన్నందున పరిపాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశాన్ని మరింత వివాదం చేయకుండా విజ్ఞతతో వ్యవహరిస్తే బాగుంటుంది. ఇదే దృఢ సంకల్పంతో ముందుకు సాగి అక్రమ నిర్మాణాలకు ముకుతాడు వేయగలిగితే ప్రజల మద్దతు ప్రభుత్వానికి పుష్కలంగా  లభిస్తుంది.
ఉద్దేశ్యం మంచిదే. పెట్టుకున్న లక్ష్యం గొప్పదే. కానీ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆచరణలో దోవతప్పి మరో బాట పట్టడం కొత్త విషయం ఏమీ కాదు. యెంత మంచి  పధకం అయినా ప్రజల మద్దతు  లేనిదే విజయవంతం కానేరదు. కొన్ని కొన్ని విషయాల్లో పాలకులు తమ పట్టుదలలకు కొంత వివేచన జత చేస్తే బాగుంటుందేమో ఏలికలు ఆలోచించాలి.
వై.ఎస్. జగన్ మోహన రెడ్డి పాలన కొన్ని శుభశకునాలతో మొదలయింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీతోనూ  పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ చక్కటి స్నేహపూర్వక సంబంధాలు వున్నాయి. ఢిల్లీలో ప్రధానమంత్రిని తొలిసారి కలిసి వచ్చిన తర్వాత మోడీ  చేసిన ట్వీట్ ఇందుకు చక్కని ఉదాహరణ. జగన్ మోహన రెడ్డితో తన సమావేశం అద్భుతంగా జరిగిందని ప్రధాని వర్ణించడం మోడీ వ్యవహార శైలి తెలిసిన వారికి  గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించి వుంటుంది. అలాగే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో చంద్రబాబు నాయుడితో వ్యవహరించిన తీరు గుర్తున్న వారికి ఇప్పుడు వై.ఎస్. జగన్ తో ఆయన వ్యహరిస్తున్న విధానం ఒకింత అచ్చెరువు కొలిపేదిగా వుంది. ఒక విధంగా ఉభయ రాష్ట్రాలకు ఈ మార్పు ప్రయోజనకరం. రెండు కొత్త రాష్ట్రాల నడుమ పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు వున్నాయి. అయిదేళ్ళు గడిచిపోయినప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనేమాదిరిగా కొన్ని ఇంకా  అపరిష్కృతంగానే  వున్నాయి. ముఖ్యమంత్రుల స్థాయిలో చొరవ చూపిస్తే వాటిల్లో చాలావాటికి పరిష్కారం దొరకడం అసాధ్యమేమీ కాదు. అలాగే ప్రతియేటా సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి నదీ జలాల సమగ్ర వినియోగం, నానాటికీ తగ్గిపోతున్న కృష్ణానదీ జలాల గరిష్ట వాడకం. వీటిని సుసాధ్యం చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్. తెలంగాణా రాష్ట్రాలకు సేద్యపు నీటి సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది. చినుకు పడితేనే బతుకు అనే రైతాంగం దుస్తితికి తెర పడుతుంది. ఈ రెండు నదుల అనుసంధానానికి ఉన్న అవకాశాలను పరిశీలించి ఆచరణలోకి తేగలిగితే రెండు తెలుగు రాష్ట్రాల ఆర్ధిక స్తితిగతులు ఊహించలేనంతగా మారిపోతాయి. మొన్న శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం ఈ దిశగా సానుకూల ఫలితాలను ఇవ్వగలదని ఆశించడం అత్యాశ కాబోదు.

1 కామెంట్‌:

  1. ఈ ఏడాది ఖరీఫ్ నుండి వ్యవసాయ పనులకు పగటి పూటే తొమ్మిది ఘంటలు విద్యుత్ ఇవ్వడం శుభపరిణామం.

    అదే రకంగా సింగపూరు తలదన్నే భ్రమరావతి అంటూ బాహుబలి లెవెల్లో ఉబుసుపోకు గ్రాఫిక్స్ చూపించి రైతుల దగ్గర గుంజుకున్న భూముల వాపసీ ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిది.

    రిప్లయితొలగించండి