8, జూన్ 2019, శనివారం

ముఖ్యమంత్రుల ‘ఇంటి’ ముచ్చట్లు – భండారు శ్రీనివాసరావు


(Publishrd in ANDHRA BHOOMI daily in it's Edit Page on 09-06-2019, SUNDAY)

దేశంలో తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి  నీలం సంజీవరెడ్డి. ఆంధ్రరాష్ట్ర రాజధాని కర్నూలు నుంచి  హైదరాబాదుకు మారగానే ఆయన  మొదట్లో ప్రస్తుతం రాజభవన్ పక్కన వున్న దిల్ కుష భవనంలో వుండేవారు. ‘కర్నూలు రాజధానిలో డేరాలు వేసుకుని వుండి వచ్చారు కదా! ఇప్పుడు హైదరాబాదులో జీవితం ఎలావుంద’ని ఒక విలేకరి ముఖ్యమంత్రిని అడిగారు. ‘ఏం చెప్పనబ్బా!  ఈ ఇల్లు ఎంత పెద్దగా వుందో  చూస్తున్నారు కదా! మా ఆవిడ ఏ గదిలో వుందో కనుక్కోవడానికి అరగంట పడుతోంది’ అని నవ్వుతూ బదులిచ్చారని ఆ నాటి రోజులకి ఈనాటి కాలానికీ ఒక వారధిలా ఉన్న సీనియర్ పాత్రికేయులు, వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు  జీ.ఎస్. వరదాచారి మాటల సందర్భంలో చెప్పారు. తరువాతి కాలంలో సంజీవరెడ్డి బేగంపేట లోని గ్రీన్ లాండ్స్ ప్రభుత్వ అతిధి గృహాన్ని తన అధికార నివాసంగా ఎంచుకున్నారు.  ప్రైవేట్ బస్సుల జాతీయకరణ విషయంలో  న్యాయస్థానం తనకు వ్యతిరేక తీర్పు ఇచ్చినందుకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేవరకు ఆయన  అదే భవనంలో నివాసం వున్నారు. ఆయన తర్వాత దామోదరం సంజీవయ్య  ముఖ్యమంత్రి అయ్యారు. సంజీవరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా వున్నప్పుడు సంజీవయ్య ఖుర్షిద్ జా అనే ఒక ప్రైవేటు భవంతిలో నివాసం వుండేవారని సంజీవయ్య బావమరది డాక్టర్  సి.బి. శ్రీనివాసరావు చెప్పారు. ప్రస్తుతం రాజీవ్ గాంధి విగ్రహం నుంచి రాజ్ భవన్ వైపు వెళ్ళే రహదారిలో ఆ భవంతి వుండేది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మకాం గ్రీన్ లాండ్స్ కి మారింది. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాల కారణంగా  రెండేళ్ళ తర్వాత సంజీవరెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం జరిగింది. తదుపరి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చాలా రోజులు  ప్రస్తుతం విద్యుత్ సౌధకు సమీపంలోని  ఏరువాక ప్రభుత్వ భవనంలో వుండి, తరువాత బేగంపేటలో  గ్రీన్ లాండ్స్ ఎదురుగా, రోడ్డుకు  ఆవలవైపు ఉన్న మరో ప్రభుత్వ భవనాన్ని(ఇప్పుడు మంజీరా గెస్ట్ హౌస్) తన అధికార నివాసంగా ఎంచుకున్నారు. ముఖ్యమంత్రికి శాశ్వత అధికార  నివాసభవనం ఉండాలనే బ్రహ్మానందరెడ్డి ఆలోచన  ఫలితంగా ఆనందనిలయం రూపుదాల్చింది. తిరుపతి ఆనంద నిలయం మనసులో ఉందేమో తెలవదు, బ్రహ్మానందరెడ్డి ఆ భవనానికి అదే పేరు పెట్టారు. వాస్తు చూసి ఏర్పాటుచేసుకున్నా ఎక్కువరోజులు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగలేదు. రాష్ట్ర విభజన ఉద్యమాల ఫలితంగా ఆయన పదవి నుంచి దిగిపోవడంతో పీవీ నరసింహా రావు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టారు.  ఆంద్ర ఉద్యమం కారణంగా  రాజీనామా చేసి  తప్పుకునేంతవరకు ఆయన కూడా ఆనంద నిలయంలోనే కొనసాగడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం రాష్ట్రం  రాష్ట్రపతి పాలనలో వుంది.
తదనంతరం జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు.  గతంలో  హోంమంత్రిగా వున్న  సమయంలో పంజాగుట్ట ప్రాంతంలోని  ద్వారకాపురి కాలనీలో ముచ్చటపడి కట్టుకున్న చిన్న భవంతిలోనే కొనసాగారు. ముఖ్యమంత్రి హోదాకు తగిన వసతులు అరకొరగా ఉన్నప్పటికీ  చివరి వరకు ఆయన ఆ ఇంట్లోనే కాలక్షేపం చే
సారు.
ఆ తరువాత ముఖ్యమంత్రి అయిన మర్రి చెన్నారెడ్డి వ్యవహార శైలి విభిన్నం. ఆయన తార్నాక లోని సొంత ఇంట్లోనే వుండి, దానికి అన్నిరకాల హంగులు సమకూర్చుకున్నారు. బహుశా సొంత నివాసాలకు ప్రభుత్వ ఖర్చుతో వసతులు ఏర్పాటు చేసుకునే సాంప్రదాయానికి అప్పుడే బీజం పడిందని అనుకోవాలి.  ఆ రోజుల్లో మొత్తం హైదరాబాదులో లిఫ్ట్ సౌకర్యం ఉన్న ప్రైవేటు గృహాలు రెండే ఉండేవని, వాటిల్లో ఒకటి చెన్నారెడ్డి గారి తార్నాక నివాసం అని జనం చెప్పుకునేవారు.
తదుపరి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య పరిస్తితి దీనికి పూర్తిగా విరుద్ధం. ఆయనకు బరకత్ పురాలో రెండు గదుల సొంత ఇల్లు వుండేది. మామూలుగానే చాలా ఇరుకు. ఇక ముఖ్యమంత్రి అయితే ఆ తాకిడి తట్టుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. దాంతో ఆయన గతంలో సంజీవ రెడ్డి నివాసం ఉన్న గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ ని అధికార నివాసంగా చేసుకుని, దానికి జయప్రజా భవన్ అనే పేరు పెట్టారు.
అంజయ్య గారి ఇంటికి  సంబంధించి ఒక ఆసక్తికరమైన ముచ్చట చెప్పుకోవాలి.
ఆయన ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధి తనయుడు రాజీవ్ గాంధి విమానాల పైలట్ గా పనిచేసేవారు.  ఓ రోజు ముఖ్యమంత్రిగారు సచివాలయంలో నలుగురితో మాటా మంతీ సాగిస్తున్న సమయంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. అంజయ్య గారు తత్తరపడుతూ లేచి, వున్నపాటున బరకత్ పురాలో వున్న తన ఇంటికి బయలుదేరారు. అప్పటికి అంజయ్య గారు అధికార నివాసం గ్రీన్ లాండ్స్ కి మకాం మార్చలేదు. బరకత్ పురాలో హౌసింగ్ బోర్డ్ వారి టూ ఆర్ టీ ఇంట్లోనే వుంటున్నారు. ఇప్పటి రోజులతో పోలిస్తే అది ఒక విడ్డూరమే. ఆ చిన్న ఇంటిపైనే గది మీద గది నిర్మించుకుంటూ వెళ్లడం వల్ల చాలా ఇరుకుగా వుంటుంది. మెట్లు కూడా సౌకర్యంగా వుండవు.
సరే! అంజయ్య గారు హడావిడి పడుతూ ఇంటికి వెళ్ళి ఆయాసపడుతూ మెట్లెక్కినప్పుడు కనబడ్డ దృశ్యం ఈనాటి ఛానళ్ళకు దొరికివుంటే పండగే పండగ. రాజీవ్ గాంధీ అక్కడి చిన్న గదిలో అంతకంటే చిన్న కుర్చీలో కూర్చుని తనను పీక్కుతింటున్న దోమల్ని తోలుకునే పనిలో నిండా మునిగి తేలుతున్నారు. అసలే పండంటి మనిషి. లేత శరీరం. ఆయన మొహం మీద దోమ కాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అసలు జరిగిన విషయం ఏమిటంటే,  రాజీవ్ గాంధీ పైలట్ గా హైదరాబాదు వచ్చిన ఇండియన్ ఎయిర్ లైన్స్  విమానం, తిరిగి వెళ్ళడానికి బాగా వ్యవధానం వున్నట్టుంది. యెందుకు అనిపించిందో తెలియదు కాని, ఆయన బేగం పేట ఎయిర్ పోర్ట్ లో ఎవర్నో అడిగి ఓ కారు తీసుకుని నేరుగా బరకత్ పురాలోని అంజయ్య గారి నివాసానికి వెళ్ళిపోయారు. ఈ కబురు అంది, ముఖ్యమంత్రిగారు ఆఘమేఘాలమీద ఇంటికి వచ్చేసరికి ఇదీ సీను.
ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయిన భవనం వెంకట్రాం మాత్రం తాను అంతకుముందు మంత్రిగా వున్నప్పుడు వున్నప్పుడు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్ లోనే వుండిపోయారు. భవనం వెంకట్రాం తర్వాత ముఖ్యమంత్రి అయిన కోట్ల విజయ భాస్కరరెడ్డి లోగడ పీవీ ముఖ్యమంత్రిగా నివసించిన ఆనంద నిలయానికి మారారు. ఇంతవరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ఇంటి ముచ్చట్లు.
ఇక, తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత ఎన్టీ రామారావు ఆబిడ్స్ లోని తన సొంత ఇంట్లోనే వున్నారు. ఒక ముఖ్యమంత్రి అధికార నివాసాలు ఒకటికి మించి గుర్తించి అందుకు తగిన సదుపాయాలు కల్పించే పద్దతి ఆయన హయాములోనే మొదలయింది. గండిపేటలోని తన ఆశ్రమాన్ని కూడా రెండో అధికార నివాసంగా మార్చుకున్నారు.  కొన్నాళ్ళు ప్రతిపక్షంలో వుండి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాస్తు బాగుందని భావించారేమో తెలియదు, బంజారా హోటల్ సమీపంలోని తన కుమార్తె పేరిట ఉన్న ఒక చిన్న భవనంలో నివాసం వున్నారు. ప్రభుత్వం పక్కనే ఉన్న మరో భవనాన్ని అద్దెకు తీసుకుని ముఖ్యమంత్రి అవసరాలకు తగిన విధంగా వసతులు సమకూర్చడం జరిగింది. ఒక నెల రోజులపాటు ముఖ్యమంత్రి అయిన నాదెండ్ల భాస్కర రావు జూబిలీ హిల్స్ లోని తన సొంత ఇంట్లోనే వున్నారు.
1995లో ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబునాయుడు జూబిలీ హిల్స్ లోని తన సొంత ఇంట్లోనే నివాసం  వున్నారు.  హోదాకు, అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వమే కొన్ని వసతులు సమకూర్చింది.
వై. ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పదవీప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్నిమాసాలపాటు నాగార్జున సొసైటీలోని తన కుమార్తె ఇంట్లో నివాసం వున్నారు. ముఖ్యమంత్రికి శాశ్వత నివాస భవనం ఉండాలనే కాసు బ్రహ్మానంద రెడ్డి ఆలోచనను ఆయన మళ్ళీ ఆచరణలోకి తీసుకువచ్చారు. బేగం పేట మంత్రుల క్వార్టర్స్ లోని కొన్ని భవనాలను తొలగించి, అన్ని వసతులతో కూడిన  విశాలమైన ఒక మంచి భవనాన్ని ప్రభుత్వ ఖర్చుతో కొద్ది నెలల కాలంలోనే  నిర్మించారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించేవరకు అందులోనే నివాసం వున్నారు.
తరువాత ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అయిన కే. రోశయ్య ఆ భవనంలో చేరడానికి ఇష్టపడలేదు. అమీర్ పేటలోని ప్రకృతిచికిత్సాలయం దాపునే తాను నిర్మించున్న భవంతిలోనే వుండిపోయారు. ముఖ్యమంత్రిగా రోశయ్య నుంచి బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా చాలా కాలం జూబిలీ హిల్స్ లోని సొంత ఇంట్లోనే వున్నారు. ఆ తరువాత తన నివాసాన్ని బేగం పేటలోని ముఖ్యమంత్రి అధికార నివాసానికి మార్చుకున్నారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్నాళ్ళు సొంత ఇంట్లో నివసించిన తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొన్నాళ్ళు  వై.ఎస్. హయాములో నిర్మించిన నివాసంలోనే వున్నారు. అక్కడ వున్న సోఫాలను కానీ, ఫర్నిచర్ ను కానీ మార్చకుండా అందులో నివసించారని కేసీఆర్ వ్యక్తిగత అధికారులు చెబుతుంటారు. అక్కడే వుంటూ, పక్కనే  కొత్తగా విశాలమైన ఆధినిక వసతులు కలిగిన  సీఎం క్యాంపు కార్యాలయ సముదాయాన్ని ఏర్పాటు చేశారు.
పోతే, అటు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయిన  చంద్రబాబునాయుడు, అమరావతి నిర్మాణం అనే భారీ ప్రాజెక్టు భుజాలకు ఎత్తుకోవడం వల్ల నూతన  రాష్ట్రంలో ముఖ్యమంత్రికి అంటూ ఒక అధికార నివాస భవనం ఏర్పాటు చేసుకోలేక పోయారు. అంచేత తాత్కాలికంగా కృష్ణానదీ తీరాన  ఒక ప్రైవేటు గెస్టు హౌస్ ను తన అధికార నివాసంగా మార్చుకున్నారు. దానికి పక్కనే ఉన్న స్థలంలో ప్రజావేదిక పేరుతొ ప్రభుత్వమే మరో సదుపాయాన్ని కల్పించింది. అధికారంలో ఉన్నంతకాలం  చంద్రబాబు దాన్నే తన నివాసంగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడదే ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇందుకు ఓ నేపధ్యం లేకపోలేదు.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న అయిదేళ్ళు, కృష్ణానది కరకట్ట మీద అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా కొందరు విలాసవంత మైన భవనాలను నిర్మించారని, ఈ కట్టడాలు పర్యావరణానికి మేలు చేయవనీ, వాటిని తొలగించాలని కోరుతూ వచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే వీటిని కూల్చివేయడం జరుగుతుందని గట్టిగా చెబుతూ వచ్చారు. ఇలా ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరిగింది. ఏప్రిల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షనేత జగమ్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమితమయ్యారు.
ఈ దశలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి ఒక లేఖ రాసారు. తాను  నివాసం ఉంటున్న భవనాన్ని మళ్ళీ కొంతకాలం వాడుకోవడానికి నిర్ణయించుకున్నట్టు తెలిపారు. పక్కనే నిర్మించిన ప్రజావేదికను కూడా ప్రతిపక్ష నేత హోదా కలిగిన  తనకే కేటాయించాలని విజ్ఞప్తి చేసారు. ఈ లేఖ ఇంకా కొత్త ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందో లేదో తెలవదు కానీ మీడియాలో ఇది పెద్ద వివాదాస్పద చర్చనీయాంశంగా తయారయింది. ఒకప్పుడు కరకట్ట మీద నిర్మించిన అక్రమ భవనాలను కూల్చివేయాలని డిమాండ్ చేసిన వైసీపీ  అధినేత వై.ఎస్. జగన్ మోహన రెడ్డి ఇప్పుడు అదే భవనాలలో ఒకదాన్ని చంద్రబాబుకు అధికారికంగా కేటాయిస్తే ఆ అక్రమ కట్టడాన్ని సక్రమ నిర్మాణంగా ప్రభుత్వమే అంగీకరించినట్టు కాగలదని ఆ పార్టీలోనే కొందరు ఆక్షేపిస్తున్నారు. అభ్యంతర పెడుతున్నారు.
ఈ సందర్భంలో  ఓ పాత సంగతి ప్రస్తావన అసందర్భం కాబోదు.  
అప్పుడు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు.
ఒకప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మంత్రుల నివాసాలు అన్నీ ఒకేచోట ఉండాలనే ఉద్దేశ్యంతో బంజారాహిల్స్, రోడ్ నెంబరు పన్నెండులో మంత్రుల నివాస ప్రాంగణాన్ని నిర్మించారు. అందులో ఒక భవనాన్ని ప్రతిపక్షనేతగా తనకు కేటాయించాలని వై.ఎస్. కోరారు. నాటి ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని త్రోసిపుచ్చింది. అప్పటి నిబంధనల ప్రకారం నెలకు పదిహేను వేల రూపాయలకు మించని అద్దె కలిగిన భవనానికి కిరాయి చెల్లిస్తామని తెలియచేసిందని వై.ఎస్. వ్యక్తిగత సహాయకుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన భాస్కర శర్మ చెప్పారు.
ఇప్పుడు పూర్తి స్థాయి మంత్రివర్గం కూడా ఏర్పాటు అయింది కాబట్టి, జగన్ ప్రభుత్వం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి ఇంతవరకు ముఖ్యమంత్రుల నివాసాల అంశం ఆసక్తికరంగా సాగుతూనే వస్తోంది. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా వారి నివాసాల మీద ప్రభుత్వాలు ఖర్చు చేసే వ్యయాన్ని తగ్గించే దిశగా ఏమైనా ఆలోచనలు చేస్తే బాగుంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి