(Published in SURYA daily on 23-06-2019, SUNDAY)
‘రాజకీయాల్లో గెలుపోటములు సహజం’
ఎన్నికల్లో పోటీ చేయకుండా, ప్రజలు
నేరుగా ఎన్నుకోకుండా పరోక్ష పద్దతిలో చట్ట
సభల్లో అడుగుపెట్టిన వాళ్ళు ఈ మాటలు చెబుతుంటే అసహజంగా అనిపిస్తుంది.
కానీ వాళ్ళు చెబుతూనే వుంటారు. మనం
వింటూనే వుంటాం. ఇదంతా ఒక సహజమైన ప్రక్రియగా మారిపోయింది.
నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు, సుజనాచౌదరి,
సీఎం రమేష్, గరికపాటి మోహన రావు, టీజీ వెంకటేష్ లు పార్టీ ఫిరాయించి బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం
న్యాయమా ! ధర్మమా అనే చర్చలు గత కొద్దిరోజులుగా టీవీల్లో సాగుతున్నాయి. న్యాయమో
ధర్మమో అటుంచి చట్టబద్ధమే అని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. రాజ్యాంగం లోని పదో
షెడ్యూల్, నాలుగో పేరాను వారు పదేపదే పేర్కొంటున్నారు. చట్టబద్ధంగా చూసినప్పుడు
అది న్యాయమే. కానీ ధర్మబద్ధంగా చూసినప్పుడు న్యాయం కాకపోవచ్చు. న్యాయం కాదని
టీడీపీ అంటోంది, తన గతాన్ని కాసేపు తాత్కాలికంగా మరచిపోయి. కానీ జనాలకు అంతటి
మతిమరపు లేదుగా.
కష్టాలు ఒంటరిగా రావు, వచ్చినప్పుడు
కట్టకట్టుకుని వస్తాయని అంటారు.
ఇప్పుడు టీడీపీ పరిస్తితి అదే. ఒకటా
రెండా కష్టాలు. అన్నీఇన్నీ కావు.
ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు
కనీవినీ ఎరుగని పరమ ఘోరమైన పరాజయం ఇటీవలి
ఎన్నికల్లో అనుభవంలోకి వచ్చింది. అసెంబ్లీలో ఇరవై మూడు స్థానాలకు, లోక సభలో మూడంటే
మూడు స్థానాలకు టీడీపీని పరిమితం చేస్తూ ఓటర్లు తీర్పు చెప్పారు. పైగా అధికారం
కట్టబెట్టింది ఎవరికో కాదు, తమ ప్రధాన రాజకీయ
ప్రత్యర్ధి వైసీపీకి. అదీ అద్భుతమైన మెజారిటీతో. ఇది చాలదన్నట్టు కేంద్రంలో
అధికారానికి వచ్చింది బీజేపీ. గత ఎన్నికల సమయంలో కంటే హెచ్చు మెజారిటీ ఇచ్చి ఆ
పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టారు. మళ్ళీ ప్రధానిగా మోడీ రాకూడదు అనే
ధ్యేయంతో కాలికి బలపం కట్టుకుని దేశమంతా తిరిగి ప్రచారం చేసివచ్చిన చంద్రబాబుకు మోడీ,
అమిత్ షా ద్వయం తిరుగు లేని విధంగా అధికారంలోకి రావడం నిజంగా మింగుడు పడని విషయమే.
ఇటు రాష్ట్రంలో జగన్. అటు కేంద్రంలో మోడీ. తను నమ్ముకున్న కాంగ్రెస్ ఎన్నికల్లో
బొక్క బోర్లాపడి తేరుకోలేని స్తితిలో వుంది. మరో పక్క పొరుగు రాష్ట్రంలో కేసీఆర్.
ఆయనకు వ్యతిరేకంగా కూటమికట్టి ఓటమి పాలయిన సంగతి టీడీపీ అధినేత మరపున పడితే పడి ఉండవచ్చు.
కానీ కేసీఆర్ ఎలా మరచిపోతారు? ఎన్నికలకు
ముందు నుంచీ వీరందరినీ టీడీపీ నాయకులు అనని మాట లేదు. వాడని పరుష పదం లేదు.
ఇలా దిక్కుతోచని స్తితిలో వున్న టీడీపీకి
పులిమీది పుట్రలా కొత్తగా పార్టీ ఫిరాయింపులు. నలుగురు రాజ్యసభ సభ్యులు అదీ
చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు చెప్పాపెట్టకుండా బీజేపీ కండువాలు కప్పుకున్నారు.
పార్టీ ఫిరాయించి ఊరుకుంటే కొంత ఉపశమనంగా
వుండేది. ఏదో వెళ్ళిపోయారు. ఒకరు పొతే నలుగు వస్తారు అని షరా మామూలుగా సమాధానపడడానికి
వీలుండేది. రాజ్యసభలో వున్న ఆర్గురు టీడీపీ సభ్యుల్లో మూడింట రెండు వంతులు బయటకు
వచ్చాం కాబట్టి మమ్మల్ని వేరే ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించండి అంటే మరో రకంగా
వుండేది. అలా చేయకుండా రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం రాజ్యసభలోని టీడీపీని
ఏకంగా బీజేపీలో విలీనం చేయాలని సభ చైర్మన్ కు మహజరు ఇచ్చారు. ఆయన కూడా పరిశీలిద్దాం
అని ఊరుకుంటే అదో రకంగా వుండేది. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఆ నలుగురినీ
బీజేపీ సభ్యులుగా పరిగణిస్తున్నట్టు వెనువెంటనే ప్రకటించేశారు. టీడీపీ అధినాయకత్వం
తేరుకునేలోగానే ఇదంతా వాయువేగంతో జరిగిపోయింది. పైగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు
కుటుంబంతో కలిసి విదేశాల్లో వున్నప్పుడు.
సరే! పరిస్తితిని సరిదిద్దుకోవడానికి
ఏమీ లేకపోయినా అయన తన వంతు ప్రయత్నం అక్కడి నుంచే ప్రారంభించారు. టెలి కాన్ఫరెన్స్
ద్వారా అమరావతిలో పార్టీ ప్రముఖులతో సంప్రదింపులు జరిపారు. అధినాయకుడి ఆదేశం మేరకు
పార్టీ అధికార ప్రతినిధులు, మీడియా ముందుకువచ్చి పార్టీ మారిన తమ వారిపై కారాలు
మిరియాలు నూరడం మొదలుపెట్టారు. గతజల సేతుబంధనం.
ఈ చరాచర సృష్టిలో కడుపు నిండుగా
వున్నప్పుడు, ఆకలి లేనప్పుడు కూడా ఆహారాన్ని వెతుక్కునో, వేటాడో తినే స్వభావం
వున్నది ఒక్క మనుషులకే. మరీ ముఖ్యంగా రాజకీయులకి. కాకపొతే వాళ్ళ ఆహారం సంఖ్యాబలం. లేకపోతే
జనం మంచి మెజారిటీతో గెలిపించి అధికారం
అప్పగించినప్పుడు కూడా పరాయి పార్టీ వాళ్ళకోసం ఈ వెంపర్లాటలేమిటి? ఇప్పుడు బీజేపీ చేసిన
పనే గతంలో వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుని టీడీపీ చేసింది. నీవు నేర్పిన విద్యయే
నీరజాక్ష అంటూ ఇప్పుడు కాషాయదళం వెక్కిరిస్తుంటే
టీడీపీ దగ్గర జవాబు ఏముంటుంది, మౌనం తప్ప.
గత చరిత్ర గమనిస్తే రాజ్యసభకు
సంబంధించి చంద్రబాబుకు గంధర్వుల శాపం ఉందేమో అనిపిస్తుంది. ఆయన ఏరికోరి, పార్టీలో
వేరేవారి అభ్యంతరాలను, అభ్యర్ధనలను త్రోసిపుచ్చి అనేకమందిని రాజ్యసభ సభ్యులుగా
చేసారు. వారిలో ఇద్దరు ముగ్గురు మినహా ఎవరూ ఇప్పుడు పార్టీలో లేరు. దానికి ప్రధాన
కారణం వారికి ఉన్న వ్యాపార ప్రయోజనాలు. ఎవరు అధికారంలో వుంటే వారి ద్వారా మాత్రమే
నెరవేర్చుకోవడానికి వీలున్న వ్యాపార, వాణిజ్య లావాదేవీలాయె. అంచేత వ్యక్తిగత
విధేయతలు తప్పిస్తే పార్టీపట్ల నిబద్దతను అలాంటి వారి నుంచి ఆశించడం కష్టం. నిజానికి
ఇప్పుడు పార్టీ మారిన రాజ్యసభ సభ్యులు నలుగురికీ ప్రభుత్వంతో పనిపడే వ్యాపారాలు
అనేకం వున్నాయి. పైగా వారందరూ చంద్రబాబు ఆప్త వర్గంలో ముందువరసలోని వాళ్ళు. పదవుల
పందేరం విషయానికి వస్తే వారికే ముందు పీట వేస్తారని పార్టీలోనే ప్రచారం జోరుగా
సాగేది. వాళ్ళే ఇప్పుడు చంద్రబాబుకు మొండి చేయి చూపి తమ దోవ చూసుకున్నారు.
జూలియస్ సీజర్ నాటకంలో బ్రూటస్ అనే
పాత్ర వుంటుంది. సీజర్ కు అతడు ఆరోప్రాణం. సీజర్ అంటే ప్రాణం ఇచ్చే తత్వం బ్రూటస్
ది. చివరికి ఏమైంది. సీజర్ ని అంతమొందించే కుట్రలో అతడూ పాలుపంచుకుంటాడు.
ప్రత్యర్ధులు కత్తులు దూసి తనను పొడుస్తుంటే చలించని సీజర్, బ్రూటస్ తనను
చంపడానికి కత్తి ఎత్తినప్పుడు అతడి మొహం వివర్ణమౌతుంది. ‘యూ టూ బ్రూటస్’ (బ్రూటస్
!నువ్వు కూడానా) అంటూ ఆశ్చర్యంగా అతడివైపు చూస్తూ ప్రాణాలు వదులుతాడు.
రాజకీయాల్లో ఇవన్నీ సహజమని
సరిపుచ్చుకోక తప్పని పరిస్తితి. ఎందుకంటే ఈనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న
అనేకమందికి ఇలాంటి గతమే వుంది.
టీడీపీ బీజేపీ నాయకుల నడుమ ఇలా
వాగ్యుద్ధాలు సాగుతుండగానే కధ ఓ కొత్త మలుపు తిరిగింది.
ఇంతకీ జరిగింది ఫిరాయింపా, పురమాయింపా
అనే మీమాంస మొదలయింది. వైసీపీ అగ్రనాయకుల్లో ఒకరయిన విజయ సాయిరెడ్డి చేసిన ఓ ట్వీట్
ఇందుకు కారణం. చంద్రబాబు నాయుడు పురమాయించిన మీదటే ఈ నలుగురు టీడీపీ రాజ్యసభ
సభ్యులు బీజేపీలో చేరారని ఆ ట్వీట్ తాత్పర్యం. మోడీతో తగవు పెట్టుకోవడం వల్ల
ప్రయోజనం లేకపోగా, ముందు ముందు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదాన్ని పసికట్టి
ముందు జాగ్రత్త చర్యగా చంద్రబాబు తన సొంత మనుషులు, నమ్మకస్తులు అనుకున్నవారిని
బీజేపీలో చేర్పించారని సోషల్ మీడియాలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
అమల్లోకి వచ్చినప్పటి నుంచీ దేశంలో పార్టీ
మారిన వారి సంఖ్యను లెక్కవేయాలంటే అది చేతివేళ్ళతో సాధ్యం అయ్యే పనికాదు,
కాలిక్యులేటర్లు కావాలి. ఈ లెక్కలు చూస్తే ఈ చట్టం ఉద్దేశ్యం నెరవేరిందా లేక
ఫిరాయింపులకు చట్టబద్ధమైన మార్గాన్ని ఏర్పరిచిందా అనే సందేహం కలుగుతోంది.
బీజేపీతో పొత్తులేకుండా, కనీసం ఎన్నికల
అవగాహన లేకుండా తెలుగుదేశం పార్టీ ఏనాడూ గెలవలేదని బీజేపీ నాయకులుతరచూ చెబుతుంటారు.
బీజేపీ సాయంతోనే టీడీపీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిందని కూడా ఆ పార్టీ
నాయకుడు ఒకరు టీవీ చర్చల్లో చెప్పారు. రానున్న అయిదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ
సమీకరణాలు మారే అవకాశాలు కొట్టేయలేమని, ఆ పరిస్తితే తలెత్తితే ప్లాన్ బి కింద
బీజేపీ అధినాయకత్వం మరో ప్రణాళిక సిద్ధం చేసుకుంటుందేమో అనే అనుమానాలు కూడా పొటమరిస్తున్నాయి.
గతంలో మాదిరిగా టీడీపీ , బీజేపీలు అనేక మార్లు చేతులు కలిపాయి. అదే మాదిరిగా
విడిపోయాయి కూడా. ఒకవేళ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అధినాయకుడు
జగన్ మోహన్ రెడ్డితో అద్యతన భావిలో ఇలాగే స్నేహ సంబంధాలు కొనసాగే పరిస్తితులు
లేకపోతె అప్పుడు మళ్ళీ ఈ రెండు పార్టీలు దగ్గరవుతాయా అనే సందేహాలు కొందరు వ్యక్తం
చేస్తున్నారు. బీజేపీలో నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యుల చేరికకు వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పన్నిన రాజకీయ
వ్యూహంవుందని సందేహించడానికి ఇదే కారణం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్
మోహన రెడ్డి పార్టీ మార్పిళ్ళకు వ్యతిరేకంగా గట్టి విధాన నిర్ణయాన్ని అసెంబ్లీ
సాక్షిగా ప్రకటించడంతో టీడీపీలో అసంతృప్తులకు
ఒక ప్రధాన మార్గం మూసుకుపోయింది. వారికి ఇప్పుడు మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం
బీజేపీ ఒక్కటే. రాష్ట్రంలో తమ పార్టీని వచ్చే ఎన్నికల నాటికి ఒక బలమైన రాజకీయ
శక్తిగా తయారుచేయాలనే ఉద్దేశ్యం బీజేపీకి వుంది. ఆ కారణంగా టీడీపీలో సమర్దులయిన
నాయకులను ఆకర్షించే కార్యక్రమానికి ఆ పార్టీ సిద్ధంగా వున్నట్టు ఈ పరిణామాలు
తెలియచేస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పనికట్టుకుని ఢిల్లీకి పలుమార్లు వచ్చి, మోడీ వ్యతిరేక కూటమిని
కూడగట్టే ప్రయత్నాలు చేయడం ఇంకా వారి మనసులో పచ్చిగానే వుంది. అంచేత ఏ అవకాశం
వచ్చినా సరే దాన్ని వాడుకుని టీడీపీ ఉనికి రాష్ట్రంలో లేకుండా చేసి ఆ స్థానంలో తమ పార్టీ
బలాన్ని పెంచుకోవాలనే అభిమతాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పలుమార్లు బహిరంగంగానే వ్యక్తం
చేస్తూనే వస్తున్నారు. తెలుగు దేశం పార్టీకి, ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబుకు
అధ్యతన భవిష్యత్తులో ఎదురయ్యే పెను ప్రమాదాల్లో ఇది ప్రధానమైనది.
తమ పార్టీకి సంక్షోభాలు కొత్త కాదని
ఆపార్టీ నాయకులు గతాన్ని గుర్తు చేసుకుని చెబుతుంటారు. కానీ అవన్నీ సొంత పార్టీ నుంచి ఎదురయిన సంక్షోభాలు. ఇవి అలా
కాదు, బయటి శక్తుల నుంచి పొంచి వున్న ప్రమాదాలు. ప్రమత్తంగా ఉండని పక్షంలో
తీరిగ్గా విచారించాల్సివస్తుందేమో ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది.
స్వయంకృతాలకు ఇతరులను నిందించడం కన్నా
ఆత్మ పరిశీలన చేసుకోవడం ఆవశ్యకం.
BJP has a different purpose. They want to get the triple talaq and NRC bills passed at any cost. Especially the NRC bill is a landmark bill. Maybe this is the first occasion where any party is doing something for Hindus. Every citizen of this country should welcome NRC bill. Justice Sen of Meghalaya high court has written an excellent article on the importance of this bill. BJP don't have the required numbers in rajya sabha. Emptying TDP is a trivial issue. The pain and persecution Hindu refugees of neighbouring countries have gone through and the way they are living in India for decades without citizenship rights is not known to many.
రిప్లయితొలగించండి"నలుగురు రాజ్యసభ సభ్యులు అదీ చంద్రబాబుకు *అత్యంత సన్నిహితులు* చెప్పాపెట్టకుండా బీజేపీ కండువాలు కప్పుకున్నారు"
రిప్లయితొలగించండివెంకయ్య నాయుడు కూడా టీడీపీకి *అత్యంత సన్నిహితులు* కనుకే తాను సభ్యుడనని చెప్పుకొనే namesake party పార్టీ ఎదిగినప్పుడల్లా పొత్తుల పేరిట టీడీపీకి లాభం చేకూరుస్తూ వచ్చాడు. ఇప్పుడూ అలానే ఆపరేషన్ కోవర్ట్ చక్కదిద్ది తన స్వామిభక్తి చూపించాడు.