2, జూన్ 2019, ఆదివారం

పండంటి పాలనకు పనికొచ్చే సూత్రాలు – భండారు శ్రీనివాసరావు


(Publishedin SURYA daily on 02-06-2019, SUNDAY)

వై.ఎస్. జగన్ మోహన రెడ్డికి ప్రతిపక్ష నాయకుడిగా బరువు దిగింది, ముఖ్యమంత్రిగా  బాధ్యత పెరిగింది.
ఆంధ్రప్రదేశ్  రెండవ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహనరెడ్డి పదవీ ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టు జగన్ వయసు చిన్నది, బాధ్యత పెద్దది. ఆయన ముందున్న సమస్యలు కూడా చిన్నవి కావు.
అనేకానేక అవరోధాలను, సవాళ్ళను, కుట్రలు, కుతంత్రాలను దాటుకుంటూ, చేధించుకుంటూ దాదాపు దశాబ్ద కాలానికి పైగా అలుపెరుగని రాజకీయ పోరాటం చేసి జగన్ మోహన రెడ్డి తన లక్ష్యాన్ని సాధించారు. 2014లో చేతికి అందినట్టే అగుపడి, అడుగు దూరంలో అందకుండా చేజారిపోయిన ముఖ్యమంత్రి పదవిని 2019లో ప్రత్యర్ధి టీడీపీ అధినేత చంద్రబాబును గురికి ఆమడ దూరంలో ఆపేసి, సాధించి  ఒక ఘన విజయాన్ని అందుకున్నారు. మొత్తం సీట్లలో అంటే వైసీపీది ఆషామాషీ గెలుపు మాత్రం కాదు. అంతేకాదు పోలయిన ఓట్లలో యాభయ్ శాతం సాధించడం ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని సంగతి. అందుకే,  ఏ కొలమానం ప్రకారం చూసినా ఇది ఒక గొప్ప విజయం.
ఎన్నికల ప్రచార సమయంలోనే కాదు, అంతకుముందు  పాదయాత్రలో కూడా ప్రజలకు ఇచ్చిన నవరత్న హామీలను ఆయన చిత్తశుద్ధితో విశ్వసించారు. ప్రజలు సైతం వాటిని మనః స్పూర్తిగా నమ్మి జగన్ మోహన రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అనే నవరత్నఖచిత సింహాసనాన్ని అప్పగించారు. ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన బహిరంగ సభలో కూడా జగన్ ఆ నవరత్న హామీలనే మరోమారు ప్రస్తావించి వాటిలో పించన్ల పెంపుకు సంబంధించిన ఫైలుపై ప్రజల సమక్షంలోనే  మొదటి సంతకం చేసారు. మిగిలిన వాటి అమలు గురించి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాలికను ప్రకటించారు.
సరే! ఇవన్నీ ఒక పధ్ధతి ప్రకారం జరిగిపోవడానికి విస్తృతమైన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు  ఆయన ఆజమాయిషీలో వుంది.  సలహాలు ఇవ్వడానికి అనుభవశాలురు అనేకమంది సిద్ధంగా వున్నారు. సమర్ధులని భావించిన అధికారులతో సొంత బృందాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలను ఇప్పటికే ఆయన ప్రారంభించారు. పదవిలో వున్నవాళ్ళు ప్రజలకు ఏమైనా చేయగోరితే వారి ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రతిస్పందించే అధికారుల బృందం ఆవశ్యకత అంతాఇంతా కాదు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వై.ఎస్. రాజశేఖర రెడ్డి పేషీలో కూడా ఇటువంటి అధికారులే వుండేవారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన సాగుతున్న సమయంలో సైతం సమర్దులయిన అధికారులను ఎంపిక చేసుకున్న సంగతి ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం వుంది.
ఆరుమాసాలు లేదా ఏడాదిలోగా తన పనితీరును ప్రదర్శించి మంచి ముఖ్యమంత్రిగా ప్రజలచేత ప్రశంసలు అందుకుంటానని జగన్ మోహన రెడ్డి ముందే వాగ్దానం చేసారు. కాబట్టి ఆ వ్యవధానం ఇవ్వడం సముచితంగా వుంటుంది.
పొతే, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అధికార పగ్గాలు చేపడుతున్నట్టు ప్రకటించారు కనుక పాలనలో పనికి వస్తాయి అనుకుంటున్న కొన్ని సూచనలు చేయడం పాత్రికేయ ధర్మంగా భావిస్తున్నాను. 
రైతులు, రైతు కూలీలు. జగన్ మోహన రెడ్డి తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డికి కూడా ఈ వర్గాల పట్ల అవ్యాజానురాగం.
పంట పండించడానికి రైతుకు కావాల్సింది డబ్బు ఒక్కటే కాదు. తగిన తరుణంలో విత్తనం భూమిలో పడితేనే మొలకెత్తుతుంది. అంచేత ఏమి చేస్తారో ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. రైతులకు చాలా ముందుగానే మంచి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక ఔషధాలు మొదలయినవి నేరుగా ఆయా కంపెనీల నుంచి సేకరించి  రుణ రూపంలో వారికి ఇండ్ల వద్దనే అందించాలి. అప్పులు ఇచ్చి కొనుక్కోండి అనడం కంటే ప్రభుత్వమే పూనుకుని సరఫరా చేస్తే వాటి నాణ్యతలో లోపాలు వుంటే ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది. పంటలు లేదా వ్యవసాయ ఉత్పత్తులు వాళ్ళ ఇళ్ళకుచేరిన తర్వాత, దళారీల దయాధర్మాలకు వదిలేయకుండా, ఆ పంటకు ఏమి ధర ఉండాలో వాళ్ళే నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించాలి. తగిన ధర వచ్చి అమ్ముకున్న పిదపే వారి నుంచి రుణాలను వసూలు చేయాలి. ఒక్కసారి రైతు కుదుటపడి తేరుకుంటే  ప్రభుత్వం నుంచి ఎలాటి రుణ విమోచనను అతడు కోరుకోడు. అతడికి కావాల్సిందల్లా సకాలంలో విత్తనాలు, ఎరువులు, సాగు నీళ్ళు, విద్యుత్ సరఫరా, గిట్టుబాటు ధర. ఇంతకూ మించి ఏ వ్యవసాయదారుడు తనకోసం ఇతరుల నుంచి ఆశించడు. మొత్తం వ్యవసాయ రంగంలో దారుణం ఏమిటంటే పండించిన వాడు, చివరికి వాటిని కొనుక్కుంటున్న వాళ్ళు తప్పితే మధ్యలో అందరూ కోటికి పడగలెత్తుతున్నారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. ఉదాహరణకు కూరగాయలు. వాటినిఅమ్మబోయే రైతుకు అడివి. కొనే వినియోగదారుడికి కొరివి. ఆర్టీసీ నడుపుతున్న పల్లె బస్సుల సౌకర్యాన్ని మరింత విస్తరించి ప్రతి ఉదయమో లేదా శని, ఆది వారాల్లోనో ప్రతి గ్రామం  నుంచి దగ్గరలో ఉన్న బస్తీలకు, నగరాలకు సర్వీసులు ఉచితంగా నడపాలి. రైతులు తాము పండించే కూరగాయలకు ఎక్కడ అధిక ధర వస్తే అక్కడే వాటిని నేరుగా విక్రయించుకునే వెసులుబాటు కల్పించాలి. రానూపోనూ బస్సు లేదా రవాణా చార్జీలను కూరగాయలు విక్రయించగా వచ్చిన డబ్బుల నుంచి తీసుకోవాలి. రైతు బజార్లు చేస్తున్నది ఇదే కదా అనొచ్చు. కానీ అవి కూడా ఓ మోస్తరు దళారీ వ్యవస్థ మాదిరిగానే మారిపోతున్నాయి. అక్కడా దళారులు తయారయ్యారు. అంటే ఏమిటన్న మాట. మధ్య దళారులను తొలగిస్తే ఆ లాభం ఉత్పత్తిదారుడికి, వినియోగదారుడికి చేరుతుంది. వ్యవసాయాన్ని లాభసాటి చేయాలంటే ఇదొక సులువైన మార్గం.
ఆరోగ్య శ్రీ, 108, 104 వ్యవస్థల స్థాయిని  వై ఎస్ జమానా నాటికి తీసుకువెళ్ళండి. వీటిని ఒక స్థాయికి చేర్చాలని తద్వారా రాష్ట్రంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని వై ఎస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అవి నెరవేరకుండానే ఆయన అకస్మాత్తుగా దాటిపోయారు.
ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ, డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయా దాక్షిణ్యాలపైనా,  వారిచ్చే నాటు మందుల పైనా ఆధారపడాల్సిన దీనస్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా కొండలు, అడవులలో, అంత సులువుగా చేరుకోలేని కోయగూడాలు, లంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా సుగరు, రక్త పోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటే ఎలాటి వైద్య పరీక్షలు జీవితంలో ఏనాడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా తెలియదు.
ఆరోగ్యమంత్రిత్వ శాఖను వైద్య, ఆరోగ్య శాఖ అంటుంటారు. అంటే ఆరోగ్యానికీ, వైద్యానికి సంబంధం ఉన్నప్పటికీ ఆరోగ్యం కాపాడుకోగలిగితే, వైద్య  అవసరం రాదన్న అర్ధం ఇందులో నిగూఢ౦గా వుంది. అందుకే మన పూర్వీకులు ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. వ్యాధులకు చికిత్స బదులు, రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే వారు. తాగే నీరు, తినే ఆహారం, నివసించే వాతావరణం ఇవన్నీ మనుషుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ ప్రాధమిక అంశాలకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తే రోగాల సంఖ్యా, రోగుల సంఖ్యా తగ్గిపోయి వైద్యరంగంపై ప్రభుత్వం పెట్టే ఖర్చు గణనీయంగా తగ్గగలదని ఆ రంగంలో విశేష కృషి చేసిన నిపుణులు అంటున్నారు. వై.ఎస్. హయాంలో, హెచ్ ఎం ఆర్ ఐ అనే స్వచ్చంద సంస్థ ఈ కోణంలో కొంత కృషి చేసింది.
సుదూర గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారికి కనీస వైద్య సదుపాయాలు  ఈనాటి వరకు లేవనీ, నాటు వైద్యం మీదనే వాళ్ళు బతుకులు వెళ్ళదీస్తున్నారని, బీపీ, షుగర్ వంటి వ్యాధులు ముదిరి ప్రాణం మీదకు వచ్చేవరకు అలాటి వ్యాధుల బారిన పడ్డ విషయం కూడా తెలియని నిర్భాగ్య స్తితిలో వారు రోజులు గడుపుతున్నారని ఆనాటి ప్రభుత్వ పెద్దలకు  వివరించారు. అలాటి ప్రజానీకానికి  నెలకొక్కమారు వైద్య పరీక్షలు జరిపిరోగ నిర్ధారణ జరిపి  తగిన మందులిస్తే,  పక్షవాతం వంటి జబ్బుల బారిన పడకుండా కాపాడవచ్చని  చెప్పారు. ప్రస్తుతం వున్న వైద్య ఆరోగ్య శాఖ వార్షిక  బడ్జట్ తో పోలిస్తే ఇందుకయ్యే ఖర్చు అతి స్వల్పమని వివరించారు. అయితే ప్రభుత్వానికి ఒక అనుమానం వచ్చింది. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే ఈ సంచార వైద్య వాహనంలో డాక్టర్ వుంటాడా? అని.  డాక్టర్ల కొరత, గ్రామీణ ప్రాంతాలలో పనిచేయడానికి వారిలో పేరుకుపోతున్న వైముఖ్యం కారణంగానే ఈ పధకాన్ని రూపొందించాల్సి వచ్చిందని స్వచ్చంద సంస్థ ప్రతినిధుల సమాధానం. మొత్తం మీద వై.ఎస్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే  రాష్ట్రంలో హెచ్ ఎం ఆర్ ఐ సంస్థ కార్యకలాపాలు ప్రభుత్వ ప్రవేట్ భాగస్వామ్యం ప్రాతిపదికన మొదలయ్యాయి.
అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు, నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి, వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు పధకం,  ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినది. హెచ్ ఎం ఆర్ ఐ రూపొందించిన ఈ 104 సంచార వైద్య వాహనం, పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే, ఒక్కొక్కరిపై పెట్టే ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే, వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.
 104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఏ ఎన్ ఎం లు(నర్సులు), ఒక ఫార్మసిస్టు, ఒక లాబ్ టెక్నీషియన్, ఒక డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు.అవసరమని భావిస్తే,108 అంబులెన్సుకి ఫోన్ చేసి రప్పించి ఆసుపత్రిలో చేర్పిస్తారు. రక్త పోటు, షుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన రక్త పరీక్షలు , ఇతర పరీక్షలు నిర్వహించి అవసరమైన మార్పులతో మందులు ఉచితంగా అక్కడికక్కడే పంపిణీ చేస్తారు.

'దర్వాజాలో దవాఖానా' వంటి ఈ పధకం తదనంతర కాలంలో సంభవించిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో అందే ప్రభుత్వ సాయం అరకొరగా మారడంతో అర్ధాంతరంగా అటకెక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో సంభవించిన రాజకీయ పరిణామాల క్రీనీడలు  సంస్థ కార్యకలాపాలపై ముసురుకుని తొలిదశ లోనే  సంస్థ కృషి అర్ధాంతరంగా ముగిసింది. 
ఆదర్శంగా నిలవాల్సిన ఓ అద్భుత పధకం కొందరి నిర్వాకాలకు నీరుకారిపోయింది. మరి కొందరి స్వార్ధాలకు బలయిపోయింది. ఇంకొందరి  ఆహాలను చల్లార్చడానికి మాడి మసయిపోయింది. రాజకీయ చదరంగంలో చిక్కుకుపోయి ఆ  ఎత్తులు పైఎత్తుల్లో చితికి   చిత్తయిపోయింది.
ఇంత జరిగినా ఏమీ జరగనట్టే వుండడానికి కారణం వుంది. ఈ పధకం వల్ల లబ్ది పొందుతున్న వారు నిరుపేదలు. వారికి నోరూవాయీ లేదు.
కష్టం వచ్చినా చెప్పుకోలేరు. ఆ కష్టం తొలగినా చెప్పుకోలేరు. ఎందుకంటె చెప్పుకోవడానికి వారికెవరూ లేరు.
వారి గురించి పత్రికల్లో రాసేవారు లేరు. కారణం  వారిలో చాలా మంది నిరక్షరాస్యులు. చదవడం రాని వారి గురించిన వార్తలు వారికి పట్టవు. 
వారి గురించి బుల్లి తెరలపై చూపించేవారు లేరు. ఎందుకంటె అలాటి ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఎక్కడో బతుకులీడుస్తున్న బడుగులు వాళ్ళు.
అలాటి వాళ్లకు బాగా ఉపయోగపడే ఒక మంచి ఆరోగ్య పధకం పురుట్లోనే సంధి కొట్టిన రీతిగా అదృశ్యం అయింది.
ఇది ఉమ్మడి రాష్ట్రం చివరాఖరు దశలో జరిగిన కధ. రాజశేఖర రెడ్డి  జీవించి వుంటే బతికి బట్ట కట్టే కధ. ఆయన లాగానే ఈ కధ కూడా అర్ధంతరంగా ముగిసిపోయింది.
108, 104 పధకాలు ఇప్పటికీ వున్నాయి అనే వారు వున్నారు కానీ అవి ఏ రూపంలో వున్నాయో అందరికీ తెలుసు.
ఏదో చేయాలనే  తపన కొత్త ముఖ్యమంత్రిలో కనబడుతోంది. చేసి చూపిస్తాం అనే సంస్థలు వున్నాయి. తపనకు, సహకారం తోడయితే సత్ఫలితాల విషయంలో సందేహించే పని వుండదు. టెక్నాలజీని సరిగా ఉపయోగించుకుంటే మానవ ప్రయత్నాలకు మరింత పరిపుష్టి చేకూరుతుంది.  గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఇటువంటి పధకాలపై   వై.ఎస్.ఆర్. సి. పీ. ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి