3, మే 2019, శుక్రవారం

నాయకులు, నమ్మకాలు, అంచనాలు, వాస్తవాలు

2014 లో ఏం జరిగింది? 2019 లో ఏం జరుగుతుంది?
‘ఏదో జరుగుతోంది. కానీ ఏం జరుగుతున్నదో అర్ధం కావడం లేదు’ అంటాడు ఓ తెలుగు సినిమాలో జూనియర్ విలన్.
అలా వుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం.
జరిగిన దాన్ని బట్టి జరగబోయేది ఊహించి చెప్పడానికి వీలుంది కాని అదే నిజమని ఖచ్చితంగా చెప్పే వీలు మాత్రం లేదు. అందుకే జరిగినదాన్ని బట్టి జరిగేది అంచనా వేసి చెప్పే  ఊహాగానాల పరంపర అవిచ్చిన్నంగా అక్కడ  కొనసాగుతోంది.
పోలింగుకు,  ఓట్ల లెక్కింపుకు నడుమ దాదాపు నలభయ్ రోజులకు పైగా వున్న వ్యవధానం ఇందుకు ప్రధాన కారణం. మే  ఇరవై మూడో తేదీ తర్వాత అసలు విషయం తేలేలోగా ఎవరికి వారు జయాపజయాలు గురించి ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకుంటున్నారు. అధికార తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే ఒకసారి ఎన్నికల్లో పోటీచేసిన తన పార్టీ అభ్యర్ధులతోను, పార్టీకి చెందిన ఇతర నాయకులతోనూ ఒకపర్యాయం సమాలోచనలు జరిపి తమ పార్టీ గెలుపు గురించి భరోసా ఇచ్చారు. మళ్ళీ మరోమారు పార్లమెంటునియోజక వర్గాల వారీగా అభ్యర్ధులు అందరితోను సమీక్షలు జరపాలనే ఓ  సుదీర్ఘకార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రధాన ప్రత్యర్ధి వై ఎస్ జగన్ మోహన రెడ్డి మాత్రం విజయం మీద విశ్వాసంతో సమీక్షల వంటి కార్యక్రమల జోలికి పోకుండా కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు వెళ్ళారు.
సరే! మీడియాలో మాత్రం అనునిత్యం ఈ రెండు పార్టీల ప్రతినిధుల మధ్య ఏదో ఒక విషయంలో చర్చలు, ఘర్షణలు తప్పడం లేదు. ఈలోగా సోషల్ మీడియాలో ఎన్నికల ఫలితాలు గురించి గంటకో సర్వే, పూటకో  అంచనా వెలువడుతున్నాయి. మళ్ళీ వాటిమీద వ్యాఖ్యానాలు. తిరిగి వాటిమీద వ్యాఖ్యలు. ఇలా ఆ మాధ్యమంలో అలుపెరుగని అంచనాల దుమారం చెలరేగుతోంది. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియని అయోమయం.  ఎక్కడోఅక్కడ నలుగురు కలిస్తే చాలు, ఏపీలో ఏం జరుగుతుందనేది మొదటి ప్రశ్నగా మారింది. పత్రికారంగానికి చెందిన మనిషి కనబడితే  ఈ ప్రశ్నల పరంపర మరింతగా కొనసాగుతుంది. చెప్పేందుకు ఏమీ లేకపోవడం వల్లనో, ఏం చెబితే ఏం కొంప మునుగుతుందో అనే భయం చేతనో, ఏదీ ఇదమిద్ధంగా తెలియకపోవడం వల్లనో, ప్రస్తుతానికి  ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటే పోలా అనే ఆలోచన వల్లనో ఏమో కాని మొత్తం మీద ఒక జవాబు సిద్ధం చేసి పెట్టుకోవాల్సి వస్తోంది.
‘పరిస్తితి టైట్ గా వుంది. కొంచెం ఆ పార్టీకి మొగ్గు ఉండొచ్చు. కానీ చివరి వరకు చెప్పలేం, ఏమైనా జరగొచ్చు’. ఇలా అన్నమాట.
ఈ గోడమీది పిల్లివాటం బాపతు జవాబులకు తోడు ఆయా రాజకీయ పార్టీల వీరాభిమానులు అపరిమితమైన ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తున్న ఫలితాల అంచనాలు కొండొకచో వినోదాన్ని కూడా పంచుతున్నాయి.
ఈ నేపధ్యంలో పదిమంది పదిరకాలుగా చెప్పుకుంటున్నారు. పల్లెల్లో రచ్చబండ కబుర్లను పోలివుండే ఆ మాటల  సమాహారమే ఇది. కాకపోతే ఇది సర్వే కాదు, ఊహాగానం అంతకంటే కాదు. అన్నీ జరిగినవే. అన్నీ నిజాలే అని ఆ మాటలు చెప్పేవాళ్ళు చెబుతారు. పైగా  ఏదీ ఊహాగానం కాదంటారు.  వీటిలో వాళ్ళు విన్నవి కొన్ని. మరికొన్ని కన్నవి.
సినిమా వారికి, రాజకీయ నాయకులకు కొన్ని నమ్మకాల మీద నమ్మకం జాస్తి.
ప్రసిద్ధ తెలుగు  సినిమా నిర్మాత ఒకరు  తను కొత్త చిత్రం నిర్మించిన ప్రతిసారీ తిరుపతికి వెళ్లి వస్తాడు. ఆయన తీసిన సినిమాల్లో సింహభాగం సూపర్ డూపర్ హిట్టు అయ్యాయి. కొన్ని బాక్సాఫీసు వద్ద బోలాపడ్డాయి. దెబ్బతిన్న ఆ సినిమాల విడుదల ముందు కూడా ఆయన తిరుపతి వెళ్లి పూజలు చేశారు. అయినా సరే, ఆయన నమ్మకం కించిత్తు కూడా మారలేదు. అది ఆయన నమ్మకం. ఆ నమ్మకంతోటే ఆయన ప్రతి సినిమా విడుదలకు ముందు తప్పనిసరిగా వెంకన్న దర్శనం చేసుకుంటారు.
ఆ సినిమా రంగం నుంచే రాజకీయ రంగ  ప్రవేశం  చేసిన నందమూరి తారక రామారావు కూడా ఎన్నికల సమయంలో ఒక విధానాన్ని అనుసరిస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని తిరుపతి నుంచి మొదలు పెట్టి మళ్ళీ తిరుపతిలో ముగించడం టీడీపీ అధినేత రామారావుకు  ఆనవాయితీ.
ఈసారిజరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కూడా ప్రచారాన్ని తిరుపతి నుంచే  మొదలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసారు. కానీ తిరుపతిలో ముగించలేకపోయారు. ప్రచారగడువు గుంటూరు జిల్లాలో ఉండగానే ముగిసిపోయింది. తిరుపతి వెళ్లలేకపోయారు. ఆయన తలచుకుంటే ఆ రాత్రి హెలికాప్టర్ లో ఆ పుణ్యక్షేత్రానికి వెళ్లి ఆ రాత్రి అక్కడ బస చేయగలిగేవారు. కానీ అలా జరగలేదు. వెళ్లి వుంటే బాగుండేదేమో అనేది ఒక తెలుగు దేశం పార్టీ నాయకుడి మనసులోని మాట. ఆయన నమ్మకాలు ఆయనవి. వెళ్ళలేదు కాబట్టి కిందటి మాదిరిగా ఫలితం రాదేమో అనే శంకతో కూడిన నమ్మకం అన్నమాట.
2014 ఎన్నికల సమయంలో కూడా ఇప్పటిమాదిరిగానే వారాల తరబడి ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్తితి. అప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన రెడ్డి  కుటుంబంతో కలిసి హిమాచల్ ప్రదేశ్ (సిమ్లా) విహార యాత్రకు వెళ్ళారు. ఈ సారి చంద్రబాబు నాయుడు కొద్ది రోజులే అయినా కుటుంబ సభ్యులతో కలిసి అదే రాష్ట్రంలో (సిమ్లా) మూడు రోజులపాటు వేసవి విడిది చేసి సేద తీరారు. ఇలాంటి విషయాలలో మూఢనమ్మకాలు పెంచుకున్న టీడీపీ నాయకులకు మళ్ళీ ఓ అనుమానం. అప్పటి మాదిరిగానే జరుగుతుందేమో అనే భయం. అప్పుడు సిమ్లా వెళ్ళిన జగన్ కు సానుకూల ఫలితం రాలేదు కనుక అదే ఇప్పుడు తమ విషయంలో జరుగుతుందేమో అని మనసు మూలల్లో అలజడి.
 మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేసి విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఆయనకు రాజకీయాలు అంటే ఆసక్తి. ఈ మధ్య మాటల మధ్యలో తన అనుభవం ఒకటి చెప్పారు. అది ఆయన మాటల్లోనే.
“2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం తధ్యం అనే దాదాపు అన్ని సర్వేలు జోస్యం చెప్పాయి. సీఎన్ఎన్ ఐబీఎన్ అనే ప్రముఖ టీవీ ఛానల్ కూడా ఓ ప్రసిద్ధ సంస్థ చేత సర్వే చేయించింది. ఆ ఫలితం కూడా వైసీపీకి అనుకూలంగా వచ్చింది. ఈలోగా న్యాయస్థానం ఆదేశాల మేరకు నవ్యాంధ్ర ప్రదేశ్ లోని  మునిసిపాలిటీలకు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నందున ఫలితాలను మాత్రం ఆ ఎన్నికల పోలింగు పూర్తయిన తర్వాతనే ప్రకటించాలని కోర్టు షరతు విధించింది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి టీడీపీకి బీజేపీతో పొత్తుకానీ, జనసేనతో అవగాహన కానీ లేవు. పార్టీ ప్రాతిపదికన జరిగిన ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది.  అయితే ఆ విషయం అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎవరికీ తెలవదు. అసెంబ్లీ పోలింగు పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఫలితాలు ప్రకటించడం జరిగింది.
సీఎన్ఎన్ ఐబీఎన్ టీవీ ఛానల్ కు ఆ సమయంలో ప్రధాన సంపాదకుడిగా వున్న రాజదీప్ సర్దేశాయ్ తాము జరిపిన సర్వేపై నిర్వహిస్తున్న చర్చలో ఈ విషయాన్ని ప్రస్తావించారు కూడా.  స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సర్వే ఫలితాలకు భిన్నంగా వచ్చే అవకాశం లేదా అని  సర్వే జరిపిన సంస్థ ముఖ్యుడిని ప్రత్యక్ష ప్రసారంలో నేరుగా అడిగారు. అంటే అసెంబ్లీ ఫలితాలు టీడీపీకి అనుకూలంగా మారే వీలు లేదా అన్నది ఆయన మనసులోని మాట కావచ్చు.  సర్దేశాయ్ వ్యక్తం చేసిన సందేహాన్ని నివృత్తి చేస్తూ ఆ సెఫాలజిస్ట్ ఆనాడు చెప్పిన మాటలు నాకు బాగా జ్ఞాపకం వున్నాయి. ఆయన  ఇలా అన్నారు.
“స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సాధించిన విజయం కళ్ళముందు కనబడుతున్న మాట వాస్తవమే. కాదనను. కానీ మా సర్వే నిజం అవుతుందనే అనుకుంటున్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ విజయం సాధిస్తుందనేది నా గట్టి నమ్మకం’ (While the empirical evidence of local body elections is against YCP, still my gut feeling is Jagan will come to power.)
కానీ చివరికి  జరిగింది ఏమిటి?  ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సర్వేలో చెప్పిన ఫలితానికి భిన్నంగా జరిగింది.
అది ఆ రిటైర్డ్ బ్యాంకు అధికారి అనుభవం.
నమ్మకాల విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ది ఒక విలక్షణమైన తత్వం. తాను  నమ్మడమే కాదు, ఇతరులను నమ్మమని కూడా  చెబుతారు. అమరావతి నిర్మాణం విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కొన్ని వాస్తు సలహాలు ఇచ్చారని కొన్నేళ్ళ క్రితం పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది కూడా.
నిరుడు చివర్లో జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ స్వయంగా వెళ్లి  త్రిదండి  చినజీయర్ స్వాముల దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు తీసుకున్నారు. నామినేషన్ వేయడానికి ముందు కూడా ఒక దేవాలయానికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకున్న తర్వాతనే ఆయన మిగిలిన పనులు పూర్తిచేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా అలాగే చేసారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు నామినేషన్ వేసేముందు అక్కడికి ముప్పయి కిలోమీటర్ల దూరంలోని కోనాయ్ పల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఫలితాలు చూసిన తర్వాత, ఈ నమ్మకాలు కేసీఆర్ కి కలిసివస్తున్నట్టే అనుకోవాలి. ఆ ఎన్నికలో కేసీఆర్ తన సమీప ప్రత్యర్ధిపై  యాభయ్ వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొండమే కాకుండా అసెంబ్లీలోని 119 స్థానాల్లో 88 సీట్లు గెలిచి వరసగా  రెండోమారు తెలంగాణాలో టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు.
ఈ సారి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సయితం కేసీఆర్ బాటనే అనుసరించినట్టు అనుకోవాలి. పాదయాత్ర ముగింపులో నేరుగా తిరుపతి వెళ్లి, పాదరక్షలు లేకుండా మెట్ల మార్గంలో నడిచి వెళ్లి  తిరుమల చేరుకుని ఏడుకొండల  వెంకన్న స్వామి దర్శనం చేసుకున్న విషయం, విశాఖ శారదా పీఠాధిపతిని దర్శించి ఆయన ఆశీర్వాదాలు పొందిన వైనం ఇందుకు సాక్ష్యం. అలాగే చిన జియ్యర్ స్వామిని ఆయన ఆశ్రమంలో దర్శించుకుని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కానీ, వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన రెడ్డి కానీ కేవలం ఇటువంటి నమ్మకాలపైనే పూర్తిగా ఆధారపడి ఎన్నికల వైతరణి దాటే ప్రయత్నం చేసారని చెప్పలేం. వారు తమ తమ  పార్టీ నాయకులుగా సమస్త శక్తియుక్తులను ధారపోసి ఎన్నికల్లో విజయం సాధించే కృషి చేసారు. అలాగే కొత్తగా ఎన్నికల రంగ ప్రవేశం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా.
వయసు మీద పడుతున్నా చంద్రబాబునాయుడు ఏమాత్రం సంకోచించకుండా తన కంటే వయసులో చిన్నవారయిన రాజకీయ ప్రత్యర్ధులకు తీసిపోకుండా ఒంటి చేత్తో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్తా కర్మా క్రియా సమస్తం ఆయనే అన్నట్టుగా ప్రచారభారాన్ని తన భుజస్కందాలకు ఎత్తుకున్నారు.
ఇక వైసీపీ అధినేత జగన్ మోహన రెడ్డి సంగతి చెప్పక్కర లేదు. ఈ తడవ ఎన్నికలతో ఆయన రాజకీయంగా పూర్తిగా రాటుతేలినట్టే అని అనుకోవచ్చు. ఏ కొద్ది కాలమో మినహాయిస్తే,  గత ఎన్నికల నుంచి ఈ ఎన్నికల వరకు ఆయన పాదయాత్ర పేరుతోనో, మరో పేరుతోనో ప్రజల మధ్యనే ఎక్కువ కాలం గడిపారు.
సినీ రంగానికి చెందినవారు ఎండ కన్నెరుగని సుకుమార జీవులని ప్రతీతి. ఇందుకు భిన్నంగా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ సయితం ఎన్నికల ప్రచారంలో అలుపెరుగకుండా పాల్గొన్నారు. 
మానవ ప్రయత్నానికి దైవకృప తోడవుతే మంచి ఫలితాలు వస్తాయని పెద్దలు  చెబుతారు. చూడాలి ఎవరి రాత ఎలా వుందో!!  (EOM)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి