2, ఏప్రిల్ 2019, మంగళవారం

రేడియోలో ‘దూడలు’ – భండారు శ్రీనివాసరావు


చాలా ఏళ్ళ కిందటి సంగతి.
ఢిల్లీలో  బాబూ జగ్జీవన్ రామ్ మరణించినట్టు  ఆరోజు ఉదయం ఆరుగంటల ప్రాంతంలో    పీటీఐ వార్తా సంస్థ వార్త ఇచ్చింది.  మరో నలభయ్ అయిదు నిమిషాల్లో విజయవాడ నుంచి ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ప్రాంతీయ వార్తావిభాగం అధికారి శ్రీ ఆర్వీవీ కృష్ణారావు, వెంటనే స్పందించి,  జగ్ జీవన్  రాం గురించిన సమస్త సమాచారం సిద్ధం చేసుకుని సవివరంగా ఆ వార్తను ప్రసారం చేసారు. న్యూస్ రీడర్, కీర్తిశేషులు కొప్పుల సుబ్బారావు ఆ రోజు బులెటిన్ చదివారు. ప్రాంతీయ వార్తల అనంతరం ఢిల్లీ నుంచి వెలువడే సంస్కృత వార్తల్లో ఈ సమాచారం లేకపోవడంతో సిబ్బంది కంగారు పడ్డారు. ఆ తరువాత ఏడూ అయిదుకు వచ్చే  ఢిల్లీ తెలుగు వార్తల్లోనూ, ఎనిమిది గంటల జాతీయ వార్తల్లోనూ ఆ  మరణ వార్త లేకపోవడంతో కంగారు మరీ ఎక్కువయింది. బెజవాడ రేడియో కప్పదాటు వేసిన విషయం బయట పడింది. అప్పటి తెలుగు దేశం లోక్  సభ  సభ్యుడు శ్రీ పుట్టపాగ రాధాకృష్ణ ఈ విషయాన్ని  ప్రశ్న రూపంలో లేవనెత్తారు. సమాచార శాఖ మంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో, ఈ వార్త ప్రసారం చేయడంలో పీటీఐ పై ఆధారపడి దేశంలోని  ఏడు రేడియో స్టేషన్లు తప్పు చేశాయని తెలిపారు. గమ్మత్తేమిటంటే ఈ పొరబాటు చేసిన విజయవాడ రేడియో స్టేషన్ పేరు ఈ జాబితాలో లేదు.
ఏది ఏమైనా ఈ ఉదంతంతో రేడియో అధికారులు మరణ వార్తల ప్రసారం విషయంలో అనుసరించాల్సిన ఆదేశిక సూత్రాలు ఢిల్లీ నుంచి జారీ అయ్యాయి. రేడియో విలేకరి స్వయంగా వెళ్లి చూసి  ఇచ్చేదాకా, ముఖ్యుల మరణ వార్తను ప్రసారం చేయరాదని ఆంక్షలు విధించారు.
తరువాత చాలా కాలానికి   ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి ఢిల్లీలోని రామమనోహర్ లోహియా ఆసుపత్రిలో  మరణించారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న శ్రీ పీవీ నరసింహారావు అంజయ్య భౌతిక కాయాన్ని విమానంలో హైదరాబాదు తీసుకు వస్తున్నట్టు జాతీయ వార్తా ఛానళ్ళు సమాచారం ఇచ్చాయి. బెజవాడ నుంచి వెలువడే కొన్ని ప్రధాన పత్రికల్లో కూడా అంజయ్య మరణ వార్త లేట్ న్యూస్రూపంలో సంక్షిప్తంగా ప్రచురించారు.
విజయవాడలో ఉన్న కృష్ణారావు గారు హైదరాబాదులో ఉన్న నాకు ఫోను చేసి అడిగారు. వార్త కరక్టే అని చెప్పాను. కానీ ఆయన చనిపోయింది ఢిల్లీలో. నిబంధనల ప్రకారం  ఢిల్లీ విలేకరి ఆ  వార్తను ధ్రువపరచాలి. అందుకోసం ప్రయత్నించారు కానీ ఆ సమయంలో ఢిల్లీలోఎవరూ దొరకలేదు. చనిపోయింది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. నిబంధనల పేరుతొ ఆరోజు న్యూస్ బ్రేక్ చేయక పొతే  ప్రజలనుంచి పెద్ద నిరసన వచ్చే ప్రమాదం వుంది. దాంతో ఏమైతే ఏమైందని కృష్ణారావు గారు అంజయ్య గారి మరణ వార్తను ఇతర వివరాలతో కలిపి ఉదయం ఆరూ నలభయ్ అయిదు  నిమిషాలకు మొదలయ్యే ప్రాంతీయ వార్తల్లో ప్రముఖంగా ప్రసారం చేసారు.
మళ్ళీ సీను రిపీట్. ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ ముచ్చటే లేదు. ఇక్కడ నుంచి ఇచ్చినా నిబంధనల పేరుతొ తీసుకోలేదు.
తెలుగు ప్రముఖుడు ఒకరు చనిపోతే ఆ వార్తకు ఢిల్లీ తెలుగు వార్తల్లో ఆ విషయం చెప్పరాఅంటూ మళ్ళీ పుట్టపాగ రాధాకృష్ణ గారే పార్ల మెంటులో హడావిడి చేసారు.
ఇలాటివే మరి కొన్ని అవకతవకలు రేడియో వార్తల్లో దొర్లాయి. ఒకటి జగ్జీవన్ రాం మరణ వార్త, రెండోది లోక్ నాయక్ జయప్రకాశ్ కన్నుమూత గురించిన వార్త. ఈ రెండింటినీ ధ్రువ పరచుకోకుండానే వార్తల్లో ఇవ్వడం, నాలుక  కరచుకోవడం జరిగింది. పార్లమెంటు శ్రద్ధాంజలి ఘటించింది కూడా. ఆ తరువాత కానీ జరిగిన పొరబాటు తెలియరాలేదు.
ఇంకా పాత కాలంలో తమిళనాట (అప్పుడు మద్రాసు రాష్ట్రము) ద్రవిడ నాయకుడు అన్నాదొరై మరణ వార్త ప్రసారం చేసే విషయంలో రేడియోవాళ్ళు తొందర పడి దూడ వేసారనే వదంతి ఒకటి  వుంది. నాకైతే తెలియదు.

1 కామెంట్‌: