16, మార్చి 2019, శనివారం

దుర్గంధ భరితం - ఏపీ రాజకీయం

ఒక మంచి మనిషిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తారు. పోలీసులకంటే ముందు రాజకీయం రంగ ప్రవేశం చేస్తుంది. కారణం  అది ఆంధ్రప్రదేశ్.
ఉదయం గుండెపోటుతో మరణించారని వార్తలు. చనిపోయింది నిగర్వి, నిరాడంబరుడు అయిన వై.ఎస్. వివేకానంద రెడ్డి. అందరూ పార్టీలను పక్కన బెట్టి నివాళులు అర్పించారు. ఒక గొప్ప మనిషి, నేటి రాజకీయాలకు ఏమాత్రం సరిపోని వ్యక్తి కాబట్టి అందరూ ఆయనతో తన అనుబంధాలను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
గంటల్లో దృశ్యం మారిపోయింది. అది సహజ మరణం కాదు, హత్య అనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అంతే! రాజకీయం రంగంలోకి వచ్చింది. చనిపోయింది సాక్షాత్తు ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి కావడంతో రాజకీయం తన డేగ రెక్కలు విప్పుకుంది. అందులోను ఎన్నికల కాలం. ఎవరు మాత్రం వదులుకుంటారు ఈ మహత్తర అవకాశం. అదే జరుగుతోంది. ఒక ఉత్తమ రాజకీయ నాయకుడి ఆకస్మిక మరణం అమానుష రాజకీయానికి ఒక వేదికగా మారింది. ఎక్కడయినా ఇలా జరుగుతుందా! జరగదు. కానీ అది ఆంధ్రప్రదేశ్. అక్కడ అలాగే జరుగుతుంది. జరిగితీరాలి.
సంఘటనపై పోలీసులు స్పందించారు. చనిపోయింది కడప జిల్లాకు చెందిన  ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కావడంతో డీజీపీ స్థాయి అధికారి పెదవి విప్పి మాట్లాడడంలో అసహజం ఏమీ లేదు. కానీ అది కూడా ఒక వివాదాంశం అయికూర్చుంది. ఎండుమంటే, అది ఆంధ్రప్రదేశ్.
వివాదం కావడానికి కూడా కారణం లేకపోలేదు. గతంలో విచారణ సాగుతుండగానే పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు తొందరపడి  స్పందించిన దాఖలాలు వున్నాయి. ఉన్నతస్తానాల్లో ఉన్న పోలీసు  అధికారులు ఇలా  బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యానాలు చేయొచ్చా  అనే చర్చ అనవసరం. ఎందుకంటె అది ఆంధ్రప్రదేశ్.
ఈలోగా అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన  ఒక నాయకుడు టీవీ తెరలపై కానవచ్చి ‘జగనే తన బాబాయిని హత్య చేయించాడని ఒక బాంబు పేల్చారు.  ఇలా తొందరపడి ఒక నిర్ధారణకు రావడం, ప్రతిపక్ష నేతపై ముందూ వెనకా చూసుకోకుండా తీవ్రమైన ఆరోపణలు చేయడం సబబా అంటే ఎంతమాత్రం కాదు. కానీ అది ఆంధ్రప్రదేశ్. అలాగే జరుగుతుంది.
వై.ఎస్.ఆర్. పార్టీ వాళ్ళు ఊరుకుంటారా! ఊరుకుంటే అది రాజకీయపార్టీ కానేరదు. ఏకంగా ఆ పార్టీ అధినాయకుడే స్పందించారు. ఇది ప్రభుత్వం చేయించిన హత్య అని జగన్ మోహన రెడ్డి ఆరోపించారు. దీని వెనుక చంద్రబాబు హస్తం వుందనేది అన్యాపదేశంగా ఆయన ఉద్దేశ్యం. ఒక ముఖ్యమంత్రి పై ఇలాంటి ఆరోపణలు చేయడం సహేతుకమా అంటే సమాధానం మళ్ళీ ఒక్కటే. అది ఆంధ్రప్రదేశ్.
మరో రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్ల పర్వం మొదలవుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్దులను ఖరారు చేయడంలో, అసంతృప్తులను బుజ్జగించడంలో, పార్టీ మారి వచ్చేవారికి కండువాలు కప్పి తమ పార్టీ తీర్దాలు ఇప్పించడంలో తలమునకలుగా ఉన్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రి  విలేకరుల సమావేశం పెట్టి సంఘటన పూర్వాపరాలను వివరించారు. పనిలో పనిగా అనుమానపు వేలును జగన్ వైపు చూపించారు. ఇది అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్.
విడ్డూరంగా అనిపించే విషయం ఏమిటంటే ఒక చిన్న స్థాయి పోలీసు అధికారి చెప్పాల్సిన మాటలు ముఖ్యమంత్రి చెప్పడం.
‘ఉదయం సహజ మరణం అన్నారు. గంటల్లో అది హత్య అని తేలింది. సంఘటన జరిగింది వారింట్లో. చనిపోయిన మనిషిని స్నానాలగది నుంచి పడక గదికి చేర్చారు.  రక్తపు మరకలు తుడిచేశారు. సాక్ష్యాధారాలు మాయం చేసే దురుద్దేశ్యంతో అలా చేసారు. ఆసుపత్రికి తీసుకెళ్ళి సహజ మరణం అని నమ్మించే ప్రయత్నం చేసారు. ఇంట్లో హత్య జరిగినప్పుడు ఎవరయినా ముందు పోలీసులకు సమాచారం అందిస్తారు. హత్యాప్రదేశంలో ఆనవాళ్ళు చెరిపేయరు. అందుకే అనుమానాలు. వీటి నివృత్తి జరగాలి. క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలి. అందుకే ‘సిట్’ ఏర్పాటు’ అన్నారాయన. అది ఆంధ్రప్రదేశ్. అందుకే ప్రతి విషయంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు స్పందిస్తారు.
వైసీపీ ఊరుకుంటుందా! గతంలో హైదరాబాదులో నటుడు బాలకృష్ణ ఇంట్లో ఒక దుస్సంఘటన జరిగినప్పుడు పోలీసులు వచ్చేలోగా ఆ ఇంటి వాళ్ళు రక్తపు మరకలను శుభ్రం చేయలేదా అని గుర్తు చేస్తున్నారు.
‘ఒక ఘోరం జరిగింది. తెల్లారి చూస్తె ఇంటి పెద్ద బాత్ రూములో చనిపోయి పడివున్నాడు. ఆ దృశ్యం చూసిన ఇంట్లో వాళ్ళు ముందు ఏం చేస్తారు? ఆ విగత జీవిని వేరే గదిలోకి తరలిస్తారు. శరీరం మీద నెత్తురు మరకలు వుంటే తుడుస్తారు. చనిపోయిన వాడు పరాయి మనిషి కాదు, చూస్తూ చూస్తూ పోలీసులు వచ్చేదాకా అలా స్నానాల గదిలో  వదిలేయడానికి. మానవత్వం ఏ కోశానా  లేనివాళ్ళు మాత్రమే అలాంటి దుష్టపు ఆలోచనలు చేస్తారు’ అని చంద్రబాబుపై ఎదురు దాడికి దిగుతున్నారు.
ఇది సరే! ఒప్పుకుందాం. మరి సహజ మరణం అంటూ ఇచ్చిన పిర్యాదు సంగతేమిటి? ఈ ప్రశ్నకు జవాబు లేదు. ఉండదు. ఎందుకంటే  అది ఆంధ్రప్రదేశ్.     
జరిగింది హత్య అని ఇరుపక్షాలు నిర్ధారణకు వచ్చి బహిరంగంగా ఆ సంగతి అంగీకరిస్తున్నారు. పోలీసులు కూడా హత్యే అని అంటున్నారు. ప్రభుత్వం గంటల వ్యవధిలోనే ప్రత్యెక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది.
‘ఠాట్!  ‘సిట్’ పనికిరాదు. అది రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తుంది. సీబీఐ చేత దర్యాప్తు చేయించి నిజం నిగ్గు తేల్చాలి’ అని వైసీపీ నాయకుల డిమాండ్. డేటా చోరీ కేసులో తెలంగాణా ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేస్తే తెలుగు దేశం పార్టీ  చేసిన ఆరోపణలను గుర్తుచేస్తూ.
‘వీళ్ళకి రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు, వ్యవస్థల మీద నమ్మకం లేదు. మాట్లాడితే సీబీఐ అంటారు. తమ నేరాలను కప్పి పుచ్చుకోవడానికే ఆ డిమాండ్లు’ చంద్రబాబు ఆరోపణాస్త్రం.
‘గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు ఎన్నిసార్లు సీబీఐ దర్యాప్తుకు పట్టుబట్టలేదు. అంటే స్థానిక పోలీసుల మీద నమ్మకం లేకనేనా? మాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం వుంది. విశ్వాసం లేనిది ప్రభుత్వం మీదనే. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నాం’ వైఎస్ ఆర్ సి పీ నాయకుల ప్రత్యారోపణ.
నిన్నకాక మొన్న సీబీఐ ని మా రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వం అని ఘీంకరించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఈడీ మీద నమ్మకం లేదన్నదీ ఆయనే. తనకు నమ్మకం లేదంటే అందరూ దాన్ని నమ్మాలి. మాకు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదంటే మాత్రం  మాకు వ్యవస్థల మీద నమ్మకం లేదని భాష్యం చెబుతుంటారు’ అనేది వారి ముక్తాయింపు.  
ఒక పెద్దమనిషి మరణించినప్పుడు అదీ హత్య అని నిర్ధారణ అయినప్పుడు జరగాల్సిన వాదోపవాదాలు ఇవేనా! ఖచ్చితంగా కాదు. కానీ అది ఆంధ్రప్రదేశ్.    
వివేకానంద రెడ్డిని వివాదరహితుడిగా అభివర్ణిస్తూ,  నివాళులు అర్పించిన రాజకీయ నాయకులే ఆయన మరణాన్ని వివాదగ్రస్తం చేస్తూ వుండడం ఓ విషాదం.
సరే! ఇవన్నీ ఒకెత్తు. మీడియా ఈ సంఘటనపై స్పందిస్తున్న తీరు.  చర్చల రూపంలో విచారణ సాగిస్తున్నవైనం. ఇది బాధ్యత కలిగిన మీడియా చేయాల్సిన పనేనా! ఈ ప్రశ్న కూడా అనవసరం. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్.
సరే! ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఇలాగే సాగేవే. వాటిని కాసేపు ఒదిలేద్దాం.
చనిపోయిన ఆ మంచి మనిషిని గురించి ఓ మంచి ముక్క చెప్పుకుందాం  
ఇది జరిగి చాలా ఏళ్ళయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి.
రవీంద్ర భారతిలో దూరదర్సన్ ఏదో సంగీత కార్యక్రమం ఏర్పాటు చేసింది. ముఖ్య అతిధులు, ముఖ్యుల కోసం ముందు రెండు వరసలు ఖాళీగా ఉంచారు. నేను మూడో వరసలో కూర్చున్నాను.
వెనుకవైపు జనం బాగా నిండి పోయారు. అక్కడక్కడా ఒకటో అరో కుర్చీలు ఖాళీగా వున్నాయి.
కార్యక్రమం మొదలు కావడానికి కాస్త ముందు బక్కపలచగా ఉన్న ఓ వ్యక్తి లోపలకు వచ్చి నాలుగో వరసలో ఖాళీగా ఉన్న ఓ కుర్చీ వెతుక్కుని కూర్చున్నారు. ఎక్కడో చూసినట్టుగా వుందే అనుకుంటూ తేరిపార చూస్తే అయన ఎవరో కాదు, పార్లమెంటు సభ్యుడు వై.ఎస్. వివేకానంద రెడ్డి. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి స్వయానా సోదరుడు. ముందూ వెనకా సెక్యూరిటీ కూడాలేదు.
వెళ్లి ముందు వరసలోకి రమ్మంటే ఆయన సున్నితంగా తిరస్కరించారు. పరవాలేదు ఇక్కడే కూర్చుంటాను, నాకేమీ ఇబ్బంది లేదుఅన్నారాయన అంతకంటే సున్నితంగా.
రాజకీయాల్లో అటువంటి నిరాడంబరత్వం నిజంగా అపురూపమే. 

2 కామెంట్‌లు:

  1. అవునండి. ఆంద్రప్రదేశ్ రాజకీయాలు కుళ్ళి పోయాయి.
    సమూలంగా, శాశ్వతంగా ప్రక్షాళన చేయవలసిన స్థితికి వచ్చేసాయి.

    రిప్లయితొలగించండి
  2. చట్టం తనపని తాను చేసుకుపోతే నేరస్థులు తప్పించుకోలేరు. త్వరలోనే పట్టుబడాలని ఆశిద్దాం.

    రిప్లయితొలగించండి