12, మార్చి 2019, మంగళవారం

ఉడ్డుగుడుచుకుంటున్న పార్టీలు


నాలుగే నాలుగు వారాలు. అంటే నెల రోజులు.
తాము నమ్ముకున్న ప్రజలు, తాము ఇన్నాళ్ళుగా నమ్మించాలని విశ్వ ప్రయత్నం చేసిన ఆ ప్రజలు, ఇటా, అటా, ఎటో అన్న సంగతి నిర్ధారించే ఘడియకు రాజకీయ పార్టీలకు ఇప్పుడు మిగిలిన వ్యవధానం ఇంచుమించు ఇంతే!
ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్ధుల నామినేషన్లు దాఖలు  చేయడానికి తుది గడువు రెండు వారాల్లో  మార్చి ఇరవై అయిదో తేదీతో ముగిసిపోతుంది. ఈ గడువులోగా అభ్యర్ధులను ఖరారు చేయడానికి, తిరస్కరణకు గురికావడానికి ఆస్కారం లేని రీతిలో వారి నామినేషన్లను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సకాలంలో  సమర్పించడానికి పార్టీలు, అభ్యర్ధులు  ఎంతగా అతలాకుతం ఊహకు అందని సంగతి కాదు.
గత డిసెంబరు లోనే తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగాయి కనుక, ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని పదిహేడు లోకసభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకసభతో పాటు శాసన సభకు కూడా ఎన్నికల నగారా మోగింది. అంటే, రెండువారాల వ్యవధిలో  ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోకసభ సీట్లకు ఎన్నికలు ఏ క్షణంలో వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి సదా, సర్వదా సంసిద్ధంగానే ఉన్నామంటూ పలుమార్లు ఉద్ఘాటించిన నాయకులు ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు.     
ఎంత కాకలు తిరిగిన రాజకీయ యోధుడికయినా ఎన్నికలు అంటే ఆషామాషీ కాదు.
ఎన్నో వ్యవహారాలు చక్కదిద్దుకుంటేనే ఆ క్రతువు పూర్తవుతుంది.
అభ్యర్ధుల ఎంపిక పెద్ద సమస్య. ఇందులో ఎన్నో విషయాలు పైకి చెప్పుకోలేనివి వుంటాయి. బయటకు మాత్రం ‘గెలుపు గుర్రాలు’ అని ఒక్క పదంతో సరిపుచ్చుతున్నారు. అభ్యర్ధి కులం ఏమిటి, ఆ నియోజక వర్గంలో ఆ కులానికి ఉన్న సంఖ్యాబలం ఏమిటి, ప్రత్యర్ధి కాగల అవకాశాలు వున్న వ్యక్తి కులం ఏమిటి ఆ కులపు బలం ఏమిటి, అభ్యర్ధి ఆర్ధిక స్థోమత ఏమిటి (దీన్ని ఎన్నికల పరిభాషలో ధన బలం అంటారు), పార్టీ పట్ల అతడి నిబద్దత ఏమిటి (నిజానికి అంచనా వేసుకోవడానికే కానీ వాస్తవంగా ఎక్కడా రుజువు కాని విషయమే, ఇది టిక్కెట్టు ఇచ్చేవారికీ తెలుసు, పుచ్చుకునేవారికీ తెలుసు, అంచేత పెద్దగా పట్టించుకోవాల్సిన సంగతి ఎంతమాత్రం కాదు) ఇలా అనేక వివరాల ఆరాలు తీసుకుని కాని అభ్యర్ధి ఎంపిక జరగదు. దీనికి ముందు కూడా  ఎంతో తంతు నడుస్తుంది. పలానా సీటు పలానా వారికి అంటూ మీడియాలో లీకులు మొదలవుతాయి. వాటి ఆధారంగా వెనక్కి తిరిగివచ్చే సమాచారం కూడా అభ్యర్ధుల ఎంపికలో కీలక భూమిక పోషిస్తుంది. చివరికి బరిలో అతడే మిగులుతాడా లేదా వేరే ‘నల్ల గుర్రం’ ఆ టిక్కెట్టు తన్నుకుపోతుందా అనేది చిట్ట చివరివరకు అనుమానమే. బీ ఫారం చేతిలో పడిన తర్వాత కూడా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడానికి వీలు లేదు. చివరి ఘడియలో కూడా బొమ్మలు మారిపోవచ్చు.
ప్రచారానికి గడువు తక్కువ వుంటే ఒక రకంగా అభ్యర్ధులకు కాస్త వెసులుబాటు. ప్రచారం ఖర్చు కొంత కలిసివస్తుంది.  అయితే చాలా సందర్భాలలో ఇబ్బంది కూడా. ఉన్నట్టుండి ఎన్నికల ఘడియ తోసుకువస్తే పార్టీలు ఉడ్డుగుడుచుకుంటాయి. పోటీకి దిగాలని అనుకునే అభ్యర్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతారు. దీనికి తోడు టిక్కెట్టు ఆశించి భంగపడ్డవాళ్ళు, అనుకున్న సీటు రానివాళ్ళు అటూ ఇటూ గెంతులాటలు.  
ప్రస్తుతం నడుస్తున్న కధ ఇదే!

3 కామెంట్‌లు:

  1. ఎవరి గోల వారిది. మీడియా వాళ్ళకి మాత్రం సీజన్ టైం!

    రిప్లయితొలగించండి
  2. అన్నట్టు ఎన్నికల ప్రకటనకు నామినేషన్ దాఖలు చేసే చివరితేది కి మధ్య ఆట్టే గడువు లేదు. మరి ఇంత తక్కువ సమయంలో అన్ని గ్రహాలు నక్షత్రాలు అనుకూలించే పగటిముహూర్తం దొరుకుతుందో లేదో అభ్యర్థులకు. అన్నీ చూసుకుని చివరి తేదిని దాఖలు చేసి అది కాస్తా తిరస్కరించబడితే?ముహూర్తం చూసుకుని బయలుదేరితే ఏదోఎదురయ్యిందనే సామెత నిజమైపోతుంది!

    రిప్లయితొలగించండి