11, అక్టోబర్ 2018, గురువారం

గుడ్డుగారికో రోజు - భండారు శ్రీనివాసరావు


ఏ దేశమేగినా, ఎందుకాలిడినా పాలూ, నీళ్ళతో పాటు తప్పకుండా దొరికేది మరోటివుంది. అదే కోడి గుడ్డు.
రేపు శుక్రవారం అంతర్జాతీయ కోడిగుడ్డు దినం కూడానట. ఇప్పుడే ఒక మిత్రుడి ద్వారా తెలిసింది.
1975 వరకు ఎగ్గూ పెగ్గూ రెండూ మా ఇంటావంటా లేవు. వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా రెండోది ముందుగా వచ్చి  చాలా కుటుంబాలలో తిష్ట వేసింది. మొదట్లో నిరసన ధ్వనులు వినపడ్డా మొత్తం మీద  దానికి పసుపు నీళ్ళు చల్లి ఇళ్ళల్లోకి రానిచ్చారు. దాంతో పాటే మొదటిది కూడా తగుదునమ్మా అని గృహప్రవేశం చేసి ఓటరు కార్డు, ఆధార్ కార్డు లేకుండానే ఇంట్లో సభ్యురాలు అయిపొయింది. మంచి ఎండాకాలంలో కూడా చలి దుప్పటి కప్పుకుని పడుకునేది ఆ కోడిగుడ్డే. తిన్నా తినకపోయినా ఇంటికి వచ్చిన నాన్  వెజ్  ఫ్రెండ్స్ ఎవరికయినా అవసరం పడుతుందో ఏమో అని మా ఆవిడ ముందు జాగ్రత్తగా వాటిని కొని ఫ్రిజ్ లో దాచి ఉంచుతుంది.
ఎప్పుడో మా చిన్నప్పుడు మా చుట్టాల అమ్మాయికి టైఫాయిడ్ వచ్చి నిమ్మలించిన తర్వాత త్వరగా కోలుకోవడానికి డాక్టర్  ఉడక పెట్టిన కోడి గుడ్డు రోజూ ఒకటి  తినమన్నారు. అసలే నిప్పులు కడిగే ఆచారం. గుడ్డు తినమనగానే ఇంట్లో వాళ్లకి నిలువు గుడ్లు పడడం చూసిన డాక్టరు గారు, పేషెంటు ముక్కూ, కళ్ళూ మూసి, నోరు తెరిపించి పటేల్ మని గుడ్డు పగల గొట్టి తటాలున నోట్లో పోసి మింగించాడు. ఆ భీకర భీభత్స దృశ్యం చూసిన తరువాతే  వ్యాధి కంటే చికిత్స ప్రమాదకరం అనే సామెత పుట్టి వుండాలి.
ఏది ఏమైనా పిడికెట్లో నాలుగోవంతు లేని కోడి గుడ్డుకు అంతర్జాతీయఖ్యాతి వచ్చి, దాని పేరిట ఒక దినం ఏర్పాటు కావడం, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని గుడ్డు ప్రాముఖ్యతను ప్రస్తుతిస్తూ రేడియో ప్రసంగాలు, టీవీ కార్యక్రమాలు జరగడం కోడి గుడ్డు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. గుడ్డుగా వున్నప్పుడూ నలుగురికీ ఉపయోగపడుతూ, గుడ్డు నుంచి కోడిగా మారిన కొత్త అవతారంలో కూడా మానవులకు ఆహారంగా సేవలందిస్తున్న  బలి, శిబి చక్రవర్తులను మించిన ఆ  త్యాగశీలికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం, ఆమ్లెట్ గావేసుకుని నోరారా తినడం తప్ప.   


4 కామెంట్‌లు:

  1. బ్రామ్మలనుకున్నానే. గుడ్డు తింటున్నారా. దారుణం సార్. ఆమ్లెట్ కంపు ఎలా భరిస్తారు. పైపెచ్చు ఫ్రిజ్జులో పెట్టుకుంటున్నారా. రామ రామ.

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. @SURYA: మీకు ఆ గుడ్డు అంటే ఇష్టం అని ఇప్పుడే తెలిసింది. మీ కోరిక తీర్చడం కోసం అయినా ప్రయత్నం చేస్తాను. ఇంతకీ మీకు ఆమ్లెట్ కావాలా! ఉడకబెట్టుకుని తింటారా! ఇది కూడా తెలిస్తే నాకు రాయడం సులువవుతుంది. సూర్యగారూ. దయచేసి ఇటువంటి అర్ధరహితమైన వ్యాఖ్యలతో నా సమయం వృధా చేయకండి. మీ సమయం వృధా చేసుకోకండి. పెద్దవాడ్ని చెబుతున్నాను. నేను సాధారణంగా ఇటువంటి చర్చల్లో పాల్గొని సాగదీయను. తమిళంలో ఒక సామెత వుంది. ఈ సృష్టిలో ఏదీ పనికి రానిది అంటూ లేదు. పూచిక పుల్లతో కూడా అవసరం పడొచ్చు అనేది ఆ సామెతలోని భావం.

    రిప్లయితొలగించండి
  4. మీలో ఇంచక్కని (ర)హాస్య కోణం ఉందని
    ఈ విధంగా తెలియజెప్పారన్న మాట...
    హిలేరియస్ ... :)

    రిప్లయితొలగించండి