కంభంపాడులో మా ఇల్లు
ఇప్పటికి ఎనభయ్ ఏళ్ళు దాటినవాళ్ళు కూడా కంభంపాడు ఇంట్లోనే పుట్టారు అంటే ఇక ఆ ఇంటి వయసు ఎంతో, ఎప్పుడు కట్టారో ఊహించుకుంటే దానికి నూరేళ్ళు నిండాయనే అనిపిస్తోంది. నిజంగానే ఆ ఇంటికి త్వరలో నూరేళ్ళు నిండబోతున్నాయి. పదేపదే మరమ్మతులు వస్తూ వుండడం, శిధిల ఛాయలు కానరావడం బహుశా ఆ ఇంటి కూల్చివేతకు కారణం అనుకుంటున్నాను.
కంభంపాడులో మా ఇల్లు పెద్ద భవంతి ఏమీ కాదు. ఈ ఇల్లు కట్టడానికి ముందు ఉన్న ఇల్లు మాత్రం చాలా పెద్దది, మండువా లోగిలి అని చెబుతారు. మా తాతగారి కాలంలో ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురయింది. ఆ సంఘటనలో కాలిపోగా మిగిలిన కలపతో కొత్త ఇల్లు కట్టారని చెబుతారు. ఇప్పటికీ వసారాలో వేసిన పైకప్పులో కాలిన నల్లటి మచ్చలు కానవస్తాయి. ముందు వసారా. పక్కన దక్షిణాన ఒక పడక గది, మధ్యలో పెద్ద హాలు, దానికి ఆనుకుని ఒక పెద్ద గది, వెనుకవైపు మళ్ళీ ఓ వసారా, పక్కన వంటిల్లు. వెనుక వసారాలో పాలు కాచుకునే దాలి గుంట, పక్కనే మజ్జిగ చిలికే కవ్వం. అక్కడక్కడా గోడల్లోనే చిన్న చిన్న గూళ్ళు, వంటింట్లో రెండు ఇటుకల పొయ్యిలు, గోడకు రెండు చెక్క బీరువాలు, ఒకటి మడి బీరువా, ఆవకాయ కారాల జాడీలు పెట్టుకోవడానికి, రెండో బీరువాలో పెరుగు కుండలు, కాఫీ పొడి పంచదార మొదలయినవి దాచుకునే సీసాలు. వాటితో పాటే పిల్లలకోసం తయారు చేసిన చిరు తిళ్ళు. ఈ రెండు బీరువాలు తాకడానికి కూడా పిల్లలకు హక్కు వుండేది కాదు. మడి బీరువా మరీ అపురూపం. దానికి తాళం కూడా వుండేది కాదు, అందులోనే చిల్లర డబ్బులు దాచి పెట్టేవారు. పొరబాటున కూడా ఇంట్లో ఎవ్వరూ మైల బట్టలతో వాటిని తాకే సాహసం చేసే వాళ్ళు కాదు. వంటింటి వసారాలోనుంచి పెరట్లోకి గుమ్మం వుండేది. దానికింద వలయాకారంగా మెట్లు. కింద తులసి కోట. ఒక వైపు బాదం చెట్టు. అక్కడ అంతా నల్ల చీమలు. ఎర్రగా పండిన బాదం పండ్లు కొరుక్కు తింటే భలే బాగుండేవి. ఇక బాదం పప్పు రుచే వేరు. దానికి పక్కనే పున్నాగ చెట్టు. నేలరాలిన పూలు భలే మంచి వాసన వేసేవి. మా అక్కయ్యలు వాటిని సుతారంగా మడిచి మాలలు కట్టుకునే వాళ్ళు. మేము వాటితో బూరలు చేసి వూదేవాళ్ళం. దగ్గరలో ములగ చెట్టు. కొమ్మల నుంచి ములక్కాడలు వేలాడుతూ కనిపించేవి. అక్కడే రెండు బొప్పాయి చెట్లు కవల పిల్లల్లా ఉండేవి.
రెండో వైపు కొంచెం దూరంలో గిలక బావి. ఆ బావి చుట్టూ చప్టా. పక్కనే రెండు పెద్ద గాబులు (నీటి తొట్టెలు). ఒకటి స్నానాలకి, రెండోది బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి. స్నానాల గాబు పక్కనే వేడి నీళ్ళ కాగు. అక్కడే చెంబుతో వేడి నీళ్ళు, గాబు లోని చల్ల నీళ్ళు సరిపాట్లు చేసుకుంటూ పిల్లలు స్నానాలు చేసేవాళ్ళు. పెద్ద వాళ్ళు బావిదగ్గర నిలబడి, పనివాళ్ళు నీళ్ళు తోడి ఇస్తుంటే పిండితో వొళ్ళు రుద్దుకుంటూ స్నానాలు చేసేవాళ్ళు. నాకు బాగా బుద్ధి తెలిసే వరకు ‘సబ్బు’ గృహ ప్రవేశం చేయలేదు. బావి దగ్గర నుంచి వెనుక పెరట్లోకి చిన్న చిన్న కాలువలు ఉండేవి. ఇంట్లోకి అవసరం అయ్యే కాయగూరల్ని, ఆకు కూరల్ని అక్కడే పండించే వాళ్ళు. చుట్టూ కంచెగా వున్నా ముళ్ళ కంపకు కాకర పాదులు పాకించే వాళ్ళు. తేలిగ్గా ఓ పట్టాన తెంపుకు పోవడానికి వీల్లేకుండా. అక్కడే మాకు పెద్ద పెద్ద బూడిద గుమ్మడి కాయలు, మంచి గుమ్మడి కాయలు కనబడేవి. అంత పెద్దవి అక్కడికి ఎలా వచ్చాయో అని ఆశ్చర్యపడేవాళ్ళం. నాకు పొట్ల పందిరి ఇష్టం. పందిరి మీద అల్లుకున్న తీగె నుంచి పొట్ల కాయలు పాముల్లా వేలాడుతుండేవి. పొట్లకు పొరుగు గిట్టదు అనేది మా బామ్మ. పొరుగున మరో కూరగాయల పాదు వుండకూడదట.
బచ్చల పాదులు అంటే కూడా పిల్లలకు ఇష్టం. ఎందుకంటె వాటికి నల్ల రంగుతో చిన్న చిన్న పళ్ళు (విత్తనాలు) కాసేవి. వాటిని చిదిమితే చేతులు ఎర్రపడేవి. నెత్తురు కారుతున్నట్టు ఏడుస్తూ పెద్దవాళ్ళని భయపెట్టే వాళ్ళం. బెండ కాయలు, దొండ కాయలు దొడ్లోనే కాసేవి. దొండ పాదు మొండిది అనేవాళ్ళు. ఒకసారి వేస్తే చచ్చినా చావదట. ఇందులో యెంత నిజం వుందో తెలవదు. పాదుల గట్ల మీద ఆ పెరడు మధ్యలో రాణీ గారి మాదిరిగా కరివేపాకు చెట్టు వుండేది. నిజంగా చెట్టే. చాలా పెద్దగా, ఎత్తుగా వుండేది. ఊరి మొత్తానికి అదొక్కటే కరివేపాకు చెట్టు కావడం వల్లనేమో ఊరందరి దృష్టి దానిమీదనే. మా బామ్మగారిది నలుగురికీ పంచి పెట్టె ఉదార స్వభావమే కాని, మడి పట్టింపు జాస్తి. మైల గుడ్డలతో కరివేపాకు చెట్టును ముట్టుకోనిచ్చేది కాదు. దాంతో ఎవరూ చూడకుండా ఎవరెవరో దొంగతనంగా కరివేపాకు రెబ్బలు తెంపుకు పోయేవాళ్ళు.
బావి పక్కనే కంచెను ఆనుకుని విశాలమైన ఖాళీ స్థలం వుండేది. వెనుక వైపు దక్షిణం కొసన బండ్లు వెళ్ళడానికి రాళ్ళు పరచిన ఏటవాలు దారి వుండేది. అక్కడే జుట్టు విరబోసుకున్న రాక్షసి లాగా పెద్ద చింత చెట్టు. పగలల్లా ఆ చెట్టు కిందనే ఆడుకునే వాళ్ళం కాని పొద్దుగూకేసరికి చిన్న పిల్లలం ఎవరం ఆ ఛాయలకు పోయేవాళ్ళం కాదు. చింత చెట్టుకు ఓ పక్కన ఎరువుల గుంత వుండేది. గొడ్ల సావిట్లో పోగుచేసుకు వచ్చిన చెత్తనూ, పేడను అందులో వేసేవాళ్ళు. సాలు చివర్లో వాటిని జల్ల బండ్లకు ఎత్తి పంట పొలాలకు ఎరువుగా వేసేవాళ్ళు. కనీసం యాభయ్, అరవై బండ్ల ఎరువు పోగు పడేది.
ఇప్పుడు అవన్నీ గతంలోకి వేగంగా జారిపోతున్న తీపి జ్ఞాపకాలు
ఇంటిని మళ్లీ కట్టే ఆలోచన ఉందనుకుంటా. కూల్చేముందు బాగా ఫోటోలు తీసుకోండి గుర్తుకోసం. అయితే కూల్చేటపుడు పక్కనే ఉండండి. అంత పాత ఇల్లుకదా.. ఏమో ఏ గోడలో ఏ లంకెబిందె ఉందొ ఎవరికెఱుక?!
రిప్లయితొలగించండిఏమో ఏ గోడలో ఏ లంకెబిందె ఉందొ ఎవరికెఱుక?!
రిప్లయితొలగించండి😊😊😊😊
భండారు అంటే కాపులు అనుకున్నాను. మడీ ఆచారం అంటున్నారు బ్రాహ్మణులా ?
తొలగించండిஅவுனன்டே ரேபடினும்சி ஈயனகு ஏமி தம்டாலோ சாமீ :)
ఎవర్నన్నా పొగిడారా, తిట్టారా “జిలేబి” గారూ?
రిప్లయితొలగించండి@ 🦁 gaaru,
తొలగించండిఅవునంటే రేపట్నుంచి ఈయనకు ఏమి తంటాలో స్వామీ :)
మొన్న భాష్యానికి తైలం అడిగారు కదా ? ఈ రోజు ఆ తైలానికి ఈ తైలం చెల్లు...మీకూ నాకూ బాకీ లేదు.
అనువాదానికి థాంక్స్ నీహారిక గారూ.
రిప్లయితొలగించండిబాకీ చెల్లు అంటారా? అయితే వచ్చేజన్మలో కలుసుకోవడంలేదన్నమాట 🙂. సరే ఓకే, అలాక్కానివ్వండి 😌.
🦁
ఏయ్ జిలేబి అరవంలో పైకూలు రాస్తున్నావా.
రిప్లయితొలగించండి