16, సెప్టెంబర్ 2018, ఆదివారం

రణతంత్ర రాజకీయ గణితం – భండారు శ్రీనివాసరావు


(PUBLISHED IN ‘SURYA’ TELUGU DAILY ON SUNDAY, 16-09-2018)
రాజకీయాల్లో కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు వుంటాయి. అయితే గణిత శాస్త్రంలో మాదిరిగా ఇవి స్థిరంగా వుండవు. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మారుతుంటాయి. లెక్కల్లో రెండును  రెండుతో  కలిపితే నాలుగు అవుతుంది. అది మారదు. కానీ రాజకీయాల్లో అలా కాదు. ఆ  ప్రశ్నకు జవాబు నాలుగు కావచ్చు, కాకపోవచ్చు. అయినా రాజకీయులు గణితాన్నే నమ్ముకుని ముందుకు సాగుతుంటారు. వాళ్ళ లక్ష్యం గణితంలో పాసు మార్కులు తెచ్చుకోవడం కాదు, ఎన్నికల పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం.
ఇందులోనుంచి పుట్టుకొచ్చిన ప్రక్రియే పొత్తులు, అవగాహనలు, సీట్ల సర్దుబాట్లు. కాస్త ముదిరితే ఈ పొత్తులే కూటములు, మహా కూటములుగా రూపు మార్చుకుంటాయి.  ఈ కూటముల సృష్టికర్తలు ముందుగా వేసుకున్న అంచనాలు నిజమైన సందర్భాలు వున్నాయి, వికటించిన అనుభవాలు వున్నాయి. కనుకే,  ఇది లెక్కల వ్యవహారమే అయినా లెక్క తప్పే అవకాశం కూడా లేకపోలేదు.  
కొన్ని రాజకీయ పార్టీలు కలసి ఇలా కూటములు కట్టే వ్యవహారం కొత్త విషయమేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది అనుభవైకవేద్యమే. రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయిన తర్వాత    కొత్తగా ఏర్పడ్డ పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014లో నిర్వహించిన ఎన్నికల్లో, ఒక  కూటమి అనే పేరుతో యేర్పడ లేదు కానీ టీడీపీ, బీజేపీలు పొత్తు కుదుర్చుకునే పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో పోటీకి దిగని పవన్ కళ్యాణ్ జనసేన ఆ పొత్తును బలపరచి వాటి విజయానికి తన వంతు పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే దేశంలో ఏ కూటమి కూడా తాను  సాధించిన విజయాలను సుస్థిరం చేసుకోలేక పోయింది. అధికారానికి వచ్చిన దరిమిలా తలెత్తిన వివాదాల కారణంగా ఆ స్నేహాలు మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలి పోతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన అయిదేళ్ళ పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా కలిసి వుండలేకపోయాయి. ఎన్నికల సమయంలో కలయికకు కారణాలు తెలిసినవే అయినా, విడి పోవడానికి మాత్రం ఎవరి కారణాలు వారు చెబుతున్నారు. ఈ పరిణామాలకు తగ్గట్టే పాత సమీకరణాల స్థానంలో కొత్తవి రావడం రాజకీయ అనివార్యతగా మారింది. వచ్చే ఏడాది ఎన్నికల నాటికి కలిసున్నవాళ్ళు విడిపోయినట్టే, ఇప్పటివరకు విడిగావున్న  వాళ్ళు కలిసే అవకాశం ఎలాగూ వుంటుంది. సిద్ధాంతాలు, సూత్రాలు అని ఎవరయినా సుద్దులు చెప్పబోతే వాళ్ళని వెర్రివాళ్ళ లాగా జమ కట్టే ప్రమాదం వుంది.
నేటి రాజకీయాల్లో పైకి  పార్టీ పేరు ఏమైనా, అన్ని పార్టీల  రంగూ రుచీ వాసనా ఒక్కటే. అధికారం. ఏమిచేసైనా సరే  ఆ పీఠాన్ని అధిరోహించడం. దీనికి వాళ్ళు చెప్పే భాష్యం ఒక్కటే, మార్గం ఎలాంటిదైనా అనుకున్న గమ్యాన్ని చేరుకోవడం.
ముందు నగారా తెలంగాణలో మోగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఆలోచనతో మెరుపు వేగంతో ముందుకు దూసుకుపోతున్నారు. అసెంబ్లీ రద్దుకావడం, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తును ఎన్నికల సంఘం ప్రారంభించడం అన్నీ ఆఘమేఘాల మీద సాగుతున్నాయి. ‘ఇదేమీ సబబుగా లేదు, ప్రభుత్వం ప్రజాస్వామ్య స్పూర్తికి తూట్లు పొడుస్తోంద’నే  ప్రతిపక్షాల వాదనలు ఈ హోరులో కొట్టుకుపోతున్నాయి. ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే’ సామెతలాగా కేసీఆర్  చాలా ముందస్తుగానే నూట అయిదు మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించడం ఇతర పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే మంట పెట్టిన వారికి కూడా ఎంతోకొంత ఆ సెగ తగులుతుందన్నట్టు, పాలకపక్షం టీఆర్ఎస్ కు కూడా ఈ ముందస్తు ప్రకటన కొన్ని ఇబ్బందులను కలగచేస్తోంది. అసంతృప్తుల బెడద రాజుకుంటోంది. మొదట మెల్లగా మొదలయినా రోజులు గడుస్తున్న కొద్దీ అసంతృప్తి జ్వాలలు తమిళనాడు రాజకీయాలను తలపిస్తున్నాయి. కొందరు కార్యకర్తలు తమ నాయకులకు సీటు రాలేదన్న మనస్తాపంతో తీవ్రమైన చర్యలకు పూనుకోవడం పరిస్తితిలోని తీవ్రతను తెలుపుతోంది. అయితే, ఎన్నికల ఘడియ దగ్గర పడేసరికి ఇవన్నీ సర్దుకుంటాయని, బుజ్జగింపులు, లాలింపులు ఎన్నికల వేళ ఏ రాజకీయ పార్టీకయినా సహజమేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
వాళ్ళు చెబుతున్నట్టు, నిజానికి  ఇదేమీ కొత్త విషయం కాదు, అధికారం కోసం రాజకీయ పార్టీలే తమ సిద్ధాంతాలను పక్కన బెట్టి కానివారితో చెలిమికోసం చేయి చాపుతున్నప్పుడు పార్టీలలోని దిగువశ్రేణి నాయకులు కూడా అదేరకం ఆలోచన చేస్తుంటారు. ‘ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు’ కదా! గత వారం రోజులుగా అనేకమంది ఛోటా, బడా నాయకులు ‘ఆస్మాసిస్’ పద్దతిలో అటూ ఇటూ పార్టీలు మారుతున్నారు. ‘ఎవరు ఏ పార్టీకి సలాం చెప్పారు, ఎవరు ఏ పార్టీకి సలాం కొట్టారు’ అనే జాబితాను విశ్లేషించడం అనవసరం. ఎందుకంటే, ముందు ముందు ఈ ‘మార్పిళ్ల’ వేగం, పరిమాణం మరింత పెరిగే వీలుంది. ఒక పద్దతి అంటూ లేకుండా సాగిపోతున్న ఈ వికృత రాజకీయ క్రీడ గురించి ఇప్పటికే కుప్పలుతెప్పలుగా సాంఘిక మాధ్యమాల్లో అనేక వ్యాఖ్యానాలు వెలుగు చూస్తున్నాయి.
ఈసారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ లు పెట్టుకోబోయే పొత్తు గురించి అనేక ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ ఆవిర్భావమే కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై జరిగింది. ‘అలాంటి ఆగర్భ ప్రత్యర్ధితో కలయికా’ అంటూ కొందరు ఆక్షేపిస్తున్నారు. పొత్తును సమర్ధించేవారు గతంలో జరిగిన ఉదంతాలను ఉదహరిస్తున్నారు. ‘రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మితృలు ఉండరని, తాము కలిస్తే అది ఎంతమాత్రం అపవిత్ర కలయిక కాబోద’ని అంటున్నారు. ఇది ఇలా ఉండగానే, మహాకూటమి గురించిన వార్తలు వెలుగు చూశాయి. బలమైన ప్రత్యర్ధిని ఎదుర్కోవాలంటే నలుగురు కలిస్తేనే సాధ్యం కాగలదన్న నమ్మకంతో మహా కూటమి దిక్కుగా చూస్తున్నారు. కొన్ని అడుగులు పడ్డాయి కూడా. సీపీఐ, జనసేన, కోదండరామిరెడ్డిగారి కొత్త పార్టీ ఇలా అందరూ కలసి ఏకోన్ముఖ దాడికి సిద్ధం అవుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు తెలంగాణా ప్రజలకు ఈ మహాకూటముల సంగతి ఎరుకే కాని, కొత్త తెలంగాణా రాష్ట్రానికి మాత్రం కొత్త సంగతే. అందులోనూ, కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తరువాత మొట్టమొదటి సారి జరుగుతున్న ఎన్నికలు. అంచేతే వీటికి ఇంతటి  ప్రాముఖ్యత.
ఈనాటి రాజకీయ రణతంత్ర నీతి ప్రకారం కూటముల ఏర్పాటు తప్పుకాకపోవచ్చు. అయితే, అందులో రాజకీయ అవసరాలు ఉన్నప్పటికీ జత కట్టే పార్టీలలో నిజాయితీ  వుండాలి. భారతంలో కురుక్షేత్ర మహా సంగ్రామానికి ముందు సామంత రాజులతో కౌరవ, పాండవులు పొత్తులు ఏర్పాటు చేసుకున్న ప్రస్తావనలు వున్నాయి. కృష్ణుడి తరపున వున్న సైన్యం యావత్తూ, కృష్ణ భగవానుడు దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారం కురుక్షేత్రంలో కౌరవుల తరపున నిబద్ధతతో కూడిన యుద్ధం చేస్తాయి. సహజంగా పాండవ పక్షపాతులు అయిన భీష్మ, ద్రోణాదివీరులు కూడా తమ అంతరాత్మను యుద్ధ రంగానికి ఆవలే విడిచిపెట్టి దుర్యోధనుడి విజయం కోసమే ఎంతో నిబద్ధత, నిజాయితీతో పోరాడతారు. కూటముల ఆలోచన చేసేవాళ్ళు ఈ విషయం కూడా గమనంలో వుంచుకోవాలి.
అలాకాకుండా తాత్కాలిక ప్రయోజనాలకోసం కలిపే  చేతులు, కలిసే మనుషులు, అనుకున్న  లక్ష్యం నెరవేరగానే అంత సులభంగానూ  విడిపోయే పరిస్తితి రాకూడదు. నిజాయితీతో కూడిన రాజకీయ  కూటములను  ఏర్పరచగలిగితే వాటి మనుగడ ప్రశ్నార్ధకం కాబోదు.                        
తోకటపా: విజేతలు  తమ పరిమితులు ముందు తెలుసుకుంటారు. తరువాత తమ శక్తి సామర్ధ్యాలపై దృష్టి పెడతారు.
పరాజితులకి తమ బలహీనతలేవిటన్న దానిపై ఒక అవగాహన వుంటుంది. కాకపోతే దృష్టంతా వారి తమ బలహీనతలపైనే వుంటుంది.
(EOM)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595



18 కామెంట్‌లు:

  1. కొందరు ఇలా అన్నారు. కొందరు అలా అన్నారు. కాదు మీరేమి అంటున్నారో అది చెప్పండి. అత్తిపత్తి సుత్తి news బదులు views చెప్పండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అలా కాదు సర్ క్రిందాయన్నీ చూడండి mountain out of a mole ఎలా చక చకా కట్టేసారో. B+

      తొలగించండి
  2. ఏ రాజకీయ పొత్తులు అయినా అసహజమైనవి, అవకాశవాదమైనవే కదా శ్రీనివాసరావు గారూ. అటువంటి పొత్తులను unholy alliance అని ఊరికే అనలేదు. 1977 ఎన్నికలలో ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని పడదోయడమే లక్ష్యంగా (1975లో ఆవిడ విధించిన ఎమర్జెన్సీ ప్రధాన కారణంగా) మూడు నాలుగు పార్టీల పొత్తుతో ఏర్పడిన “జనతా పార్టీ” అధికారంలోకి వచ్చి కూడా ఏమాత్రం / ఎంతకాలం .. అంతర్గత కుమ్ములాటలు లేకుండా .. నిలబడిందో పాత్రికేయులుగా మీకు తెలియనిదేముంది? అప్పటికీ ఇప్పటికీ గడిచిన 40 ఏళ్ళ పైబడిన కాలంలో విలువలు ఎంత నీచంగా దిగజారాయో చూస్తూనే ఉన్నాం కదా. అనుకోవడం కూడా కంఠశోషే.

    మీరు భలే చమత్కారులండీ. ఈనాటి రాజకీయనాయకులకు ఆనాటి మహాభారత ప్రముఖులయిన భీష్మ ద్రోణాదులతో పోలికా? భలేవారే.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చమత్కారులండీ.
      మీరేం తక్కువా ఏంటి? ఆయన తన్నుకుని తన్నుకుని గిలాగిలా లాడుతుంటే ఒక్క ముక్కలో ఒడ్డున పడేసారు. భలే. మీరిద్దరూ బలరామకృష్ణుల్లా ఉన్నారే. Yaadon ki baaraat బ్రదర్స్లా!��������

      తొలగించండి
    2. ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ సార్లూ. No offences meant. With due respects ����

      తొలగించండి
  3. హ్హ హ్హ, బాగానే ఉంది అజ్ఞాత గారూ, అయితే పైన మీరు వాడిన ఆ ఆంగ్ల నానుడి అసలు రూపం make a mountain out of a molehill (mole కాదు. mole తవ్విపోసిన మట్టికుప్ప molehill) 🙂.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. రాఘవేంద్రుని సినిమాలెక్కువ గా చూస్తారేమో వారు Mountain out of mole :)


      జిలేబి

      తొలగించండి
  4. విజేతలు తమ పరిమితులు ముందు తెలుసుకుంటారు. తరువాత తమ శక్తి సామర్ధ్యాలపై దృష్టి పెడతారు.

    పరాజితులకి తమ బలహీనతలేవిటన్న దానిపై ఒక అవగాహన వుంటుంది. కాకపోతే దృష్టంతా తమ బలహీనతలపైనే వుంటుంది.

    అసలు టపాకంటే తోకటపా భలే ఉంది సర్ ! వీటికోసమే మీ బ్లాగ్ చదువుతాను.

    రిప్లయితొలగించండి
  5. "ఒక కూటమి అనే పేరుతో యేర్పడ లేదు కానీ టీడీపీ, బీజేపీలు పొత్తు కుదుర్చుకునే పోటీ చేశాయి"

    కూటమికి పేరు లేకేమిటండీ ఎన్డీయే (NDA, జాతీయ ప్రజాస్వామ్య కూటమి). ఎప్పటినుండో ఈ కూటమి ఉనికిలో ఉంది. అంతక ముందెప్పుడో కూటమికి దూరమయిన టీడీపీ 2014 ఎన్నికలు దగ్గర పడేసరికి మళ్ళీ అదే గూటికి చేరింది (మళ్ళీ వదిలేసిందనుకోండి అది వేరే విషయం)

    రిప్లయితొలగించండి
  6. // “రాఘవేంద్రుని సినిమాలెక్కువ .......” //
    —————

    హ్హ హ్హ హ్హ హ్హ, “జిలేబి” గారూ 😀👍.

    రిప్లయితొలగించండి
  7. గీ తెండు రాష్ట్రాల్నీ మర్ల పది రాష్ట్రాలుగ చీల్చినా రాజకీయాలు గిట్లనే నడుస్తయి - గసుంటిదానికి తెలంగాణ కోసరం గత్తర జేసిన్రెందుకో!

    రిప్లయితొలగించండి
  8. "కొందరు ఇలా అన్నారు. కొందరు అలా అన్నారు. కాదు మీరేమి అంటున్నారో అది చెప్పండి. అత్తిపత్తి సుత్తి news బదులు views చెప్పండి."
    ఈ కామెంటు రాసిన అజ్ఞాత గారికి:
    "ముందు మీ అజ్ఞాతంలో నుంచి బయటకు రండి. అప్పుడు అత్తి పత్తి సుత్తి న్యూస్ రాసే అజ్ఞానం నుంచి బయట పడి నా వ్యూస్ రాయడం మొదలు పెడతాను"
    నోట్: సాధారణంగా ఎవరయినా నా వ్యాసాల మీద విమర్శలు రాస్తే నేను ఖండించే ప్రయత్నం చేయను. ఇది నా అభిప్రాయం, అది వారి అభిప్రాయం అని మౌనంగా వుండిపోయి గౌరవిస్తాను. కానీ ఇలా అసభ్యంగా రాసే ప్రయత్నం చేస్తే మాత్రం నా స్పందన ఇలాగే వుంటుంది.

    రిప్లయితొలగించండి
  9. @Jai Gottimukkala : మీరు చెప్పింది నిజమే. టీడీపీ బీజేపీ ఎన్డీయే లో భాగస్వాములులే ఆనాడు. నాదే పొరబాటు. కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి

  10. Blogger Zilebi అన్నారు...



    Rip van winkle has woken up :)



    ?

    రిప్లయితొలగించండి
  11. రాజకీయాల్లో శాశ్వత మిత్రులులేరు అన్నప్పుడు తాత్కాలిక పొత్తులని అనైతికం అని చెప్పలేం. నిజానికి ప్రజలు ఆమోదించే ఏ పొత్తు అయినా నైతికమే అని ఒప్పుకోవాలి.ప్రజలు ఆమోదించారా లేదా అనేది ఫలితాల్లో తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి
  12. నమస్తే శ్రీనివాస రావు గారు,

    మొన్న AP 24x7 లో మీరు పాల్గొన్న చర్చ చూసిన తర్వాత మీకు ఈ లింక్ పంపాలనిపించింది. ఈ పోస్ట్ కి సంబధం లేకపోయినా, అక్కడ (AP 24x7) కామెంట్ కి అవకాశం లేకపోవడంతో ఇక్కడ చొరవతీసుకుంటున్నందుకు క్షమించాలి.

    ఆ సో కాల్డ్ ప్రబోధానంద బోధించే ‘గ్నానం’ గురించి ఒక మచ్చు తునక ఇక్కడ చూడండి. ముందుగానే చెపుతున్నాను ఇది పూర్తిగా చూడాలంటే చాలా సహనం, కొద్దిగా గుండె దిటవు అవసరం. ఇది ‘పెద్దలకు మాత్రమే’ కంటెంట్.

    https://www.youtube.com/watch?v=oIzcFVKHydU&t=2943s

    రిప్లయితొలగించండి
  13. మీకు అసలైన జ్ఞానం ఈ వీడియో లో 28:40 నుండి 36:00 మధ్యలో లభిస్తుంది.

    రిప్లయితొలగించండి