7, నవంబర్ 2017, మంగళవారం

“ఎవరా మేనకోడలు ఏమా కధ!”


అని చాలామంది అడుగుతున్నారు. నిరుడు జూన్ లో జరిగిన విషయం ఇది. నేనే మరచిపోయాను. కేటీఆర్ గుర్తుపెట్టుకున్నారు. అది ఆయన గొప్పతనం. తెలంగాణా పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి గారిని ఉద్దేశించి రాసింది. చివరి వాక్యం అందుకోసమే.
అప్పటి పోస్టింగు ఇదిగో!   

ఇలాగా కూడా జరుగుతుందా! – భండారు శ్రీనివాసరావు  

కొన్ని విషయాలు వింటుంటే నిజమా అనిపిస్తుంది.
మామేనకోడలుకు చెల్లెలు వరస అయిన అమ్మాయి బీటెక్ పాసయింది. ఎం టెక్ కూడా చేసింది. వాళ్ళు వుండేది నల్గొండలో.
సర్వీసు కమీషన్ వాళ్ళు  మునిసిపల్ ఇంజినీరింగ్ విభాగంలో టెక్నికల్ ఆఫీసరు పోస్టుకు పరీక్ష పెడితే రాసింది. ఇంటర్వూకు పిలిస్తే వెళ్ళింది. ఏదో మోటారు సైకిల్ కంపెనీ వారి ట్యాంకులో పెట్రోలు నింపండి, ఇక మరచిపొండిఅనే ప్రకటన తరహాలో ఆ విషయం మరిచిపోయింది.
నిన్ననో మొన్ననో ఆమెకు నియామక పత్రాలు పోస్ట్  లో అందాయి. ఆ అమ్మాయికి ఆనందం, ఇంట్లో వాళ్లకి ఆశ్చర్యం.  ఆ ఉద్యోగం కోసం వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు, ఏ రకం అయిన పైరవీలు చేయలేదు. అందుకే ఆ ఆనందం, అందుకే ఆ ఆశ్చర్యం.
ఆర్డరులో చూస్తే బోధన్ పోస్టింగు ఇచ్చారు. ఆ అమ్మాయే ధైర్యం చేసి ఆ విభాగం చీఫ్ ఇంజినీరును కలిసి ముందు థాంక్స్ చెప్పింది, తరువాత వచ్చిన పని చెప్పింది.
ఆ అమ్మాయికి ఈసారి ఆనందంతో పాటు ఆశ్చర్యం.
ఎందుకంటే క్షణాల్లో ఆ ఆర్డరు మార్చి బోధన్ బదులు నల్గొండకు పోస్టింగు  ఇచ్చారు.
పైరవీ లేదు, పైసా ఖర్చులేదు. ఆ కుటుంబం ఆనందమే ఆనందం.

(ఘంటా చక్రపాణి గారూ వింటున్నారా!)
27 జూన్, 2016.  

ఇది రాసి నేను మరచిపోయాను. కనీసం ఎవరికీ ట్యాగ్ కూడా చేయలేదు. అయినా ఇది పడవలసిన వారి కంట్లో పడింది. ఏడాది తరవాత కూడా గుర్తుంచుకుని కేటీఆర్   ఒక ఇంటర్వ్యూ లో కోట్ చేసారు. అందుకే నాకు కూడా ఆ అమ్మాయికి మల్లే ఆశ్చర్యంతో కూడిన ఆనందం.

అంతే! వేరే ఏమీ లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి