12, అక్టోబర్ 2017, గురువారం

చీరే మేరే సప్నే – భండారు శ్రీనివాసరావు


వారాల అబ్బాయిలా ప్రతి గురువారం పొద్దున్నే యధావిధిగా స్నేహ టీవీ డిబేట్ కు వెళ్ళొచ్చి తీరిగ్గా మరోమారు పేపరు తిరగేస్తుంటే మా ఆవిడ ఫోను సంభాషణ చెవుల్లో పడింది. మిగతా సమయాల్లో ఏమో కాని, ఫోను మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఆవిడ స్వరం స్పష్టంగా, స్పుటంగా వినిపిస్తుంది.
“ఇక్కడ వానల సంగతా. నిన్న  కాస్త తెరిపి ఇచ్చింది కానీ, మళ్ళీ భారీ వర్షాలు అంటూ టీవీలు భయపెడుతున్నాయి. మీకక్కడ చలికాలం అనుకుంటా. పొతే, ఒక సంగతి చెప్పాలి వొదిన గారు, మీరు నమ్ముతారో లేదో కానీ రాత్రి మీరు కల్లోకి వచ్చారు. అసలే మీది పచ్చటి పసిమి ఛాయ, అమ్ముమ్మ గారిలా.  దానికి తోడు  నెమలి పించం రంగు చీరె. మామిడి పిందెల ఆరంజి కలర్ బార్డరు. రిచ్ పల్లు.  ఒకటే  మెరిసిపోతున్నారు. ఒకసారి  సారి మీరు అమెరికా నుంచి వచ్చినప్పుడు, అప్పుడు ఎయిర్ పోర్ట్ బేగం పేటలో వుండేది, విమానం దిగి మీరు నడిచి వస్తుంటే అద్దాల తలుపు లోంచి చూస్తూ కళ్ళు తిప్పుకోలేక పోయాను. చీరె రంగు అదేకాని చిన్న చిన్న  బుటాలు. శ్రీకాంత్ పెళ్ళికి నేను పెట్టిన ఆ చీరె కట్టుకుని మీరలా వస్తుంటే యెంత సంతోషం అనిపించిందో. అన్నట్టు మాటల్లో  మరిచేపోయా. మీరు అప్పుడు పెట్టిన చీరె లాంటిదే వెతికి వెతికి మరీ  కొనుక్కున్నాను.  మీరీసారి వచ్చినప్పుడు చూపిస్తాలెండి. కాకపొతే మస్టర్డ్  కలర్ కి రెడ్  బార్డరు.  మీరు తప్పకుండా వస్తారు, చూస్తారు ఒదినె గారు.  తెల్లవారుఝామున వచ్చిన కలలు నిజమైతాయని అంటారు కూడా.......”
అలా అలా సాగిపోతోంది మా ఆవిడ మాటల ఝరి.

తనకొచ్చిన కల గురించి అప్పుడే చూసొచ్చిన సినిమా కధలా తీరు తీరున  వర్ణించి చెబుతోంది. మరి నాకూ కలలు వస్తాయి. కానీ, లేచిన తరువాత ఒక్కటీ గుర్తుండి చావదు.      

3 కామెంట్‌లు:

  1. నిజమయే కలలే గుర్తుంటాయి సర్. అక్కయ్య గారి ఆగమనానికై ఎదురుచూడండి.

    రిప్లయితొలగించండి
  2. చంద్రబాబు గారిని కలిసినట్లు, కేసీఆర్ గారిని కలిసినట్లు, మోడీ గారిని కలిసినట్లు ...ఇలా మీకు గుర్తుండే కలలు కంటే సరిపోతుంది. రిటైర్మెంట్ తర్వాత ఆడవాళ్ళకి ఫోన్ మాట్లాడుకునే స్వేచ్చ కూడా ఉండదు కాబోలు...నెమలిపింఛం రంగుకి ఆరెంజ్ బోర్డర్ మాత్రం భలే గుర్తుపెట్టుకున్నారే ...నాకిష్టం అయిన కాంబినేషన్ :))

    రిప్లయితొలగించండి