ఇక్కడో
చిన్న మలుపు. మా ఇంట్లో ఇప్పటి తరానికి, పాత తరానికి వారధి మా పెద్దక్కయ్య కుమారుడు డాక్టర్ ఏ.పీ.రంగారావు. ఇప్పటి మా కుటుంబంలో పెద్దవాడు. కుటుంబానికి పెద్ద దిక్కు
కూడా. డెబ్బయి అయిదేళ్ళ క్రితం మా కంభంపాడు (ఆయనకు మాతామహుల స్థానం) లోనే జన్మించాడు.
చిన్నతనంలో తాను పెరిగిన మా వూరు గురించీ, అప్పటి ఆచార వ్యవహారాల గురించి
ఒక వైద్యుడి కోణంలో కొన్ని విశేషాలు ఇంగ్లీష్ లో రాశారు. వాటిని నేను తెనుగు చేసి
ఇందులో పొందుపరుస్తున్నాను. (భండారు శ్రీనివాసరావు)
(డాక్టర్ అయితరాజు పాండు రంగారావు)
కంభంపాడు
గురించి డాక్టర్ అయితరాజు పాండు రంగారావు జ్ఞాపకాల దొంతర:
“కృష్ణా జిల్లా, నందిగామ తాలుకా, కంభంపాడు అనే
కుగ్రామంలో - 1942 సెప్టెంబర్ 20వ తేదీన పుట్టాను. అప్పుడది బ్రిటిష్ పాలనలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో వుండేది. నేను
పుట్టింది మా మాతామహుల ఇంట్లో. అదొక పెంకుటిల్లు. మా తాతగారు అంటే మా అమ్మగారి
నాన్నగారు, భండారు రాఘవరావు, ఆ వూరికి కరణం.
“నేను
మా తలిదండ్రులకు రెండో సంతానాన్ని. నేను పుట్టినప్పుడు నా బొడ్డు కోసిన మంత్రసాని
పుట్టుగుడ్డిది. విచిత్రమేమిటంటే మా అమ్మ పుట్టినప్పుడు కూడా ఈ మంత్రసానే
పురుడుపోసిందట. మా కుటుంబంలో చాలామంది ఈ
మంత్రసాని ఆధ్వర్యంలోనే సుఖంగా ప్రసవించి క్షేమంగా వున్నారు. ఆమె పురుడు పోసిన పిల్లలెవ్వరూ ప్రసవ సమయంలో చనిపోలేదు. అది ఆవిడ చేతిచలవ అని చెప్పుకునేవారు. ఆ రోజుల్లో
ప్రసవాలన్నీ ఇళ్ళల్లోనే జరిగిపోయేవి. మొట్టమొదటిసారి ఆసుపత్రిలో పురుడు పోసుకున్నది
మా అమ్ముమ్మ గారు. అదీ మా మా పెద్ద మేనమామ (పర్వతాలరావు) పుట్టినప్పుడు. అయిదుగురు
ఆడపిల్లల తరవాత కానుపు కావడంతో మా
అమ్ముమ్మను అప్పుడు ఖమ్మంలోని క్రిస్టియన్ మిషన్ ఆసుపత్రిలో చేర్పించి పురుడు
పోయించారు.
“నేను
పుట్టిన తరవాత నాకు కానీ, మా అమ్మకు కానీ ప్రసవానంతర జాగ్రత్తలు ఏమీ తీసుకోలేదు.
మా ఇద్దరికీ ధనుర్వాతం (టెటనస్) రాకుండా ఏ విధమయిన ఇంజెక్షన్లు ఇవ్వలేదు. అలాటివి
వున్నట్టు ఆ రోజుల్లో ఎవరికీ తెలిసివుండదు.
పురుడు రావడానికి కొన్ని
నెలలముందు మా అమ్మ పుట్టింటికి వెళ్ళింది. కేవలం పుట్టింటివారి ఆప్యాయతా, పూర్తి
విశ్రాంతి మినహా ఆమె తీసుకున్న మందులు ఏమీ
లేవు. నేను పుట్టగానే మంత్రసాని
కొడవలితో బొడ్డు కోసి ఒక తట్టలో
పడుకోబెట్టింది. కోసిన బొడ్డు ముక్కను గోతిలో పాతిపెట్టారు. నాకు స్నానం చేయించి
తల్లి పాలు పట్టించారు. మైల బట్టలు మంత్రసాని పట్టుకెళ్ళింది. అవి ఆమెకే
చెందుతాయి. పురుడు పోసినందుకుగాను కొంత ధాన్యం కొలిచి ఇచ్చేవాళ్ళు.
“ప్రసవం
అయిన తరవాత ఆ గదిలోకి పన్నెండు రోజులపాటు ఎవ్వరూ రావడానికి వీలులేదు. ఎవరూ
తాకడానికి వీలులేదు. పుట్టిన తిధి నక్షత్రాలనుబట్టి జాతకం రాయించారు. ‘రాధమ్మ
సుఖంగా ప్రసవించింది. తల్లీ పిల్లవాడు కులాసా’ అని చుట్టపక్కాలందరికీ ఇంటి
పురోహితుడితో కబురు పంపించారు.
“మూడోరోజున
బాలింతరాలయిన మా అమ్మకు వావిలాకులు కలిపిన
వేడినీటితో స్నానం చేయించారు. మరో తొమ్మిది రోజులు ఇలాగే గడిచిన తరవాత,
పన్నెండో రోజున ఆమెకు పురిటి స్నానం
చేయించారు. పసుపు, పెసరపిండి,శనగపిండి కలిపి వొంటికి నలుగుపెట్టి చేయించే స్నానం
ఇది. ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి
పుణ్యావచనం, పూజ అయిన తరవాత, బియ్యం, బెల్లంతో తయారుచేసిన పులగం మా అమ్మకు
తినడానికి పెట్టారు. అప్పటినుంచి పురిటి మైల వొదిలిపోయినట్టే. ఇల్లంతా స్వేచ్చగా
అందరితో కలసి తిరగొచ్చు. పసిపిల్లాడినయిన నాకు కూడా ప్రతి రోజూ పెద్దవాళ్లో, పనిమనుషులో కాళ్ళమీద పడుకోబెట్టుకుని
స్నానం చేయించేవారు. ఒక గుడ్డ పరచి
నిద్రపుచ్చేవారు. దాన్ని పాడుచేసినా ఆ గుడ్డనే, ఉతికి ఆరవేసి మళ్ళీ వాడేవారు. పన్నెండో రోజున నామకరణం చేసి ఉయ్యాలలో వేసారు. “చిన్నతనంలో నాకు
ఎలాటి వాక్సినేషన్లు ఇవ్వలేదు. రెండేళ్ళ తరవాత నా చెల్లెలు పుట్టేవరకూ నేను మా
అమ్మ పాలే తాగేవాడిని. అయితే, నాకు తొమ్మిది నెలల వయస్సు రాగానే ఒక మంచి రోజు చూసి యిరవై కిలోమీటర్ల దూరంలో
వున్న తిరుమలగిరి గుట్టమీది వెంకటేశ్వర స్వామి గుడిలో అన్నప్రాసన చేసారు. బెల్లం కలిపి వొండిన అన్నం
పాయసం. ( అంటే అది నేను తిన్న మొట్టమొదటి
ఘన పదార్ధం అన్నమాట.) అలాగే నా మొట్టమొదటి
కేశ ఖండన (తల వెంట్రుకలు) కూడా ఏడాది నిండినప్పుడు జరిగింది. చిన్నతనంలో మా
పినతల్లులు (మా అమ్మ చెల్లెళ్ళు ) ముగ్గురు నా ఆలనా పాలనా చూసేవారు. అప్పటికి వారికింకా
పెళ్ళిళ్ళు కాలేదు. పైనుంచి మా తాతయ్య రాఘవయ్య గారి తల్లి రుక్మిణమ్మ గారు నన్ను కనిపెట్టి చూసేది. ఆమె, ఆమె తల్లి ఇద్దరూ
చిన్నవయస్సులోనే వైధవ్యం పొందారు. పెద్దలు, పిల్లలు అందరికీ వాళ్ళిద్దరే పెద్ద
దిక్కు. దూలానికి వేలాడదీసిన గుడ్డ ఉయ్యాలలో నన్ను పడుకోబెట్టి నిద్రపుచ్చేవారు.
మా తరంలో నేనే తొలిచూరు పిల్లవాడినని చాలా గారాబంగా చూసేవారు. యిరవై నాలుగ్గంటలూ
ఎవరో ఒకరు కంటికి రెప్పలా కనిపెట్టుకుని వుండేవారు.
బోర్లపడితే
బూరెలు వండాలి, పారాడితే పాలకాయలు పంచాలి అని ఏదో
పేరుతొ ప్రతినెలా నేను పుట్టిన తరువాత పండగలు, పేరంటాలు చేసేవారు. మా అమ్మ నన్ను ప్రసవించిన తొమ్మిదో
రోజున మా అమ్ముమ్మగారు, మా అమ్మ అమ్మగారు వెంకట్రావమ్మ గారు కూడా అదే ఇంట్లో మరో గదిలో మగ పిల్లవాడిని (భండారు రామచంద్రరావు) కన్నది. నాకు
బొడ్డుకోసిన మంత్రసానే మా అమ్ముమ్మకు కూడా పురుడు పోసింది. ఒకే ఇంట్లో రోజుల
తేడాతో పుట్టిన మేమిద్దరం ఆడుతూ పాడుతూ
పెరిగాం.
“చిన్నప్పటి ఓ జ్ఞాపకం నా మనసు తెరపై
ముద్రపడిపోయింది.
“1948 నాటి
మాట. మా అమ్మ తండ్రి రాఘవయ్య గారిని కంభంపాడు తాతయ్య అనే వాళ్ళం. ఎవరూ లేవకముందే
తెల్లారగట్టనే లేచి కాఫీ తయారుచేసుకుని తాగడం ఆయన అలవాటు. బెజవాడనుంచి పచ్చి కాఫీ గింజలు కొనుక్కొని వచ్చి
వాటినివేయించి కాఫీ చేసుకుని తాగేవాడు. కాఫీ గింజలను పొడి చేసే ఒక చిన్న మిషను
ఒకటి అయన పట్నం (మద్రాసు) పోయినప్పుడు కొనుక్కు వచ్చాడు. నన్ను నిద్రలేపి, వొళ్ళో
వేసుకుని పొయ్యి రాజేసేవాడు. నీళ్ళు పడేసి అవి కాగుతుండగానే, బొడ్లోనుంచి బీడీ
కట్ట తీసి ఒకటి వెలిగించేవాడు.
“వేయించిన గింజల కమ్మటి వాసన, కాఫీ పొడి మిషన్
చేసే అదో రకం చప్పుడు, సుళ్ళు తిరిగే బీడీపొగ, ఎదురుగా పొయ్యిలో కణకణమని కట్టెల
మంటలు, ఇవన్నీకళ్ళకు కట్టినట్టు గుర్తుండిపోయాయి.
“ఇన్నేళ్ళ తరవాత ఇప్పటికీ ఇలాటి చిన్న చిన్న
సంగతులు కొన్ని బాగా జ్ఞాపకం వున్నాయి.
“అలాటిదే మరో జ్ఞాపకం, గుడ్డ ఉయ్యాలలు గురించి. ఈ
కాలం వారికి ఏమాత్రం తెలియని ఉయ్యాలలు ఇవి. ఒక పాతచీరెను
దూలానికి వేలాడగట్టి ఉయ్యాల మాదిరిగా
తయారుచేసేవారు. అందులో పిల్లలని పడుకోబెట్టి ఎవరో ఒకరు ఊపుతూ నిద్రపుచ్చేవారు.
బయటనుంచి చూసేవారికి లోపల పిల్లాడికి గాలి ఆడుతుందా అని అనుమానం కలిగించేలా
వుండేవి ఈ గుడ్డ ఉయ్యాలలు.
“మరో
చేదు జ్ఞాపకం నెలనెలా పిల్లలకు వంటాముదం పట్టించడం. పిల్లల్ని కాళ్ల మీదవేసుకుని,
బలవంతంగా నోరు తెరిచి ఉగ్గిన్నెతో ఆముదం తాగించేవాళ్ళు. ఇలా చేస్తే మలబద్దకం రాదని
నమ్మకం.
“వినడానికి
ఆశ్చర్యంగా వుండవచ్చు కానీ, మా నాన్నను చూడడం కూడా నా చిన్ననాటి జ్ఞాపకాల్లో ఒకటి.
“1949 సెప్టెంబర్ ఆఖరి వారంలో మా నాన్న
జెయిలునుంచి విడుదల అయ్యారు. హైదరాబాద్
స్టేట్, ఇండియన్ యూనియన్ లో విలీనం కావడంతో జైళ్లలో పెట్టిన స్వాతంత్ర్య
సమరయోధులనందరినీ వొదిలిపెట్టారు. మా అమ్మగారి పుట్టింటిలో వుంటున్న మమ్మల్ని
చూడడానికి మా నాన్నగారు, మూడు, నాలుగు మైళ్ల దూరంలోవున్న పెనుగంచిప్రోలులో బస్సు
దిగి కాలినడకన కంభంపాడు చేరారు.
“అంత దూరంలో
ఆయన కనబడగానే పెద్దపిల్లలం కొంతమందిమి చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని, ‘జై
హింద్’ అని అరుస్తూ పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళాము. “అంతమంది పిల్లల్లో
తనపిల్లవాడెవరన్నది ముందు ఆయనకు అర్ధం కాలేదు. అయితే వెంటనే తేరుకుని
నన్నుగుర్తుపట్టి చేతుల్లోకి తీసుకుని
ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు. నా గుండె గోడల నడుమ పదిలంగావుండిపోయిన మరో మధుర మధుర
జ్ఞాపకం అది.
“మేముంటున్న
ఇల్లు చాలా పెద్దది. ముందూ వెనకా బోలెడంత ఖాళీ జాగా. పిల్లలం ఆరుబయట ఆడుకునేవాళ్ళం. చెట్లనీడలో మంచాలు వేసుకుని
కొంత మంది కబుర్లు చెప్పుకునేవాళ్ళు.
ఇంట్లో నా వయసు పిల్లలం ముగ్గురం వుండేవాళ్ళం. అందరూ మమ్మల్ని గారాబంగా
చూసుకునేవారు. దానితో మా పని ఆడింది ఆట పాడింది పాట.
“ఇంట్లో
పెద్దవాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టుకుని కధలు చెప్పేవాళ్ళు. కబుర్లు చెప్పేవాళ్ళు.
రకరకాల ఆటలు నేర్పించేవాళ్ళు. దాగుడుమూతలే మేము ఎక్కువగా ఆడుకున్న ఆట. దొంగా
పోలీసు మాదిరి. చేతులతో పంటలు వేసుకుని దొంగని నిర్ణయించేవాళ్ళం. వాడు ఒక్కడే
మిగిలిన వారిని ఎక్కడ దాక్కున్నా వెతికి
పట్టుకోవాలి.
“అందరం రోజూ
రెండుపూటలా స్నానాలు చేసేవాళ్ళం. బావిదగ్గరనిలబడితే పనివాళ్ళు చేదతో తోడి పోసేవాళ్ళు. కాగులో నీళ్ళు కాగుతూ వుండేవి
కానీ దాదాపు రోజూ చన్నీళ్ళ స్నానమే. ఆ
నీళ్ళనే బావి వెనుకవున్న పెరడుకు మళ్లించే
వారు. అక్కడ అరటి చెట్లు, కాయగూరల మడులు వుండేవి. కాలకృత్యాల కోసం అందరూ ఇంటికి
కొద్ది దూరంలోవున్న తుమ్మల బీడుకు చెంబులు తీసుకునివెళ్ళేవాళ్ళు. మరీ పెద్దవాళ్ల
కోసం పెరట్లో ఒక దడి కట్టి వుండేది.
“ఇల్లు యెంత
పెద్దదయినా మూడంటే మూడే లాంతర్లు వుండేవి. పొద్దుగుంకడానికి ముందుగానే లాంతరు అద్దాలను ముగ్గు పెట్టి శుభ్రంగా తుడిచి, కిరసనాయిలు పోసి సిద్ధంగా వుంచేవారు. పూర్తిగా
చీకటి పడకముందే పిల్లలకు అన్నాలు పెట్టేసేవాళ్ళు. తరవాత అంతా ఆరుబయట మంచాలు
వేసుకుని పండుకునేవాళ్ళం. వెల్లకిలా పడుకుని ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలు చూస్తూ వుంటే ఆ ఆనందం అంతా ఇంతా
కాదు.
“ఒక్కొక్క
మంచంలో ఇద్దరిద్దరం పడుకునేవాళ్ళం. నులక మంచాలు కొన్ని, నవారు మంచాలు మరికొన్ని.
నవారు మంచాలు పెద్దవాళ్ళకు వేసేవాళ్ళు.
మంచం పట్టెడ
వొదులు కాకుండా సాయంత్రం కాగానే వాటిని బిగించి కట్టేవాళ్ళు.
“వెన్నెట్లో ఎన్నోరకాల ఆటలు ఆడుకునేవాళ్ళం.
పాడుకునేవాళ్ళం. వెన్నెల కుప్పలు అనే ఆట బాగుండేది. ఒక జట్టు చేతిలో మట్టి
తీసుకుని ఇంటి ఆవరణలోని రకరకాల చోట్ల మట్టిని
చిన్న చిన్న కుప్పలుగా పోసేది. రెండో జట్టు అవి ఎక్కడున్నాయో కనుక్కుని
వాటిని చెరిపేసేది. ఎవరివి మిగిలితే వాళ్ళు గెలిచినట్టు.
“మమ్మల్ని
అందరితో పాటే వూరి బడిలో వేసారు. తాటాకుల షెడ్డు. తెలుగులో చదువు. అన్ని క్లాసులకూ
ఒక్కరే టీచరు. స్కూల్లో వున్నప్పుడు అ ఆ ఇ ఈ లు నేర్పించేవారు. వల్లెవేయడం మీదనే
శ్రద్ధ చూపెట్టేవారు. అంటే టీచరు
చెప్పిందే మనం మళ్ళీ మళ్ళీ చెప్పడం
అన్నమాట. కుర్చీలు బెంచీలు లేవు. నేలమీదనే
కూర్చునే వాళ్ళం. పుస్తకాల సంగతి సరే - అసలు
పలకా బలపాలే లేవు. ఇసకలో అక్షరాలూ రాసి వేళ్ళతో దిద్దించే వాళ్ళు. మొత్తం
స్కూల్లో విద్యార్దుల సంఖ్య పదిహేను దాటేది కాదు.
వారిలో ఏడెనిమిది మందిమి మా ఇంటినుంచే. బాగా పాఠం ఒప్పచెప్పిన వారిని
పంతులు గారు మాటలతో మెచ్చుకునేవారు. బడి
వొదలగానే ఇంటికి వచ్చి భోంచేసే వాళ్ళం. “అన్నం,
గరిటెజారుడు పప్పు, వంకాయ, బెండకాయ, దోసకాయ, చిక్కుడుకాయలతో చేసిన ఏదో ఒక కూర,
పప్పుచారు, ఆవకాయ, నెయ్యీ, పెరుగు ఇదీ మా
భోజనం.
“ ఆ
రోజుల్లో కంభంపాడు గ్రామానికి కరెంటు
లేదు. రోడ్డు లేదు. మంచినీటి పంపులు లేవు. ఒక్క మా తాతగారికి తప్ప ఎవరి కాళ్ళకూ
చెప్పులు కూడా వుండేవి కాదు. అల్యూమినియం
కంచాల్లో భోంచేసే వాళ్ళం. పెద్దవాళ్ళకు విస్తరాకులతోనో, బాదం ఆకులతోనో
కుట్టిన విస్తళ్లలో వడ్డించే వాళ్ళు.
ఇంట్లో విధవరాండ్రయిన ముగ్గురు ఆడవాళ్ళు వుండేవాళ్ళు. ఒంటిపూట భోజనాలు. రాత్రి
ఉప్పిడిపిండి తినేవాళ్ళు. ఉప్పుడు పిండికీ, తప్పాల చెక్కకూ, ‘పేటెంట్’ ఇవ్వాల్సివస్తే, అది మా కంభంపాడు అమ్ముమ్మ వెంకట్రావమ్మ గారికి ఇవ్వాలి.
తప్పాలచెక్క అంటే బియ్యపు పిండితో చేసే వంటకం. బియ్యపుపిండిలో నానేసిన సెనగపప్పు,
ఉప్పూ కారం జీలకర్ర కలిపి ముద్దగాచేసేవాళ్ళు.
ఇత్తడి గిన్నెను పొయ్యిపై వేడిచేసి, దానిలోపల ఈ ముద్దను తందూరీ రోటీ మాదిరిగా పలచగా అంటించి
మూతపెట్టేవాళ్ళు. కాసేపయిన తరవాత, గిన్నెని దించి లోపల ఎర్రగా కాలిన తప్పాలచెక్కను
చేత్తో బయటకు తీసి దానికి వెన్నరాసి పెట్టేవాళ్ళు. ఆహా ఏమి రుచి! అన్ని లొట్టలు
వేసుకుంటూ తినేవాళ్ళం. కానీ అది తయారుచేసేటప్పుడు అమ్ముమ్మ కాల్చుకున్న చేతుల
సంగతి ఎవరికీ గుర్తుండేది కాదు.
“ఇంట్లో వంట పని భారం అంతా మా అమ్ముమ్మదే. పొగ
చూరే కట్టెల పొయ్యిముందు కూర్చుని, ఇంటిల్లిపాదికీ వొంటి చేత్తో
వండివార్చేది. ఆవిడ వొదినెగారో, అత్తగారో
అప్పుడప్పుడు ఆమెకు చేతి సాయం చేసేవారు.
“వాళ్ళందరికీ
మడి పట్టింపులు ఎక్కువ. మమ్మల్ని పొరపాటున కూడా తాకనిచ్చేవారు కాదు. ఎప్పుడయినా
ముట్టుకోవాల్సిన పరిస్తితి ఏర్పడితే బట్టలు విప్పి ముట్టుకోవాలి. “మా అమ్ముమ్మ
కానీ, ఆవిడ వొదినె గారు కానీ, ఆమెను అంతా
చిదంబరం అత్తయ్య అనే అని
పిలిచేవాళ్ళు, మంచి నీళ్ళ బావికి వెళ్లి బిందెలో నీళ్ళు పట్టుకుని నెత్తిన పెట్టుకుని మోసుకొచ్చేవాళ్ళు. ఇంటిల్లిపాదీ అవే
తాగేవారు. ఇంటికి మూడువందల మీటర్ల దూరంలో
ఈ మంచి నీళ్ళ బావి వుండేది. ఇంట్లో కూడా బావి వుండేది కానీ నీళ్ళు ఉప్పు కషాయం.
తాగడానికి పనికి రావు.
“కావాల్సిన
కూరగాయలన్నీ ఇంటి పెరట్లోనే పండేవి.
కొష్టం నిండా ఆవులూ, బర్రెలూ వుండేవి. ఇంట్లోకి అవసరమయిన పాలు,పెరుగు,నెయ్యీ వాటి
పాడితోనే సరిపోయేది. కొనుక్కోవాల్సిన పరిస్తితి వుండేది కాదు. అలాగే బియ్యం,పప్పులూ,
ఇతర దినుసులు. వేరుసెనగ విత్తులను గానుగ ఆడించి నూనె తీసేవారు.
“ఆడవాళ్ళు
ధరించే చీరెల నుంచి, మగవాళ్ళు కట్టుకునే దోవతులవరకూ వూళ్ళోని నేతపనివారే నేసిపెట్టేవారు. ఏదయినా
శుభాకార్యాలప్పుడే పట్నం వెళ్లి ఆలుగడ్డలు, టొమాటోలు వంటివి కొనుక్కుని
వచ్చేవాళ్ళు. కాయలూ, పండ్లూ కూడా కొనుక్కోవాల్సిన అవసరం వుండేది కాదు. తోటల్లోనే
కాసేవి. రుతువులనుబట్టి దొరికేవి. అరటి, జామ, మామిడి, సీమచింత, సపోటా, రేగిపళ్ళు ఏవీ కొనాల్సిన పనివుండేది కాదు.
“ఆరోజుల్లో
రకరకాల పండుగలు. కానీ ప్రతి పండగా పిల్లలకు పెద్ద
పండగే. అది ఆడవాళ్ళ వ్రతమయినా, మగవాళ్ళ వనభోజనాలయినా.
వినాయక చవితి, మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీవ్రతం,
కేదారేశ్వర వ్రతం, అట్లతద్దె, ఉండ్రాళ్ళ తద్దె, దసరా, బతకమ్మ, దీపావళి, సంక్రాంతి, ఉగాది ఇలా పండగలే
పండగలు. నోములే నోములు. నవకాయ పిండి వంటలతో పండగ భోజనాలన్నీ అదిరి పోయేవి. ఆ పండగలన్నీ ఇప్పుడు లేవని కాదు.
ఆనాడు పిల్లల్లో పెద్దల్లో కానవచ్చే
సంతోషం సంబరాలు ఇప్పుడు మచ్చుకు కూడా
కానరావడం లేదు. ఈ పండగలే కాక, బంధు
మిత్రులతో కలసిచేసే వన భోజనాలు, తిరునాళ్ళు, తీర్ధయాత్రలు. వ్రతాలు,పూజలు,
పేరంటాలు, ఆ రోజుల్లో అలా సందడే సందడి.”
ఇవండీ డాక్టర్
రంగారావు, మా ఊరిలో తన చిన్నతనాన్ని
గుర్తు చేసుకుంటూ చెప్పిన ముచ్చట్లు.
తుమ్మల బీడు, లాంతరు దీపం, వెన్నెల కుప్పలు, తపాళ చెక్కలు అన్నీ మీ పోస్ట్ చూడగానే గుర్తొచ్చాయి ఒక్కసారిగా.
రిప్లయితొలగించండిమీ చిన్నతనానికి మా చిన్నతనానికి కంభంపాడు ఏమీ మారలేదు...
చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుతెస్తున్న మీ బ్లాగుకు వందనం
అయ్యా మీరు వివరించిన విధానం కళ్ళకు కట్టినట్లు ఉంది...మా చిన్ననాటి చిన్నపాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి...ధన్యవాదాలు
రిప్లయితొలగించండి