చిన్నప్పుడు మా బామ్మను చూసినప్పుడు
నేనెప్పుడు ఇంత పెద్దవాడిని అవుతానో కదా అనుకునేవాడిని. ఆమె పోయిన నలభయ్ అయిదేళ్లకల్లా నాకామె వయసు ఈజీగా నా ప్రమేయం లేకుండానే వచ్చేసింది. ఇంట్లో అందరికంటే వయసులో
చిన్నవాడినేకావచ్చు, కానీ నేనూ ఇప్పుడు పెద్దవాడినే!
పుట్టిన ప్రతివాడికి బాల్యం వుంటుంది
కాని ముసలి వయసు అనేది ఆయుస్సునిబట్టి
వుంటుంది. ఇంకో చిత్రం ఏమిటంటే మొండితనం అనే ఒక లక్షణం మాత్రం పసితనానికి, ముసలితనం ఈ రెండింటికీ కామన్.
చిన్నప్పుడు ‘అలా చేయోద్దురా’ అనే
పెద్దవాళ్ళు వుండేవాళ్ళు. ‘ఏమిట్రా అలా ముందూ వెనకా చూసుకోకుండా ఆ గెంతులు. పడితే
కాలో చెయ్యో విరుగుతుంది. సిమెంటు కట్టు కట్టుకుని ఆటా పాటా లేకుండా మంచం మీద పడి వుండాలి,
జాగ్రత్త!’ అంటూ వుంటారు. ‘ఏవిటో ఈ పెద్దవాళ్ళు, అనవసరంగా అన్నింటికీ కంగారు
పడుతుంటారు’ అనుకుంటారు పిల్లవాళ్ళు. నేనూ అలాగే చెప్పిన మాట వినకుండా ఒకరోజు
సైకిల్ మీద నుంచి పడి చెయ్యి విరగగొట్టుకున్నాను.
సర్కారు దవాఖానాలో సిమెంటు కట్టు వేస్తే దాన్ని మెడకి తగిలించుకుని మోస్తూ నలభయ్
రోజులు తిరిగాను. ‘ఇంకా నయం కాలు విరిగింది కాదు’ అనుకున్నాను. అంతే కాని ‘కాళ్ళూ
చేతులు విరగగొట్టుకోవద్దు’ అన్న పెద్దల మాటలు చెవి కెక్కించుకోలేదు.
ఇప్పుడు మళ్ళీ సీను రివర్స్. ‘కాస్త
జాగ్రత్త’ అంటారు పిల్లలు. ‘ఆ మాత్రం తెలియదా’ అంటుంది మనలోని మొండితనం.
‘వద్దమ్మా! అలా మిట్ట మధ్యాన్నం వరకు
పూజలూ అవీ చేస్తూ కడుపు మాడ్చుకోకు. అసలే నీకు, సుగరు, బీపీ. డాక్టరు ఏం చెప్పాడు,
పొద్దున్నే ఏదో ఇంత తిన్న తరువాతనే ఏ పని
అయినా అని చెప్పాడా లేదా. మళ్ళీ ఏదైనా అయితే ఇబ్బంది పడేది నువ్వే’ అంటుంటారు
పిల్లలు. అందరి మాటా అంతవరకూ వింటూవచ్చి, ‘మంచి అమ్మ’ అని నలుగురి చేతా అనిపించుకున్న ఆ అమ్మ మాత్రం
పిల్లలు చెప్పిన ఆ మంచి మాట వినదు. పైగా ‘ఆ
మాత్రం నాకు తెలవదా’ అనుకుంటుంది. ‘మనం పెద్దవాళ్ళం కదా పిల్లవాళ్ళ మాట వింటే ఇక
మన పెద్దరికం ఏముంటుంది’ అని కూడా అనుకుంటుంది. నిజానికి ఏదైనా జరిగితే ఇబ్బంది పడేది
నిజమే అయినా, అసలు ఇబ్బంది పిల్లలది.
మొన్నీమధ్య తెలిసిన దంపతులు పిల్లల్ని
చూడ్డానికి అమెరికా వెళ్ళారు. ఆమెకు బీపీ, సుగరూ పుట్టింటి కట్నంగా వచ్చాయి.
కావాల్సిన మాత్రలు అవీ తీసుకు వెళ్ళారు. తల్లీ తండ్రికి అమెరికాలో నాలుగు
ప్రదేశాలు చూపించాలని ముచ్చటపడి పిల్లలు, ఎక్కడికో
విహార యాత్రకు తీసుకువెళ్ళారు. ఈసందడిలో మాత్రలు వెంట పట్టుకుపోవడం మరచిపోయారు. నాల్రోజులు మాత్రలు
వేసుకోకపోతే ఏం కొంప మునుగుతుందని పిల్లలకి ఆ విషయం చెప్పలేదు. చెబితే ఏదైనా
ప్రయత్నం చేసేవాళ్ళేమో! చివరికి నిజంగానే కొంప మునిగింది. జబ్బున పడ్డ తల్లిని
ఆసుపత్రిలో చేర్చి బయటకు తీసుకురావడానికి వాళ్ళ లెక్కలో అటూ ఇటూగా ఓ యాభయ్ లక్షలు ఒదిలాయని
చెప్పుకున్నారు. కాబట్టి ఏమిటట!
చిన్నప్పుడు పిల్లల మొండితనం మనకు యెంత కోపం తెప్పించేదో గుర్తుకు తెచ్చుకుని
పెద్దతనంలో మనం కాస్త మొండితనం తగ్గించుకోవాలి. ‘ఈ రోడ్డే కదా దాటి అవతల ఉన్న
గుడికి వెళ్ళలేమా!’ అంటే వెళ్ళవచ్చు. అదే ఖర్మం కలిసిరాక ఏదైనా జరిగితే మంచాన
పడేది పిల్లలు కాదు, మనమే అనే విషయాన్ని
కూడా గుర్తు పెట్టుకోవాలి.
చలికాలం వస్తే మూడంకె వేసి దుప్పటి
కప్పుకుని పడుకుంటాం. ముసలి తనం కూడా
అలాగే. ఆ వయసుని బట్టి దానికి తగ్గట్టు మన మనసును కాస్త వీలుగా ముడుచుకోవాలి.
కాదూ కూడదంటే కలిగేవి ఇబ్బందులే. మనం పడడంతో
సరిపోదు ఇతరులను కూడా అనవసరంగా ఇబ్బందుల పాలు చేయాల్సిరావచ్చు.
నీతి: పెద్దతనంలో మొండితనాన్ని అటక
ఎక్కించాలి. లేకపోతే ‘పడక’ వేయాల్సి వస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి