వాస్తవానికి సమాజంలో వైద్యులది
విశిష్టమయిన స్తానం. అందుకే డాక్టరును ‘డాక్టరు గారు’ అని గౌరవంగా
సంబోధిస్తారు. నలుగురిలో వారికి
పెద్దపీటవేసి మన్నన చేస్తారు. రోగాలబారి నుంచి కాపాడే అపర ధన్వంతరులుగా, ప్రాణబిక్ష పెట్టే కలియుగ
దైవాలుగా కొలుస్తారు. నాకిప్పటికీ గుర్తు. మా చిన్నతనంలో మా వూరికి వారానికోసారి ఓ
డాక్టరుగారు సైకిలు మీద వచ్చేవారు. చిన్న చితకా జ్వరాలకు తనతో తెచ్చుకున్న
తోలుపటకా సంచీనుంచి మందు గోలీలు ఇచ్చి వైద్యం చేసేవారు. పంటలు చేతికందినప్పుడు
వూళ్ళోని పెద్ద పెద్ద ఆసాములు ఏడాదికోసారి కొలిచి ఇచ్చే ధాన్యం మినహా ఆ డాక్టరు
గారు ఏనాడూ రోగులనుంచి ఫీజు వసూలు చేసిన దాఖలా లేదు. ఆయన వూరికి వస్తే చాలు
దేవుడే నడిచివస్తున్నట్టుగా జనం భక్తి ప్రపత్తులు ప్రదర్శించేవారు. ‘సైకిల్ డాక్టరుగార’ని పిలవడం మినహా ఆయన అసలు
పేరేమిటో ఎవరికీ తెలియదు. నాడి పట్టుకుని చూసి ‘ఇప్పుడెలావుందయ్యా రాముడూ’ అని ఆప్యాయంగా అడగగానే సగం రోగం
చేతులతో తీసివేసినట్టు వుండేది. చుట్టుపక్కల అయిదారు వూళ్ళకు ఆయనే దిక్కు. సైకిల్
తొక్కుకుంటూ రోజుకో వూరు చుట్టబెట్టేవారు. ఆ రోజుల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే.
కరెంటు వుండేది కాదు. ఉక్కపోస్తున్నా, నులక మంచంమీద కూర్చుని తన మానాన తాను రోగులకు వైద్యం
చేస్తుండేవారు. కళ్ళల్లో కారుణ్యం. మోహంలో చెదరని చిరునవ్వు. ఆయన హస్తవాసిపట్ల
అందరికీ అపరితమయిన గురి. జనాలకు కొండంత ధైర్యం.
మరి ఇప్పుడో. ఆ చిత్రం పూర్తిగా మారిపోయింది.
రోగులు పెరిగారు. రోగాలు పెరిగాయి.
వైద్యులూ పెరిగారు. ఇచ్చే మందులూ పెరిగాయి. వాటి ఖరీదులూ పెరిగాయి.
పెరగనిదల్లా వైద్యులపట్ల రోగులకు వుండే భరోసా! వుండాల్సిన దిలాసా!!
మా చిన్న తనం రోజులు కానీ, ఆరేళ్ళ క్రితం సంఘటన కానీ
గుర్తుచేసుకున్నప్పుడు, మార్పేమయినా కానవస్తున్నదంటారా!
మీకు పేరాశ కొంచెం ఎక్కువే సుమండీ 🙂.
రిప్లయితొలగించండి