మేము డోలీలలో హాయిగానే కూర్చున్నాం.
కానీ డోలీల వాళ్ళ సంగతి గమనిస్తే చాలా బాధ వేసేది. రాళ్ళల్లో బురదలో, నిటారుగా
వుండే కొండ దారిలో మమ్మల్ని మోస్తూ వాళ్ళు నడుస్తున్నారు. చలికి వణుకుతూ డోలీల్లో
కూర్చోవడమే మాకు ఇంత బాధగా వుంటే, వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ, పైగా
డోలీల్లోకూర్చున్న మమ్మల్ని మోసుకుంటూ అంతంత దూరాలు ప్రయాణాలు చేస్తున్నారంటే
వాళ్ళ కష్టం ఊహించు కోవడానికే భయం వేస్తుంది. వాళ్లకు మన భాష రాకపోయినా ఎలాంటి
ఇబ్బంది, పేచీలు పెట్టకుండా వస్తున్నారు.
మన దగ్గర ఆటోల వాళ్ళు, రిక్షాల వాళ్ళు పెట్టే పేచీలు, కిరికిరులు గుర్తుకువచ్చాయి. కానీ వీళ్ళు అదేమిటో ఒక్కరోజు
కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరగలేదు. దొంగతనం అన్నది ఈ యాత్ర మొత్తంలో మాకు
అనుభవానికి రాలేదు. మా సామాన్లను వాళ్ళే ఎంతో పదిలంగా జాగ్రత్త చేసారు. డోలీలో
ప్రయాణిస్తూ వుండగా సురేష్ వాళ్ళు ఫోటో తీయాలని అనుకున్నారు. అయితే కెమెరా ఎందులో
పెట్టిందీ గుర్తురాక అది సాధ్యపడలేదు. చివరికి అందరం క్షేమంగా గౌరీకుండ్
చేరుకున్నాము. మళ్ళీ అదే హోటల్లో మా బస. అక్కడే అన్నాలు తిని మళ్ళీ బస్సెక్కి బదరీ
బయలుదేరాం.
తిరుగు ప్రయాణంలో మళ్ళీ శ్రీనగర్
వచ్చాము. అయిదు గంటలు కావస్తోంది. కేదార్ వెళ్ళేటప్పుడు కొండల నిండా గుబురుగా
పెరిగిన పచ్చటి చెట్లు. ప్రకృతి సోయగాలు చూసి మురిసిపోయాము. అదేమిటో శ్రీనగర్
(కాశ్మీర్ శ్రీనగర్ కాదు) పరిసరాలలో ఉన్న కొండలన్నీ ఎండిపోయి, చిగురు పెట్టని
చెట్లతో కళావిహీనంగా కానవస్తాయి. సారహీనమైన సంసారంలా వన్నెతగ్గి ఉసూరుమంటూవున్నాయి.
ఏవిటో ఈ ప్రకృతి వైచిత్రి.
మా బస్సులో వచ్చిన గైడ్ పేరు చవాన్.
“కేదార్ లో పచ్చని చెట్లు విరివిగా
వుంటాయి. కాబట్టి ఏమీ అనిపించదు. కానీ బదరీలో అలా చెట్లు లేవు. బాగా ఎత్తుకు పోయిన
కొద్దీ ఆక్సిజన్ అందడం కష్టం. నడిచేటప్పుడు ఎక్కువగా మాట్లాడకండి. మాట్లాడితే
ఆయాసం వస్తుంది. కాబట్టి ఎక్కడ తిరిగినా నెమ్మదిగా నడవండి, మౌనంగా వుండండి” అని
హెచ్చరికగా చెప్పాడు.
గదిలో వున్నప్పుడు బాగానే వుండేది
కానీ, బయటకు వచ్చినప్పుడు ఊపిరి పీల్చడం కష్టంగావుండేది. నాకే కాదు, అక్కడ అందరి
విషయం అంతే. మనిషి ముందూ వెనకా ఆలోచించకుండా,
ఆశ కొద్దీ చెట్లన్నిటినీ కొట్టేయడం వలన కలిగిన దుష్ఫలితం ఇది. (ఇంకా వుంది)
బదరి కేదార్ యాత్ర సిరీస్ బావుందండీ. ఈ రోజుల్లో అందరూ హెలికాప్టర్ లో వెళ్లి వచ్చేస్తున్నారు.
రిప్లయితొలగించండి@Chandrika Chandrika : ధన్యవాదాలు. ఇది 1996 నాటి సంగతి. - భండారు శ్రీనివాసరావు
రిప్లయితొలగించండి