రైతుది ఒక విచిత్ర పరిస్తితి.
పండిన ఏడు ధర వుండదు. ఎండిన ఏడు ధర
మాటే వుండదు. పంట పండినా, ఎండినా పండించే రైతు డొక్క నిండదు.
ఒకడు ఒక సినిమా తీస్తాడు, ఆడుతుంది. డబ్బులు
కురుస్తాయి. అది చూసి మరొకడు అదే తరహా ఫిలిం తీస్తాడు. డబ్బాలు తిరిగొస్తాయి.
కాస్త పలుకుబడి వుంటే వినోదపు పన్ను రద్దు రూపంలో సర్కార్లు ఆదుకుంటాయి.
ప్రభుత్వాలకు రావాల్సిన మొత్తం వాళ్ళ ఖాతాల్లో జమవుతుంది.
అదే నిరుడు మంచి ధర వుందని అదే పంట
వేసిన రైతుకు ధరలు లేక కన్నీరే మిగులుతుంది. కన్న పేగుతీపిని కూడా
లక్ష్యపెట్టకుండా ఆరుగాలం కష్టించి పండించిన పంటనే కడుపుమండి తగలబెట్టుకుంటాడు.
ఒడ్డున కూర్చుని తమాషా చూసే వాళ్ళు అలా చేయడం తగదంటారు. రైతును ఆదుకోవడంలో తమను
మించినవాళ్లు లేరంటూ జబ్బలు విరుచుకుంటూ ప్రకటనలు చేస్తారు. వీలుంటే ప్రజలు కట్టిన
పన్నుల నుంచి కొంత మొత్తం విదిలించి చేతులు దులుపుకుంటారు.
ఇంతేనా! చేయాల్సింది ఇంకేమీ లేదా!
ప్రతి ఏడు ఇదే తంతయితే కొన్నాళ్ళకు పాలకుల పట్ల ప్రజలకు విశ్వాసం పోదా!
రెండు తెలుగు రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్లలో మిర్చికి ధరలేదు. మరి పొరుగు
రాష్ట్రం మహారాష్ట్రలో అంత ధర ఎందుకు వుంది. ఆ రాష్ట్రం మన దేశంలో ఉందా! పరాయి
గడ్డపై ఉందా!
మిర్చికి ధర లేదు సరే! మరి
వినియోగదారుడు షాపుల్లో కొనుక్కునే కారం ధర ఎందుకలా మండిపోతోంది! దీనికి జవాబు
వుండదు.
పండించిన రైతుకు, దాన్ని వినియోగించే
పౌరుడికీ దక్కని ‘ప్రయోజనం’ ఎవరికి దక్కుతోంది. జవాబు చెప్పడం కష్టమేమీ కాదు, దళారీలకు,
వ్యాపారులకు. మరి అంతంత లాభాలు గడించేవారి నుంచి, ఇప్పటికే వసూలు చేస్తున్న
పన్నులకు అదనంగా ఎంతో కొంత మొత్తం ‘సెస్సు’
రూపంలో వసూలు చేసి, దానితో ఒక శ్రేయోనిధిని ఏర్పాటు చేసి, సరయిన ధర దొరకని
రోజుల్లో రైతులను ఆదుకునే ప్రయత్నం చేయవచ్చు కదా!
ప్రభుత్వాలూ! ఆలోచించండి!
శ్రీనివాస రావు గారూ, కేవలం మీడియాలో వచ్చే "వార్త"లను బట్టి వెళ్ళితే పప్పులో కాలేస్తాం. కొన్ని వాస్తవాలను గమనించ ప్రార్థన.
రిప్లయితొలగించండితెలంగాణా ఆంద్ర రాష్ట్రాలు రెండూ కలిపితే మొత్తం సాగు విస్తీర్ణంలో మిర్చి కేవలం 1.7% మాత్రమే. పసుపు (0.5%) ఇంకా తక్కువ.
ఈ రెండు పంటలూ అత్యంత లాభసాటి. ఉ. వరితో పోలిస్తే మిర్చి రాబడి/విస్తీర్ణం నిష్పత్తి అయిదు రెట్లు ఉంటుంది. ఇంపుట్ ఖర్చు ఇతర పంటలకంటే కొంచం ఎక్కువ అయినా వీరి పరిస్థితి మొత్తంగా దయనీయం అనలేము.
గిడ్డంగులు & కోల్డ్ స్టోరేజీల వలన కొంత ఊరట వచ్చినా దీని మీదే ఆధార పడరాదు. సెస్సులు నిధులు ధర స్థిరీకరణలు అంటూ అదనపు భారం తగదు.
వ్యవస్తీకృత పరిమితులను (system constraints) అధిగమించడం సులభం కాదు. వాటి లోపలే పని చేయడం శ్రేయస్కరం.
@ Jai Gottimukkala : సోషల్ మీడియాలో రావుగారనే ఆయన ఈ విషయాన్ని మిర్చి రిటైల్ ధర ఫోటోతో సహా పోస్ట్ చేసారు. అది ఇలా వుంది:'
రిప్లయితొలగించండి"బయట రిటైల్ మార్కెట్లలోనూ హెరిటేజ్ లాంటి సూపర్ మార్కెట్ల లోనూ 200 గ్రాముల ఎండు మిర్చి రిటైల్ ధర ₹ 50/-, అంటే కిలో 250 రూపాయలు..
అంటే క్వింటా ధర (100 కిలోలు) 100 కిలోలు × ₹ 250 = ₹ 25000/- .
హెరిటేజ్ లో క్వింటా ఎండు మిర్చి ధర ₹ 25000/-
రూపాయలా ?
రైతులకు కింటాకు ఇచ్చేది ₹ 3000/- + ఇస్తే గిస్తే మద్దతు ధర క్రింద ఇంకో ₹1500/- మొత్తం ₹ 4500/- ఇస్తున్నారు మరి హెరిటేజ్ లో ఏమో ₹ 25000 /-అమ్ముతున్నారు.అంటే వ్యాపారులకు క్వింటా ఎండు మిర్చి మీద దగ్గర దగ్గర ₹20500/- లాభమా ? రైతన్న పండించే పంటకు ఖర్చు పెట్టిన సొమ్ము కూలీ కూడా రావడం లేదు.. హెరిటేజ్ లాంటి వ్యాపారస్తులు మాత్రం కింటాకు ₹ 20500/- లాభం పొందుతున్నారు... ఇది సబబేనా ?
ప్రయివేటు వర్తకులు దళారీలు ప్రభుత్వ సహకారంతో ఒకటై రైతులను వినియోగదారులను దారుణంగా మోసం చేస్తున్నారు కదా !"
ఇలా ఇబ్బడిముబ్బడిగా లాభాలు దిగమింగే వ్యాపారుల నుంచి వసూలు చేసే డబ్బుతో రైతుల్ని ఆదుకోవాలని నా సూచన.
@Bhandaru Srinivasrao:
రిప్లయితొలగించండిమిర్చి మార్కెట్ యార్డ్ నుండి మన ఇళ్లకు చేరే మధ్యలో ఎన్ని చేతులు మారుతుందో ఎంతగా రూపాంతరం చెందుతుందో నాకు తెలీదు కనుక "దారుణంగా మోసం" & "ఇబ్బడిముబ్బడిగా లాభాలు" లాంటి మాటలు సబబా కదా చెప్పలేను. ఏదేమయినా మీడియా సందర్శకులతో ఎందరికో దళారీలు, మధ్యవర్తులు లాంటి పదాలపై ఏవగింపు ఉందన్నది వాస్తవం. ఆ ఈసడింపు భావమే వారితో అలా పలికిస్తోందేమో అని నా అనుమానం.
ఎవరయినా ఇవ్వాల్సినప్పుడు అత్యల్పం పుచ్చుకునేటప్పుడు అత్యధికం కావాలనే ప్రయత్నిస్తారు. ఇది ప్రకృతి సిద్ధం, ఈ లక్షణమే (లేదా లాభాపేక్ష) ఆర్ధిక రంగానికి పునాది. రైతులయినా వర్తకులయినా వినియోగదారులయినా ఎవరూ ఇందుకు మినహాయింపు కారు.
(మిగిలిన రైతులలో పోలిస్తే కొద్దోగొప్పో బాగానే ఉన్న) మిర్చి రైతులు *ఈ ఏడాది* కష్టాలలో ఉన్నారు. వారికి కొంచం ఊరట ఇవ్వాలని మీలాంటి వారు అంటున్నారు అది మీ ఇష్టం. ఆ భారమేదో వర్తకులు ఎందుకు భరించాలి? ప్రభుత్వం వారు కిలోకు 50 రూపాయలు "దుర్భిక్ష పన్ను" వసూలు చేసి తద్వారా రైతును ఆదుకుంటామంటే మీడియాలో "మధ్యతరగతిపై జులం" అంటూ స్క్రోలింగ్ రాదా?