(PUBLISHED IN ANDHRAPRABHA TELUGU DAILY ON 27-05-17, SATURDAY)
“మోడీ లాంటి మొగాడు దేశానికి అవసరం”
ఈ మాట చెప్పింది మోడీ అభిమానీ కాదు, బీజేపీ కార్యకర్తా కాదు.
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా
వున్నరోజుల్లో, ప్రత్యేకించి గోద్రా మారణ హోమం
నేపధ్యంలో ఆయనను పూర్తిగా ఖండిస్తూ పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసిన
వ్యక్తి. పేరు సుహేల్ సేథ్.
గుజరాత్ లో గోద్రా మారణహోమం అనంతరం
నరేంద్ర మోడీ అభినవ హిట్లర్ అంటూ పలు విమర్శలు చేసిన చరిత్ర ఈయనకు వుంది. ఆ సంఘటన
మోడీ జీవితంలో మాయని మచ్చ అన్నారు. అంతే కాదు, ఆ కారణంగా భారత రాజకీయ వ్యవస్థ
భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అయితే, నరేంద్రమోడీ ప్రధాన మంత్రి
కాగానే సుహేల్ సేథ్ మహాశయులు తన బాణీ తానే మార్చుకుని ‘ఈ దేశం అవసరం మోడీకి లేదు, మోడీ వంటి మొనగాడి అవసరం దేశానికే
వుందంటూ గొప్ప కితాబు ఇచ్చారు.
“ఆయనలో కొన్ని లోపాలు వున్నాయి, కాదనను. కానీ మోడీ వంటి మరో నేత
ఈరోజు దేశంలో మరొకరు లేరు. ఇది వాస్తవం. అయన ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి.
ఇది మరో వాస్తవం’ అంటారు
సుహేల్ సేథ్.
ఈయన మాటల్ని విశ్వసించాల్సిన అవసరం
వుందనుకోను. ఆయనే స్వయంగా చెప్పుకున్నట్టు ఆయన ఒక ప్రచారకర్త. తనను తాను
పెంచుకునే వ్యూహంలో భాగంగా మోడీ, సోషల్ మీడియాలో సేథ్ వంటి వ్యక్తులను
ఉపయోగించుకుంటూ వుంటారని మోడీ రాజకీయ ప్రత్యర్ధులు ఆరోపిస్తూ వుంటారు.
కేవలం ప్రచార ఆర్భాటంతో మోడీ తనకులేని ప్రతిభను అలా చాటుకుంటూ వుంటారని వారి
ఉద్దేశ్యం.
కానీ ఇది పూర్తిగా నిజం కాదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆ
రాష్ట్రం రూపురేఖల్ని ఆయన ఎలా మార్చగలిగిందీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయనలో
దాగున్న సమర్ధ రామదాసు మనకు కనబడతాడు.
సరే! సేథ్ ఒక ప్రచార కర్త. ఆయన సంగతి
అలా ఉంచుదాం.
గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మోడీ
పనితీరు గురించి ఒక మిత్రుడు పంపిన సమాచారం ఇది.
“మోడీ గుజరాత్ సీతయ్య. కాకపొతే కొంత తేడా వుంది. మన
తెలుగు సీతయ్య ఎవడి మాటా వినడు. ఈ గుజరాత్ సీతయ్య అందరి మాటా వింటాడు కానీ చివరకు
తాను అనుకున్నదే చేస్తాడు. ”
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు
ఆయన్ని గురించి వినవచ్చే కధలన్నీ ఇలాగే వుండేవి. మోడీ లాంటి నాయకులు అయిదుగురు
వుంటే చాలు, యావత్ ప్రపంచంలో భారత దేశం అగ్రగామి
కావడానికి ఎంతో కాలం పట్టదు’ అంటూ గుజరాత్ ని సందర్శించిన వాళ్ళు చెప్పేవాళ్ళు.
ఇదిగో, సరిగ్గా ఇలాంటి ప్రచారమే గత
సార్వత్రిక ఎన్నికల్లో మోడీని దేశ ప్రజల దృష్టిలో మొనగాడిని చేసింది. మోడీ అనే
రెండక్షరాలు ఆసేతు హిమాచలం మారుమోగి పోయాయి. మూడేళ్ళ నాడు జరిగిన సార్వత్రిక
ఎన్నికల్లో అద్భుతమైన విజయం ఆయన ఒళ్లో పడింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు.
చూస్తుండగానే మూడేళ్ళు గడిచిపోయాయి.
ఇంకా మిగిలింది రెండేళ్ళు. చివరి ఏడాది ఎటూ ఎన్నికల సంవత్సరమే. మిగిలింది ఒక్క
ఏడాదే. రెండో ఏడు కేవలం లెక్కకే. ఏమి చేయాలన్నా, చేసింది చూపించి జనాలను
ఒప్పించాలన్నా , మెప్పించాలన్నా ప్రధాన మంత్రి
నరేంద్ర మోడీకి ఈ ఒక్క ఏడాదే మిగిలివున్న వ్యవధి. సరయిన సమయం కూడా.
అందరికీ గుర్తుండే వుండాలి. ఏడాది పాలన
పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలకు మోడీ ఒక బహిరంగ లేఖ రాసారు.
“సేవా పరమో ధర్మః” అనే సూక్తితో మోడీ ఆ లేఖను మొదలు
పెట్టారు. ప్రజలకు సేవ చేయడంలో వున్న తృప్తినీ, ఆనందాన్ని తను ఏడాది కాలంగా
అనుక్షణం ఆస్వాదిస్తూ వచ్చానని ఆయన అందులో పేర్కొన్నారు.
“అంతులేని అవినీతి
రాజ్యమేలుతున్నప్పుడు, నిర్ణయాలు తీసుకోలేని అసమర్ధ పాలనతో జాతి
నవనాడులు కుంగిపోయి వున్న నేపధ్యంలో మీరు నాపట్ల ఎంతో నమ్మకంతో నాకు పగ్గాలు
అప్పగించారు. మీ ఆశలను నిజం చేయడానికే గత ఏడాదిగా నేను అహరహమూ కష్టపడుతూ వచ్చాను’ అన్నారాయన ఆ లేఖలో ఆనాడు.
పేదల అభ్యున్నతికోసం ‘అంత్యోదయ’, పరిశుభ్రత, పారిశుధ్యం కోసం స్వచ్చ భారత్
మొదలయిన ప్రభుత్వ పధకాల జాబితాను ఏకరువు పెట్టారు.
ఈ మాటలు చెప్పిన తరువాత మరో ఏడాది కాలగర్భంలో కలిసింది.చూస్తుండగానే
మూడేళ్ళు గతంలో కలిసి పోయాయి. ప్రజల
ఆకాంక్షలను నెరవేర్చడానికి మోడీ అహరహమూ పడుతున్న కష్టం ఏమన్నా ఫలితాలు ఇచ్చిందా
అంటే చప్పున జవాబు చెప్పడం కష్టం.
లోకం చుట్టిన వీరుడు అని పేరు
తెచ్చుకుంటున్న మోడీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రధానమంత్రి హోదా వున్నప్పుడు, విదేశీ ప్రభుత్వాల ఆహ్వానాలు, దేశ విదేశాల్లో పర్యటనలు, ఎర్ర తివాచీ స్వాగతాలు, మీడియాలో ప్రచారాలు ఇవన్నీ
సహజాతిసహజం. వాటివల్ల సొంతగడ్డకు యెంత మేలు జరిగిందన్నదే ప్రధానం.
మూడేళ్ళుగా ఎలాంటి మచ్చా లేకుండా స్వచ్చమైన
పాలన అందించామని ఎన్డీయే నాయకులు చెబుతున్న దాంట్లో వాస్తవం వుంది. అయితే యూపీఏ
మొదటి విడత మన్మోహన్ సింగ్ పాలన కూడా ఇలాగే స్వచ్చంగా సాగిందన్న నిజాన్ని కూడా
గుర్తు పెట్టుకోవాలి. పతనం మొదలు కాకూడదు. మొదలయితే ఆ వేగం వడీ యెంత ఉధృతంగా
ఉంటాయనేది యూపీయే రెండో విడత పాలన మనకు విడమరచి చెబుతోంది.
గత ప్రభుత్వాల వైఫల్యాల పాత జాబితాలను పదేపదే వల్లె వేస్తూ
పొతే, ప్రజలు కొంతకాలంపాటే అరాయించుకుంటారు. కాలం
గడుస్తున్న కొద్దీ, తరువాత కూడా పాత పల్లవే అందుకుంటూ వుంటే, ప్రజలు విసిగిపోయి, మరొకర్ని పల్లకీ ఎక్కించే ఆలోచన మొదలు
పెడతారు.
రాజకీయాల్లో వున్నవాళ్ళు రాజకీయం చేయక
తప్పదు. కానీ ప్రజలు, పరిపాలన కూడా పాలకులకు అంతే ప్రధానం. ఈ
సత్యం ఎరుకలో వుంచుకుంటే పాలకులకూ మంచిది, ప్రజలకూ మంచిది.
మంచి పోస్ట్...Good
రిప్లయితొలగించండిఉద్యోగ అవకాశాలు, టీచర్ గైడెన్స్, అన్ని తరగతుల ప్రశ్నా పత్రాలు, మీరు ఉన్నత స్థితికి ఎదగాలంటే ఏమి చేయాలి? తదితర విషయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
What is your opinion?Will modiji get a second term? Neither here nor there stand won't do sir
రిప్లయితొలగించండి