గుండు చేయించుకున్న వాళ్లకు తమ నెత్తి మీద జుట్టు లేదు అన్న స్పృహ ఎన్నడూ
కలగదు. కానీ ఎదుటివారు ఆ తేడాను ఇట్టే పట్టేస్తారు. తేడా అయితే పడతారు కానీ
మనిషిని అయితే గుర్తుపట్టలేరు. ఈ కారణంగానే గుండూ రావులు ఎదుటి వారిని కనబడగానే ‘హలో సుబ్బారావు బాగున్నావా’ అనేస్తుంటారు. గుండూరావును
ఆ గుండుతో పోల్చుకోలేని సుబ్బారావులు
జుట్టు పీక్కుంటూ వుంటారు.
ఈరోజు పార్కులో పెళ్లి నడకలు
నడుస్తున్న సమయంలో దూరంగా ఎదుటి నుంచి పరుగు లాంటి నడకతో వస్తున్న ఓ పెద్దమనిషి
కనిపించాడు. ఎక్కడో చూసినట్టు వుందే అనుకుంటూ ఉండగానే బుర్రలో లైటు వెలిగి ‘మన ఏబీసీడీ
ప్రసాద్ కదూ’ అనిపించింది. వెంటనే ఎదురెళ్ళి ‘ఏం ప్రసాద్ గారు ఎలా వున్నారు, మీరు
అమరావతిలో వున్నారనుకుంటున్నాను’ అనేశాను. కానీ ఆయన మోహంలో నన్ను గుర్తుపట్టిన
ఛాయలు కనిపించలేదు. అప్పుడు గుండు గుర్తొచ్చి దాన్నొకసారి గోక్కుంటూ ‘ తిరుపతి’
అన్నాను. అయన తేరిపార చూసి, మరు క్షణంలో నన్ను గట్టిగా పట్టుకుని ‘ఎన్నాల్టికెన్నాళ్ళకు
మిమ్మల్ని చూసాను చాలా సంతోషం, నిజంగా
ఈరోజు చాలా మంచి రోజు’ అన్నాడు. నిజానికి
అయన ఇంటి పేరు ఏబీసీడీ కాదు.
అయితే కొందరి పేర్లను, వారి ఇంటి
పేర్లను వాళ్ళతో నిమిత్తం లేకుండానే
ఇతరులు అందరూ కలిసి మార్చేస్తుంటారు.
వారిలో ఏబీసీడీ ప్రసాద్ ఒకరు. ఆయన అసలు
పేరు ఎల్.వీ.ఎస్.ఆర్.కే. ప్రసాద్. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా
వున్నప్పుడు పార్టీ కార్యాలయంలో పత్రికా సంబంధాలు వగయిరా చూస్తుండేవారు. అంచేత
హైదరాబాదులోని పత్రికల వాళ్ళందరికీ ఆయన చిరపరిచితుడు. ప్రెస్ వాళ్ళే పెట్టారు
ఏబీసీడీ ప్రసాద్ అని ఆయన ఇంటిపేరుకో మారుపేరు. ఇప్పుడాయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో
గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ కూడా. రాష్ట్రం విడిపోయిన తరువాత చూసి చాలా కాలం
అయింది.
పరవాలేదు, అప్పుడప్పుడన్నా ఇలా
పార్కుల్లో మార్నింగు వాకులు చేస్తుంటే, ఎప్పుడో విడిపోయిన వాళ్ళు తెలుగు
సినిమాల్లో ఇంటర్వెల్ తరువాత కలుసుకున్నట్టు, పాత స్నేహితులు పార్కుల్లో తారసపడే
అవకాశాలు ఉన్నాయన్న మాట.
అంచేత ఏమన్నమాట! అంతయు మన మేలునకే!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి