8, మార్చి 2017, బుధవారం

మనసు వుండాలేకాని మనుషుల్ని ఇలా కూడా మార్చవచ్చు


బహిరంగ సభని తలపించే సందర్భం అది.
చిత్తూరు జిల్లాలో మూడువందల గడప వున్న ఆ పాత కాలువ  గ్రామానికి ఏకంగా  పదివేలమంది తరలి వచ్చారు. అంతమంది చేరిన చోట చిన్న చిన్న సంఘటనలు తప్పవు. చిన్నవి అని ఉపేక్షిస్తే అలవికానివిగా మారే ప్రమాదం పొంచి వుంటుంది. ఆ సమయంలో ఒక గంభీర స్వరం ఆ ప్రాంతంలో మారు మోగింది.
రండి, కూర్చోండి. ప్రశాంతంగా వినండి.
“నేను మీ వూరుని దత్తత తీసుకుంటున్నా.
“మీ ఊరికి జరిగే మంచి చెప్పుకుందాం”
“ ఇది ఒక ఊరన్న మాటే కానీ పిల్లలు చదువు కునేందుకు బడి లేదు.
“మీ  పిల్లలు చదువుకోవడానికి కింద కూర్చుని ఇబ్బంది పడనక్కరలేదు. .. ఆ ముందు వరుసలో కూర్చున్న రాజు గారు మీ బడి నిర్మాణం బాధ్యత తీసుకుంటారు. బడికి కావాల్సిన బల్లలూ, కుర్చీలు అన్నీ ఇస్తారు. ఇక అదిగో ఆ వారున్నారే  మంచి ఉదారులు. మీ ఊరూ కాదు, మీ ప్రాంతమూ కాదు. అయినా మీ ఊరిమొత్తానికి చక్కటి  తాగు నీటి సౌకర్యం కల్పిస్తారు. తాగే నీళ్ళు సరిగా లేకపోతే రకరకాల రోగాలు ఒంటిని చుట్టుకుంటాయి. అందుకే ఈ ఏర్పాటు. పిల్లలకి మంచి చదువు, మీకు శుద్ధమైన మంచి నీళ్ళు. ఇంకా ఏమిటి మీ సమస్యలు, మొహమాట పడకుండాచెప్పండి." 
అంతే! సర్వత్రా కాసేపు నిశ్శబ్దం. ఆ వెనువెంటనే హర్షధ్వానాలు.
అప్పటిదాకా వకుళామాత గుడి మూలంగా తమకి క్వారీ ఉపాధి పోతుందంటూ ఉద్రేక పడుతున్న గ్రామస్తులంతా ఒక్కసారిగా మారిపోయారు. ఆనందంతో చప్పట్లు కొట్టేశారు. "మన పాత కాలువ స్వామికి జై" అంటూ ఉత్సాహంగా నినాదాలు చేశారు.
ఆ మాటలు చెప్పింది, ఒక రాజకీయ నాయకుడు కాదు, సర్వం త్యజించిన ఒక సన్యాసి.
పాతకాలువ స్వామీ దండాలుఅన్నాయి అక్కడి గొంతులు.
ప్రపంచానికి పరిపూర్ణానంద స్వామిగా పరిచితులయిన శ్రీ పీఠం స్వామి వారు, ఆ క్షణంలో పాతకాలువ స్వామిగా మారిపోయారు.
స్థానికులతో మమేకం కావడం అంటే ఇదే. స్థానికుల మనసులను దోచుకోవడం అంటే ఇదే!
మన రాజకీయ నాయకులు ఎప్పుడు నేర్చుకుంటారు - ఇలా ప్రేమతో మనుషుల్ని గెలవటం?

ఎప్పుడో కాదు ఇది జరిగింది, మొన్నీ మధ్యనే. మార్చి నెల ఐదో తేదీన.


2 కామెంట్‌లు: