(ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అసెంబ్లీల సమావేశాలు మొదలవుతున్న సందర్భంగా)
1958 - 59 ఆర్ధిక సంవత్సరం
బడ్జెట్ పై ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో
చర్చ జరుగుతోంది. అంటే దాదాపు
యాభై అయిదేళ్ళ కిందటి ముచ్చట.
ఒక సభ్యుడు లేచి అన్నారు. ' పన్నులన్నీ తెలంగాణపై
రుద్దుతున్నారు' అని.
ఆర్ధిక మంత్రి వెంటనే స్పందించారు, 'గౌరవ సభ్యులు వాడిన 'రుద్దుతున్నారు' అనే పదం బయట పర్వాలేదు. కానీ
సభలో 'కర్ణ కఠోరం'గా వుంటుంది'
సభ్యుడు లేచి 'అలా అన్నందుకు' విచారం వెలిబుచ్చారు.
ఆ ఆర్ధిక మంత్రి పేరు బెజవాడ
గోపాల రెడ్డి.
ఆ పదం వాడి, తరువాత విచారం వ్యక్తం చేసిన సభ్యుడు ఎవ్వరో కాదు, తదనంతర కాలంలో యావత్ భారత
దేశానికి అయిదేళ్ళ పాటు ప్రధాన మంత్రిగా పనిచేసిన పీ.వీ. నరసింహారావు.
అవీ ఆ రోజులు.
అలనాటి, అంటే ఓ నలభయ్, యాభయ్ ఏళ్ళక్రితం జరిగిన శాసన సభ సమావేశాల్లో, తీవ్రమైన చర్చల నడుమ
వాతావరణాన్ని చల్లబరచడానికి కొన్ని చలోక్తులు కూడా వినబడేవి.
తెలుగు పత్రికల్లో ఈ ఛలోక్తులను 'బాక్స్' కట్టి మరీ ప్రచురించేవారు.
చదువుకోవడానికి తమాషాగానే కాకుండా ఆహ్లాదకరంగా కూడా ఉండేవవి.
1958 లో కళా వెంకటరావు గారు
రెవెన్యూ మంత్రి. రాములు అనే సభ్యుడు (ఇంటి పేరు గుర్తు రావడం లేదు) మంత్రిని తమాషా పట్టించాలని'మంత్రిగారు మాట్లాడుతున్నది
కొండ నాలుకతోనా లేక కొన నాలుకతోనా' అని జోకబోయారు. అంటే మంత్రిగారు
చెప్పేవన్నీ పై పై మాటలు, ఒక్కటీ కరెక్టు కాదు అనేది ఆ సభ్యుడి ఉద్దేశ్యం.
కళా వెంకటరావు గారు సామాన్యుడు
కాదుకదా! వెంటనే తిప్పికొట్టారు.
'మనిషి అనేవాడు ఎవరయినా
నాలుకతోనే మాట్లాడుతాడు. కొండ నాలుకతో ఎవ్వరూ మాట్లాడరు. మరి రాములు గారు కొండ
నాలుకతో మాట్లాడుతారేమో నాకు తెలియదు'
ఆ దెబ్బతో రాములుగారు
కిమ్మిన్నాస్తి. గమ్మున కూర్చుండిపోయారు.
పూర్వం ఆంద్ర ప్రదేశ్ తొలి
ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవ రెడ్డి గారు ఒకసారి సభలో ప్రసంగిస్తూ భారతం
లోని ఒక ఘట్టాన్ని ఉదాహరించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. 1959 ఆగస్టు ఒకటో తేదీన
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ఆయన సమాధానం
చెబుతున్నారు. ఆరోజుల్లోనే కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేరళలో ఏర్పడ్డ మొట్టమొదటి
కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. దీనికి నిరసనగా
ఆంద్ర ప్రదేశ్ శాసనసభలోని కమ్యూనిస్టులు సభ నుంచి వాకౌట్ చేసారు. అది సంజీవరెడ్డి
గారికి నచ్చలేదు. అదే విషయం తన ప్రసంగంలో ప్రస్తావించారు. 'కేరళలో కమ్యూనిస్టులకు వచ్చిన
ప్రమాదం ఏమీ లేదు. ఆ పార్టీ ప్రజల మన్నన పొందగలిగితే తిరిగి అధికారంలోకి రావచ్చు.
కర్నూలులో వుండగా ప్రకాశం గారి ప్రభుత్వం పోయింది. ఆ తరువాత కాంగ్రెస్ కి నాలుగు
సీట్లు కూడా రావనుకున్నాము. కానీ, మళ్ళీ అధికారంలోకి వచ్చాము.
ఒకసారి ఒక పార్టీ , మరొక సారి మరో పార్టీ అధికారంలోకి రావచ్చు. ఇది వేదకాలం నుంచీ ఎరిగిన ధర్మం. యుద్ధంలో కూడా ఏదో ఒక
పక్షమే గెలుస్తుంది. తిక్కన భారతం ఉత్తర గోగ్రహణంలో భీష్ముడు
దుర్యోధనుడితో చెబుతాడు.'........పెనంగిన బలంబులు రెండును గెలవ నేర్తునే' అని. ఈ నీతి ఈనాడు కూడా
వర్తిస్తుంది' అని చెప్పారు సంజీవరెడ్డి గారు.
1976 లో జలగం వెంగళరావు గారు
ముఖ్యమంత్రి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన
చర్చలో దాదాపు నలభయ్ యాభయ్ మంది సభ్యులు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడినంత సేపు
ముఖ్యమంత్రి సభలో తన స్థానం నుంచి కదల లేదు. మౌనంగా సీట్లో కూర్చుని సభ్యులు
ప్రస్తావించిన వివిధ అంశాలపై నోట్స్ రాసుకుంటూ పోయారు. తరువాత తన సమయం రాగానే లేచి
సుమారు గంటన్నరపాటు అన్ని అంశాలను స్పృశిస్తూ సమాధానం చెప్పారు. సభలోని యావన్మందీ
వెంగళరావు ప్రసంగాన్ని మెచ్చుకున్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఏ పద్యం అయినా రాగయుక్తంగా కాకపోయినా ఎలాటి
స్ఖాలిత్యాలు దొర్లకుండా పండిత ప్రకాండులు మెచ్చే విధంగా పాడగలరనేది జగమెరిగిన
సత్యం. భారత భాగవతాల్లోని అనేక పద్యాలు కేసీఆర్ కి కంఠోపాఠం. దాశరధి, నారాయణ రెడ్డి వంటి కవుల గేయాలు
ఆయన ప్రసంగంలో ఆశువుగా దొర్లుతుంటాయి. ఒకసారి రవీంద్ర భారతి లో జరిగిన ఒక
కార్యక్రమంలో సినారె పక్కన ఉండగానే కేసీఆర్, నారాయణరెడ్డి గారు రాసిన తొలి
సినిమా పాటను యధాతధంగా వినిపించి శ్రోతలను అలరించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన
దామోదరం సంజీవయ్య గారు బహిరంగ సభల్లో కూడా పద్యం ఎత్తుకునేవారు. ఆయన ఏ.ఐ.సీ.సీ.
అధ్యక్షులుగా వున్నప్పుడు ఢిల్లీలో సంజీవయ్య గారు వుండే బంగళా
సాహిత్య గోష్టులకు వేదికగా ఉండేదని 'కలం కూలీ' జీ. కృష్ణగారు తన అనుభవాల్లో
రాసారు. సరే! ముఖ్యమంత్రిగా ఉంటూ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన
డాక్టర్
రాజశేఖర రెడ్డికి సయితం పద్యాలు వచ్చన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన ప్రతిపక్ష
నాయకుడిగా వున్నప్పుడు ఏకంగా ఒక పద్యం మొత్తం సభలో చదివి వినిపించారు. 2001- 2002
ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై జరిగిన చర్చను ప్రారంభిస్తూ చంద్రబాబు పరిపాలనలో వున్న
రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలని, భారతంలో తిక్కన విరచిత పద్యం - 'సారపు ధర్మమున విమల సత్యము ....' అని మొదలెట్టి ఒక పద్యం చదివి
వినిపించారు.
"ద్రౌపదీ వస్త్రాపహరణం
జరుగుతున్నప్పుడు దక్షత కలిగిన భీష్మ, ద్రోణుల వంటి వారు కూడా మౌనంగా
వుండిపోయారు. అలా ఉపేక్షిస్తే అది వారికే చేటవుతుంది. కానీ ఏదో ఒకరోజున భగవంతుడే
కల్పించుకుని సత్యాన్ని, ధర్మాన్ని నిలబెడతాడు. ఈ రాష్ట్రాన్ని కూడా ఆ దేవుడే
కాపాడాలి" అని ప్రసంగం ముగించారు రాజశేఖర రెడ్డి.
మరోసారి 2003 ఫిబ్రవరిలో
గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో పాల్గొంటూ, దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన
గేయభాగాన్ని వై.యస్.ఆర్. చదివి వినిపించారు.
'ఒక్క నిరుపేద ఉన్నంతవరకు, ఒక్క మలినాశ్రువు బిందువు
ఒరిగినంతవరకు, ఒక్క శుష్క స్థన్య సన్నిధిని క్షుదార్తి ఏడ్చు పసిబాలిక ఉన్నంతవరకు, నాకు శాంతి కలుగదింక నేస్తం
..... ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనించగలదు, ఏ రాజకీయవేత్త గుండెలను
స్పృశించగలదు' అంటూ 'పేదవాడి ఆర్తిని వినే ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రిగారు, చేయండి ముఖ్యమంత్రిగారు' అని తనదైన శైలిలో ప్రసంగం
ముగించారు.
చంద్రబాబు నాయుడు గారిది అదో
తరహా. శాసన సభలో ఆయన చేసే ప్రసంగాలలో పద్యాలు, గేయాలు వుండవు. కానీ ఆర్ధిక
అభ్యున్నతి గురించి,సంస్కరణలు
గురించి కొందరు ప్రముఖులు ఆయా సందర్భాలలో చేసిన కొటేషన్లు బాగా
చోటుచేసుకుంటాయి. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తాను చేపట్టిన వివిధ అభివృద్ధి
పధకాలు గురించి ప్రతిపక్ష నాయకుడిగా చేసే ఉపన్యాసాలలో వివరించే ప్రయత్నం చేస్తారు.
అలాగే,ముఖ్యమంత్రిగా
సభలో మాట్లాడేటప్పుడు కూడా ఈ పధకాల వివరాలు ఎక్కువగా ఉండే విధంగా జాగ్రత్త పడతారు.
1999 నవంబరు 16 వ తేదీన గవర్నర్
ప్రసంగంపై చర్చకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన సమాధానంలో కొన్ని భాగాలు ఇలా
వున్నాయి.
"నేను రాష్ట్రం అభివృద్ధిని
కోరుకుంటున్నాను. నా పట్ల ప్రజలకున్న అభిమానాన్నే నమ్ముకున్నాను. అందువల్లే
ఎన్నికల్లో మీ అంచనాలు తారుమారయ్యాయి. ప్రజల ఆశీర్వాదం నాకుంటుంది అని మొదటినుంచీ
చెబుతున్నాను. అదే ఈనాడు నిజమైంది. కుల్ దీప్ నాయర్ మాట్లాడుతూ, 'నేను ఆంద్ర ప్రదేశ్
ముఖ్యమంత్రిని అభినందించడం లేదు, ఆంద్ర ప్రదేశ్ ఓటర్లని
అభినందిస్తున్నాను. ఒక విజ్ డమ్ ని వాళ్ళు వ్యక్తం చేసారు. చాలా మెచ్యూరిటీ
ప్రదర్శించారు. కర్నాటక, మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఆంద్ర ప్రదేశ్ మాకు
ఆదర్శం అంటున్నారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా గట్టిగా
చెప్పారు. 'దేనికయినా ఆంద్ర ప్రదేశ్ కొలమానం' అని. 'అభివృద్ధి విషయంలో అన్ని
రాష్ట్రాలు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అనుసరించాలి' అని. ఇంటర్నేషనల్ మీడియా కూడా
అదే చెబుతోంది. దేశంలో బెస్ట్ విజన్ వున్న వ్యక్తి ఎవరంటే ఆంద్రప్రదేశ్ సీ.ఎం. అని
విద్యార్ధులు కూడా చెప్పే పరిస్తితి వుంది.’ ఇలా సాగింది ఆనాటి ఉమ్మడి
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం.
'ఈ నడుమ ఒక ఎకానమిస్టు చెప్పాడు.
ఆంద్ర ప్రదేశ్ లో నాయుడు కోరుకుంటున్న విప్లవం ఊహల్లో ఊహించుకునేది కాదు, చేసి చూపించగలిగేది, అని. ఇప్పుడు దేశానికి
కావాల్సిన సరయిన నాయకుడు చంద్రబాబే అని కూడా ఆ ఎకానమిష్టే చెప్పారన్నారు
చంద్రబాబు.
'మహాత్మా గాంధీ అన్నారు. ఒకరికి
ఆదర్శం బోధించాలి అంటే ఆ ఆదర్శాన్ని మనమూ పాటించాలి అని. అప్పుడే ఒకళ్ళకు చెప్పినా
వాళ్ళు వినే పరిస్తితి వుంటుంది. 'ప్రతిపక్ష నాయకులు
(వై.యస్.ఆర్.) చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే తప్పకుండా
సహకరిస్తామని. వారిని మనః స్పూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళు సభలో
వన్ తర్డ్ వున్నారు. అందుకే అందర్నీ కలుపుకుని ముందుకు పోవాలని అనుకుంటున్నాను.' అన్న అభిలాష వ్యక్తం చేసారు.
ఆనాడు చెప్పిన ఈ మాటను
చంద్రబాబునాయుడు ఈనాడు నిలబెట్టుకోగలుగుతున్నారా అంటే అనుమానమే.
చెప్పకనే చెప్పారుగా 'ఒకరికి ఆదర్శం బోధించాలి అంటే ఆ ఆదర్శాన్ని మనమూ పాటించాలి' అని.
రిప్లయితొలగించండిఈవేళా, రేపా జైలుకెళ్లేది అని అందరూ అనుకుంటున్న వ్యక్తి బోధించే ఆదర్శాలు' విని పాటించమంటే అయ్యే పనేనా !