5, జనవరి 2017, గురువారం

ఇంతకంటే ఏం కావాలి?

ఎప్పటి రేడియో మాస్కో? ఎప్పటి తెలుగు వార్తలు?
పాతికేళ్ళు దాటింది నేను మాస్కో రేడియోలో తెలుగు వార్తలు అయిదేళ్లపాటు చదివి హైదరాబాదుకు తిరిగొచ్చి.
ఇవ్వాళ ఉదయం రాజమండ్రి నుంచి చంద్రశేఖర్ గారనే పరిచయం లేని పెద్దమనిషి ఫోను చేశారు. పత్రికల్లో నేను రాసే వ్యాసాలు చదివి గూగుల్ సెర్చి ద్వారా నా ఆనుపానులు పట్టుకున్నారుట. ఆరోజుల్లో మాస్కో రేడియో తెలుగు వార్తలు క్రమం తప్పకుండా వినే అలవాటు తనకు ఉండేదని, ఒకసారి నా సంతకంతో మాస్కోనుంచి పంపిన చిరుకానుక తన దగ్గర ఇప్పటికీ భద్రంగా ఉందనీ చెప్పారు. శ్రోతలకు అలా కానుకలు పంపే సంప్రదాయం రేడియో మాస్కోలో వుండేది.
మాస్కో రేడియోతోటే ఒదిలిపెట్టలేదు. అంతకుముందు 1971లో బెజవాడ ఆంద్ర జ్యోతిలో పనిచేసేటప్పుడు నేను రాసిన ‘వాక్టూనులు’, ‘బుక్ రివ్యూలు’ గురించి సవిస్తరంగా ప్రస్తావించడం చూసి ఆయన ధారణ శక్తికి ఆశ్చర్యపోవడం నావంతయింది. అల్లాగే హైదరాబాదు ఆలిండియా రేడియోలో నా కార్యక్రమం ‘జీవన స్రవంతి’ గురించి కూడా చంద్రశేఖర్ గారు ప్రస్తావించారు. 1975 లో ఆ కార్యక్రమం నేను మొదలు పెట్టినప్పటి నుంచి జీవనస్రవంతి ప్రసారం చేసే వేళలు ఎలా మారుతూ వచ్చాయో అన్న వివరాలు కూడా ఆయన చెప్పేసరికి నాకేం మాట్లాడాలో తోచలేదు.
చంద్రశేఖర్ గారూ. మీకు నా సెల్యూట్.




కింది ఫోటో : 1975 లో నా 'జీవన స్రవంతి'

7 కామెంట్‌లు:

  1. వారినోసారి దర్శించాలనిపించలేదూ?

    రిప్లయితొలగించండి
  2. అభిమానుల (ఈ కాలపు వెర్రిమొర్రి ఉన్మాదపు సినిమా అభిమానుల గురించి కాదు నేను చెప్పేది) అభిమానాన్ని మీలాగా graceful గా, కృతజ్ఞతాపూర్వకంగా రిసీవ్ చేసుకునేవారు అరుదండి శ్రీనివాసరావు గారూ. పేరున్నవారే అయినా కొంతమందిలో ఆ grace హుందాతనం లోపించినట్లు అనిపిస్తుంది.
    మరో న్యూస్ రీడర్ కందుకూరి సూర్యనారాయణ గారు కూడా రేడియో మాస్కో లో పని చేసారని ఆ రోజుల్లో విన్నట్లు గుర్తు.

    పైన శర్మ గారిచ్చిన ప్రశస్తమైన సలహా మీ వీలును బట్టి ఆచరించతగ్గది.

    రిప్లయితొలగించండి
  3. @శర్మగారికి, ప్రస్తుతం నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల హైదరాబాదు ఒదిలి మా సొంత ఊరుకూడా వెళ్ళే వీలు లేదు. అంచేత వీలు చేసుకుని వస్తానని చెప్పే పరిస్తితి లేదు. క్షమించాలి.

    రిప్లయితొలగించండి
  4. @విన్నకోట నరసింహారావు గారికి, ధన్యవాదాలు. నాకంటే ముందు మాస్కో రేడియోలో శ్రీయుతులు కందుకూరి సూర్య నారాయణ, తిరుమలశెట్టి శ్రీరాములు, అద్దంకి మన్నార్, ఏడిద గోపాల రావు పనిచేశారు. మాస్కో వెళ్ళే అవకాశం వచ్చి కూడా వ్యక్తిగత కారణాల వల్ల శ్రీ డి.వెంకట్రామయ్య వెళ్ళడం మానుకున్నారు. పొతే, సోవియట్ పతనం కారణంగా మాస్కో రేడియో తెలుగువిభాగంలో పనిచేసిన చిట్టచివరి తెలుగు వాడిని నేనే కావడం యాదృచ్చికం.

    రిప్లయితొలగించండి
  5. @విన్నకోట నరసింహారావు: మీకిచ్చిన వివరణలో ఢిల్లీ నుంచి వార్తలు చదివిన దుగ్గిరాల పూర్ణయ్య గారి పేరు మరచిపోయాను. వారు కూడా మాస్కో వెళ్ళే అవకాశాన్ని స్వచ్చందంగా ఒదులుకున్నారు.

    రిప్లయితొలగించండి
  6. వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు. పైన మీరు చెప్పిన పేర్లన్నీ రేడియో మహర్దశ కాలంలో తెలుగువారి ఇళ్ళల్లో household names. పాతరోజులు గుర్తుకొచ్చాయి. Those were the days my friend అనే ఆ నాటి ఓ popular ఇంగ్లీషు పాట లోలాగా.

    రిప్లయితొలగించండి
  7. మనగురించి మరొకరు ఎంత ఇష్టం లేకపోతే అన్ని విషయాలు గుర్తు పెట్టుకుంటారు? మరొకరు తమ సమయం మనకోసం వెచ్చించారంటే.... అదెంత గొప్ప విషయం.మనల్ని అభిమానించే వారి దగ్గర మనం సుఖంగా ఉంటాం, మనం అభిమానించే వారి దగ్గర కంటే, ఇవన్నీ మీకు తెలియనివి కావు,చాదస్తం.
    మీ పరిస్థితులేంటో తెలియక అన్నా! ఇందులో మన్నింపు సమస్య లేదు. అదృష్టవంతులు :)

    రిప్లయితొలగించండి