10, డిసెంబర్ 2016, శనివారం

రాజకీయ వారసత్వాలు

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 11-12-2016, SUNDAY)
మనిషి ఎలా బతికాడన్న విషయం అతడి చావు తెలుపుతుంది అంటారు. ఆ రకంగా జయలలిత గొప్పగా జీవించి నట్టే లెక్క. మహరాణిలాబతికింది. మహారాజ్ఞిలా దాటిపోయింది. చెన్నై నగరంలో ఒక పక్క జన సంద్రం, మరోపక్క జలసంద్రం నడుమ  మెరీనా సైకత తీరంలో సమస్త అధికార లాంఛనాలతో జరిగిన  అంత్యక్రియల్లో భాగంగా  జయలలితకు  రాజకీయ బిక్ష పెట్టిన  ఎం.జీ. రామచంద్రన్  సమాధి సరసనే నిర్మించిన  మరో సమాధిలో గంధపు చెక్కలతో చేసిన  శవ పేటికలో శాశ్వితనిద్రకు ఉపక్రమించింది. తమిళనాట  రాజకీయాలపై  ఒక ప్రగాఢమైన ముద్ర వేసిన జయలలిత శకం ఆ విధంగా  ముగిసింది. ఒక ప్రాంతీయ పార్టీ నాయకురాలికి ఆ స్థాయిలో తుది వీడ్కోలు లభించడం నిజంగా ఒక అరుదయిన రికార్డు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై దేశ వ్యాప్తంగా మీడియాలో నిరంతరాయంగా సాగుతూ వస్తున్న చర్చోపచర్చలకు జయలలిత మరణం తాత్కాలికంగా అయినా తెర దించడం గమనిస్తే, ఆవిడ మృతి యావత్  జాతిజనులను  ఎంతగా దిగ్భ్రాంతికి గురిచేసింది అర్ధం అవుతుంది.  
అంతుపట్టని ఆకస్మిక అనారోగ్యానికి గురై ముఖ్యమంత్రి జయలలిత చెన్నై లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి నెలల తరబడి  మృత్యువుతో ఆఖరి పోరాటం చేస్తున్నప్పుడే, ఆవిడ తరువాత అన్నా  డీఎంకే నాయకత్వం ఎవరు స్వీకరించాలనే అంశంపై అనంతంగా  చర్చలు సాగాయి. గతంలో రెండు పర్యాయాలు తాత్కాలికంగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి, జయలలితకు  అత్యంత విధేయుడు అనే ముద్ర వేయించుకున్న పన్నీర్ సెల్వం, ఆవిడ చనిపోయిన రోజు అర్ధరాత్రి రాజభవన్ లో మూడోసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడంతో జయలలిత వారసత్వం గురించిన చర్చకు కూడా తాత్కాలికంగా తెరపడింది.
ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుపడిన భారత దేశంలో రాజకీయ వారసుల గురించి మాట్లాడుకోవడం ఒక విచిత్రం. అధికార వ్యవస్థలో కీలకమైన  ప్రధానమంత్రి పదవికి  కానీ, ముఖ్యమంత్రి పదవికి కానీ ఎన్నిక ద్వారా కాకుండా వారసత్వ ప్రాతిపదికపై ఎంపిక జరగడం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సాంప్రదాయంగా పరిణమిస్తూ రావడం  ప్రజాస్వామ్యప్రియులను కలత పెడుతోందనడం నిర్వివాదాంశం. తమిళనాడు రాజకీయాలను కంటి చూపుతో శాసించిన అన్నా డీఎంకే నాయకురాలు జయలలిత, తన వారసుడు ఎవరన్నది నిర్దారించకుండానే ఈ లోకం నుంచి నిష్క్రమించడం వారికి ఊరట కలిగిస్తోంది కూడా.  
వివాదాస్పదమైన రాజకీయ వారసత్వాలకు ప్రజామోదం లభిస్తూ వుండడం వల్ల ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయ స్తితిలో ప్రజాస్వామ్య వ్యవస్థ చిక్కుకు పోయింది. జాతీయస్థాయిలో ఇదే పరిస్తితి. అనేక రాష్ట్రాల్లో కూడా ఇదే దుస్తితి.     
ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంగతి తీసుకుందాం. ఆయన కూడా వారసుడి హోదాలోనే అధికార పీఠం అధిరోహించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా ఎంపిక కావడం తప్పనిసరి కనుక ఆ శంఖుతీర్ధం తంతు పూర్తిచేసుకునే ముఖ్యమంత్రి అయ్యారు.   నవీన్  తండ్రి బిజూ పట్నాయక్ గతంలో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పేరు మీద పుట్టిన  బిజూ జనత దళ్ పార్టీ  తరపున ఆయన ఒరిస్సా పాలనాపగ్గాలు చేపట్టారు.  వరసగా మూడు ఎనికల్లో తన పార్టీని విజయపధంలో నడిపించి పార్టీలో, ప్రభుత్వంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న నవీన్ పట్నాయక్, తరచూ అనారోగ్యానికి గురవుతున్నారనే వదంతుల నేపధ్యంలో ఆయనకు  రాజకీయ వారసుడెవరనే చర్చకు రెండేళ్ళక్రితమే తెర లేచింది. ఈ సందర్భంలోనే నవీన్ పట్నాయక్ మేనల్లుడు అరుణ్ పట్నాయక్ పేరు బయటకు వచ్చింది కానీ, రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని అరుణ్ స్వయంగా ప్రకటించడంతో ఆ చర్చకు నిరుడే  తాళం పడింది.
ఇక పశ్చిమ బెంగాల్ ఆడపులి మమత బెనర్జీ. ఇంటా బయటా ఎదురులేని ఈ వీరవనితకు సయితం  నిజజీవితంలోనూ, రాజకీయ జీవితంలోను వారసులంటూ ఎవరూ లేరు. తన వారసుడు పలానా అని దీదీ కూడా ఎప్పుడూ బయటపెట్టలేదు. అయితే అయిదేళ్ళ క్రితం తన మేనల్లుడు, ఇరవై నాలుగేళ్ల యువకుడు అభిషేక్ బెనర్జీకి  తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షపదవి కట్టబెట్టడంతో ఆ రాష్ట్రంలో  కూడా తృణమూల్ అధినేత్రి  మమత వారసుడి గురించిన చర్చలు మొదలయ్యాయి. రెండువేల పద్నాలుగులో అతగాడికి తృణమూల్ పార్టీ టిక్కెట్టు ఇచ్చి, గెలిపించి  అతి చిన్న వయసులోనే  పార్లమెంటుకి పంపడంతో  ఈ వదంతులకు మరింత బలం సమకూరినట్టయింది. కాకపొతే, రాజకీయ అరంగేట్రం చేసి అయిదేళ్ళు అవుతున్నా అభిషేక్ బెనర్జీ మాత్రం తనేమిటో, తన బలమేమిటో నిరూపించుకున్న సందర్భం లేకపోవడంతో ఆయన గురించి వెలువడిన వారసత్వపు వార్తలకు పురిటిలోనే గండి పడింది.  
ఉత్తరప్రదేశ్  లో బహుజన సమాజ్ పార్టీ అధినాయకురాలు మాయావతి విషయం కూడా ఇదేమాదిరి. ఆవిడకీ వారసులు ఎవరూలేరు. బహుజన సమాజ్  పార్టీ అంటే మాయావతి, మాయావతి అంటే బహుజన్ సమాజ్ పార్టీ అనే  తరహా రాజకీయమే నడుస్తూ వుండడంతో వారసత్వం అంశం అంతగా చర్చకు రావడం లేదు. ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ప్రజాస్వామిక స్పృహ ఆ పార్టీ  నాయకురాలికి  వున్నట్టు లేదని చెవులు కొరుక్కుంటున్నా ఆవిడ ఏమాత్రం చెవిన పెట్టే పరిస్తితి లేదు.  కాకపొతే, తన రాజకీయ వారసుడిని తాను  ఎన్నడో నిర్ణయించానని ఎనిమిదేళ్ళ క్రితం ఒకసారి ప్రకటించిన మాయావతి, ఆ వారసుడి  పేరు మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు. గతంలో మాయావతిపై హత్యాప్రయత్నానికి కుట్ర జరిగినట్టు వార్తలు వెలువడిన నేపధ్యంలో ఏర్పాటయిన ర్యాలీలో ప్రసంగిస్తూ, బీఎస్పీ అధినేత్రి స్వయంగా   ఈ విషయం బయట పెట్టారు. కానీ ఏళ్ళు గడుస్తున్నా తాను ఎంపిక చేసుకున్న వారసుడు ఎవరు అనే దానిపై మళ్ళీ  పెదవి విప్పలేదు.
తమిళనాడులో జయలలిత, ఉత్తర ప్రదేశ్ లో మాయావతి, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఈ మువ్వురుదీ ఒకే పడవలో ప్రయాణం. వారికి నిజ జీవితంలో వారసులు లేరు. పార్టీలో వారికి ఎదురు లేదు. చుట్టూ జేజేలు కొట్టే భజన బృందాలు ఎన్ని వున్నా ఎవర్నీ నమ్మలేని తత్వం వీరిది.  దిగువ శ్రేణి నాయకులను  తప్ప ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించడం వీరికి అలవాటులేని పని. అంచేతే భవిష్యత్తులో వీరికి వారసులు ఎవరూ  అంటే ఎవ్వరూ చెప్పలేని పరిస్తితి.    


అదే ఉత్తరప్రదేశ్ లో మాయావతికి ప్రధాన ప్రత్యర్ధి అయిన సమాజ్ వాదీ పార్టీ నాయకుడు మూలాయం సింగ్ యాదవ్ తన రాజకీయ వారసుడి విషయంలో లేనిపోని గుంజాటన పడలేదు. మీనమేషాలు లెక్కపెట్టలేదు. ఎవరు ఏమనుకున్నా లెక్కపెట్టకుండా  ఏకంగా తన కుమారుడు అఖిలేష్ యాదవ్ ని ముఖ్యమంత్రి గద్దె మీదనే కూర్చోబెట్టి అధికారపగ్గాలు అప్పచెప్పారు. కుమారుడికి  ముఖ్యమంత్రి పదవిని  అయితే కట్టబెట్టగలిగారు కానీ, తిరుగులేని  అధికారానికి వుండే  సహజస్వభావాన్ని గుర్తించలేకపోయారు. అది వంటబడితే  తండ్రీ కొడుకూ అనే వ్యత్యాసం  వుండదు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్  అధికారంలో వున్న సమాజ్ వాదీ పార్టీలో బయట పడుతున్న లుకలుకలే ఇందుకు సాక్ష్యం.       
పొతే,  జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఈ వంశపారంపర్య విధానం  దశాబ్దాలుగా సాగుతూనే వస్తోంది. ఆ రాష్ట్రపు తొలి ప్రధానమంత్రి (స్వతంత్రం వచ్చిన కొత్తల్లో, భారత ప్రధాన మంత్రితో పాటు జమ్మూ కాశ్మీర్ కు కూడా  ప్రధానమంత్రి వుండేవారు, తదనంతర కాలంలో దాన్ని కూడా దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు ముఖ్యమంత్రి హోదాకు అనుగుణంగా  మార్చారు) షేక్ అబ్దుల్లా.  తరువాత ఆయన  కుమారుడు ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యారు. ఫరూక్ తనయుడు ఒమర్ అబ్దుల్లా కూడా వారసత్వాన్ని అందిపుచ్చుకుని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కాగలిగారు. అలాగే ఆ రాష్ట్రంలోనే  ముఖ్యమంత్రి  ముఫ్తీ  మహమ్మద్ సయీద్ కుమార్తె మెహబూబా ముఫ్తీని తన రాజకీయ వారసురాలిగా ప్రకటించారు. ఆయన మరణానతరం మెహబూబా  ముఖ్యమంత్రి పీఠం ఎక్కగలిగారు.
వారసత్వ రాజకీయాలకు బీహారు కూడా పుట్టిల్లు. రాష్ట్రీయ జనత దళ్ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కోర్టు తీర్పుల దరిమిలా పదవి కోల్పోయినప్పుడు ఎలాంటి భేషజాలకు పోకుండా తన భార్య  శ్రీమతి రబ్రీ దేవినే  ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి తను వెనుక వుండి పాలన సాగించారు. నితీష్ కుమార్ ప్రస్తుత మంత్రి వర్గంలో కూడా లాలూ కుమారులు ఇద్దరు మంత్రులుగా వున్నారు. ఒక కుమారుడు తేజస్వి యాదవ్  ఉప ముఖ్యమంత్రి కాగా మరో  కుమారుడు  తేజ్ ప్రతాప్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖామంత్రి.
మహారాష్ట్రలో కూడా వారసులకే అధికార పదవులు దక్కడం చూస్తున్నాము. థాకరేలు ఇందుకు  చక్కని ఉదాహరణ. మరాఠా నాయకుడు శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియ పవార్ ఈ విధమైన ఫామిలీ  పవర్ పాలిటిక్స్ కి ప్రసిద్ధి. కర్ణాటకలో జనతాదళ్ (ఎస్) రాజకీయాలు యావత్తు మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, ఆయన కుటుంబం చుట్టూ పరిభ్రమిస్తూ వుంటాయి.
పంజాబులో శిరోమణి అకాలీ దళ్ నేత ప్రకాష్  బాదల్ ముఖ్యమంత్రి. ఆయన కుమారుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఉప ముఖ్యమంత్రి.
రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ సంస్కృతికి దూరంగా లేవనే చెప్పాలి.
ఇక స్వతంత్ర భారతంలో వారసత్వ రాజకీయాలకు ఆద్యులు ఎవరయ్యా అంటే మొదట చెప్పుకోవాల్సింది గాంధీ, నెహ్రూ కుటుంబీకులు గురించి.  పేరులో గాంధీ అని వున్నప్పటికీ జాతి పిత, స్వతంత్ర ప్రదాత మహాత్మా గాంధీకి ఏమాత్రం సంబంధంలేని నెహ్రూ కుటుంబం వారే దేశాన్ని ఎక్కువకాలం పరిపాలించారు.  ప్రముఖ ప్రవచన కారుడు చాగంటి వారు పురాణాల్లోని వంశ వృక్షాలను ఆశువుగా నుడివినట్టు చెప్పాలంటే,  జవహర్ లాల్  నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ, ఆయన కుమారుడు.....’ ఇలా సాగిపోతుంది ఆ వారసుల జాబితా.
విచిత్రం ఏమిటంటే గాంధీ, నెహ్రూ కుటుంబీకుల  వారసత్వ రాజకీయాలను చీల్చి చెండాడిన ప్రత్యర్ధులు సయితం అధికారం చేతికి అందగానే నిస్సిగ్గుగా  అదే బాటలో ప్రయాణించడం. అందువల్లే, రాజకీయాల్లో విమర్శలకు విలువ లేకుండా పోతోంది.    
చివరిగా ఒక మాట.
ప్రజాస్వామ్య పదకోశంలో చోటులేని పదం ఏదైనా వుంటే అది రాజకీయ వారసత్వం.
వర్తమాన  రాజకీయాల్లో దానిదే అగ్రస్థానం కావడం దేశానికి పట్టిన దురదృష్టం.  (10-12-2016)
రచయితఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్:  98491 30595


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి