మొండివాడు రాజుకన్నా బలవంతుడంటారు. రాజే మొండివాడయితే ఇక చెప్పేది ఏముంటుంది?
మోడీకి మొండివాడనే పేరుంది. నిజానికి ఆ
మొండితనమే ఆయన్ని ఇంతవాడ్ని చేసిందంటారు. ఆ మొండి తనమే ఆయనకి ఇంతమంది అభిమానుల్ని
సంపాదించి పెట్టింది. అయితే మొండితనం ఎల్లవేళలా అక్కరకు రాదు.
నిజానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం
చాలా సాహసోపేతమైనది. నవంబరు ఎనిమిదో తేదీన ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు
మోడీ అభిమానులేకాదు అత్యధికులయిన దేశ ప్రజలు మోడీ చొరవను మనసారా స్వాగతించారు.
మోడీ ఒక్కడే మొనగాడని, ఆయన మాత్రమే ఇటువంటి సాహసం చేయగలడని వేనోళ్ళ పొగిడారు. ఈ
పొగడ్తలు ఒక దశలో మోతాదు మించి ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరాగాంధీని ఆకాశానికి
ఎత్తిన రోజుల్ని గుర్తుకు తెచ్చాయి. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టయిన అభిప్రాయ
వ్యక్తీకరణ స్వేచ్చను హరించడం వల్ల ఆ రోజుల్లో ప్రజలు యెంత ఉడ్డుగుడుచుకున్నదీ
తొంభయ్యవ దశకం తరువాత జన్మించిన నేటి తరం మోడీ అభిమానులకి తెలిసే అవకాశం
లేకపోవచ్చు.
ఎమర్జెన్సీ ప్రకటించిన తొలిరోజుల్లో
ప్రత్యర్ధ రాజకీయ నాయకులను మినహాయిస్తే సామాన్య ప్రజలు చాలా ఊరట పొందారు. రైళ్ళు
ఠ౦చనుగా వేళప్రకారం నడిచాయి. రోజులతరబడి ఆఫీసుల మొహం చూడని ప్రభుత్వ సిబ్బంది ఖచ్చితంగా వేళకు కార్యాలయాల్లో
కనబడేవారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా
లంచాలు అడగడానికి, తీసుకోవడానికి
భయపడ్డారు. బెజవాడ వంటి పట్టణాల్లో ప్రజలు బహిరంగ మూత్ర విసర్జనకు స్వస్తి
చెప్పారంటే తొలినాళ్లలో ఎమర్జెన్సీ అనేది ప్రజల్ని ఎంతగా ప్రభావితం చేసిందో అర్ధం
చేసుకోవచ్చు.
అయితే ఈ బుడగ పగలడానికి ఎన్నో రోజులు
పట్టలేదు. ఆ తరువాత ఎమర్జెన్సీ ముసుగులో జరిగిన అనేక అత్యాచారాలు బయట పడ్డాయి.
జాతి చెల్లించుకున్న మూల్యం ఏమిటన్నది తదనంతర కాలంలో వెలుగులోకి వచ్చింది. జనం
కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. ఆ తరువాత జరిగింది చరిత్ర. ప్రజాగ్రహానికి గురయిన ఇందిర
ప్రభుత్వం గద్దె దిగాల్సివచ్చింది.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో అద్భుతాలు
జరిగిపోగలవని ఎవ్వరూ అనుకోలేదు. కాకపొతే సాహసోపేత నిర్ణయం అని చాలామంది భావించారు.
వారిలో నేను కూడా ఒకడ్ని.
అయితే రోజులు గడుస్తున్న కొద్దీ
సామాన్య జనం ఆలోచనల్లో మార్పు రావడం మొదలయింది. అనుకున్నది ఒకటయితే, జరుగుతున్నది
మరొకటన్న అభిప్రాయం బలపడసాగింది. పెద్ద నోట్లు కూడబెట్టి, పెద్ద పెద్ద మేడలు
కట్టిన బడా బాబులు ఎవ్వరూ ప్రభుత్వ నిర్ణయంతో కలవరపడకపోవడం వారిని ఆశ్చర్య
పరిచింది. ఏమీ జరగనట్టు నల్ల కుబేరులు
కాలుమీద కాలువేసుకుని నిబ్బరంగా వుంటుంటే, తాము మాత్రం రాత్రీ పగలూ తేడాలేకుండా
బ్యాంకుల ముందూ, ఏటీఎంల పడిగాపులు పడడం ఏమిటన్న సందేహం పొటమరించింది. తమ డబ్బు
తాము తీసుకోవడానికి ఇంతగా హైరానా పడాలా అనే ప్రశ్నలు వారిని వేధించడం మొదలు
పెట్టాయి. మూడు వారాలు గడిచిపోతున్నా
కష్టాలు, కడగండ్లు పెరుగుతూ పోవడం తప్ప ఉపశమనం కనుచూపు మేరలో కనబడక పోవడంతో
వారిలో సహనం తగ్గిపోవడం ఆరంభమైంది. ‘కాస్త
ఓపిక పట్టండి, మంచి రోజులు ముందున్నా’యని ప్రభుత్వం ఇస్తున్న భరోసా సామాన్యులను
సంతృప్తి పరచడం లేదు. నిజానికి ప్రజలకు వున్న ఓరిమి చాలా గొప్పది. సర్దుకుపోయే
తత్వం ఇంకా గొప్పది. అంచేతే యాభయ్ రోజులు ఎదురు చూడడానికే సిద్ధపడ్డారు. ఆ తరువాత
కూడా ఓపికపడతారు. ఎందుకంటే జనాలు ఆశాజీవులు. బతుకులు బాగుపడకపోతాయా అనే ఆశతోనే
బతుకు బండి లాగడానికి అలవాటు పడ్డారు. అది
రాజకీయులకు కూడా తెలుసు. అంచేతే ఆశకంటి కురుపు భయం లేకుండా ప్రజలకు ఆశలు
కల్పిస్తూనే వుంటారు. వాళ్ళు కావాలని
మరచిపోయే వాస్తవం ఒకటుంది. ఓపికకు కూడా హద్దు ఉంటుందని, ఆ హద్దు మీరితే ఆ జనమే ఓటుతో బుద్ది చెబుతారని. గతం చెబుతున్న నిలువెత్తు
నిజం ఇది.
నిజంగా దేశంలో నల్లధనం లేకుండా చేస్తే మొత్తం
జాతి మోడీకి రుణపడి వుంటుంది. ఈ విషయం నిశ్చయంగా చెప్పవచ్చు. ఒకవేళ వైఫల్యం
చెందితే. ఆ పరిణామాలను ఊహల్లో భరించడం కూడా కష్టం. ఎమర్జెన్సీ గాయాలు మానడానికి
ఎన్నేళ్ళు పట్టిందో తెలిసిన వారికి ఈ భయం మరింత ఎక్కువగా వుంటుంది. అప్పట్లో ఎట్లాగో
అట్లా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించుకోగలిగారు కనుక సరిపోయింది.
ఈనాటి సమస్య ఆర్ధిక వ్యవస్థకు సంబంధించినది. అత్యంత వేగంగా
ఎదుగుతున్న దశలో ఎటువంటి అవాంతరం ఎదురయినా అభివృద్ధి కుంటుపడడమే కాదు,
స్తంభించిపోయే ప్రమాదం కూడా వుంటుంది. ఆర్ధిక నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఇవే. మంచి
కోసం చేసే సాహసోపేత నిర్ణయాలు ఊహాతీత
పరిణామాలకు దారి తీయకూడదు. ఆచితూచి చేయాల్సిన పనులను హడావిడిగా చేయడం వల్ల ఒక్కోసారి
అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. అదే ఇప్పుడు జరుగుతోంది.
పెద్ద నోట్ల రద్దు దరిమిలా ఇబ్బందులు
ఎలా వున్నా జాతి మాత్రం పొదుపు మంత్రం పఠిస్తోంది. విచ్చలవిడిగా చేసే ఖర్చుకు
కళ్ళెం పడింది. అనవసర కొనుగోళ్ళు నిలచిపోయాయి. అవసరం అయితేనే జేబులోంచి డబ్బు
బయటకు తీసే పాత రోజులు వచ్చేశాయి. నిర్బంధ వ్యయ నియంత్రణ అమలవుతోంది.
అదే సమయంలో వచ్చిన జీతాల రోజు, ఫస్టు
తారీఖు, వేతన జీవులకు చుక్కలు చూపించింది. తమ కష్టార్జితంలో కొంత తీసుకోవడానికి
క్యూల్లో గంటలు గంటలు నిలబడాల్సి రావడం నిజంగా ఎన్నడూ ఎరుగని అనుభవమే. జీతం కోసం పొద్దున్న
నుంచి సాయంత్రం దాకా నిలువుకాళ్ళ జీతం, ఏవిటో చిత్రం. నెలసరి జీతాల వాళ్ళ
పరిస్తితే ఇలా వుంటే దినసరి ఆదాయాలవారి సంగతి చెప్పనక్కర లేదు. చేతిలో పైసలు ఆడక చిరు
వ్యాపారాల వాళ్ళు దిగాలు పడుతుంటే మరోపక్క భారీ ఎత్తున కొత్త కరెన్సీ నోట్లు బయట
పడుతున్న సంఘటనలు, పెద్ద ఎత్తున జరుగుతున్నకరెన్సీ నోట్ల అక్రమ మార్పిళ్ళూ ప్రజలను
విభ్రమానికి గురిచేస్తున్నాయి. ప్రయోగ విజయం పట్ల సందేహాలను పెంచుతున్నాయి.
నగదు రహిత భారతం ఆవిష్కరణ గురించి
నేతాశ్రీలు చేస్తున్న ప్రసంగాలు సామాన్యులను నివ్వెర పరుస్తున్నాయి. పోస్ట్ కార్డు మొహమే
చూసి ఎరుగని వాళ్లకు ఏటీఏం కార్డు ప్రయోజనాలు గురించి చెప్పడం వింతల్లోవింత.
అన్నప్రాసన నాడే ఆవకాయ కారం తినిపించినట్టుగా వుందని హేళన స్వరాలు
వినిపిస్తున్నాయి. ఈ ఉచిత ఉద్బోధలు చేస్తున్న నాయకమణ్యులు ఒక్కసారంటే
ఒక్కసారి ఆన్ లైన్లో ఒక్క రూపాయి
ట్రాన్సాక్షన్ చేసి చూపించగలరా అనే మౌన ప్రశ్నకు జవాబు ఏదీ?
ఇప్పుడు పులిమీద పుట్రలా బంగారం మీద
అంక్షలు. మనిషికి ఇంత బంగారమే ఉండాలనే నిబంధనలు మళ్ళీ ఏ ప్రకంపనలు సృష్టిస్తాయో
తెలియదు. వెనుకటి రోజుల్లో భూసంస్కరణల వల్ల ఒనగూడిన ప్రయోజనాలు ఏ పాటివో తెలిసిన
వారికి జరగబోయేది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా ఇది సెంటిమెంటుతో,
ప్రత్యేకించి మహిళలతో ముడిపడిన వ్యవహారం. ఏ వైపు తిరుగుతుందో, యెంత దూరం సాగుతుందో
చెప్పడం కష్టం.
ఇవన్నీ చూస్తున్నప్పుడు గురి పెట్టిన
బాణం సరయిన దిశలోనే వెడుతోందా, మధ్యలో
దారితప్పుతోందా అనే కొత్త ప్రశ్న తలెత్తుతోంది. నేషన్ వాంట్స్ టునో. జాతి తెలుసుకోవాలని
అనుకుంటోంది.
అందుకే చెప్పేది.
నల్లధనంపై మొదలు పెట్టిన పోరాటంలో
నరేంద్ర మోడీ గెలవాలి. గెలిచి తీరాలి. ఇది మోడీ అభిమానులు కోరుకుంటున్నదే కాదు
ఆయన్ని నరనరాన ద్వేషించే వాళ్ళు సైతం
ఇదే కోరుకుంటున్నారు. ఎందుకంటే మోడీ ఈ
ప్రయత్నంలో విఫలం అయితే ఆ ప్రభావం ఆయనకూ,
ఆయన పార్టీకి మాత్రమే కాదు యావత్ దేశానికీ చుట్టుకుంటుంది. ప్రపంచ దేశాల్లో
ఈనాడు ఎన్నదగిన ఆర్ధిక శక్తిగా ఎదుగుతూ వస్తున్న భారత దేశం కొన్ని దశాబ్దాలు
వెనక్కు పోతుంది. మళ్ళీ కోలుకోవాలన్నా, కనీసం ఈనాడు వున్న స్తితికి చేరుకోవాలన్నా ఏండ్లూపూ౦డ్లూ
పట్టే ప్రమాదం వుంది. కారణం మోడీ స్వారీ చేస్తున్నది భయంకరమైన, జాతిని పీల్చి
పిప్పి చేస్తున్న నల్లధనం అనే రక్కసి పులి మీద. మోడీ జయిస్తే పరవాలేదు. కానీ
పులిదే పై చేయి అయితే, ‘పరవాలేదు’ అని చెప్పుకోవడానికి కూడా ఏమీ మిగలదు.
పొంచివున్న పెద్ద ముప్పు ఇదే. నోబుల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ కానీ, విధి వశాత్తు రాజకీయాల్లోకి వచ్చిన సుప్రసిద్ధ
ఆర్ధిక వేత్త మన్మోహన్ సింగ్ అయినా, రాజకీయాలకు అతీతంగా ఆలోచించేవాళ్ళయినా చేసే హెచ్చరికలు
ఇవే!
గుడ్డిగా కళ్ళు మూసుకుని ముందుకు
సాగితే కాలు రహదారిలోకి సాగొచ్చు, ముళ్ళ దారిలోకి దారి తీయొచ్చు. రెంటికీ అవకాశం
వుంది కాబట్టే జాగ్రత్తల అవసరం ఎక్కువ వుంది. ఇది మోడీకీ, ఆయనను గుడ్డిగా
అభిమానించేవారికీ, మోడీ వ్యతిరేకులకూ, వారిని కళ్ళు మూసుకుని సమర్ధించేవారికి
మాత్రమే సంబంధించిన సమస్య అనుకోవడం మంచిది కాదు. నూట పాతిక కోట్లమంది భారతీయుల భవిత దీనితో
ముడిపడి వుంది.
అభిమాన దురభిమానాలు పక్కనబెట్టి,
రాజకీయాలకు అతీతంగా మోడీ విజయం సాధించాలని
మనసారా కోరుకుందాం. మనకోసం కాదు, మోడీ కోసం కాదు, మన దేశ భవిష్యత్తు కోసం.
భవిష్యత్ తరాల భద్రతకోసం. (03-12-2016)
This article was published in SURYA telugu daily, dated 4th DEc.16, SUNDAY.
This article was published in SURYA telugu daily, dated 4th DEc.16, SUNDAY.
Well said and written thoughtfully. I hope people would realize about the things mentioned inside the article and be more cautious during next election
రిప్లయితొలగించండి"ఆ తరువాత ఎమర్జెన్సీ ముసుగులో జరిగిన అనేక అత్యాచారాలు బయట పడ్డాయి. జాతి చెల్లించుకున్న మూల్యం ఏమిటన్నది తదనంతర కాలంలో వెలుగులోకి వచ్చింది. జనం కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. ఆ తరువాత జరిగింది చరిత్ర"
రిప్లయితొలగించండిదయచేసి అవన్నీ వివరంగా తెలుపగలరు. ఇప్పటివారము తెలుసుకుంటాము.
For everything we should use digital payment. This is the chance to go cashless.
రిప్లయితొలగించండి