ఒకడు తుమ్మితే పక్కన వున్నవాడికి కూడా తుమ్ము వస్తుంది అంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా, విన్నా, చదివినా ‘అప్పు’ మాటే కాబట్టి నా పాత అప్పుకధ ఒకటి పాత బాకీలా గుర్తుకొస్తోంది.
అసందర్భంగా అనిపించినా ఆ సందర్భం ప్రస్తావించదలిచాను. 1970 ప్రాంతంలో నేను విజయవాడలో ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో పని చేసే రోజుల్లో జర్నలిష్టుగా సంఘంలో నా జీవితం ఒక మెట్టు పైన వుండేది. జీతభత్యాల రీత్యా చూసుకున్నప్పుడు దారిద్య్ర రేఖకు దిగువన వుండేది. జీతానికీ, జీవితానికీ పొంతనలేని ఆ రోజుల్లో ఒకరోజు, ఒక్క రూపాయంటే ఒక్క రూపాయి జరూరుగా కావాల్సి వచ్చింది. ఇల్లంతా గాలించినా పాతిక పైసలు కూడా లేవు. పిల్లవాడికి పోతపాలు. పాలసీసా పగిలిపోయింది. నేనూ మా ఆవిడా దిగులు మొహాలు వేసుకుని కూర్చుని వుంటే రామారావు అని కొత్తగా పరిచయం అయిన వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. అతడాసమయంలో అలా రావడం మా ఇద్దరికీ బాగనిపించలేదు. పరిస్తితి గమనించాడేమో వచ్చిన వాడు వచ్చినట్టే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన వాడు ఇట్టే తిరిగి వచ్చాడు. అతడి చేతిలో పాలసీసా. మా ప్రాణాలు లేచి వచ్చాయి. కొద్దిరోజులుగా నానుంచి ఓ సాయం కోరుతూ అతడు నా వెంట తిరుగుతున్నాడు. అతనో పెయింటర్. సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలనే తపన. బ్యాంకులో పూచీకత్తు ఇచ్చేవాళ్ళు కావాలంటున్నారు. అతడు చేసిన సాయానికి ప్రతిగా బ్యాంకుకు వెళ్లి హామీ సంతకం చేసి పదివేలు అప్పు ఇప్పించాను. వెంటనే, హైదరాబాదు ఆకాశవాణిలో ఉద్యోగం రావడం, ఆ తరువాత మాస్కో రేడియోలో పనిచేయడానికి మాస్కో వెళ్ళడం ఈ హడావిడిలో నేను బెజవాడ బ్యాంకు అప్పు సంగతి మరచిపోయాను. ఈలోగా అప్పుతీసుకున్న వ్యక్తి వ్యాపారం సరిగ్గా నడవక రోడ్డున పడడం, బ్యాంకు వాళ్ళు హామీదారునయిన నా చిరునామా పట్టుకుని మాస్కోలోని ఇండియన్ ఎంబసీ ద్వారా లక్ష రూపాయలకు కోర్టు ఇచ్చిన డిక్రీ చేతిలో పెట్టడం సినిమాలోలా జరిగిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగిని కదా, అప్పు వసూలుకు నేను వారికి కనిపించి వుండడంలో ఆశ్చర్యం లేదు. ఆశ్చర్యం అల్లా ఇప్పుడు అలా జరగడం లేదేమిటని!
ప్రభుత్వోద్యోగి కదా, తప్పించుకోవడం కష్టం - ఆదాయపుపన్ను లాగానే 😀😀. ప్రభుత్వోద్యోగులు కాని వారు కొంత కాలమయినా తప్పించుకు తిరగడం కాస్త సులువని ఎప్పటి నుండో చూస్తునే ఉన్నాంగా - ఉదాహరణకి అలనాటి ధర్మతేజ ఉదంతం గుర్తున్నది కదా.
రిప్లయితొలగించండి