బాధలు, ఇబ్బందులు రెలెటివ్ అని
తీర్మానించాడు ఒకాయన.
నేను 1975 లో రేడియోలో చేరడానికి హైదరాబాదు వచ్చినప్పుడు చిక్కడపల్లిలో అద్దెకు
ఉండేవాడిని. చేసే ఉద్యోగం రేడియోలో అయినా రిపోర్టర్ గా నేను వెళ్ళాల్సింది మాత్రం
సచివాలయానికో మరో చోటికో. అసలానౌకరీయే తిరుగుళ్ళ
ఉద్యోగం. సిటీ బస్సుల్లో తిరగడానికి సర్కారువారిచ్చిన ఉచిత పాసు వుండేది. ఆ
రోజుల్లో నాకు బస్సు ప్రయాణీకుల తిప్పలు తప్ప వేరేవి పట్టేవి కావు. తరువాత మూడో పే
కమీషన్ ధర్మమా అని జీతం పెరిగి నా
ప్రయాణాలు సిటీ బస్సుల నుంచి ఆటోల స్థాయికి మారాయి. ఇక అప్పటినుంచి ఆటోల వల్ల,
ఆటోవాలాల వల్ల ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులే నా కంటికి భూతద్దంలో మాదిరిగా
పెద్దగా కనబడడం మొదలయింది. ఓ పుష్కరం తరువాత స్కూటరు కొనడం ఝామ్మని తిరగడం
మొదలయింది కానీ, జీవితంలో ఇబ్బందులను స్కూటరు వాలా కోణం నుంచే గమనించడం కూడా
మొదలయింది. ఇలా బోలెడు జీవితం సినిమా రీలులా తిరిగి, కారూ, డ్రైవరు వైభోగం పిల్లల
ద్వారా సంక్రమించిన తరువాత ఇబ్బందుల రంగూ, రుచీ, వాసనా మరో రూపం సంతరించుకున్నాయి.
సిటీ బస్సు, ఆటో, స్కూటరు రోజుల ఇబ్బందులు మూగమనసులు సినిమాలోలా లీలగా
గుర్తున్నాయి.
ఏతావాతా చెప్పేది ఏమిటంటే ఇబ్బందులు,
కష్టాలు రెలెటివ్. మేం అనుకునే ఇబ్బందులు
వేరు, మా పనివాళ్ళ ఇబ్బందులు వేరు. మనం ఏ ఇబ్బందీ లేకుండా వుంటున్నామంటే అందరూ అలా
వుంటున్నారని కాదు. ఎవరి ఇబ్బందులు వారివి. మనకు చిన్నవే కావచ్చు వారికి పెద్దవి
కావచ్చు. అలాటివారిని చిన్నబుచ్చడం పెద్దరికం అనిపించుకోదు.
తినడానికి రొట్టె లేక ఆకలితో ఓ అమ్మాయి ఏడుస్తుంటే ‘
రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చుకదా!’ అనే రాజకుమారి జోకులు పుట్టింది ఇందుకే!
‘రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చుకదా!’ అనే రాజకుమారి "జోకు" అలనాటి (ఫ్రెంచ్ రివల్యూషన్ కాలం) ఫ్రాన్సు దేశపు రాణి Marie Antoinette అన్న మాటలంటారు.
రిప్లయితొలగించండి