21, ఆగస్టు 2016, ఆదివారం

మంత్రిని కుమ్మిన గేదె కధ

ఆదివారం ఆటవిడుపు:

సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రిని పల్లెటూరి గేదె ఒకటి కొమ్ములతో కుమ్మి కింద పడేసింది. ఇది జరిగింది వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లాలో. వేల జనం చూస్తుండగా గేదె తన ప్రతాపాన్ని ప్రదర్శించింది. చుట్టూ వున్న అధికారులు, పోలీసులు నిశ్చేష్టులయి చూస్తూ వుండిపోయారు. దాదాపు 33 సంవత్సరాల క్రితం, మొత్తమ్మీద సుఖాంతంగా ముగిసిన ఈ కధాకధన క్రమంబెట్టిదనిన:
(This incident was narrated to me by my brother Shri B.Ramachandra Rao, who retied as Chief General Manager State Bank Of India. Story in his words, in English)
"1983 లో నేను హైదరాబాదు స్టేట్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ గా పనిచేస్తున్న రోజులు. ఒక రోజు ఉదయం ఆఫీసుకు వెళ్ళీ వెళ్ళగానే సీ.జీ.ఏం. గారు అర్జంటుగా పిలుస్తున్నారని కబురు. శ్రీ ఏమ్వీ సుబ్రహ్మణ్యం గారు (ఇప్పుడు లేరు) అప్పుడు సీ.జీ.ఎం. నేను వెళ్లేసరికి ఆయన ఛాంబర్లో నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు అనంత రాములు గారు కూర్చుని వున్నారు. కేంద్రంలో ఆర్ధిక శాఖ సహాయ మంత్రిగా వున్న జనార్ధన పూజారి గారికి అయన చాలా సన్నిహితులు. సీజీఎం గారు విషయం సూటిగా చెప్పారు.
'మరో పది రోజుల్లో మంత్రిగారు నాగర్ కర్నూల్ వస్తున్నారట. స్టేట్ బ్యాంక్ వాళ్ళు బ్రహ్మాండమయిన లోన్ మేళా ఏర్పాటుచేయాలి.'
ఇంతలో అనంత రాములు గారు, జనార్ధన పూజారి గారికి తాను యెంత దగ్గరో తెలియచెప్పడానికో ఏమో, ఆ గదిలోనుంచే ఫోను కలిపించి ( అప్పట్లో సెల్ ఫోనులు లేవు) మంత్రిగారితో మాట్లాడించారు. ఫంక్షన్ ఎలా జరగాలో మంత్రిగారు ఫోనులోనే మా సీజీఎం గారికి పది నిమిషాలపాటు హుకుం జారీ చేసారు. అనంతరాములు గారు సంతృప్తిగా వెళ్ళిపోయారు కానీ, సీజీఎం గారికి భయం పట్టుకుంది. మంత్రిగారు ఆ సభకి కనీసం పదివేలమంది రైతులు రావాలి, ప్రతివారికీ రుణ సంతర్పణ జరగాలి అని చెప్పారట. 'పదిరోజుల్లో ఇది ఎలా సాధ్యం అని అంటూనే, 'ఏం చేస్తావో తెలవదు. మంత్రి గారి చేత మాట రాకుండా చూడాల్సిన బాధ్యత నీది. మీటింగ్ ఏర్పాట్లు ఘనంగా వుండాలి. యెంత ఖర్చయినా పరవాలేదు. నేను 'రాటిఫై' చేస్తాను. నాకు మాత్రం మాట రాకూడదు' అనేసారు. (జనార్ధన పూజారి గారు వ్యక్తిగతంగా ఎంతో నిజాయితీ పరులు. కానీ బ్యాంకు ఉన్నతాధికారులను కూడా బహిరంగ సభల్లో కడిగేస్తారు. పేరుకు జూనియర్ మంత్రి అయినా ఆయన అంటే బ్యాంకింగ్ రంగంలో టెర్రర్. దేశమంతా లోన్ మేళాలు పెట్టించి బ్యాంకింగ్ వ్యవస్థను ఒక రకంగా దాదాపు పలుచన చేసారు. అది వేరే సంగతి).
“ఇక చూడాలి. మా అవస్థలు. వున్నది పదిరోజులు. రుణాలు ఇవాల్సింది పదివేల మందికి. నాగర్ కర్నూల్ డివిజన్లోని మా పదిమంది బ్రాంచి మేనేజర్లు రాత్రనక, పగలనక అవిశ్రాంతంగా కష్టపడ్డారు. నేను కూడా వారితో కలిసి ఆ ప్రాంతం అంతా తిరిగాను. మా మేనేజర్లతో ఒక్కటే చెప్పాను. 'ఈ హడావిడిలో ఎలాటి తప్పులు చేయవద్దు. తప్పుడు పేర్లతో లోన్లు ఇవ్వవద్దు. మీ మీద ఏ వత్తిడి వచ్చినా, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా నాకు ఫోను చేసి చెప్పండి. మర్నాడే నేను వచ్చి చూసుకుంటాను. మీరు మాట పడవద్దు, నాకు మాట రానియ్యవద్దు.'
సిబ్బంది శ్రమ ఫలించింది. పెట్టుకున్న టార్గెట్ చేరుకోగలిగాము.
ఆరోజు రానే వచ్చింది. సాయంత్రం నాలుగు గంటలకు నాగర్ కర్నూల్ లో బహిరంగ సభ. హైస్కూల్ మైదానంలో ఎక్కడ చూసినా జనమే జనం. రుణ గ్రహీతలకోసం మంజూరు చేసిన దాదాపు వెయ్యి గేదెలు, రెండు వందల ట్రాక్టర్లు, వందలాది పంపు సెట్లు అక్కడకు తెప్పించి పెద్ద ఎగ్జిబిషన్ పెట్టాము.
అదంతా చూసి అనంతరాములు గారు ఖుషీ. ఆయన ఖుషీ చూసి మా సీజీఎం గారు ఖుషీ. కధ ఇలా ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో ఉన్నట్టుండి ఒక జరగరాని సంఘటన జరిగిపోయింది.
మంత్రి గారు ఈలోపల గేదెల స్టాల్ చూస్తానన్నారు. అక్కడికి వెళ్లి అక్కడి బ్యాంకు సిబ్బందితో గేదెలను గురించి రకరకాల ప్రశ్నలు సంధించారు. జవాబులు ఆయనకు సంతృప్తి కలిగించడంతో బతుకు జీవుడా అనుకున్నాము. ఇంతలో అనంత రాములు గారు 'చీకటి పడుతోంది, తొందరగా సభ మొదలు పెడదాం' రండని పిలిచారు. మంత్రి గారు సరేనంటూ పక్కకు తిరిగారు. పెద్ద పెద్ద కొమ్ములున్న ఓ పెద్ద గేదె ఆయన కంట పడింది. అలాటి గేదెలు గురించి బాగా తెలిసున్నవాడిలా ఆయన చరచరా దాని దగ్గరకు వెళ్లి చూసారు. ఆ గేదె గురించి మళ్ళీ కొన్ని ప్రశ్నలు వేసారు. మేము తత్తరపడుతుంటే అయన - 'మీరంతే. ఏసీ రూముల్లో కూర్చునే బ్యాంకర్లు. గేదెలగురించి మీకేం తెలుస్తుంది? నేను చెబుతాను వినండి' అంటూ ఓ చేత్తో గేదె కొమ్ములు పట్టుకుని ఆ రకం గేదెల కధాకమామిషు చెప్పడం మొదలు పెట్టారు.
ఆ గేదెకి ఈ వ్యవహారం నచ్చినట్టు లేదు. అకస్మాత్తుగా అది మెడవంచి కొమ్ములతో మంత్రిగారిని అమాంతం కుమ్మేసింది. గేదె కబుర్లు చెప్పబోతున్న మంత్రిగారికి కళ్ళు బైర్లు కమ్మాయి. కుమ్మడమే కాకుండా అది పూజారి గారిని కింద పడేసి కాళ్ళతో తొక్కబోయింది. అందరం బిత్తరపోయాం. ఏం చెయ్యాలో తెలియదు. ఓపక్క గేదె కాళ్ళకింద మంత్రి గారు. మరో పక్క కాలెత్తి తొక్కడానికి సిద్ధంగా వున్న గేదె. వూరివాళ్ళు కలిపించుకుని గేదెని పట్టుకు వెళ్లి దూరంగా కట్టేశారు. మంత్రిగారు కిందపడి లేవలేకుండా వున్నారు. ఇంతలో ఎవరో 'డాక్టర్ డాక్టర్' అని అరిచారు. ఇంకెవరో వెళ్లి ఓ డాక్టర్ ని పట్టుకొచ్చారు. అమ్మయ్య అనుకున్నాం. తీరా చూస్తె అయన పశువుల డాక్టర్. మా సీజీఎం గారి బీపీ పెరిగిపోతోంది. చివరికి పూజారి గారు తనకు తానే తేరుకున్నారు. తేరుకోగానే ఆయనకు తను మంత్రి అన్న విషయం స్పృహకు వచ్చింది. లేచి నిల్చుని 'డోంట్ వర్రీ నాకేం కాలేదు. నాకు ప్రజలు ముఖ్యం. వారితో మీటింగ్ ముఖ్యం. నాకేం జరిగిందన్నది ముఖ్యం కాదు' అంటూ చకచకా వెళ్లి స్టేజి ఎక్కారు.
జరిగిన దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమో ఏమో మంత్రి గారు ఆరోజు అనర్ఘళంగా మాట్లాడారు. గట్టిగా గొంతెత్తి ప్రసంగించడం మొదలు పెట్టారు. మేము ఏర్పాటు చేసిన అనువాదకుడు కూడా రెచ్చిపోయి అంతకంటే గట్టిగా బిగ్గరగా అరవడం మొదలు పెట్టాడు.
మంత్రి గారు స్వరం పెంచి అడిగారు. " ఇక్కడకు వచ్చిన పదివేలమందిలో బ్యాంకు లోను కోసం ఎవరయినా లంచం ఇచ్చారా. అది నాకు తెలవాలి. లంచం ఇస్తే చేతులెత్తండి. వాళ్ళను ఇక్కడే సస్పెండ్ చేస్తాను, మీకేం భయం లేదు. భయపడకుండా చేతులెత్తండి."
కాసేపు అంతటా నీరవ నిశ్శబ్దం. స్టేజి మీద మరింత భయంకరమైన నిశ్శబ్దం. అయిదు నిమిషాలు గడిచాయి. ఎవరూ చేతులు ఎత్తలేదు.
మంత్రి గారు పట్టువదలని విక్రమార్కుడిలా మళ్ళీ మైకు పట్టుకుని చెప్పారు.
అనువాదకుడు తెలుగులో అంతకంటే గట్టిగా కరిచినట్టు అరిచి చెప్పాడు.
'చెప్పండి. భయపడకండి' అంటూ.
చివరికి మంత్రిగారు ఓ మెట్టు దిగి అడిగారు.
'సరే. ఇప్పుడు మరోటి అడుగుతా చెప్పండి. మీలో లంచం ఇవ్వకుండా లోను తీసుకున్నవాళ్లు ఎవ్వరో చేతులు ఎత్తండి'
ఒక్కసారిగా అందరూ చేతులు ఎత్తారు. స్టేజ్ మీద వున్న బ్యాంకర్లు ఊపిరి పీల్చుకున్నారు.
మంత్రి గారు ఉపన్యాసం ఇలా ముగించారు.
'ఈ నాగర్ కర్నూల్ సభని నేనెప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్ళినా మీ ఉదాహరణే చెబుతాను'
అక్కడికి కధ సుఖాంతం. కానీ కధ అయిపోలేదు.
అప్పుడు రుణ మేళాలు. ఇప్పుడు రుణ మాఫీలు. బ్యాంకింగ్ వ్యవస్థ ఎటు పోతోందో, ఎటు పోవాలో అర్ధం కాని పరిస్తితి.
"Are we playing for galleries? Are we indulging in competitive populism? When so many banks in other countries collapsed at one point of time, we are proud that banks in India stood the test of the time. Let us not politicise or pollute our banks. Long live Indian Banks"


5 కామెంట్‌లు:

  1. ఆనాటి కేంద్ర ఆర్ధికశాఖామాత్యుల వారు బ్యాంక్ ఆఫీసర్లని పబ్లిక్‌లో తను "కుమ్ముతుండేవాడు" కదా. ఆ హవా అలా నడిచింది. టార్గెట్లు అందుకోకపోతే రివ్యూ మీటింగులు పెట్టి వాటిల్లో గట్టిగా నిలదీయచ్చు. కానీ పబ్లిక్‌లో స్టేజ్ మీద అవమానం చేయడమే ఆయన గారు ఎంచుకున్న మార్గం. ఆ రోజుల్లో ఎంతమంది బ్యాంక్ ఉద్యోగుల ఆరోగ్యాలు దెబ్బ తిన్నాయో !

    రిప్లయితొలగించండి
  2. శ్రీనివాస రావు గారు, మూడు నాలుగు రోజుల క్రితం ఇద్దరు సినిమా హీరోల అభిమానుల మధ్య జరిగిన కొట్లాటలో ఓ అభిమాని కత్తిపోట్లకు గురయ్యి చనిపోయాడు కదా; అటువంటి ఉన్మాదాల గురించి మీరో టపా వ్రాస్తారని చూశాను.
    నిన్న (26-08-2016) రాత్రి 7 గంటలకు "భారత్" టీవీ ఛానెల్లో వచ్చిన చర్చా కార్యక్రమం - మీరు, తమ్మారెడ్డి భరద్వాజ గారు - పాల్గొన్నది చూశాను. దాంట్లో మీరు చెప్పిన ఓ పాయింట్ నాకు బాగా నచ్చింది. అదే ఆమృతుడి తల్లిదండ్రుల్ని ఓదార్చడానికి ఒక్క హీరోనే వెళ్ళే బదులు ఆ ఇద్దరు హీరోలూ కలిసి వెళ్ళినట్లయితే ఇరుపక్షాల అభిమానులకి అదో మంచి సందేశం లాగా పనికొచ్చేది అని మీరన్నది నిజంగా ఆచరణయోగ్యం. అయినా మన "హీరో" లకి అటువంటి ఆలోచనలు ఎప్పుడు రావాలి - మంచి పనికయినా, మరోటయినా ! అభిమానుల మూర్ఖత్వం వెర్రితలలేసి హద్దులు మీరుతున్నంత కాలం ఇలాగే నడుస్తుంటుంది.

    రిప్లయితొలగించండి


  3. గేదెల వోలెన్ తరిమిరి
    పేదలకు ఋణముల నివ్వ పెద్దలు మేలౌ !
    బాధగ నమ్ముడు బోయిన
    గేదెయు పూజారివార్ని గేముగ కుమ్మెన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. @విన్నకోట నరసింహారావు గారికి - సినీ అభిమానాలు గురించి నాలుగయిదు ఛానల్స్ లో మాట్లాడ్డం వల్ల విడిగా రాయలేకపోయాను. పొతే, భారత్ టీవీ చూసి మీరు రాసిన ప్రశంసకు ధన్యవాదాలు. మరో విషయం సెప్టెంబరు నుంచి మేము మళ్ళీ మా పాత చిరునామాకు (ఎల్లారెడ్డి గూడా) కు మారుతున్నాము. ఇవ్వాళే పాలు పొంగించాము.

    రిప్లయితొలగించండి