ఈ కింది చిత్రంలో మధ్యలో కూర్చున్నది ఎవరో అందరికీ తెలుసు. ఆయన అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు పక్కన మెడలో గుర్తింపు కార్డు వేలాడవేసుకుని, గళ్ళ చొక్కా ధరించి ఒద్దికగా కూర్చున్నది మా మూడో అన్నయ్య భండారు వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు భండారు రాఘవరావు. అతడు ప్రభుత్వ రెవెన్యూ శాఖలో అతి చిన్న ఉద్యోగి వీ ఆర్ వో. అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. ఇటీవలే ముగిసిన కృష్ణా పుష్కరాలలో చక్కని సేవలు అందించినందుకు రాఘవరావు ఇతర సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి వారితో కలిసి ఫోటో దిగారు. రేయింబవళ్ళు పడ్డ శ్రమను చంద్రబాబు చూపిన ఈ ఆత్మీయ ప్రదర్శన మరపున పడేసిందని మా అందరికీ పెట్టిన పోస్ట్ లో మా రఘు పేర్కొన్నాడు.
28, ఆగస్టు 2016, ఆదివారం
21, ఆగస్టు 2016, ఆదివారం
మంత్రిని కుమ్మిన గేదె కధ
ఆదివారం ఆటవిడుపు:
సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రిని పల్లెటూరి గేదె ఒకటి కొమ్ములతో కుమ్మి కింద పడేసింది. ఇది జరిగింది వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లాలో. వేల జనం చూస్తుండగా గేదె తన ప్రతాపాన్ని ప్రదర్శించింది. చుట్టూ వున్న అధికారులు, పోలీసులు నిశ్చేష్టులయి చూస్తూ వుండిపోయారు. దాదాపు 33 సంవత్సరాల క్రితం, మొత్తమ్మీద సుఖాంతంగా ముగిసిన ఈ కధాకధన క్రమంబెట్టిదనిన:
(This incident was narrated to me by my brother Shri B.Ramachandra Rao, who retied as Chief General Manager State Bank Of India. Story in his words, in English)
"1983 లో నేను హైదరాబాదు స్టేట్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ గా పనిచేస్తున్న రోజులు. ఒక రోజు ఉదయం ఆఫీసుకు వెళ్ళీ వెళ్ళగానే సీ.జీ.ఏం. గారు అర్జంటుగా పిలుస్తున్నారని కబురు. శ్రీ ఏమ్వీ సుబ్రహ్మణ్యం గారు (ఇప్పుడు లేరు) అప్పుడు సీ.జీ.ఎం. నేను వెళ్లేసరికి ఆయన ఛాంబర్లో నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు అనంత రాములు గారు కూర్చుని వున్నారు. కేంద్రంలో ఆర్ధిక శాఖ సహాయ మంత్రిగా వున్న జనార్ధన పూజారి గారికి అయన చాలా సన్నిహితులు. సీజీఎం గారు విషయం సూటిగా చెప్పారు.
'మరో పది రోజుల్లో మంత్రిగారు నాగర్ కర్నూల్ వస్తున్నారట. స్టేట్ బ్యాంక్ వాళ్ళు బ్రహ్మాండమయిన లోన్ మేళా ఏర్పాటుచేయాలి.'
ఇంతలో అనంత రాములు గారు, జనార్ధన పూజారి గారికి తాను యెంత దగ్గరో తెలియచెప్పడానికో ఏమో, ఆ గదిలోనుంచే ఫోను కలిపించి ( అప్పట్లో సెల్ ఫోనులు లేవు) మంత్రిగారితో మాట్లాడించారు. ఫంక్షన్ ఎలా జరగాలో మంత్రిగారు ఫోనులోనే మా సీజీఎం గారికి పది నిమిషాలపాటు హుకుం జారీ చేసారు. అనంతరాములు గారు సంతృప్తిగా వెళ్ళిపోయారు కానీ, సీజీఎం గారికి భయం పట్టుకుంది. మంత్రిగారు ఆ సభకి కనీసం పదివేలమంది రైతులు రావాలి, ప్రతివారికీ రుణ సంతర్పణ జరగాలి అని చెప్పారట. 'పదిరోజుల్లో ఇది ఎలా సాధ్యం అని అంటూనే, 'ఏం చేస్తావో తెలవదు. మంత్రి గారి చేత మాట రాకుండా చూడాల్సిన బాధ్యత నీది. మీటింగ్ ఏర్పాట్లు ఘనంగా వుండాలి. యెంత ఖర్చయినా పరవాలేదు. నేను 'రాటిఫై' చేస్తాను. నాకు మాత్రం మాట రాకూడదు' అనేసారు. (జనార్ధన పూజారి గారు వ్యక్తిగతంగా ఎంతో నిజాయితీ పరులు. కానీ బ్యాంకు ఉన్నతాధికారులను కూడా బహిరంగ సభల్లో కడిగేస్తారు. పేరుకు జూనియర్ మంత్రి అయినా ఆయన అంటే బ్యాంకింగ్ రంగంలో టెర్రర్. దేశమంతా లోన్ మేళాలు పెట్టించి బ్యాంకింగ్ వ్యవస్థను ఒక రకంగా దాదాపు పలుచన చేసారు. అది వేరే సంగతి).
“ఇక చూడాలి. మా అవస్థలు. వున్నది పదిరోజులు. రుణాలు ఇవాల్సింది పదివేల మందికి. నాగర్ కర్నూల్ డివిజన్లోని మా పదిమంది బ్రాంచి మేనేజర్లు రాత్రనక, పగలనక అవిశ్రాంతంగా కష్టపడ్డారు. నేను కూడా వారితో కలిసి ఆ ప్రాంతం అంతా తిరిగాను. మా మేనేజర్లతో ఒక్కటే చెప్పాను. 'ఈ హడావిడిలో ఎలాటి తప్పులు చేయవద్దు. తప్పుడు పేర్లతో లోన్లు ఇవ్వవద్దు. మీ మీద ఏ వత్తిడి వచ్చినా, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా నాకు ఫోను చేసి చెప్పండి. మర్నాడే నేను వచ్చి చూసుకుంటాను. మీరు మాట పడవద్దు, నాకు మాట రానియ్యవద్దు.'
సిబ్బంది శ్రమ ఫలించింది. పెట్టుకున్న టార్గెట్ చేరుకోగలిగాము.
ఆరోజు రానే వచ్చింది. సాయంత్రం నాలుగు గంటలకు నాగర్ కర్నూల్ లో బహిరంగ సభ. హైస్కూల్ మైదానంలో ఎక్కడ చూసినా జనమే జనం. రుణ గ్రహీతలకోసం మంజూరు చేసిన దాదాపు వెయ్యి గేదెలు, రెండు వందల ట్రాక్టర్లు, వందలాది పంపు సెట్లు అక్కడకు తెప్పించి పెద్ద ఎగ్జిబిషన్ పెట్టాము.
అదంతా చూసి అనంతరాములు గారు ఖుషీ. ఆయన ఖుషీ చూసి మా సీజీఎం గారు ఖుషీ. కధ ఇలా ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో ఉన్నట్టుండి ఒక జరగరాని సంఘటన జరిగిపోయింది.
మంత్రి గారు ఈలోపల గేదెల స్టాల్ చూస్తానన్నారు. అక్కడికి వెళ్లి అక్కడి బ్యాంకు సిబ్బందితో గేదెలను గురించి రకరకాల ప్రశ్నలు సంధించారు. జవాబులు ఆయనకు సంతృప్తి కలిగించడంతో బతుకు జీవుడా అనుకున్నాము. ఇంతలో అనంత రాములు గారు 'చీకటి పడుతోంది, తొందరగా సభ మొదలు పెడదాం' రండని పిలిచారు. మంత్రి గారు సరేనంటూ పక్కకు తిరిగారు. పెద్ద పెద్ద కొమ్ములున్న ఓ పెద్ద గేదె ఆయన కంట పడింది. అలాటి గేదెలు గురించి బాగా తెలిసున్నవాడిలా ఆయన చరచరా దాని దగ్గరకు వెళ్లి చూసారు. ఆ గేదె గురించి మళ్ళీ కొన్ని ప్రశ్నలు వేసారు. మేము తత్తరపడుతుంటే అయన - 'మీరంతే. ఏసీ రూముల్లో కూర్చునే బ్యాంకర్లు. గేదెలగురించి మీకేం తెలుస్తుంది? నేను చెబుతాను వినండి' అంటూ ఓ చేత్తో గేదె కొమ్ములు పట్టుకుని ఆ రకం గేదెల కధాకమామిషు చెప్పడం మొదలు పెట్టారు.
ఆ గేదెకి ఈ వ్యవహారం నచ్చినట్టు లేదు. అకస్మాత్తుగా అది మెడవంచి కొమ్ములతో మంత్రిగారిని అమాంతం కుమ్మేసింది. గేదె కబుర్లు చెప్పబోతున్న మంత్రిగారికి కళ్ళు బైర్లు కమ్మాయి. కుమ్మడమే కాకుండా అది పూజారి గారిని కింద పడేసి కాళ్ళతో తొక్కబోయింది. అందరం బిత్తరపోయాం. ఏం చెయ్యాలో తెలియదు. ఓపక్క గేదె కాళ్ళకింద మంత్రి గారు. మరో పక్క కాలెత్తి తొక్కడానికి సిద్ధంగా వున్న గేదె. వూరివాళ్ళు కలిపించుకుని గేదెని పట్టుకు వెళ్లి దూరంగా కట్టేశారు. మంత్రిగారు కిందపడి లేవలేకుండా వున్నారు. ఇంతలో ఎవరో 'డాక్టర్ డాక్టర్' అని అరిచారు. ఇంకెవరో వెళ్లి ఓ డాక్టర్ ని పట్టుకొచ్చారు. అమ్మయ్య అనుకున్నాం. తీరా చూస్తె అయన పశువుల డాక్టర్. మా సీజీఎం గారి బీపీ పెరిగిపోతోంది. చివరికి పూజారి గారు తనకు తానే తేరుకున్నారు. తేరుకోగానే ఆయనకు తను మంత్రి అన్న విషయం స్పృహకు వచ్చింది. లేచి నిల్చుని 'డోంట్ వర్రీ నాకేం కాలేదు. నాకు ప్రజలు ముఖ్యం. వారితో మీటింగ్ ముఖ్యం. నాకేం జరిగిందన్నది ముఖ్యం కాదు' అంటూ చకచకా వెళ్లి స్టేజి ఎక్కారు.
జరిగిన దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమో ఏమో మంత్రి గారు ఆరోజు అనర్ఘళంగా మాట్లాడారు. గట్టిగా గొంతెత్తి ప్రసంగించడం మొదలు పెట్టారు. మేము ఏర్పాటు చేసిన అనువాదకుడు కూడా రెచ్చిపోయి అంతకంటే గట్టిగా బిగ్గరగా అరవడం మొదలు పెట్టాడు.
మంత్రి గారు స్వరం పెంచి అడిగారు. " ఇక్కడకు వచ్చిన పదివేలమందిలో బ్యాంకు లోను కోసం ఎవరయినా లంచం ఇచ్చారా. అది నాకు తెలవాలి. లంచం ఇస్తే చేతులెత్తండి. వాళ్ళను ఇక్కడే సస్పెండ్ చేస్తాను, మీకేం భయం లేదు. భయపడకుండా చేతులెత్తండి."
కాసేపు అంతటా నీరవ నిశ్శబ్దం. స్టేజి మీద మరింత భయంకరమైన నిశ్శబ్దం. అయిదు నిమిషాలు గడిచాయి. ఎవరూ చేతులు ఎత్తలేదు.
మంత్రి గారు పట్టువదలని విక్రమార్కుడిలా మళ్ళీ మైకు పట్టుకుని చెప్పారు.
అనువాదకుడు తెలుగులో అంతకంటే గట్టిగా కరిచినట్టు అరిచి చెప్పాడు.
'చెప్పండి. భయపడకండి' అంటూ.
చివరికి మంత్రిగారు ఓ మెట్టు దిగి అడిగారు.
'సరే. ఇప్పుడు మరోటి అడుగుతా చెప్పండి. మీలో లంచం ఇవ్వకుండా లోను తీసుకున్నవాళ్లు ఎవ్వరో చేతులు ఎత్తండి'
ఒక్కసారిగా అందరూ చేతులు ఎత్తారు. స్టేజ్ మీద వున్న బ్యాంకర్లు ఊపిరి పీల్చుకున్నారు.
మంత్రి గారు ఉపన్యాసం ఇలా ముగించారు.
'ఈ నాగర్ కర్నూల్ సభని నేనెప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్ళినా మీ ఉదాహరణే చెబుతాను'
అక్కడికి కధ సుఖాంతం. కానీ కధ అయిపోలేదు.
అప్పుడు రుణ మేళాలు. ఇప్పుడు రుణ మాఫీలు. బ్యాంకింగ్ వ్యవస్థ ఎటు పోతోందో, ఎటు పోవాలో అర్ధం కాని పరిస్తితి.
"Are we playing for galleries? Are we indulging in competitive populism? When so many banks in other countries collapsed at one point of time, we are proud that banks in India stood the test of the time. Let us not politicise or pollute our banks. Long live Indian Banks"
పౌరసంబంధాల పథనిర్దేశకుడు భండారు పర్వతాలరావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (21-08-2016)
వనం జ్వాలా నరసింహారావు
సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున (ఆగస్ట్ 21, 2006) 71 సంవత్సరాల భండారు పర్వతాలరావు పుట్టపర్తిలో మరణించారు. ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న పర్వతాలరావు స్వఛ్చందంగా పదవీ విరమణ చేసిన కొన్నాళ్ల నుంచి పుట్టపర్తి భగవాన్ సత్యసాయిబాబా సన్నిధిలోనే వుంటూ ఆయన సేవలో తరించిపోయేవారు. ఈ తరం పాత్రికేయులకు కాని, ఇతరులకు కాని, అంతగా తెలిసుండని, వుండే అవకాశం లేని భండారు పర్వతాల రావు కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తో మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీకి చెందిన స్వర్గీయ ఎన్టీ రామారావు వరకు, ఆ తరువాత స్వర్గీయ ఎన్, జనార్ధన రెడ్డికి, అంటే ఆరుగురు ముఖ్యమంత్రులకు ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసి ఆ పదవికే వన్నె తెచ్చిన సంగతి కూడా బహుకొద్ది మందికే తెలిసుంటుంది. "పీఆర్వో టు సీఎం" అనే పదవిని మొట్టమొదటి సారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 1978 లో మొదటి దఫా ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో ఏర్పాటైంది. భండారు పర్వతాలరావును ఆ పదవిలో ఆయన నియమించారు. విరివిగా పుస్తకపఠనం, రచనలు చేసే అలవాటున్న పర్వతాలరావు ఉమ్మడి రాష్ట్రంలో సమాచార-పౌర సంబంధాల శాఖకు డైరెక్టర్ గా, ఆంధ్రా బాంక్ పౌర సంబంధాల అధికారిగా, చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్ట్రర్ గా, అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయానికి పరీక్షల విభాగపు కౌన్సిలర్ గా పనిచేశారు. స్వఛ్చంధ పాత్రికేయుడిగా ప్రసిద్ధికెక్కిన ఆయన ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ సలహాదారుడిగా, నేషనల్ ఇన్పర్మేషన్ సర్వీసెస్ న్యూస్ ఫీచర్ గౌరవ సంపాదకుడిగా కూడా పనిచేశారు.
1958 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాచార పౌరసంబంధ శాఖలో డీపీఆర్వో గా ఉద్యోగంలో చేరిన పర్వతాలరావు, స్వయం కృషితో, స్వయం ప్రతిభతో, అదే శాఖలో ఉన్నతోన్నత స్థానమైన డైరెక్టర్ పదవిని నిర్వహించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు, ప్రప్రధమంగా సీఎం పీఆర్వో పదవిని ఏర్పాటు చేయగానే, సమాచార పౌర సంబంధాల శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న పర్వతాలరావును ఆయనే స్వయంగా ఆ పదవిలో నియమించారు. బహశా ఆ పదవిని ఆయన నిర్వహించిన తీరు అప్పటికీ, ఇప్పటికీ, బహుశా ఎప్పటికీ ఒక ఆదర్శంగా వుండిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఆ పదవిలో వున్న మాలాంటి ఎంతో మందికి ఆయన స్ఫూర్తిదాత అనవచ్చు. ఆంగ్లం, తెలుగు భాషల్లో ప్రావీణ్యం వున్న పర్వతాలరావు, వచన, కవిత్వ రచనలెన్నో చేసారు. బహుగ్రంథకర్త. ప్రముఖంగా పేర్కొనాల్సిన వాటిలో: టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత చరిత్ర ఆధారంగా వంద చిన్ని కథలను "ప్రకాశం గాథా శతి", "మన సుప్రసిద్ధ దేవాలయాలు", "పరమాచార్య పావన గాథలు", "నారసింహాయ" పేర్కొనవచ్చు. అనేక పత్రికలకు, మాగజైన్లకు ఆయన వ్యాసాలు రాసేవారు.
స్వఛ్చంద పదవీ విరమణ అనంతరం, పుట్టపర్తిలో నివాసం ఏర్పాటు చేసుకునే ముందర కొన్నాళ్ల పాటు, ఆయన అపారమైన అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ, డాక్టర్ ఎంసీఆర్ హెచార్డీ సంస్ద కొంతమేరకు ఉపయోగించుకున్నాయి. అంతరించి పోతున్న హస్తకళల మీద ఆయన సుదీర్ఘ అధ్యయనం చేశారు. వాటి తయారీ ప్రదేశాలకు వెళ్లి, హస్తకళాకారులతో స్వయంగా అనేక మార్లు మాట్లాడి, వాటి నేపధ్యం, తయారీ విధానం, అంతరించి పోవడానికి దారితీస్తున్న కారణాలను కూలంకషంగా పరిశీలించి సమగ్ర నివేదికలు తయారుచేసారాయన. వాటినెలా పునరుద్ధరించాలో కూడా సూచించారు. ఆయన నివేదిక ఆధారంగానే వాటి పునరుద్ధరణకొరకై "హస్తకళల అభివృద్ధి కేంద్రాలను" కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిధులతో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. "వీణల తయారీ", "మృదంగం తయారీ", "తోలుబొమ్మలు" మీద ఆయన చేసిన అధ్యయన నివేదికలను ఒక పుస్తక రూపంలో తెచ్చి వున్నట్లయితే భావితరాల వారికి ఎంతో ఉపయోగంగా వుండేది కాని నేనెంత ప్రయత్నం చేసినా హస్తకలల అభివృద్ధి సంస్థతో ఆ పని చేయించలేకపోయాను. ఇప్పటికీ ఆ డమ్మీ కాపీ నా దగ్గర భధ్రపరచాను.
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వర రావు, పౌరసంబంధాల పితామహుడు డాక్టర్ సీవీ నరసింహారెడ్డి, అత్యవసర సహాయ సేవల రూప శిల్పి డాక్టర్ ఏపీ రంగారావు, పర్వతాలరావుతో తమకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటూ ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పారు. స్వయానా మేనమామ అయిన పర్వతాలరావును తన బాల్యం నుంచే అమితంగా అభిమానించే వాడినని, "పర్వతాలరావు చెడువారిలో కూడా వారిలోని మంచి గుణాలను మాత్రమే వెలికితీసే అపురూపమైన శక్తిగల అరుదైన వ్యక్తి" అన్నారు రంగారావు. పర్వతాల రావు ఎప్పుడూ, ఎవరినీ, ఒక్క పొల్లుమాట కూడా అనేవాడు కాదని, కోపమంటే ఏమిటో ఆయనకు తెలియదని రంగారావు అన్నారు. ఒక గొప్ప రచయితగా, ఉపన్యాసకుడిగా, వక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా ఆయనలో దాగి వున్న శక్తి అనిర్వచనీయం అన్నారాయన. అహర్నిశలూ మార్పుకు ప్రేరేపణ కలిగిస్తూనే, ఒక గొప్ప వ్యక్తిగా సమాజంలో తనకొక స్థిరమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశాలున్నప్పటికీ, కారణాలేవైనా, పర్వతాలరావు స్వఛ్చందంగా ఒక ప్రేమైక జీవిగా మారి, ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాడని రంగారావు కొనియాడారు.
సమాచార పౌర సంబంధాల శాఖకు-వృత్తికి, ఒక గొప్పతనాన్ని, క్రమశిక్షణను, నిబద్ధతను, ఆత్మగౌరవాన్ని సమకూర్చిన ఒక మహనీయుడిగా, ఓ అరుదైన పౌరసంబంధాల వృత్తి నిపుణిడిగా పర్వతాలరావును వర్ణించారు ఆయన సహాద్యోగి, ఆ శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ సీవీ నరసింహారెడ్డి. సత్యసాయి బాబా ఆశయానికి, సిద్ధాంతానికి, బోధనలకు ప్రభావితుడై, ఆయన అడుగుజాడల్లో పయనించడానికొరకే, మానవసేవ ధ్యేయంగా తన అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా, పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో పర్వతాలరావు వానప్రశ్తం చేశాడని ఆయన అన్నారు. "ఒక వైవిధ్యభరితమైన వ్యక్తి ఆయన. ఒక గొప్ప స్కాలర్ గా, మేధావిగా, నిపుణిడిగా, అత్యున్నత ప్రమాణాలను పాటించిన మహా మనీషి పర్వతాలరావు. సేవే పరమావధిగా ఆయన జీవించాడు. ఆయన ఆలోచనలు, మాటలు, చేతలు ఆధ్యాత్మిక మార్గంలో వుండేవి. అసలు-సిసలైన అజాతశత్రువు పర్వతాలరావు ఒక గొప్ప స్నేహితుడు, దార్శనికుడు, తాత్వికుడు" అన్నారు ఆయన గురించి నరసింహారెడ్డి.
ఆత్మగౌరవానికి ప్రతీకగా, అరుదైన అసామాన్య వ్యక్తిత్వానికి నిదర్శనంగా పర్వతాలరావు తనకెప్పుడూ ఆరాధ్యనీయమైన మనిషన్నారు సీనియర్ పాత్రికేయులు, మాజీ ఏపీ ప్రెస్ అకాడెమీ అధ్యక్షులు పొత్తూరి వెంకటేశ్వ్రర రావు. వర్కింగ్ జర్నలిస్టుగా తనకాయన పరిచయమయ్యారని అన్నారు పొత్తూరి. "ఆయనో నిశ్శబ్ద అగ్నిపర్వతం లాంటివాడని, ఎన్నో సమస్యలను తనలోనే దాచుకునేవాడని, వాటిలో కొన్ని ఆయనకు సంబంధించినవైతే మిగతావి ఇతరులవని నాకెప్పుడూ అనుమానంగా వుండేది. ఆయనెప్పుడూ ఇతరులను తన సమస్యలతో ఇబ్బందిపెట్టేవాడుకాదు కాని, ఇతరుల-ముఖ్యంగా స్నేహితుల బాధలను ఎప్పుడూ పంచుకునేవాడు" అన్నారాయన. "ఆయుర్వేద వైద్యంలో ఆయనకు బాగా ప్రవేశం వుంది. ప్రాక్టీస్ చేయడానికి ఆయన అర్హుడు కూడా. మెడిటేషన్ కూడా బాగా తెలిసిన వాడు. ఆయనో గొప్ప పరిశోధకుడు. నరసింహ స్వామి మీద ఆయన రాసిన పరిశోధనాత్మక పుస్తకాలు అరుదైన సాహిత్యం" అన్నారు పొత్తూరి.
"చెన్నా టు అన్నా" (చెన్నారెడ్డి నుంచి ఎన్టీ రామారావు వరకు) పేరుతో ఒక పుస్తకం రాయాలని పర్వతాలరావు అంటుండేవారు. దురదృష్ట వశాత్తు అది ఇంకా వెలుగుచూడలేదు. ఆ పుస్తకం ప్రచురితమై వున్నట్లయితే, అలనాటి ఎన్నో రాజకీయ చారిత్రక ప్రాధాన్యతాంశాలను, మెలకువలను, ముఖ్యమంత్రుల మనోగతాన్ని, మనం తెలుసుకోగలిగే వాళ్లం. స్వర్గీయ టీ. అంజయ్య ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయనదగ్గర పర్వతాలరావు పీఆర్వోగా పనిచేసిన రోజులనాటి ఒక సంఘటనను పొత్తూరి ఎప్పుడూ గుర్తుచేసుకుంటారు. అప్పట్లో పొత్తూరి ఆంధ్రప్రభ మాగజైన్ సంపాదకులు. "ముఖ్యమంత్రితో ముఖాముఖి" శీర్షికన వారంవారం ఆంధ్రప్రభలో ఒక ఫీచర్ ప్రచురించేవారప్పట్లో. సంపాదకుడిగా, పత్రికాముఖంగా పాఠకులనుండి ప్రశ్నలను ఆహ్వానించేవారాయన. వాటికి సీఎం ఇచ్చిన సమాధానాలను మాగజైన్ లో వారంవారం ప్రచురించేవారు. సమాధానాలు ఇచ్చే విషయంలో, విషయ సేకరణకు సంబంధించి, ముఖ్యమంత్రి అంజయ్యకు ఆయన కార్యదర్శి స్వర్గీయ యు బి రాఘవేంద్ర రావు. పీఆర్వో పర్వతాలరావు సహాయపడేవారు. వారిద్దరూ, ముఖ్యంగా పర్వతాలరావు రాసిచ్చే సమాధానాలు ఏ మార్పులూ లేకుండా అంజయ్య అంగీకరించే వారనీ, అది ఆయనపై అంజయ్యకు వున్న అపారమైన నమ్మకం అనీ పొత్తూరి గుర్తుచేసుకున్నారు.
సుమారు ఏబైఅయిదు ఏళ్ల క్రితం ఆయన ఖమ్మంలో డీపీఆర్వోగా పనిచేస్తున్న రోజుల్లో పర్వతాలరావుతో నాకు మొదటిసారిగా పరిచయమైంది. రికాబ్-బజార్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుకుంటున్న నాకు ఆయన సోదరుడు (ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు) భండారు శ్రీనివాస రావు క్లాస్ మేట్. ఆయన ద్వారా పరిచయం అయింది. ఆ తరువాత నేను ఆయన మేనకోడలిని వివాహం చేసుకోవడంతో పరిచయం కాస్తా చుట్టరికంగా మారింది. 1989 లో స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రెండవ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేనాయనకు పీఆర్వోవో గా పనిచేశాను. అప్పట్లో డిప్యుటేషన్ మీద ఆంధ్రాబాంక్ పీఆర్వోగా పనిచేస్తున్న పర్వతాలరావును ఏరి-కోరి శాఖకు తిరిగి రప్పించుకుని సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా నియమించారు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి. ఆ విధంగా ఆ హోదాలో వున్న ఆయనతో కలిసి సమన్వయంతో పనిచేసే అవకాశం కలిగింది నాకప్పట్లో. చెన్నారెడ్డి ఉపన్యాసాలను సేకరించి, ఎడిట్ చేసి, ఒకచోట చేర్చి, చాలాకాలం తరువాత "యాన్ ఎజెండా ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ ఏపీ" పేరుతో పుస్తక రూపంలో తేవడానికి ఆయన ఎంతగానో తోడ్పడ్డారు.
దురదృష్ట వశాత్తు పర్వతాలరావు సతీమణి, 78 ఏళ్ల వయసున్న శ్రీమతి సరోజినీదేవికి, భర్త చనిపోయి పదేళ్లయినా, ఆమెకు రావాల్సిన కుటుంబ పింఛను, ప్రభుత్వ నిబంధనలు అనుమతించడం లేదన్న కారణాన ఇంకా మంజూరు కాలేదు. తన ఆర్థిక ఇబ్బందులను మాత్రమే తన శ్రీమతికి వారసత్వంగా ఇవ్వగలిగిన మహానుభావుడాయన. తనకంటూ ఆయన ఏమీ మిగుల్చుకోలేదు.
మరపురాని మనిషి మా పెద్దన్నయ్య పర్వతాలరావు
మా పెద్దన్నయ్య, కీర్తిశేషులు భండారు పర్వతాలరావు చాలా సంవత్సరాలక్రితం ఒక వ్యాసం రాసారు. “డబ్బు కావాలా? దరిద్రం పోవాలా” అనేది దాని శీర్షిక.
“ఒకానొక గర్భ దరిద్రుడు దేవునిగూర్చి గొప్ప తపస్సు చేస్తాడు.
ఆయనప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. భక్తుడు తన పరిస్తితి చెబుతాడు.
దేవుడప్పుడు చిరునవ్వు నవ్వి,
‘’డబ్బు కావాలా ? దరిద్రం పోవాలా ?’ అని అడుగుతాడు.
దాంతో భక్తుడికి కళ్ళు తెరిపిళ్ళు
పడతాయి.
దరిద్రం అంటే డబ్బు లేకపోవడం కాదు, డబ్బున్న దరిద్రులు కూడా లోకంలో చాలామంది వున్నారు. వాళ్ళకంటే తానే మిన్న అని తెలుసుకుంటాడు.”
మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు పుట్టపర్తిలో వుండగా అనేక రచనలు చేస్తూ పోయారు. వాటిల్లో ఒకటి దశావతారాలు. వారి చిన్నమ్మాయి వాణి వెల్దుర్తి,
ఆ రాతప్రతిని చిన్ని పొత్తంగా తయారు చేసి,
కుటుంబ సభ్యులకు స్వయంగా ఇంటింటికీ వెళ్లి పంచి పెట్టింది. ఈ విషయంలో వయస్సులో చిన్నదయినా తను పడ్డ శ్రమదమాదులు ప్రసంశనీయం. ‘మళ్ళీ మనమధ్యకు నాన్న వచ్చారంటూ’ చిరంజీవి వాణి తన ముందు మాటగా నుడివిన మాటలు:
“చిన్నప్పుడు తాతయ్య తద్దినానికి కంభంపాడు వెళ్ళినప్పుడు నాన్న వరండాలో కూర్చుని మాట్లాడుతుంటే వూళ్ళో ఎంతో మంది వినడానికి వచ్చేవారు. నాన్న ఎవరి అభిరుచికి తగ్గట్టు అ అంశం వారితో ముచ్చటి పెడుతుంటే వినేవాళ్ళు అయస్కాంతంలా అతుక్కుపోయి వింటూ వుండేవాళ్ళు. నాన్న మాట్లాడే మాటల్లో రెండు విషయాలు చోటు చేసుకునేవి కావు. అవే: ఆత్మస్తుతి,
పరనింద.
“ఆదర్శాల నయాగరాల కన్నా, ఆచరణల హిమబిందువు మిన్న అని నమ్మిన మరువలేని,
మరపురాని వ్యక్తి నాన్న. ఆ నాన్న ‘దశావతారాలు’ పుస్తకంతో మళ్ళీ మన మధ్యకు వచ్చాడు.”
ఈ చిన్ని పొత్తానికి ముఖచిత్ర అలంకరణ చేసింది ‘రాంపా’
అయిదుగురు
ముఖ్యమంత్రులకు పీఆర్ ఓ గా పనిచేసి,
ఉమ్మడి రాష్ట్రంలో పౌరసంబంధాల శాఖ
డైరెక్టర్ గా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్
మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిన మా పెద్దన్నయ్యకు అనేకరంగాల వారితో సన్నిహిత పరిచయం వుండేది. చాలామంది ఆయనకు తెలుసు, ఆయనకూ
చాలామంది తెలుసు. కానీ, ఆయన ఈ లోకంలో
లేరన్న సంగతి వారిలో చాలామందికి తెలవదు. ఇప్పటికీ నేను సచివాలయానికి వెడితే లిఫ్ట్ బాయ్ నుంచి పెద్ద అధికారుల వరకు అడుగుతుంటారు, మీ అన్నగారు ఎలావున్నారని? అంత నిశ్శబ్దంగా ఆయన
దాటిపోయారు. ఆయన లేరన్న భావం మా ఇంట్లో ఎవ్వరికీ లేదు కాబట్టి నిజం
చెప్పలేకా, అబద్ధం ఆడలేకా ఒక నవ్వు నవ్వి తప్పుకుంటూ వుంటాను.
“ఎన్నడయినా చూసారా
ఆయన మొహంలో చిరునవ్వు చెరగడం
ఎప్పుడయినా గమనించారా
అన్ని బాధలు, అందరి వ్యధలు
గుండెల్లో దాచుకోవడం
బాధ్యతలన్నీ మోసీ మోసీ
ఆ చిన్ని గుండె అలసిపోయింది
అంతులేని దూరాలకు
అన్నయ్యని తీసుకుపోయింది
అనాయాస మరణం
దేవుడిచ్చే అభయం
నిజమయిన భక్తుడు కనుకే
అన్నయ్యకు దక్కిందా వరం
( మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు పుట్టపర్తిలో 2006
ఆగస్టు 21
నాడు ఆకస్మికంగా మరణించినప్పుడు రాసిన అశ్రుగీతిక -
భండారు శ్రీనివాసరావు)
20, ఆగస్టు 2016, శనివారం
తెలివి
అనగనగా ఒక నయా నయీం. అడ్డదారుల్లో సంపాదించిన మొత్తంలో ఒక పెద్ద మొత్తాన్ని ఒకడి దగ్గర
దాచిపెట్టాడు. ఏళ్ళు గడుస్తున్నా డబ్బు సంగతి మాట్లాడకపోవడంతో ఏం చెయ్యాలన్న ఆలోచనలో పడ్డాడు
నయీం. మరో చిక్కేమిటంటే ఇచ్చిన డబ్బుకు లెక్కాపత్రం లేకపోగా,ఆ డబ్బు దాచినవాడికి పుట్టచెవుడు.
యెంత గట్టిగా అరచి భయపెడదామన్నా ఒక్క ముక్క వినపడదు.
డబ్బు వసూలుకి నయీం ఓరోజు స్వయంగా కదిలాడు. చెవిటి వాళ్ళతో సంభాషించడానికి
వీలయ్యే సైగల భాష తెలిసిన ఒక లాయర్ని తన వెంటతీసుకు వెళ్ళాడు. వెడుతూ వెడుతూ వెంట ఏకే ఫార్టీ సెవెన్ కూడా వెంటబెట్టుకు వెళ్ళాడు.
పోగానే అడిగాడు డబ్బు ఎక్కడ వుందో
చెప్పమని. ఆ మాట వినబడక అతగాడు అదే విషయం అదే మొహం పెట్టి మరీ చెప్పాడు. వెంటవచ్చిన దుబాసీ వకీలు అదే మాటనయీం చెవిలో ఊదాడు. నయీం కి ఒళ్లుమండింది. తానే
స్వయంగా వచ్చి అడుగుతున్నా లెక్కపెట్టని అతడి వ్యవహారం అతడికి సుతరామూ నచ్చలేదు.
మరో మాట లేకుండా ఏకే ఫార్టీ సెవెన్ తీసి గురిపెట్టాడు.
‘డబ్బు ఎక్కడ దాచిందీ చెప్పకపోతే
పిట్టను కాల్చినట్టు కాల్చేస్తాన’ని హెచ్చరించాడు.
లాయరు అదే విషయం అవతలవాడికి అర్ధం
అయ్యేట్టు సైగలతో చెప్పాడు.
‘ఉత్త పుణ్యానికి ప్రాణాలు పోగొట్టుకోకు,
వీడు మానవరూపంలో వున్నరాక్షసుడు. అన్నంత
పని చేస్తాడు’ అని హెచ్చరించాడు.
‘కాస్త ఆగండి. డబ్బు ఎక్కడ దాచిపెట్టింది
చెబుతాను. ఇక్కడికి మూడో ఇంట్లో మా బావమరది ఉంటాడు. డబ్బు అంతా నల్ల రంగు
సూటుకేసులో పెట్టి పెరట్లో కొబ్బరి చెట్టు దగ్గర గొయ్యి తవ్వి పాతిపెట్టాను. ఆ
సంగతి మా బావమరదికి కాదుకదా మూడోకంటికి కూడా
తెలవదు ” అన్నాడు.
“ఏమంటున్నాడు వాడు, డబ్బు దాచిన చోటు గురించి ఏమైనా చెప్పాడా”
అడిగాడు నయీం లాయర్ని.
‘అబ్బే ఎక్కడండీ, మొండిముండావాడులా వున్నాడు. భయపడకపోగా దమ్ముంటే కాల్చి చంపమని ఎదురు సవాలు చేస్తున్నాడు, మీ పని
కానివ్వండి మరి.’ అన్నాడు లాయరు నయీంతో.
గాలికి కులమేది?
మన బుద్దులు ఇలా వుంటే ఎన్ని పతకాలు వస్తే ఏంలాభం?
http://www.thenewsminute.com/article/while-pv-sindhu-fought-hard-medal-many-indians-googled-her-caste-48545