16, జులై 2016, శనివారం

చిన్నారి రమ్య యాదిలో...........

సూటిగా.........సుతిమెత్తగా..........భండారు శ్రీనివాసరావు
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY TODAY, 17-07-2016)

తప్పతాగిన స్తితిలో  అతి వేగంగా  ఓ యువవిద్యార్ధి  కారు నడిపిన ఫలితంగా సంభవించిన ప్రమాదంలో రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక కుటుంబం మొత్తం చితికి పోయింది. ఉద్యోగం నిమిత్తం అమెరికా వెడుతున్న ఒక యువకుడి కలలన్నీ అతడి కనురెప్పల కిందే కరిగిపోయాయి.  అప్పటివరకు చదువుతున్న స్కూలును ఒదిలి మరో  స్కూల్లో చేరి బంగారు భవిష్యత్తు దిశగా తొలి అడుగు వేసిన  పదేళ్ళ  బాలిక   రమ్య ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్లాడుతూ వారం రోజుల తరువాత మృత్యు దేవత ఒడిలో ఒదిగి పోయింది. హైదరాబాదు పంజాగుట్ట ఫ్లై ఓవర్ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో చిన్నారి రమ్య, ఆమె బాబాయి రాజేష్ చనిపోవడం, ఆ కారులో వున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో  మొత్తం నాలుగు కుటుంబాలు భరించలేని దుఃఖంలో మునిగిపోయాయి. సహచర విద్యార్ధులతో కలిసి పగటి పూటే పూటుగా  మద్యం సేవించిన ఒక ఇంజినీరింగ్ విద్యార్ధి నడుపుతున్న కారు, అదుపు తప్పి బోల్తా కొట్టి, మరో వాహనంపై పడడంతో  ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  

  
ఇటీవల జరిగిన ఈ సంఘటన హైదరాబాదు  నగరంలో పెద్ద సంచలనమే రగిలించింది.  దరిమిలా  హైదరాబాదు పోలీసులు మద్యం  తాగి కారు నడిపేవారి విషయంలో దృష్టి కేంద్రీకరించినట్టుగా కనబడుతోంది. లైసెన్సు లేకుండా వాహనాలు నడిపేవారిని కూడా పట్టుకునే కార్యక్రమం పెద్ద ఎత్తున మొదలు పెట్టారు.  డ్రైవింగ్ చేస్తూ మైనర్లు పట్టుబడ్డప్పుడు వారికే కాకుండా  వారి తండ్రులకు కూడా కౌన్సెలింగ్ చేస్తున్నారు. పెద్ద మొత్తంలో పెనాల్టీలు విధించి  ట్రాఫిక్ నిబంధనల పట్ల అవహగాహనతో పాటు, చట్టం పట్ల భయభక్తులు అలవడేలా చర్యలు తీసుకుంటున్నారు. పిల్లల నిర్వాకంతో దిమ్మ తిరిగిన వారి తలితండ్రులు ‘ మా పిల్ల లు చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాము. ప్రమాదాలకు  కారణం కాలేదు కనుక కాస్త కనికరం చూపించండి.  భారీ మొత్తాలతో జరిమానాలు వేసి మమ్మల్ని వేధించకండి’ అంటూ  పోలీసులతో మొరపెట్టుకుంటున్నారు.  ఇలాంటి సందర్భాలలోనే పై అధికారుల ప్రాపకం సంపాదించాలని చూసే దిగువ స్థాయి సిబ్బంది ఈ అవకాశాన్ని అదునుగా తీసుకుని వాహనదారులపై మరింత జులుం ప్రదర్శిస్తున్నారనే ఆరొపణలు  కూడా  వినపడుతున్నాయి.
రోడ్డు ప్రమాదాల్లో ఏటా ఇన్ని వేలమంది మరణిస్తున్నారని ప్రభుత్వాలు గణాంకాలు విడుదల చేస్తుంటాయి. కానీ ప్రమాదాల్లో అర్ధాంతరంగా కన్నుమూసిన వారి కుటుంబాల వ్యధ గురించి ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోరు. అకాల మరణం ఒక తీరని వెత అయితే, అందువల్ల వారి వారి కుటుంబాల్లో ఏర్పడే పరిణామాలు, పర్యవసానాలు చాలా తీవ్రంగా వుంటాయి. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి  ఒక కుటుంబానికి ఏకైక ఆధారం కావచ్చు. మంచిగా  చదువుకుంటూ భవిష్యత్తులో ఒక కుటుంబానికి చక్కని ఆసరా కాగలిగిన విద్యార్ధి కావచ్చు. అన్నింటికీ మించి పోయిన ప్రాణం, విలువ కట్టలేని అతి విలువైన ప్రాణం. అలాటివాటికి పరిహారం ప్రత్యామ్నాయం కానేరదు.
నానాటికీ పెరిగి పోతున్న రోడ్డు ప్రమాదాలు ఇటీవలి కాలంలో ఇటు జనాలకు,  అటు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసుల సంగతి చెప్పక్కర లేదు. రోజురోజుకీ రోడ్ల మీదికి అసంఖ్యాకంగా వస్తున్న కొత్త కొత్త వాహనాలు,  తగిన అనుభవం, సరిపడా వయస్సు, అవసరమైన లైసెన్సులు లేకుండానే వాటిని నడపడానికి ఉరకలు వేస్తున్న యువజనాలు, వారికి అడ్డు చెప్పలేని తలితండ్రుల అశక్తత, మామూళ్ళ మత్తులో జోగుతున్న పోలీసు సిబ్బందీ వెరసి ఈ ప్రమాదాలకు కారణం అని విడమరిచి చెప్పాల్సిన పనిలేదు.
అనేక విలువైన ప్రాణాలను గాలిలో కలిపేస్తున్న రోడ్డు ప్రమాదాలకు అనేకానేక కారణాలు. అతివేగం వీటిల్లో ప్రధానమైనది. వేగంగా దూసుకుపోయే అధునాతన మోటారు వాహనాలు, వాటితో వాయువేగంతో ప్రయాణించగల అద్భుతమైన రహదారులు అందుబాటులోకి వచ్చాయి. అయితే,  తాళము వేసితిని, గొళ్ళెము మరచితిని’ అన్న చందంగా  వాటిని నడిపే వారిలో అత్యధికులు పాత పద్దతుల్లోనే వాహనాలను నడపడానికి అలవాటు పడిన వారు. అధవా వాటిని నడిపే మెలకువల్లో ప్రవేశం వున్నా వేగంగా వాహనాలను నడపడంలో వారికి ఉత్సాహం అయితే వుంది కానీ ఎదురుకాగల ప్రమాదాల విషయంలోనే వారిలో ఎరుక లోపిస్తోంది. అందుకే మంచి రోడ్లు, మంచి వాహనాలువున్నా కూడా  రోడ్డు ప్రమాదాలు మాత్రం నానాటికీ పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రయాణం అంటేనే బెరుకు పుట్టిస్తున్నాయి. బాధితుల కుటుంబాల్లో గుబులురేకిస్తున్నాయి. విలువైన మానవ వనరులను ఆవిరి చేస్తున్నాయి.
ఉదాహరణకు హైదరాబాదు నుంచి విజయవాడ వైపు,  అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలను కలుపుతూ కొత్తగా  నిర్మించిన నాలుగు లేన్ల రహదారుల పరిస్తితి కూడా ఏమంత భిన్నంగా లేదు. విశాలమైన రహదారులను విదేశాలకు దీటుగా నిర్మించుకోగలిగాం అని గొప్పలు చెప్పుకోవడం కూడా 'పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న సామెత’ను మరిపించేదిగా వుంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో హైవేస్ (జాతీయ రహదారులు) ని ఫ్రీ వేస్ అంటారు. అవి నగరాలను కలుపుతాయి కాని వాటి మధ్యగా పోవు. దారి నడుమ నగరాలను కలుపుతూ మళ్ళీ అనుసంధాన మార్గాలు వుంటాయి. అదే మన దగ్గర హైదరాబాదు - విజయవాడ జాతీయ రహదారి విషయం చూడండి. రోడ్డు కొన్ని చోట్ల వూళ్ళ మీదుగా పోతుంది. మరికొన్ని చోట్ల వూళ్ళ నడుమ నిర్మించిన  ఫ్లయ్ వోవర్ల మీదుగా వెడుతుంది. ఇంకొన్ని చోట్ల ఊళ్లకు దూరంగా వెడుతుంది. అంటే ప్రతిచోటా రాజకీయ వొత్తిళ్ళ వల్లనో లేక వేరే మరో కారణం చేతనో  రోడ్డు 'రూటు' మారిపోయిందని అనుకోవాలి.  అంటే అర్ధంఏమిటి? రోడ్డు నిర్మాణ సమయంలో అవసరమైన భద్రతా ప్రమాణాల విషయంలో శ్రద్ధ పెట్టలేదనుకోవాలి. జాతీయ రహదారిలో ఒక్క నల్గొండ జిల్లాలోనే ఏటా వెయ్యిమంది రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు  కోల్పోతున్నారని లెక్కలు తెలుపుతున్నాయంటే భద్రత పట్ల పెట్టాల్సిన శ్రద్ధ తగ్గిందని కూడా అనుకోవాలి. విషయం అలా వుంచండి.  అధికారులు నిర్ణయించిన వేగ  పరిమితుల్లోనే వాహనాలు నడుపుతున్నవారికి కూడా హఠాత్తుగా రోడ్డు మధ్యలో ఆవులూ, గేదెలు  ఇతర జంతువులు  కనిపిస్తే, రాంగు రూటులో ఎదురుగా దూసుకువస్తున్న మరో వాహనం ఎదురయితే,  'యాక్సిడెంటు' సంగతి దేవుడెరుగు ముందు గుండె ఆగినంత పనవుతుంది.
ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం వుంటుంది. సమస్యలు కంటికి కానవస్తాయి. పరిష్కారాలు మాత్రం వెతుక్కుంటేనే దొరుకుతాయి. 
రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా పరిష్కారం వుంది. పుణేలో ఓ ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్ధినులు, అదితి దాంబే, ఉపాసన గాంధే కలిసి  ఈ  అంశంపై దృష్టి సారించారు. వారికి చదువు చెప్పే అధ్యాపకురాలు వర్షా  బెంద్రే  ఈ విషయంలో వారికి సహకరించారు. రాదారి ప్రమాదాలను అరికట్టడానికి ఈ ‘పుణే త్రయం’ కనుగొన్న  విధానం గురించిన పరిశోధనాపత్రం  నిజానికి 2013 లోనే ఒక అంతర్జాతీయ జర్నల్ లో ప్రచురించడం జరిగింది. ఈ పరిశోధనలు  కేంద్ర పట్టణాభి వృద్ధి మంత్రిత్వ శాఖ దృష్టికి కూడా వెళ్ళడం, అందుకు సంబంధించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం సాగిపోయాయి. అయితే అది ఇంతవరకు కార్యరూపం ధరించినట్టులేదు. ఇప్పటికే మూడేళ్ళ పుణ్యకాలం గడిచి పోయింది కాబట్టి, ఎంతో ఉత్సాహంతో ఈ పరిశోధనలు సాగించిన విద్యార్ధినులు కూడా జీవితంలో స్థిరపడి పోయి అంతటితోనే  ఆ సంకల్పానికి స్వస్తి వాక్యం పలికారేమో తెలవదు.
ఆ పరిశోధనాపత్రం బట్టి చూస్తే రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి వారు ఒక సాంకేతిక పరిజ్ఞానా న్ని రూపొందించారు. ఆర్.ఎఫ్.ఐ.డీ. (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) అనే ఈ నమూనాలో నాలుగు యూనిట్లు వుంటాయి. వీటిని మోటారు వాహనాలకు అమరుస్తారు. కారు నడపడడానికి ముందు ఒక ప్రత్యేకమైన స్మార్ట్ కార్డుని ఉపయోగించాలి. వెంటనే చిన్న టీవీ వంటి తెరపై ఆ డ్రైవరుకు సంబంధించిన అన్ని వివరాలు, అంటే అతడి డ్రైవింగు లైసెన్సు, అది ముగిసే గడువు, అతడు అంతకుముందు చేసిన  ట్రాఫిక్ ఉల్లంఘనలు, కట్టిన జరిమానాలు ఇవన్నీ కనబడతాయి. ఈ యూనిట్ ని వాడకపోతే కారు ముందుకు కదలదు. అలాగే  మరో పరికరం డ్రైవర్ మద్యం తాగి వున్నాడా,  మోతాదు మించి సేవించాడా అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. మద్యం ఎక్కువ తాగివున్న పక్షంలో కారు ఇగ్నీషన్ పనిచేయదు. కారుకి  అమర్చిన మరో పరికరం, ఆర్.ఎఫ్.ఐ.డీ. ట్యాగ్,  సిగ్నల్ జంప్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలను పట్టిస్తుంది. నగరంలో వున్న సిగ్నల్ స్థంభాలకు అమర్చిన మైక్రో కంట్రోల్స్ తో ఈ పరికరం అనుసంధానమై వుంటుంది. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు కారు ఆపకపోతే ఆ విషయాన్ని నమోదు చేయడమే కాకుండా తేదీ, సమయం, వాహనం నెంబరు  మొదలయిన వివరాలను ట్రాఫిక్ కంట్రోల్  రూముకు తెలియచేస్తుంది. అలాగే జాతీయ రహదారుల పక్కన ఏర్పాటు చేసిన సెన్సర్లు కారులోని ఈ పరికరం సాయంతో అది వెళ్ళే వేగాన్ని కనిపెడతాయి. పరిమితికి మించిన వేగంతో ఆ కారు వెడుతున్న విషయం కారులోని డ్రైవర్ తో పాటు కంట్రోల్ రూముకు కూడా వీడియో రూపంలో బట్వాడా అవుతుంది. ఆ కారు నెంబరు, డ్రైవ్ చేస్తున్న వ్యక్తి వివరాలు, వాహనం సొంతదారు ఎవరన్నదీ వెంటనే తెలిసిపోతుంది. ఆర్.ఎఫ్.ఐ.డీ. ట్యాగ్ అమర్చిన వాహనం  టోల్ గేట్  వద్దకు చేరగానే ఆ గేటు వద్ద చెల్లించాల్సిన మొత్తాన్ని లెక్కకట్టి చూపిస్తుంది. బ్యాంకు కార్డుల ద్వారా చెల్లింపులకు వీలుంటుంది. తద్వారా, టోల్ గేట్ల వద్ద వృధా అవుతున్న అమూల్య సమయం ఆదా అవుతుంది.
వినడానికి ఎంతో వింతగా  అనిపించే అనేక విశేషాలతో ఆ ఇంజినీరింగ్ విద్యార్ధినులు ఈ వ్యవస్థకు రూపకల్పన చేసారు.           
మరో విచిత్రం ఏమిటంటే పుణే విద్యార్ధినులు కనుగొన్న పరిష్కారం వంటిదే ప్రస్తుతం  అమెరికాలో ప్రయోగాత్మక దశలో వున్నట్టు తెలుస్తోంది.  మన ఏలికలకు పొరుగింటి పుల్లకూర మహా రుచి కాబట్టి సుదీర్ఘంగా ఆలోచించి, చర్చించి ఈ విధానాన్ని బయట నుంచే బోలెడు డబ్బులు పోసి దిగుమతి చేసుకుంటారేమో తెలవదు.
ప్రమాదాలకు పెద్దంతరం చిన్నంతరం లేదు, పేదా గొప్పా తారతమ్యం లేదు. చివుక్కుమనిపించే నిజం ఏమిటంటే, రోడ్డు ప్రమాదాల్లో కలవారు కన్నుమూస్తే, పత్రికల్లో పతాక శీర్షికలు, సామాన్యులు చనిపోతే సింగిల్ కాలాలు. అంతే  తేడా!  
ఒక ప్రమాదం జరిగినప్పుడు మరీ ప్రత్యేకించి అందులో ఎవరయినా ముఖ్యుడు మరణించినప్పుడు ప్రభుత్వాలు స్పందిస్తాయి. మీడియాలో చర్చలు జరుగుతాయి. వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే దానిపై నిపుణులు సలహాలు ఇస్తారు.
అంతే! అనకూడదు కానీ, మరో ప్రమాదం జరిగి మరో ముఖ్యుడు మరణించేవరకు నిశ్శబ్దం.
కటువుగా అనిపించవచ్చు కాని నిజానికది  'స్మశాన నిశ్శబ్దం'.
ఉపశృతి :
మెయిన్ రోడ్డు తిన్నగా పొతే మా మనుమరాళ్ళు చదువుకునే బెల్ వ్యూ స్కూలు వస్తుంది. కానీ అది ఒక మలుపు తిరిగే చోట మరో రోడ్డు పక్కనుంచి వచ్చి దానిలో కలుస్తుంది. దోవన వచ్చే వాహనదారులు రెండు రోడ్లు కలిసే చోట కాసేపు ఆగి, మెయిన్ రోడ్డులో వేరే వాహనాలు ఏవీ రావడం లేదన్న సంగతి ధ్రువ పరచుకుని కానీ రోడ్డులోకి ప్రవేశించేవారు కారు. అయితే, హైదరాబాద్ ట్రాఫిక్కు అలవాటు పడివున్న నాకు మాత్రం వాహనాలు అదే వేగంతో మెయిన్ రోడ్డులోకి దూసుకు వస్తాయేమో అన్న భీతి పీడిస్తూ వుండేది. ఎందుకంత స్పీడు. కాస్త పక్కగా వచ్చే కార్లను చూసుకుని నడపకూడదా! అనేవాడిని మా వాడు సందీప్ తో.
నమ్మకంఅనేవాడు మా వాడు స్తిరంగా.
అలా దూసుకు రావని ఇక్కడ మా నమ్మకం. వచ్చి తీరుతాయని హైదరాబాదులో మీ నమ్మకం. మా నమ్మకంతో ఇక్కడ మేమిలా స్పీడుగా పోగలుగుతున్నాం. మీ నమ్మకంతో అక్కడ మీరలా ఆచి తూచి నడుపుతున్నారు. ఏదయినా అక్కడ మిమ్మల్నీ, ఇక్కడ మమ్మల్నీ నడుపుతోంది నమ్మకమే! అన్నాడు అమెరికాలో పదిహేనేళ్ళుగా వుంటున్న మా వాడు మరింత నమ్మకంగా.
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595



3 కామెంట్‌లు:

  1. Feel sad about Ramya. Licenses are being given very easily. Before issuing driving licence it should be made mandatory to
    1) conduct a one day session about driving ethics, hazards of rash/drunken driving etc. with videos.
    2) seize the vehicle & mobile whenever anyone uses mobile while driving. Cancel the driving licence immediately.
    3) seize the vehicle and arrest the offender for drunken driving. Cancel the driving licence immediately.

    There is a general degeneration of values in the public. They don't have any respect for other users of road. I should not stop anywhere. Noone should come in my way seems to be the motto.

    I have seen many riders coming in wrong route in full speed with impunity and not even alerting the pedestrians.

    Pedestrians are treated like insects by the vehicle users.

    One can say that 95 % of vehicle drivers in India don't have the proper attitude towards driving. They are unfit to be issued licences.

    రిప్లయితొలగించండి
  2. 2 wheeler nadipe variki Helmet lekunte head injurys I Pranahani.4 Wheeler drive chesevaru seat
    belt pettukokunte accident Inappudu pranahani.E 2 vishayala pai Govt,Courtlu chala seriou ga
    spandistunnaru.Madyapanam,Gutka Hukkalatho etuvanti pranahani ledani vari bhavana? Veetivalana
    enni Kutumbalu nasanam avutunnai, Vydyaniki Mandulaku enta kharchu.AAstulu ammukoni pranalu
    pogottukuntunnaru.Vidya vantulu Pasuprayulynavaru kannu minnu kanakunda speedga drive chestu amayakulanu baliteesukuntunnaru.Chinnari Ramya vari kutubaniki enduke sapam,eavaride sapam.
    E prabhutwanki Samajaniki Nyayadhikarulaku badyatha leeda,Madyapanam,agutka,Hukkalanu ENDUKU
    NISHEDINCHARU.Madyapanam etc lanti vatini protsahinchi Prajala pranalanu phanagapetti awa
    adayam tho prabhutwalu naduputara,vere adaya margalu emi leva.Dayacheci ippatikyna prbhutwalu,Nyaadhikarulu melkoni badhitha kutumbalanu,amayakulanu,Streela pasupu kumkumalanu kapadamani vijnapthi.
    Ravindranath.

    రిప్లయితొలగించండి
  3. @శ్యామలీయం (This article is PUBLISHED IN "SURYA" TELUGU DAILY TODAY, 17-07-2016)

    రిప్లయితొలగించండి