11, జులై 2016, సోమవారం

నిమిషము అనగా ఏడాది

(PUBLISHED IN "SURYA" DAILY ON 14-07-2016, THURSDAY)

ఇదేం లెక్క అంటారా? పరీక్షలు నిర్వహించే వారి లెక్కలు ఇలాగే వుంటాయి.
‘ఒక్క నిమిషం ఆలస్యం అయినా సరే పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదు’
ఎం సెట్ పరీక్షలకు ముందు టీవీల్లో  ఈ  స్క్రోలింగు చకచకా పరిగెత్తుతూ పరీక్షార్దుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తూ వుంటుంది. ఎం సెట్ ఒక్కటే కాదు ఏ సెట్టయినా ఇదొక ఆనవాయితీగా మారిపోయింది. ఏదో సబబైన కారణం వుండి నిమిషం ఆలస్యం అయి పరీక్ష హాల్లో ప్రవేశించని వారు మళ్ళీ పరీక్ష రాయాలంటే ఒక ఏడాది నిరీక్షించాలి. పైగా  ఈ ‘సెట్ల’ కు సప్లిమెంటరీలు కూడా వుండవు,  మార్చి తప్పితే సెప్టెంబరు ఉందిలే అనుకోవడానికి. ఏకంగా ఏడాది ఆగాల్సిందే. అందుకే చెప్పింది, నిమిషం అంటే ఏడాది అని.
పరీక్షలు అనేవి రాసే పిల్లలకే కాదు, వాళ్ళ తలితండ్రుల పాలిట కూడా విషమ పరీక్షలే. ఆ  పరీక్షలే పెద్ద పరీక్ష అనుకుంటే పరీక్ష రాయడం, రాయించడం  మరో పరీక్షగా పరిణమిస్తోంది. రాసే పరీక్షకు సిద్ధం అవడం ఒక పరీక్ష అయితే, ఆ పరీక్షరాయడానికి చదువుతో నిమిత్తం లేని అదనపు  కసరత్తులు కొన్ని చేయాల్సివస్తోంది.
ముందు హాలు టిక్కెట్టు వస్తుందో లేదో అన్న ఆందోళన. వచ్చిన తరువాత అది సరిగా వుందో లేదో అని సరి చూసుకోవడం, అచ్చు తప్పులు వుంటే అదో మనాది. అది బాగుంటే, రాయాల్సిన పరీక్షాకేంద్రం ఆనుపానులు కనుక్కోవడానికి దుర్భిణీ వేసి వెతుకులాడడం. మహానగరంలో వాటి   అడ్రసులు  కనుక్కోవడంలోనే తల ప్రాణం తోకకు వస్తుంది. ఎలాగో అలా కనుక్కుని వెడితే ఇది కాదు మరో చోటికి పొమ్మంటారు. అది వెతుక్కుని వెళ్ళేలోగా పుణ్యకాలం ముంచుకు వస్తుంది. ‘నిమిషం నిబంధన’ నెత్తి మీది కత్తిలా వేలాడుతుంటుంది. ఆ ఆందోళన బుర్రల్ని వాళ్ళ నిరామయం చేస్తుంది. ఇన్నాళ్ళు చదివింది పూజ్యంగా మారి, సమయానికి అక్కరకు రాని కర్ణుడి విలువిద్యను గుర్తుకు తెస్తుంది.
ఈ విషయంలో ఒక  అధికారి ఇచ్చిన వివరణ ఇలా వుంది.
“పోటీ పరీక్షల్లో ప్రతి నిమిషం అమూల్యమైంది. ఒక్క మార్కుతో వందల ర్యాంకులు తేడా వచ్చే అవకాశం వుంది. రైలు ప్రయాణాలు చేసేవాళ్ళు రైలు సమయానికి రాదని ఖచ్చితంగా తెలిసినా ఎందుకయినా మంచిదని  ముందుగానే  స్టేషనుకు వెడతారు. అలాగే విమానాల్లో వెళ్ళే వాళ్ళు నిబంధనల ప్రకారమే  వ్యవహరిస్తారు. ఇక  సినిమాలకు వెళ్ళేవాళ్ళు సరే సరి. టైటిల్స్ నుంచి చూడాలనే కోరికతో నానా ఇబ్బందులు పడయినా సరే సినిమా హాలుకు ఒకింత ముందుగా చేరుకుంటారు. మరి తమ భవిష్యత్తుకు కీలకమైన పరీక్షలకు సకాలంలో చేరుకోవడానికి ఇన్ని విమర్శలు అవసరమా?” 
ఏ విషయంలోనయినా క్రమశిక్షణ అవసరమే. సమయ పాలన మరింత ముఖ్యమే. చిన్నతనంలోనే ఈ రెంటికీ సరయిన పునాదులు పడడం అభిలషణీయమే. ఈ దిశగా అధికారులు కానీ, వారిని పర్యవేక్షించే  ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోవడం కూడా అవశ్యమే.  కాదనలేని సంగతే. అయితే కొండ నాలుకకు మందు వేసే క్రమంలో  వున్న నాలుక ఊడిపోకూడదు. ఇలా  హితోక్తులు పలికేవాళ్ళు తమ మార్గానికి అడ్డం వస్తున్నారని, మార్పుకి వ్యతిరేకులని అనుకోరాదు.

ఎంసెట్ అనేది చదువుకునే పిల్లలకు, వారి తలితండ్రులకి ఒక అపూర్వమైన ఘట్టం. ఈ పరీక్షే తమ  భవితను నిర్దేశిస్తుందని నమ్మేవారు కోకొల్లలు. వారిలోని ఈ నమ్మకమే ప్రైవేటు విద్యా సంస్థలకు కల్పతరువుగా మారుతోంది. కోట్ల రూపాయలు కురిపించే కామధేనువుగా తయారువుతోంది.
ఈ పరీక్షలు రాసేవాళ్ళు జీవితంలో  ఢక్కామొక్కీలు తిన్న బాపతు కాదు. లేలేత ప్రాయంలో వున్నవాళ్ళు. ఈ వయస్సులో ఎటువంటి  ఎదురుదెబ్బలను అయినా  తట్టుకోగల మానసిక నిబ్బరం వారికి వుండదు. తమ బతుకు బాట మార్చే పరీక్ష రాసే అవకాశం చేజారి పోయిందన్నప్పుడు వారికి కలిగే మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. బస్సు తప్పిపోయో, అడ్రసు దొరక్కనో, వారి చేతిలో లేని వేరేదయినా  కారణం చేతనో,  నిమిషం ఆలస్యం అయిందన్న ఒకే ఒక్క కారణం తమ జీవిత ధ్యేయాన్ని తూట్లు పొడుస్తుంటే వారికి కలిగే క్షోభను అర్ధం చేసుకోవడానికి సైకియాట్రిస్టులు కానవసరం లేదు.         
కొద్దిగా మనసు పెట్టి  ఆలోచిస్తే అసలు ఈ నిమిషం నిబంధన ఎంత అర్ధరహితమో అన్నది అర్ధం అవుతుంది.



నిమిషం కూడా లేటు కాకూడదు అంటున్నారు సరే! అది ఏ లెక్క ప్రకారం? పరీక్ష రాసే అభ్యర్ధి పెట్టుకున్న గడియారం ప్రకారమా? గేటు కాపలాదారుడి చేతికి వున్న వాచీ ప్రకారమా? పరీక్ష హాల్లో పర్యవేక్షణ చేసే అధికారుల గడియారాల ప్రకారమా? నిమిషం ఆలస్యాన్ని నిర్ధారించడానికి ఏది ప్రామాణికం? ప్రపంచంలో ఏ రెండు గడియారాలు ఒక సమయం చూపెట్టవని అంటారు. అలాంటప్పుడు నిమిషం ఆలస్యం అయిందా లేదా అనే విషయం ఎవరు నిర్ణయించాలి? అసలు ఈ నిమిషం నిబంధన ఈ ప్రాతిపదిక పైన విధించారు?
ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలస్యం అనేది తమ హక్కుగా పరిగణిస్తున్నప్పుడు, ఒక్క నిమిషం ఆలస్యాన్ని కూడా ఉపేక్షించేది లేదు అనే ఈ వైఖరిని ఒక్క పరీక్షార్ధుల పట్ల  మాత్రమే ఎందుకు వర్తింప చేస్తున్నారు? ఇది  ఏమేరకు సమంజసం?
అధికారులు సమయానికి ఆఫీసులకి రారు. వారికోసం వచ్చిన వారికి, ఇప్పుడే ఒక నిమిషంలో వస్తారు, వేచి వుండండి అనే జవాబు సిద్ధంగా వుంటుంది.  గంటలు గడిచి పోతున్నా ఆ నిమిషం అనేది ఎప్పటికీ రాదు. అదేమని అడిగే హక్కు ఎవరికీ వుండదు. మంత్రులు, ముఖ్యమంత్రుల కోసం సమయానికి  ఎగరాల్సిన విమానాలు ఆగిపోతాయి. బయలుదేరాల్సిన  రైళ్ళు నిలిచిపోతాయి. ఎందుకు ఆలస్యం అని అడిగేవాళ్ళు వుండరు.
ఎవరూ ఎప్పుడూ పాటించని సమయ పాలన అనే నిబంధనను లేలేత ప్రాయంలోని విద్యార్ధుల పట్లనే ఇంత నిర్దయగా ఎందుకు  అమలు చేస్తారు అన్నదే జవాబు దొరకని ప్రశ్న. ఒక్క నిమిషంలో పుట్టేమీ మునగదు అంటూ నీతి సూక్తాలు వల్లె వేసే వాళ్ళే ఈ నిమిషం నిబంధన పట్ల గంభీర ప్రకటనలు చేస్తూ వుండడం విడ్డూరం.
అంశం సమయ పాలన కాబట్టి అందుకు సంబంధించిన మరికొన్ని కబుర్లు చెప్పుకుందాం.
సమయాన్ని ఎవరు పాటించినా పాటించక పోయినా పరవాలేదు కానీ,  రాజకీయ నాయకులు, అధికారులు  పాటించి తీరాలి. ఎందుకంటే, ఈ నియమం వారు  పాటించని పక్షంలో, వారికోసం వేచి చూస్తూ అనేకమంది తమ విలువైన సమయం పాడు చేసుకోవాల్సి వస్తుంది.
ముఖ్యమంత్రి వెంగళరావు వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. పంజాగుట్ట - ద్వారకాపురి కాలనీలోని ఇంటినుంచి ఆయన సచివాలయానికి బయలుదేరారంటే చాలు, గడియారాల్లో టైం సరిచేసుకోవచ్చని చెప్పుకునేవారు. అంత ఖచ్చితంగా ప్రతి రోజూ ఒకే సమయానికి బయలుదేరడంతిరిగి ఇంటికి చేరడం వెంగళరావు గారికే చెల్లింది. తదనంతర కాలంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు సమయపాలన పాటిస్తామని ప్రకటనలు చేయడమే కానీ కానీ నిలబెట్టుకున్నవాళ్ళు లేరు. మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన నియమాన్ని ఎన్నడూ వొదులుకోలేదు. హైదరాబాద్ పొలిమేరల్లోవున్న ఫాం హౌస్ కు వెళ్లడంతిరిగి రావడం అంతా కూడా నిమిషం అటూ ఇటూ తేడా లేకుండా ప్రతి రోజూ ఒక నియమిత సమయంలో జరిగేలా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు.
రేడియో విలేకరిగా వెంగళరావుగారి పద్దతులు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటెఆయన విలేకరుల సమావేశాలను చాలా క్లుప్తంగా ముగించేవారు. రేడియో వార్తలకు తప్ప రోజుల్లో మరెవరికీ టైం కు సంబంధించిన ‘డెడ్ లైన్లు’ వుండేవి కావు. చెప్పాల్సింది చెప్పేసిలేచి నిలబడి - ‘మంచిది వెళ్ళిరండి” అనేవారు. విలేకరులతో మాట్లాడే కొద్దిసమయంలో కూడా రొటీన్ ఫైల్స్ పై సంతకాలు పెడుతూనే వుండేవారు. 
జలగం వెంగళరావు  ఓసారి బ్యాంకర్ల మీటింగు పెట్టారు. ఇప్పట్లోలా అప్పుడిన్ని  ప్రభుత్వ బ్యాంకులు  ఉండేవి కావు. పది మంది బ్యాంకు ఉన్నతాధికారులు హాజరయ్యేవారు.
ముఖ్యమంత్రి ఛాంబరులో మీటింగు. అధికారులు ఎందుకయినా మంచిదని పది నిమిషాలు ముందే వెళ్ళారు. ఇప్పట్లోలా సెక్యూరిటీ  బాదరబందీలు లేవు కాబట్టి వెళ్లి సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి  భద్రతాధికారి సీతాపతిని కలిసారు. ‘రండి రండి మీ కోసమే సి ఎం ఎదురు చూస్తున్నారు’ అంటూ లోపలకు తీసుకువెళ్ళి కూర్చోపెట్టారు. సరిగ్గా చెప్పిన టైముకు నిమిషం తేడా లేకుండా వెంగళరావు గారు గదిలోకి వచ్చారు. ఎజెండా ప్రకారం మాట్లాడాల్సినవి మాట్లాడి, వినాల్సినవి విని, ఇచ్చిన సమయం అరగంట కాగానే మంచిది వెళ్ళిరండి అని వీడ్కోలు పలికారు. గంటలు గంటలు పడిగాపులు పడకుండా వచ్చిన పని పూర్తయినందుకు అధికారులు కూడా సంతోషపడుతూ వెళ్ళిపోయారు.
ఇక నాణేనికి మరోవైపు.
వెంగళరావు తరువాత ముఖ్యమంత్రి అయిన డాక్టర్ చెన్నారెడ్డి  విజయనగరం జిల్లాలో రెండు రోజుల పర్యటన పెట్టుకున్నారు. మొదటి రోజల్లా ఊపిరి  తిరగని కార్యక్రమాలు. రెండో రోజు ఉదయం పది గంటలకు పార్వతీపురంలో విశాఖ గ్రామీణ బ్యాంకు శాఖకు ప్రారంభోత్సవం చేయాలి. అప్పటి కలెక్టర్ భిడే,  ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని  వెంటబెట్టుకుని  పది గంటలకల్లా అక్కడికి చేరుకున్నారు. అప్పటికి నిర్వాహకులు ఎదురు చూస్తూనూ,   ఆహూతులందరూ నిద్రమత్తులోనూ  జోగుతున్నారు. ఎందుకంటే, చెప్పిన ప్రకారం ముఖ్యమంత్రి పది గంటలకే వచ్చారు. కాకపొతే, రాత్రి పది  గంటలకు.  
ఉపశృతి:
ఎనభయ్యవ దశకంలో కౌలాలంపూర్ లో ప్రపంచ తెలుగు  మహాసభలు జరిగాయి. నిర్వాహకుల  ఆహ్వానం మేరకు అంజయ్య  వెళ్ళారు. కారణాలు ఏమైతేనేం కాంగ్రెస్ అధిస్థానం అంజయ్యపై కినుకతో వున్నరోజులవి.  ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరవాత అంజయ్య గారు హోటల్ రూముకి తిరిగొచ్చేసారు. వెంట షరా మామూలుగా నేను. కాస్త నలతగా కనిపించారు. అంత పెద్ద గదిలో ఆయనా నేను ఇద్దరమే. సాయంత్రం అవుతోంది. ఆయన దీర్ఘంగా ఆలోచిస్తూ కిటికీలోనుంచి బయటకు చూస్తున్నారు. విశాలమయిన రోడ్డు. వచ్చే కార్లు. పోయే కార్లు. పక్కనే ఏదో ఫ్యాక్టరీ లాగావుంది.
ఆయన వున్నట్టుండి “చూసావా!” అన్నారు. నాకేమీ అర్ధం కాలేదు.
పొద్దున్న బయలుదేరేటప్పుడు చూసాను. అందులో ( ఫ్యాక్టరీ లో) పనిచేసేవాళ్లందరూ గంట కొట్టినట్టు టైము తప్పకుండా వచ్చారు. అయిదు నిమిషాల్లో లోపలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ అంతే. షిఫ్ట్ పూర్తికాగానే ఠంచనుగా ఇళ్లకు పోతున్నారు. పనిచేసేవాళ్లకు వాళ్లకు కావాల్సింది ఇవ్వాలి. కావాల్సిన విధంగా పని చేయించుకోవాలి. ఇలా మన దగ్గర కూడా చేస్తే కావాల్సింది ఏముంటుంది!” అన్నారాయన యధాలాపంగా.
అంటే ఇప్పటిదాకా ఆయన ఆలోచిస్తోంది ఇదన్నమాట.
కౌలాలంపూర్ తెలుగు మహాసభల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదనీఇందిరాగాంధీ విషయంలో ముఖ్యమంత్రి పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారనీ, హైదరాబాదులో ఒక పత్రిక రాసిన విషయం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న అంజయ్య గారికి “రాజకీయ జ్వరం” పట్టుకున్నట్టు అప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. అందుకే ఆయన సభా ప్రాంగణంలోనే వుండిపోకుండా వొంట్లో బాగోలేదనే నెపంతో హోటల్ రూముకి తిరిగొచ్చేసారని వదంతులు హైదరాబాదు దాకా పాకాయి. ఈయనగారేమో ఇక్కడ తాపీగా కూర్చుని కార్మికులు గురించి ఆలోచిస్తున్నారు. అలావుండేది అంజయ్య వ్యవహారం. (12-07-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595


NOTE: COURTESY IMAGE OWNER

23 కామెంట్‌లు:

  1. ఎదుటివారికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయీ! అన్నట్లు ఉంది యీ నిముషం నిబంధన మీద హడావుడి చేసే అధికారుల తీరు.

    రిప్లయితొలగించండి
  2. యంకే శర్మ11 జులై, 2016 1:38 PMకి

    ఒక్క మార్క్ తేడాతో కొన్ని వందల ర్యాంక్స్ జారిపోయే పోటీ పరీక్షల్లో , ఒక్క నిమిషం చాలు - తలరాత తారుమారు చెయ్యడానికి. లేటు గా వొచ్చి, గుమ్మం దగ్గర నిలబడి MAY I COME IN SIR అని అడిగేది ఎవరబ్బా అని చూసి, మళ్ళీ Answer Sheet మీద concentrate చేసేటప్పడికి మిగతా విద్యార్థుల పుణ్య కాలం లో చాలా తేడా వొచ్చేస్తుంది. సమయ పాలనకు నిర్వచనమైన AIR లో, పని చేసిన మీరే ఇలా రాయడం బాలేదు
    యంకే శర్మ

    రిప్లయితొలగించండి

  3. సెహ భేషు !

    ఓ ఐదు నిముషాల ముందే యుండాలన్న రూలు కి మార్చేస్తే సరి :)


    జిలేబి

    రిప్లయితొలగించండి




  4. ఒక్కని మిషంబు లేటోయ్
    చక్కగ తలరాతమారె చాంసులు బోవన్
    అక్కరకువచ్చు చదువుల్
    దక్కక పాపము జిలేబి తానేడ్చెనురా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. ఇది చాలా గంభీరమైన సమస్య. ఆలస్యమైతే అనుమతించం అనేది విద్యార్ధుల పాలిట ఓ కౄరమైన నిబంధన. ప్రతి పరీక్ష ముందు ఇలా ప్రకటనివ్వడం దాదాపు ఫాషన్ అయిపోయింది. దాని పర్యావసానం గురించి పూర్తి నిర్లక్ష్యపు / insensitive ధోరణి కనబడుతోంది. ఇదివరకట్లో అరగంట ఆలస్యం వరకూ అనుమతించేవారు, ఆ వెసులుబాటు మన పెద్దవాళ్ళు విద్యార్ధులుగా ఉన్నప్పుడే ఉండేది, ఆ రోజుల్లో ట్రాఫిక్ సమస్యలు కూడా లేవు. మరి ఇప్పుడేం తేడా వచ్చింది? ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఊళ్ళు పెరిగాయి, ఊళ్ళోనే దూరాలు పెరిగాయి, ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య బాగా ఎక్కువయి అస్తవ్యస్తంగా తయారయింది, దానికి తోడు హైదరాబాద్లో అయితే మెట్రో పనులు. అసలు పరీక్ష రోజున పరీక్షా కేంద్రం దారిలో ట్రాఫిక్ రద్దీ మరీ ముమ్మరంగా ఉంటుందని అందరికీ తెలిసిన సంగతే (అధికార్లకి మాత్రమే తెలియదనుకోవాలా?). అటువంటి పరిస్ధితుల్లో కొంచెం ఆలస్యం అవడం అనివార్యం. అది అర్ధం చేసుకోకుండా అనుమతించం అని వార్నింగులు ఇవ్వడం ఓ ఘన కార్యమా? ఆలస్యమయిన వాళ్ళు టీవీ కెమేరా ముందు భోరుమనడం (understandably so), అధికార్లని బ్రతిమలాడుతున్న ఫొటోలు మర్నాడు పేపర్ల వాళ్ళు ప్రచురించడం - ఇదంతా ప్రతి పరీక్షప్పుడు తప్పనిసరి తంతులా తయారయింది. విద్యార్ధులు, తల్లిదండ్రులు ఏ రకంగా అధిగమించాలని అధికారుల అభిప్రాయం - ముందు రోజు రాత్రే ఆ కేంద్రానికి జేరుకుని అక్కడే చెట్లకింద నిద్రపోవాలా? (మాకేం సంబంధంలేదు అంటారులెండి అధికారులు, అది తెలిసిందే అయినా మాటవరసకి చెబుతున్నాను). అనుమతిస్తే, పోటీ పరీక్ష కాబట్టి ఆలస్యంగా చేరుకున్న విద్యార్ధులు సమయం సరిపోక మార్కులు తగ్గుతాయని దానికి తగ్గ రాంకే వస్తుందని మానసికంగా సిద్ధ పడవలసిందే. కాని ఓ ఏడాది పోగొట్టుకోవడం కన్నా అదే నయం కదా. మధ్యలో అధికారులకేం తీపు దిగదీసిందీ? ప్రభుత్వం విద్యార్ధుల శ్రేయస్సుకి ప్రాధాన్యత ఇవ్వాలి గానీ వాళ్ళకి నష్టం కలిగించే పనులు చెయ్యడమేమిటి?

    రోజురోజుకీ అధ్వాన్నంగా తయారవుతున్న ట్రాఫిక్ దృష్ట్యా పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే ఇటువంటి నిబంధనల్ని తొలగించాలని, కనీసం పావుగంట వరకూ ఆలస్యం అనుమతించాలనీ ఉద్యమం మొదలవ్వాలి. నాకు తోచిన మార్గాలు చెబుతాను :-
    (.) పెద్దవారు, అనుభవజ్ఞులు, సీనియర్ జర్నలిస్ట్ అయిన మీరు బ్లాగులో వ్రాసిన ఈ వ్యాసాన్ని ఏదన్నా ప్రముఖ వార్తాపత్రికలో ప్రచురణకి కూడా పంపిస్తే బాగుంటుంది.
    (.) అలాగే దీని మీద ఏదన్నా టీవీ ఛానెల్లో చర్చాకార్యక్రమం ఏర్పాటు చేయించండి, దానికి ప్రభుత్వ ప్రతినిధిని కూడా పిలిపించండి.
    (.) ప్రభుత్వంతో సత్సంబంధాలున్న వ్యక్తిగా మీరు సంబంధిత శాఖతో మాట్లాడి చూడచ్చు.
    (.) బ్లాగుల్లో సాంకేతిక నిపుణులు చాలా మందే ఉన్నట్లున్నారు - వారెవరయినా ప్రభుత్వానికి ఆన్‌లైన్ అర్జీ తయారుచేసి ఆన్‌లైన్లో ఉంచితే మనలాంటి ఆలోచనాధోరణున్న వాళ్ళందరూ ఆ అర్జీని సపోర్ట్ చేస్తున్నట్లు బటన్ నొక్కచ్చు. తర్వాత ఆ అర్జీని ప్రభుత్వానికి ఇ-మెయిల్ చెయ్యచ్చు.

    రిప్లయితొలగించండి
  6. @విన్నకోట నరసింహారావు గారికి ధన్యవాదాలు. నేను ఏది రాసినా ముందు బ్లాగులో పోస్ట్ చేస్తాను. దాని మీద వచ్చిన కామెంట్స్ తీసుకుని ఒక వ్యాసంగా మారుస్తాను. తరువాత రెండు మూడు రోజుల్లో అది పత్రికలో వస్తుంది. అయిదారేళ్ళుగా ఇదే పద్దతి. దానివల్ల పొరబాట్లు వుంటే సర్దుబాటు చేసుకోవడానికి వీలుంటుంది. ఒకసారి అచ్చులో వచ్చిన తరువాత ఆ వెసులుబాటు వుండదు. ఈ బ్లాగులో వచ్చిన అంశాలు అన్నీ దరిమిలా పత్రికల్లో వస్తాయి.

    రిప్లయితొలగించండి
  7. సమయం విలువ మీకు తెలియదనికాదు గానీ మామూలు పరీక్షకీ, పోటీ పరీక్షలకీ ఉన్న తేడా జీవితాలను నిర్దేశిస్తున్నపుడు సమయపాలన ఉండాల్సిందే !

    రిప్లయితొలగించండి
  8. fully agree with Narsimha rao sir. This atrocious rule of not allowing late comers should be immediately scrapped. The children and parents alike are put to lot of stress due to this rule. Some overzealous officials behave in cruel manner and try to send the students away even before time. The students should be free to enter the exam halls upto half an hour also.

    Neeharika. You are wrong.

    రిప్లయితొలగించండి
  9. Thank you for endorsing my views on this contemporary and sensitive issue "అజ్ఞాత" గారూ. May your tribe increase.

    రిప్లయితొలగించండి
  10. అరగంట ఆలస్యం అయినా exam hall లోకి వచ్చి ఇతరులను disturb చేస్తాను అంటే బ్లాగుల్లో కాబట్టి సరిపోతోంది.బయట ఎక్కడన్నా ఇలా మాట్లాడండి తెలుస్తుంది.ఇంజనీరింగ్ అంటేనే వేల్యూ పోయింది ఎంసెట్ ఎపుడు తీసేద్దామా అని చూస్తున్నారు.మీరు చెప్పినట్లు చేస్తే ఇంజనీరింగ్ కంటే "టీ కొట్టు" గానీ "క్యోంకి సాస్ భీ కభీ బహూ థీ" సీరియల్ తీసుకోవడమే బెటర్ అనుకునే ప్రమాదం ఉంది. వీళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు అయి (వి)దేశాన్ని ఉద్ధరించేది ఏవిటీ అనుకుంటే అది వేరే సంగతి.

    రిప్లయితొలగించండి
  11. @విన్నకోట నరసింహారావు - ఈ వ్యాసం మరికొంత వివరంగా గురువారం, 14-07-2016 తేదీ 'సూర్య' దినపత్రిక ఎడిట్ పేజీలో వస్తుంది.

    రిప్లయితొలగించండి
  12. పేపర్లో చదివానండి. బ్లాగులో కన్నా వార్తాపత్రికలో ఎక్కువ మంది చదివే అవకాశం ఉంటుంది కదా (ఈ డిజిటల్ కాలంలో నేనన్నది కరక్టేనా? 🤔). మీరు చెప్పింది మరింత మంది ఆలోచిస్తారని ఆశిద్దాం.

    బ్లాగులోనూ, పత్రికలోనూ మీ వ్యాసంలో ఈ క్రింది పేరా ఉంది.
    --------------------------
    "ఈ విషయంలో ఒక అధికారి ఇచ్చిన వివరణ ఇలా వుంది.

    పోటీ పరీక్షల్లో ప్రతి నిమిషం అమూల్యమైంది. ఒక్క మార్కుతో వందల ర్యాంకులు తేడా వచ్చే అవకాశం వుంది. రైలు ప్రయాణాలు చేసేవాళ్ళు రైలు సమయానికి రాదని ఖచ్చితంగా తెలిసినా ఎందుకయినా మంచిదని ముందు గానే స్టేషనుకు వెడతారు. అలాగే విమానాల్లో వెళ్ళే వాళ్ళు నిబంధనల ప్రకా రమే వ్యవహరిస్తారు. ఇక సినిమాలకు వెళ్ళేవాళ్ళు సరే సరి. టైటిల్స్ నుంచి చూడాలనే కోరికతో నానా ఇబ్బందులు పడయినా సరే సినిమా హాలుకు ఒకింత ముందుగా చేరుకుంటారు. మరి తమ భవిష్యత్తుకు కీలకమైన పరీక్ష లకు సకాలంలో చేరుకోవడానికి ఇన్ని విమర్శలు అవసరమా?"
    ----------------------------

    ఆ అధికారి మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయి ! ఒక్క మార్కుతో వందల ర్యాంకులు తేడా వస్తుందనే సత్యాన్ని ఎవరూ కాదనరు. కానీ ఆ నష్టాన్ని ఆలశ్యంగా వచ్చిన అభ్యర్ధే భరిస్తాడు / భరిస్తుంది, మధ్యలో అధికార్లుకేం బాధ? అయ్యో నీకు ర్యాంక్ తక్కువొస్తుంది, అందుకని ఓ సంవత్సరం గోళ్ళు గిల్లుకుంటూ కూచో అంటున్నాడా ఆ అధికారి? ఆ మాటకొస్తే ఆలశ్యంగా వచ్చిన అభ్యర్ధి ఉన్న టైములోనే చురుగ్గా ఆన్సర్ చేసేసి మంచి ర్యాంకే తెచ్చుకుంటాడేమో / తెచ్చుకుంటుందేమో, ఎవరు చెప్పగలరు? అయినా అభ్యర్ధులు ఉద్దేశ్యపూర్వకంగా ఆలస్యం చెయ్యరు కదా? చాలా మటుకు రోడ్డు మీద జరిగే కారణాల వల్లే ఆలస్యం అనివార్యం అవుతుంది ఈ రోజుల్లో. ( ఇంకొకటి - ఎక్కడ ఆలస్యం అయిపోతుందో కొడుకుని త్వరగా పరీక్షాకేంద్రానికి జేర్చాలి అనే ఆత్రుతలో తన బైక్ ప్రమాదానికి గురయ్యి ప్రాణాలు పోగొట్టుకున్నాడో తండ్రి ఆ మధ్య. గుండెలవిసిపోయేలా అంత పరుగులు పెట్టించడం అవసరమా? )

    ఇక ఆ అధికారి ఇచ్చిన తతిమ్మా ఉదాహరణలు కూడా అలాగే ఉన్నాయి. రైలు తప్పిపోతే వెంటనే బస్‌స్టాండ్‌కి పరిగెత్తి బస్ పట్టుకునే "అవకాశం" ఉంటుంది. అలాగే విమానం తప్పిపోతేనూ ప్రత్యామ్నాయాలు ఉంటాయి. సినిమా ఉదాహరణ మరింత హాస్యాస్పదమైన పోలిక.

    నిబంధనలు అనేవి అన్ని పక్షాలకీ న్యాయం చేసేట్లు సమకాలీన పరిస్ధితుల్ని కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందించాలి. ఈ నిబంధనలో అటువంటి లక్షణం కొరవడింది. ఈ సమస్య గురించి మీరు పత్రికలో ప్రచురించారు, బాగుంది. తర్వాత కావలసినది టీవీ ఛానెల్లో చర్చ. మరింత విస్తృతంగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  13. @విన్నకోట నరసింహారావు గారికి. నేను మీరు చెప్పిన అంశాలతో పూర్తిగా ఏకీవభిస్తున్నాను. నిజానికి నా వ్యాసం అంతరార్ధం అదే. కాకపోతే ఒక జర్నలిష్టుగా అవతలి పక్షం అభిప్రాయం కూడా తెలపాల్సిన బాధ్యత నాపై వుంది. అందుకే ఆ అధికారి వివరణ. అందులోని ఔచిత్యం యెంత అన్నది పాఠకులే నిర్ధారించుకుంటారు.

    రిప్లయితొలగించండి
  14. అవునండీ జర్నలిస్ట్‌గా మీ బాధ్యత కదా మరి.
    ఈ సమస్య Human Rights Commission వారి పరిధిలోకి వస్తుందంటారా?

    రిప్లయితొలగించండి
  15. భండారు వారూ, నాకు తెలిసి దేశమంతా ఇదే నియమం పాటిస్తున్నారు. మనకు చానెళ్లు ఎక్కువ & రోజూ ఏదో ఒక "వార్త" కావాలి కనుక గగ్గోలు పెడుతున్నామంతే. ఇటువంటి పోకడల బదులు సమయానికి ఎలా చేరుకోవాలో చెప్పండి అన్ని ఇబ్బందులు తొలిగిపోతాయి.

    99.99% విద్యార్థులు ముందుగానే చేరుకుంటారు. ఏడాదిలో ఒక రోజు (అందునా అతిముఖ్యమయిన రోజు) కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండడం మంచిదే. కొద్ది మంది కోసం నియమాలను మారిస్తే అందరికీ ఆలసత్వం వస్తుంది.

    రిప్లయితొలగించండి
  16. శబ్ద కాలుష్యం సంగతి తేల్చరేమిటి నరసింహారావు గారూ? ఇక్కడ బ్లాగుల్లాగా ఎవరి సోది వారు వ్రాసుకోడానికి నిశ్సబ్దాన్ని పాటించాలి కదా ? మీ చాంతాడంత కమెంట్ లో డిస్ట్రబన్స్ గురించి ఏమి సలహా ఇస్తారు ? ఎంతసేపూ మీరు చెప్పేది అవతలివాళ్ళు ఒప్పుకుని తీరాలా ?

    రిప్లయితొలగించండి

  17. పోటీ పరీక్షల్లో ప్రతి నిమిషం అమూల్యమైంది. ఒక్క మార్కుతో వందల ర్యాంకులు తేడా వచ్చే అవకాశం వుంది. రైలు ప్రయాణాలు చేసేవాళ్ళు రైలు సమయానికి రాదని ఖచ్చితంగా తెలిసినా ఎందుకయినా మంచిదని ముందు గానే స్టేషనుకు వెడతారు. అలాగే విమానాల్లో వెళ్ళే వాళ్ళు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తారు. ఇక సినిమాలకు వెళ్ళేవాళ్ళు సరే సరి. టైటిల్స్ నుంచి చూడాలనే కోరికతో నానా ఇబ్బందులు పడయినా సరే సినిమా హాలుకు ఒకింత ముందుగా చేరుకుంటారు. మరి తమ భవిష్యత్తుకు కీలకమైన పరీక్షలకు సకాలంలో చేరుకోవడానికి ఇన్ని విమర్శలు అవసరమా?"

    రిప్లయితొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  19. మళ్ళా "చాంతాడంత" వ్యాఖ్య వ్రాస్తున్నాను భండారు వారూ 🙂. కానీ వ్రాయక తప్పదు.
    దేశం అంతటా ఇలాగే ఉంది అన్నది బాధితులకి ఊరటనివ్వదు. అయినా ఇదేమైనా Govt of India వారి నిబంధనా, అందరికీ ఒకటే అనుకోవడానికి. పైగా కొన్ని రాష్ట్రాలు పక్కవారిని చూసి అనుకరించుండచ్చు కూడా. ఇక్కడి సమస్య ఇక్కడిది.
    ముఖ్యమైన రోజు కాబట్టే బయట పరిస్ధితుల దృష్ట్యా ఆలస్యమయిన ఆ ఒకరిద్దరికి కూడా అవకాశం కలిపించడం న్యాయం. దీంట్లో ఆ అభ్యర్ధికే కాని, నిర్వాహకులకి వచ్చే నష్టం / కష్టం ఏమిటో నాకర్ధం కావడంలేదు. ఇక కావాలని అలసత్వం చూపిస్తే ఆ అభ్యర్ధులు తామే నష్టపోతారు కదా. అంతేకాని ఆ చిన్నవాళ్ళ భవిష్యత్తుకి ఆటంకం కలిగించేటటువంటి అనవసరమయిన నిబంధనలు పెట్టడం సమంజసం కాదని నా అభిప్రాయం. పోటీ ప్రపంచం పోటీ ప్రపంచం అంటారుగా, మరి ఉత్తిపుణ్యానికి ఓ ఏడాది నష్టమయిపోతే ఆ మేరకు ఆ అభ్యర్ధి పోటీలో వెనక్కి నెట్టబడ్డట్లేగా. అది న్యాయమా? ఇక సమయపాలన ప్రాముఖ్యత గురించి ఆ చిన్నవాళ్ళకి తెలిసొచ్చేలా చెయ్యాలంటే ముఖ్యమయిన పరీక్ష రోజే ముహూర్తం దొరికిందా?
    అలాగే ఆలస్యంగా వచ్చిన వాళ్ళ వల్ల డిస్టర్బన్స్ అంటే "దిక్కులు చూడకు రామయ్యా" అని పరీక్ష ప్రారంభమయ్యే ముందే అభ్యర్ధులందరికీ కలిపి సలహా ఇవ్వడం మంచిది (తతిమ్మా సూచనలతో పాటు). ఈ సూత్రం మామూలు పరీక్ష, పోటీ పరీక్ష రెండింటికీ వర్తిస్తుంది. ఎట్టి పరిస్ధితుల్లోనూ సమయపాలన ఎలా ముఖ్యం అంటామో, అలాగే పరిసరాలు పట్టించుకోని ఏకాగ్రత కూడా అంతే ముఖ్యం మరి.
    పోతే ఈ పరీక్షలేమీ సౌండ్‌ప్రూఫ్ హాళ్ళల్లో నిర్వహించరుగా, శబ్దాలు ఉండనే ఉంటాయి. ఆ శబ్దాలతో సహజీవనం చెయ్యడం మనకి అలవాటేగా.

    ఏతావాతా శ్రీనివాసరావు గారూ, ఎవరెంత నిడివి గల వ్యాఖ్యలు వ్రాసారన్నది ప్రధానం కాదు గానీ ఇంత ముఖ్యమయిన సమస్యని మీరు ఫోకస్‌లోకి తీసుకొచ్చి మంచి పని చేశారని మరోసారి చెప్పడనికి నా ప్రయత్నం. దీన్ని ప్రభుత్వం పట్టించుకునేంత వరకు కొనసాగించాలి.

    రిప్లయితొలగించండి
  20. ఇప్పటికే శబ్దాలతో మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది.

    దిక్కులు చూడకు శ్రీనివాసా !

    రిప్లయితొలగించండి
  21. ఒక్క నిమిషం ఆలస్యం కారణం గా ఇంకో ఏడాది అనటం అంత సమంజసం కాదేమో. కోట్ల వ్యాపారాలకి పునాది, కొన్ని వేల మంది విద్యార్థుల కి లక్ష్యం ఈ పరీక్ష. పరీక్షా అధికారులు కొన్ని విషయాలు పరిగణ లోకి తీసుకోవాలి మరి!! మీరు చెప్పినాట్లు జీవితం అంటేనే ఎంసెట్ కోసం అన్నట్లు ఉంటారు ఈ పిల్లలు. నీహారిక గారు చెప్పినట్లు ఆలస్యం గా వచ్చి ఇంకొకరిని డిస్టర్బ్ చేయకూడదు కూడా. రెండు విషయాలు పరిగణలోకి తీసుకోవాలంటే :
    అటువంటప్పుడు ముందు గానే పిల్లలు లేదా వారి తల్లి తండ్రుల కి పరీక్షా కేంద్రాల ఎంపిక చేసుకునేట్లు ఒక పది చాయిస్ లు ఇవ్వాలి. ఇంటి దగ్గర ఉన్న పరీక్షా కేంద్రాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతా కంప్యూటరైజ్డ్ అయ్యింది కాబట్టి పెద్ద కష్టం కాదు.
    ఒక్క నిమిషం ఆలస్యం కారణం గా ఇంకో ఏడాది అనటం అంత సమంజసం కాదేమో. కోట్ల వ్యాపారాలకి పునాది, కొన్ని వేల మంది విద్యార్థుల కి లక్ష్యం ఈ పరీక్ష. పరీక్షా అధికారులు కొన్ని విషయాలు పరిగణ లోకి తీసుకోవాలి మరి!! మీరు చెప్పినాట్లు జీవితం అంటేనే ఎంసెట్ కోసం అన్నట్లు ఉంటారు ఈ పిల్లలు. నీహారిక గారు చెప్పినట్లు ఆలస్యం గా వచ్చి ఇంకొకరిని డిస్టర్బ్ చేయకూడదు కూడా. రెండు విషయాలు పరిగణలోకి తీసుకోవాలంటే :
    అటువంటప్పుడు ముందు గానే పిల్లలు లేదా వారి తల్లి తండ్రుల కి పరీక్షా కేంద్రాల ఎంపిక చేసుకునేట్లు ఒక పది చాయిస్ లు ఇవ్వాలి. ఇంటి దగ్గర ఉన్న పరీక్షా కేంద్రాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతా కంప్యూటరైజ్డ్ అయ్యింది కాబట్టి పెద్ద కష్టం కాదు.
    ఇంకొకటి ఆలస్యంగా (ఒక 15 నిమిషాలు కంటే మించకుండా) వస్తే వారిని ఇంకొక గదిలో కూర్చోబెట్టాలి. ఆలస్యం గా వచ్చేవారి సంఖ్య ఎక్కువ శాతం ఉండదు కాబట్టి వారిని కూర్చోబెట్టడం , వేరు వేరు పేపర్లు ఇవ్వటం పెద్ద సమస్య కాదు. ఆలస్యం గా వచ్చేవారికి పరీక్షా సమయాన్ని పెంచకూడదు.
    ఇలా చేయడం కుదరదు అంటే, పైన చెప్పిన విధం గా అమలు పరిచిన ఒకే ఉదాహరణ నా అనుభవం లోకి వచ్చినది చెప్తాను.
    అమెరికా లో పరీక్షా పద్దతి చూసాను, ఈ మధ్యనే మా అమ్మాయి కూడా ఇటువంటి పరీక్ష వ్రాసింది. ఏడాదిన్నర దీనికోసం చదివారు పిల్లలు. ఏదైనా వైద్యపరమైన సమస్య వచ్చిన వారికి కూడా ఒక మేకప్ తారీఖు ఇచ్చారు. అమెరికా లో అయితే ఇంకా మంచు, వాతావరణం కూడా పరిగణ లోకి తీసుకోవాలి. కంప్యూటరైజ్ చేసాక ఏది పెద్ద సమస్య కాకూడదు, మన వారు సాధించలేనిది ఏది లేదని అని నా ఉద్దేశ్యం.

    రిప్లయితొలగించండి
  22. నేను copy & paste చేయటం లో చాంతాడంత కామెంట్ వ్రాసేసినట్లున్నాను :)

    రిప్లయితొలగించండి