27, జులై 2016, బుధవారం

రేడియో భేరి - 5

పడమటి కొండలా? పశ్చిమ కొండలా?

1938 అక్టోబర్ 3 నుంచి పాఠశాల విద్యార్ధుల కోసం ప్రసారాలు మొదలయ్యాయి. తరగతి గదుల్లో చెప్పే పాఠాలను మరింత బాగా తెలుసుకోవడానికి ఈ రేడియో ప్రసారాలు తోడ్పడాలని ఆశించారు. పిల్లలకు ఆసక్తి కలిగించే తీరులో ఆటపాటలనూ, నాటికలను వాడి పాఠాలు చెప్పడానికి ప్రయత్నం జరిగింది. 1938 నవంబర్ 2 నుంచి తెలుగులో గ్రామస్తుల కార్యక్రమాలు మొదలయ్యాయి. విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించాలన్నది ఈ కార్యక్రమాల ధ్యేయం. వ్యవసాయం, పశు పోషణ, పారిశుధ్యం, సహకారం మొదలయిన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. పురాణ పఠనం, జానపద గేయాలు ఈ కార్యక్రమాలలోని తక్కిన అంశాలు. వ్యవసాయానికి సంబంధించిన విషయాలను వ్యవసాయ శాఖ నిర్దేశకుల పర్యవేక్షణలో రూపొందించేవారు. అప్పట్లో మద్రాసు రాజధానిలో వ్యవసాయ నిర్దేశకులుగా వున్న సీ.హెచ్. రామరెడ్డి, రేడియోలో ప్రసారం కోసం తాము ఆమోదించిన ప్రసంగాలు రాసిన అధికారులకుప్రభుత్వ సొమ్ము కాకుండా తానే స్వయంగా ఒక్కొక్క వ్యాసానికీ ఐదేసి రూపాయల చొప్పున ఇచ్చేవారు. ఒకటి రెండు సందర్భాలలో ఆయనే స్వయంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
1939 సెప్టెంబర్ 5 నుంచి ఉదయం, మధ్యాహ్నం ప్రసారాలు మొదలు పెట్టారు. 1939 అక్టోబర్ 1 నుంచి తెలుగులో వార్తాప్రసారాలు మొదలుపెట్టారు. 1939 నవంబర్ 2 నుంచి కళాశాల విద్యార్ధులకోసం ప్రసారాలు ప్రారంభించారు.
ఇన్ని కార్యక్రమాల నేపధ్యంలో – రేడియోకు కొన్ని బాధ్యతలు ఏర్పడ్డాయి. ఉచ్చారణకు సంబంధించి ఓ వొరవడి దిద్దుకోవడంతో పాటు శాస్త్ర సాంకేతిక విషయాల ప్రసారంలో పదాల వాడుకను స్థిరపరచాల్సి రావడం, శ్రోతల స్థాయిని బట్టి వారి వయస్సునుబట్టి అనువైన వాడుక భాషను అలవాటు చేయడం, సంగీత సాహిత్యాలకు సంబంధించి శ్రోతలలో అభిరుచిని పెంపొందించడం, జాపదకళారూపాలను, పాటలను గుర్తించడం, ఔత్సాహికులకు తమ ప్రతిభను కనబరచడానికి అవకాశాలు కల్పించడం, సామాన్య ప్రజల అభిప్రాయాలనూ, అనుభవాలనూ వినిపించడం, శాస్తీయ దృక్పధాన్ని పెంచడం వంటివి ఆ బాధ్యతలలో కొన్ని.
తెలుగుకు సంబంధించి రేడియో వాడుకలోకి తెచ్చిన కొన్ని పదాలు సరైన అవగాహనతో వాడినట్టు కనిపించదు. ఉదాహరణకు- ‘relay’ అనే ఆంగ్ల పదానికి దగ్గరగా ఉండే తెలుగు మాట ‘అంచె’. తమిళంలో నేటికీ ఆ తెలుగుమాటను పోలిన ‘అంజల్’ అనే మాట వాడినా, ఆకాశవాణి తెలుగు కేంద్రాలు మాత్రం ‘రిలే’ అనే ఇంగ్లీష్ పదాన్నే వాడుతుంటాయి. ఉష్ణోగ్రతల విషయంలో - Maximum అనే మాటకు ‘గరిష్ట’ అనీ, minimum అనే మాటకు ‘కనిష్ట’ అనీ వాడుతుంటాయి. కానీ ఇలా చెప్పడంవల్ల ‘ఎక్కువలో ఎక్కువ, తక్కువలో తక్కువ’ అనే అర్ధాలు స్పురించవు. అలాగే, వ్యవసాయానికి సంబంధించి ‘ఆశించడం’ అనే పదాన్ని ‘సోకడం’’ అనే అర్ధంలో వాడకంలో వుంది. ‘పడమటి గోదావరి జిల్లా’ అని ఎంచక్కా అనకుండా ‘పశ్చిమ గోదావరి’ అని అనేస్తుంటారు. పడమటి కొండల్ని పశ్చిమ కొండలు అనడం ఎక్కడయినా విన్నారా? కాకుంటే దేశాల పేర్లు వూర్ల పేర్లు, వ్యక్తుల పేర్లు సరిగా పలకడానికి ఆకాశవాణి ఎప్పటికప్పుడు సూచనలు రూపొందించుకుంటూ వుంటుంది. ఒకరకంగా నేటి తెలుగు ప్రసార మాధ్యమాలు అన్నింటికీ ఆకాశవాణి ‘మూలపుటమ్మ’ అనవచ్చు. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి