23, జులై 2016, శనివారం

రేడియో భేరి -1

రారండోయ్ రారండోయ్  రేడియో చరిత్ర  వినరండోయ్ !
ఇది ఆకాశవాణి  సమగ్ర చరిత్ర అని చెప్పలేను కానీ, ఈ వివరాలు ఇవ్వడంలో సహకరించిన ఆకాశవాణి పూర్వ సంచాలకులు, రచయిత డాక్టర్ పీ.ఎస్. గోపాల కృష్ణ రేడియోకి సంబంధించి ఒక అధారిటీ అని ఘంటాపథంగా చెప్పగలను. ఆయన రాసినవీ, చెప్పినవీ కలబోస్తే ఈ రూపం వచ్చింది. చిత్తగించగలరు.

ఆకాశవాణి
దక్షిణ భారత దేశంలో రేడియో ప్రసారాలు ప్రారంభం కావడానికి కారకులు ఓ తెలుగు వ్యక్తి అంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే. తెలుగువారయిన రావు బహదూర్ సీ వీ కృష్ణ స్వామి సెట్టి, మద్రాసులోనూ, మాంచెస్టర్ లోను విద్యాభ్యాసం చేసి 1914 లో మద్రాసు నగర పాలక సంస్థలో ఎలక్త్రికల్ ఇంజినీర్ గా చేరారు. ఆ నగర వీధులలో మొదటిసారి విద్యుత్ దీపాలు ఏర్పాటుచేసిన ఘనత కూడా వారిదే. 1910లో విమాన ప్రయాణం చేసిన తొలి భారతీయులలో ఆయన కూడా ఒకరు. 1924లో మద్రాసు రేడియో క్లబ్ ద్వారా ఆయన రేడియో ప్రసారాలు మొదలుపెట్టారు. ఈ రేడియో క్లబ్ లో పుర ప్రముఖులు ఎందరో సభ్యులుగా వున్నప్పటికీ, ఆ సంస్థ కార్యదర్శిగా వున్న కృష్ణ స్వామి సెట్టి పాత్ర ప్రధానమైనది. రేడియో క్లబ్ నెలకొల్పాలని ప్రతిపాదించి, ఆ క్లబ్ ద్వారా ప్రసారాలు జరగడానికి ఆయన ఎంతో కృషి చేశారు. 1924 మే 16 న ఏర్పడిన ఈ మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్, 1924 జులై 31 నాడు ప్రసారాలు మొదలు పెట్టింది. అయితే ఆ ప్రసారాలలో సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం వుండేది. 1927 అక్టోబర్ లో మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్ మూతపడింది. కానీ, కృష్ణ స్వామి సెట్టి గారి పూనికతో 1930 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి మద్రాసు నగర పాలక సంస్థ రేడియో ప్రసారాలు ప్రారంభించింది. కాని ఆ ప్రసారాలు కూడా పరిమితమైనవే. ఈ ప్రసారాలలో తెలుగు పాటలు విన్పించినా తెలుగు నాటకాలు వంటివి ప్రసారం అయిన ఆధారాలు లేవు. పోలీసువారి ప్రకటనలు, ఆరోగ్య విశేషాలు కొన్ని ప్రసారం చేసేవారు. బడి పిల్లలకోసం కొన్ని కార్యక్రమాలు వినిపించేవారు. ఈ ప్రసారాలు చిత్తూరు, వేంకటగిరి మొదలయిన చోట్ల వినిపించేవి. వాతావరణం అనుకూలించినప్పుడు బంగాళాఖాతం తీరం వెంబడి వున్న వూళ్ళల్లో విశాఖపట్నం దాకా వినిపించేవని అప్పటి వార్తల వల్ల తెలుస్తున్నది.
1923లో మహబూబ్ ఆలీ అనే తపాలాశాఖ ఉద్యోగి హైదరాబాదులో చిరాగ్ ఆలీ సందులో 200 వాట్ల శక్తి కలిగిన రేడియో కేంద్రం నెలకొల్పాడు. 1935 ఫిబ్రవరి 3 నుంచి అది నిజాం అధీనంలోకి వచ్చింది. ఆ రేడియో కేంద్రంలో ప్రసార భాష ఉర్దూ. ప్రసార శక్తి చాలా తక్కువ కావడం వల్ల ప్రసారాలు చాలా పరిమితమైన దూరాలకే వినిపించేవి.
1939 జులైలో అయిదు కిలోవాట్ల శక్తి కలిగిన రేడియో రిలే కేంద్రాన్ని (ప్రసారిణి) సరూర్ నగర్ ఓ ఏర్పాటు చేసి డెక్కన్ రేడియో పేరిట ప్రసారాలు మొదలు పెట్టారు. ఉర్దూతో పాటు తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో ప్రసారాలు చేసేవారు. అయితే ఉర్దూతో పోలిస్తే తక్కిన భాషల ప్రసారాలు పరిమితంగా వుండేవి. మొహర్రం మాసంలో ప్రసారాలు వుండేవి కావట. కొన్నాళ్ళకు స్టూడియోను సరూర్ నగర్ నుంచి నగరంలోని ఖైరతాబాదులోవున్న యావర్ మంజిల్ కు మార్చారు. రిలే స్టేషన్ (ప్రసారిణి) మాత్రం సరూర్ నగర్ లో వుండేది. తెలుగులో ప్రసారాలు మొదట తక్కువ వ్యవధిలో ఇచ్చేవాళ్ళు. కాలక్రమేణా రోజుకు గంట సేపు ప్రసారాలు చేసేవారు. ఈ కేంద్రం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా, సాయంకాలం అయిదున్నర నుంచి రాత్రి పదిన్నర దాకా ప్రసారాలు చేసేది. హిందూస్తానీ సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. చాలా ఏళ్ళ తరువాత కర్నాటక సంగీతానికి కొంత సమయం కేటాయించసాగారు. ముస్లిం వనితలకోసం పరదా పధ్ధతి, వారికోసం విడిగా వాకిలి ఏర్పాటుచేశారు. వసీంఖాన్ అనే ఆయన తెలుగు కార్యక్రమాల అధికారిగా పనిచేశారు. రాయప్రోలు రాజశేఖర్ సహాయ దర్శకులుగా, భాస్కరభట్ల కృష్ణారావు, దుర్గా చలం కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేసేవారు. కురుగంటి సీతారామయ్య, మహారధి సంభాషణలు, వార్తలు వంటివి రాసేవారు. కే.ఎల్. నరసింహారావు గ్రామీణ కార్యక్రమాలు నిర్వహించేవారు. లలిత, వెంకటేశ్వర్లు అనేవాళ్ళు వార్తలు చదివేవాళ్ళు. మల్లి పాటలు, ఎల్లి పాటలు మొదలయిన శీర్షికలతో జానపద గీతాలు ప్రసారం అయ్యేవి.
1936లో అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వం – భారత దేశంలో రేడియో వ్యాప్తిని గురించి పరిశీలించడానికి నిపుణులను నియమించింది. అప్పుడు మద్రాసు రాజధానిలో తమిళ జిల్లాలతో పాటు కొన్ని తెలుగు, కన్నడ, మళయాళ జిల్లాలు కూడా కలిసివుండేవి. మద్రాసునుంచి నాలుగు భాషల్లో ప్రసారాలు చేయాలనీ, విజయవాడ నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ తెలుగు ప్రసారాలు చేయాలని మొదట్లో అనుకున్నారు. కానీ చివరకు తెలుగు కార్యక్రమాలను కూడా మద్రాసు నుంచే ప్రసారం చేయాలని నిర్ణయించారు. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి