7, జూన్ 2016, మంగళవారం

సమయ పాలన


ఇది నాణేనికి ఒక వైపు.
సమయాన్ని ఎవరు పాటించినా పాటించక పోయినా పరవాలేదు కానీ, రాజకీయ నాయకులు పాటించి తీరాలి. ఎందుకంటే, వారికోసం వేచి చూస్తూ అనేకమంది తమ విలువైన సమయం పాడు చేసుకోవాల్సి వస్తుంది.
జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు బ్యాంకర్ల మీటింగు పెట్టారు. ఇప్పట్లోలా అప్పుడిన్ని  ప్రభుత్వ బ్యాంకులు  ఉండేవి కావు. ఓ పది మంది బ్యాంకు ఉన్నతాధికారులు హాజరయ్యేవారు.
ముఖ్యమంత్రి ఛాంబర్  లో మీటింగు. అధికారులు ఎందుకయినా మంచిదని ఓ పది నిమిషాలు ముందే వెళ్ళారు. ఇప్పట్లోలా సెక్యూరిటీ  బాదరబందీలు లేవు కాబట్టి వెళ్లి సీఎం కార్యాలయంలో అధికారి సీతాపతిని కలిసారు. రండి రండి మీ కోసమే సి ఎం ఎదురు చూస్తున్నారు అంటూ లోపలకు తీసుకువెళ్ళి కూర్చోపెట్టారు. సరిగ్గా చెప్పిన టైముకు నిమిషం తేడా లేకుండా వెంగళరావు గారు గదిలోకి వచ్చారు. ఎజెండా ప్రకారం మాట్లాడాల్సినవి మాట్లాడి, వినాల్సినవి విని ఇచ్చిన సమయం అరగంట కాగానే మంచిది వెళ్ళిరండి అని వీడ్కోలు పలికారు. గంటలు గంటలు పడిగాపులు పడకుండా వచ్చిన పని పూర్తయినందుకు అధికారులు కూడా సంతోషపడుతూ వెళ్ళిపోయారు.
ఇక నాణేనికి మరోవైపు.

అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ చెన్నారెడ్డి గారు విజయనగరం జిల్లాలో రెండు రోజుల పర్యటన పెట్టుకున్నారు. మొదటి రోజల్లా ఊపిరి  తిరగని కార్యక్రమాలు. రెండో రోజు ఉదయం పది గంటలకు పార్వతీపురంలో విశాఖ గ్రామీణ బ్యాంకు శాఖకు ప్రారంభోత్సవం చేయాలి. అప్పటి కలెక్టర్ భిడే,  ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారిని  వెంటబెట్టుకుని  పది గంటలకల్లా అక్కడికి చేరుకున్నారు. అప్పటికి నిర్వాహకులు ఎదురు చూస్తూనూ,   ఆహూతులందరూ నిద్రమత్తులోనూ  జోగుతున్నారు. ఎందుకంటె చెప్పిన ప్రకారం పది గంటలకే వచ్చారు కానీ  కాకపొతే, రాత్రి పది  గంటలకు.  


(పార్వతీపురంలో విశాఖ గ్రామీణ బ్యాంక్ బ్రాంచిని ప్రారంభించిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్  మర్రి చెన్నారెడ్డి) 
     

1 కామెంట్‌:

  1. ఆలస్యం కథ దేవుడెరుగు, ఈ మధ్య పాల్గొనాల్సిన కొన్ని సభలకు, పార్లమెంటు సమావేశాలకు ఎగనామం పెడుతున్నారు, మరి ఇది నాణేనికి ఏ వైపో చెప్పండి. 3 డి కాలం కాదా, థర్డ్ డైమెన్షన్ అనేసుకుందామా :)

    రిప్లయితొలగించండి