5, జూన్ 2016, ఆదివారం

మౌనమే శ్రేయస్కరం


అనగనగా అమ్మ. అమ్మకు ఒక్కగానొక్క కొడుకు. పిల్లలు మంచిగా చదువుకుని వృద్ధిలోకి రావాలనుకునే కన్నతల్లులందరి మాదిరిగానే ఈవిడా తన కన్నకొడుకు విషయంలో తెగ ఆరాటపడింది. చదువు చెప్పే మేష్టార్ని వెదికిపట్టుకుని కొడుకును అప్పగించింది. పొద్దున్నే చద్దన్నం తిని చదువుకోవడానికి వెళ్ళే పిల్లాడిని చూస్తూ మాతృహృదయం మురిసిపోయేది. నాలుగు మంచి ముక్కలు వొంట బట్టించుకుని ప్రయోజకుడు అవుతాడని కలలు కంటున్న తల్లికి అసలు విషయం అర్ధం కాలేదు. పిల్లాడేమో చదువుకు ఎగనామం, పంతులుగారికి పంగనామం పెట్టేసి పగలంతా గాలికి తిరిగేవాడు. పొద్దుగూకేవేళ ఇంటికి తిరిగొస్తూ పొరుగు పెరట్లోని కరివేపాకు రెబ్బలు నాలుగు దొంగతనంగా కోసుకుని బుద్ధిమంతుడిలాగా అమ్మ చేతిలో పెట్టేవాడు. దాంతో కన్నతల్లి మరింత మురిసిపోయేది. నా బాబే! నా తండ్రే! అంటూ గారంగా బెల్లం ముక్క నజరానాగా అతడి చేతిలో పెట్టేది. తల్లి మురిపెం ముచ్చట చూస్తూ పెరిగిన పిల్లాడికి తాను చేస్తున్న తప్పేమిటో అర్ధం చేసుకునే వీలు లేకుండా పోయింది. అతగాడు పెద్దయి- పెద్ద దొంగగా మారి పోలీసుల చేతిలో చిక్కిన తరవాత కానీ తల్లికి కూడా తాను చేసిన తప్పు గ్రహింపుకు రాలేదు.ఇదేమిట్రా! మన ఇంటావంటా లేని దొంగతనాలేమిట్రా! దొంగతనం చేయడం తప్పురా తండ్రీ అంటూ అమ్మ తల్లడిల్లిపోతుంటే ముక్క కరివేపాకు తెచ్చిననాడే చెప్పివుండాల్సిందమ్మా అనేసి దొంగ పిల్లాడు చక్కా జైలుకు పోతాడు.
నీతికధ అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు, మీడియాలో వస్తున్న కధనాలు గమనిస్తున్నప్పుడు కధని మరోమారు నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత వుందనిపిస్తోంది.
మంచివాళ్ల మౌనం మరీ ప్రమాదం అని పెద్దలు జయప్రకాశ్  నారాయణ్ చెబుతుంటారు. అయితే,  చెబితే వినేవాళ్ళు లేనప్పుడు, వినిపించుకునే  పరిస్తితి లేనప్పుడు మౌనమే శ్రేయస్కరమని విదురనీతి చెబుతోంది. నాకు అర్ధం అయినంతవరకు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో  సాగుతున్న  అర్ధం లేని రగడలో విదురుడి మాటే రైటని పిస్తోంది.  

ఇలా మాట్లాడ్డం తగదు అని ఒకరికి చెప్పబోయేలోగా మరొకరు రెచ్చిపోయి మాట్లాడతారు. తెరవబోయిన నోరు ఠక్కున మూతబడిపోతుంది. 

17 కామెంట్‌లు:

  1. మాటకి మాట అనుకునే బదులు ఒక్కోసారి మౌనం వహించడం హుందాగా ఉంటుందని మీరివ్వాళ ఉదయం ఓ టీవీ ఛానెల్లో చర్చా కార్యక్రమంలో చెబుతుండగా విన్నాను. బాగుంది కానీ వినిపించుకునేవారెవరు - ముఖ్యంగా ఈనాటి రాజకీయా నాయకులు? అయినా మంచిమాటలు చెబుతూనే ఉండాలిలెండి.

    రిప్లయితొలగించండి
  2. మౌనం ఒక్కోసారి అంగీకారం కూడా కావచ్చు, సహనం చేతకానితనంగా మారవచ్చు...ఇదే ఇప్పటి రీతి !

    రిప్లయితొలగించండి
  3. > చెబితే వినేవాళ్ళు లేనప్పుడు, వినిపించుకునే పరిస్తితి లేనప్పుడు మౌనమే శ్రేయస్కరమని విదురనీతి చెబుతోంది.

    నిజమేనండీ. కాని నీహారికగారి అభిప్రాయం గమనార్హం. మౌనం అర్థాంగీకారంగాకన్నా అంగీకారంగా లెక్కపెట్టి 'అప్పుడు నువ్వేం‌ మాట్లాడలేదుగా -అంటే ఒప్పుకున్నట్లే' అని నలుగురూ తీర్మానించేదే ఖాయం ఈ లోకరీతిలో. సహనాన్ని అర్థంచేసుకొనేంత విశాలహృదయం ఈ లోకానికి ఎన్నడూ‌ లేదు.
    మౌనాన్ని ఆశ్రయించటం అనేది సర్వత్రా వర్తింపజేయరాదు. మారీచుడి హితబోధ రావణుడికి తలకెక్కక, రాముడికి హాని చేసి ఆనక చావటం కాదు, నా మాటకు ఎదురుచెప్పితే ఇప్పుడే చస్తావు సుమా అంటాడు. అప్పుదు ఒక్క ముక్క

    సులభాః పురుషా రాజన్ సతతం ప్రియ వాదినః
    అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రొతా చ దుర్లభః

    చెప్పి మౌనందాల్చి అతడి ఆనతికి తల ఒగ్గుతాడు. తన మాటవలన ప్రయోజనంలేని పరిస్థితిలో అధికారివద్ద మౌనంగా ఉండకతప్పదు మరి.

    సమర్థులు - అంటే ధర్మాన్ని నిలబెట్టగల హక్కూ బాధ్యతా బలమూ ఉన్నవాళ్ళు - మౌనంగా ఉండటం తప్పు. దానిని ఎత్తిచూపుతూ కురుసభలో‌ శ్రీకృష్ణుడు

    ఉ. సారపు ధర్మమున్ విమలసత్యముఁ బాపముచేత బొంకుచేఁ
    బారముఁ బొందలేక చెడఁబాఱినదైన యవస్థదక్షు లె
    వ్వార లుపేక్షచేసి రది వారలచేటగుఁ గాని ధర్మ ని
    స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్

    ఏవో కుంటిసాకులను చూపి నిష్క్రియాపరత్వంతో మిన్నకుండే వారు అధర్మాన్ని ప్రోత్సహించేవా రవటమే‌కాదు, స్వయంగా అధర్మానికి ఒడిగట్టిన వారూ అవుతున్నారు.

    మంచివాళ్ల మౌనం మరీ ప్రమాదం అన్నది నిజమే. వారు మంచి చెప్పబోయినా చేయబోయినా వినిపించుకోనివారికి ప్రమాదం తప్పదు. కాని మంచివాళ్ళము అనిపించుకొనేందుకు ఊరుకున్నంత ఉత్తమం లేదు అని తప్పుకుంటే ఆ ప్రమాదం వారికే కాదు వారి పుణ్యాన సమాజానికి జరిగే అవకాశం హెచ్చు మరి.

    (ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న అర్ధం లేని రగడలో విదురుడి మాటే రైటని పిస్తోంది. ఈ విషయంలో ఏమీ చెప్పలేను వివరాలు తెలియవు కాబట్టి. ఐనా అంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాపోతేనే అని మౌనంగా ఉండటం మేలనుకుంటున్నారా అన్నది తెలియదు. ప్రస్తుతం కేంద్రం చేస్తున్నది మాత్రం అదేను. అక్కడ ఏ‌పితామహుడూ లేడు ఏ విదురమహాశయుడూ లేడు గాని బోలెడన్ని దుష్టచతుష్టయాలున్నాయని అనిపిస్తోంది. అందరికీ అలా అనిపించక పోవచ్చు లెండి అది వేరే విషయం.)

    రిప్లయితొలగించండి
  4. bane undi..okati idi iddaru nethala kodukulaki anvayinchandi..anthe kani edo okkallake aapadiste..oo antha okavaipe tappu undane bhramalo batukutaru

    రిప్లయితొలగించండి


  5. ఎగగొట్టెను తా చదువుల !
    దిగ జారె తెలియక దొంగ తిరుగుడు లనగన్
    తెగ కరివేపాకుల దె
    చ్చె గదా! వగచెను జిలేబి జెయిలుకు బోవన్ !



    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. మౌనం అర్ధాంగీ కా
    రానికి ప్రతినిధి ! జిలేబి రణరంగమునన్
    ఈనాటి రోజుల పనికి
    రానిది ! సూటిగ పలుకుల రగడలు మేలౌ !

    రిప్లయితొలగించండి
  7. కురుక్షేత్ర సంగ్రామానికి విదురుని తో కూడిన కౌరవ పరివారపు మౌనము కూడ ఒక్క ముఖ్య కారణము, మీరు పాల్గొన్న చర్చా కార్యక్రమము చూడటం జరిగింది, నాదొక సలహా, ఇంకేప్పుడూ రాజకీయ నాయకులు ఉన్న చర్చా గోష్టి లో పాల్గొనకండి, ఉదయాన్నే శబ్దకాలుష్యం తప్ప ఆ గోష్టి వల్ల కలిగే ఉపయోగం ఎమీ లేదు, అక్కడి దాక వెల్లి మౌనం వహించడం కన్నా, ఇంటి దగ్గరే ఉండి కర్ణ భేరులను పదికాలాల పాటు కాపాడుకోవటం సముచితం. రాజకీయలు రాష్ఠ్రాలు ఎలాగూ ఆల్రెడీ వల్లకాట్లోకి వెల్లిపొయాయి, విచారించి ఉపయోగం లేదు. మరొక్క కురుక్షేత్రం వచ్చే దాక భూమాత కు భారంగా మిగిలి పోవడం తప్ప చెయ్యగలిగింది ఎమీ లేదు.

    రిప్లయితొలగించండి
  8. Raju Garu> ఇంకేప్పుడూ రాజకీయ నాయకులు ఉన్న చర్చా గోష్టి లో పాల్గొనకండి
    +1

    రిప్లయితొలగించండి
  9. @శ్యామలీయం, @ రాజు గారు - మంచి సలహాయే. కానీ మీరు టీవీ ఫ్రేముల్లో చూస్తున్నంత దగ్గరగా కూర్చోము. కొంత ఎడం వుంటుంది. కర్ణ భేరీలు దెబ్బతినే పరిస్తితి వుండదు. ఇంట్లో కూర్చుంటే మళ్ళీ మీరు పడుతున్న అవస్తలే నాకు చుట్టుకుంటాయి. అందుకే ఈ కార్యక్రమాలకు నేను ఒక పేరు పెట్టాను. Oral diarrhea, mental constipation. నేనూ భాగమే కనుక, ఈమాట అంటే, ఎవరో బాధ పడతారన్న బాధ లేదు.

    రిప్లయితొలగించండి
  10. ఈ ఉదయపు రాజకీయ చర్చాగోష్ఠులకు కొన్ని నియమాలు తప్పనిసరిగా ఉండాలి.
    1. ఎవరైనా సరే మోడరేటర్ అవకాశం ఇవ్వనిదే నోరెత్తరారు. మోడరేటర్ ఆపమంటే తప్పనిసరిగా మాటలాడటం ఆపాలి.
    2. మోడరేటర్ అవకాశం ఇచ్చినప్పుడు విషయానికి కట్టూబడే మాట్లాడాలి. కేవలం 1ని॥ పరిమితికి లోబడి మాత్రమే మాట్లాడాలి.
    3. మోడరేటర్ మాట్లాడమన్నప్పుడు మాట్లాడేవారి మాటలే ప్రసారం అవుతాయి. మోడరేటకు మైక్ కట్ చేసే అధికారం ఉంది.
    4. ఈ నియమాలకు లోబడని లేదా లోబడలేని వాళ్ళకు చర్చాగోష్ఠుల్లో అవకాశం ఆపైన ఇవ్వరాదు.

    రిప్లయితొలగించండి
  11. ఈ శ్యామల్రావు గారి సలహాలు వింటే ఆచరణలో పెడ్తే టీ వీ చానల్స్ మూత బడి పోవాల్సిందే

    రిప్లయితొలగించండి
  12. >ఈ శ్యామల్రావు గారి సలహాలు వింటే ఆచరణలో పెడ్తే టీ వీ చానల్స్ మూత బడి పోవాల్సిందే
    ఎన్నడో నా చిన్నప్పుడు చదివిన ఒక జోక్. ఒకానొకతను ఉన్నట్లుండి ఆనందంగా ఉండటం మొదలయ్యింది. అప్పటివరకూ నిత్యం దిగులుగా చిరాగ్గా ఉండేవాడిలో ఉన్నట్లుండి ఇంత మార్పేమిటా అని మిత్రబృందం తెగ ఆరాలు తీసింది. అతగాడు మాత్రం మీరంతా నాకో పార్టీ ఇస్తేనే ఆ రహస్యం చెబుతా అన్నాక వాళ్ళకు ఆపార్టీ ఇచ్చి మరీ అడక్క తప్పలేదు. అప్పుడు అతగాడు కులాసాగా ఇలా సెలవిచ్చాడు, "మిత్రులారా, కొన్నాళ్ళ క్రితం నాకు జ్ఞానోదయం కావటం జరిగింది. ఆ దిక్కుమాలిన రేడియో వినటం మానేసాను. అప్పటినుంచీ మనస్సుకు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంది. అదీ అసలు సంగతి" అని. ఆ జోక్ కాలానికి ఈ దిక్కుమాలిన టీవీగోల లేదు మరి - ఆ రేడియోయే అపురూపం. అందుకే, ఆ జోక్ లాగే, ఉదయాన్నే అన్నికొంపల్లోనూ కొంపలంటుకుపోతున్నట్లు రాజకీయాల దొమ్మీలగోలతో ఇంటిగోడలు ఊగిపోతూ మనకు పిచ్చెక్కిపోతూ ఉండటం కన్నా, ఆ దిక్కుమాలిన వార్తాఛానెళ్ళు మూతబడటమే మన మానసిక ఆరోగ్యాలకు ఎంతో మంచిది కదా. ఆలోచించండి!

    రిప్లయితొలగించండి
  13. ఏంటో వయసు పైబడే కొద్దికీ చాదస్తాలు‌; చానెల్ చూడకూడదనుకుంటే టీవీ ని కట్టేస్తే పోలే

    రిప్లయితొలగించండి
  14. అజ్ఞాత అన్నారు కదా, వయసు పైబడే కొద్దికీ చాదస్తాలూ‌ అని, అంతే కదా మరీ - అసలు సంగతి చెప్పేసారు. అందుకనే ఆ గోల భరించలేక టీవీ కట్టేయ్యటమూ, మళ్ళా మర్నాడు ప్రొద్దున్నే వద్దనుకుంటూనే ప్రయత్నించటమూ - బాబోయ్ అనుకుని కట్టెయ్యటమూను. అదేదో సామెత ఉందే, పురాణం వినే కుక్కలాగా అని , అదేమో పురాణం వింటూ బుధ్ధిగా ఉండాలీ‌ అనుకుంటుందట, పంతులుగారు లేచి చక్కాపోగానే అదీ తోకాడిస్తూ లేచి బయటకు రావటంతోనే ఆ బుధ్ధి కాస్తే ఆ కాస్త తోక ఊపుడుతోనే దులిపినట్లై మర్లా పాత ధోరణే నట. అలాగు రాజకీయచర్చల వీరంగాలు చూసి చిరాకుపడతాం ఇంక వీటిని చస్తే చూడకూదదని. కాని మర్నాడు మరో సారి పరాభవం ఆయ్యాక కాని ఆసంగతే గుర్తే రాదు సుమా!

    రిప్లయితొలగించండి
  15. దీనివల్ల తేలిందేమంటే ప్రాబ్లెమ్ మనలో ఉంది టీవీ లో లేదని

    రిప్లయితొలగించండి
  16. అజ్ఞాత> దీనివల్ల తేలిందేమంటే ప్రాబ్లెమ్ మనలో ఉంది టీవీ లో లేదని.
    నిజమే కాబోలు!

    రిప్లయితొలగించండి
  17. అజ్ఞాత>ఏంటో వయసు పైబడే కొద్దికీ చాదస్తాలు‌; చానెల్ చూడకూడదనుకుంటే టీవీ ని కట్టేస్తే పోలే

    సబబుగానే ఉంది, కాని ఈ జాడ్యం మనకు క్లేశం కలిగించకుండానె కాదు, ఆసాంతము నిర్మూలించాలి అనటంలో తప్పు లేదు, ప్రజలలో రాజకీయ సామాజిక చైతన్యము కలిగించడానికి చర్చలు అవసరమే, కాకపోతే లబ్దప్రతిష్టులు కాకుండా మూర్ఖులను కూర్చోబెట్టి ఆ చర్చ నడిపితేనే ఈ సమస్యలు వస్తున్నాయి, అరుపులు గావుకేకలు ఉంటేనే జనాలు చూస్తారు అనే బ్రమ లో చానేళ్ళు ఈ వాగుడు ని మనకు వినిపిస్తున్నాయి, కాని అసలు కర్తవ్యాన్ని వాటికి శ్రీనివాస రావు గారి లాంటి వారి ద్వార చేర్చ గలిగితే ప్రయోజనం ఉండవచ్చు, ఇంటి ముందు చెత్త పడితే ఎన్ని రొజులని తలుపు మూసుకు కూర్చుంటాము, కేవలము నిష్పక్షపాత వైఖరిని అవలంబించే విశ్లేషకులను మాత్రమే చర్చకు ఆహ్వానించాలి, రాజకీయ నాయకులను వారికి వత్తాసు పలికె భట్టు మూర్థులను సాధ్యమైనంత వరకు చర్చలో పాల్గొనకుండా నిలువరించ గలగాలి. ఇప్పటికీ ప్రభుత్వ చానల్లైన లోక్ సభ, రాజ్య సభ టి వి లలో చాలా చర్చలు అర్థవంతంగా జరుగుతున్నాయి, ఆవేశంలో శ్రీనివాస రావు గారిని చర్చలో పాల్గొనవద్దని సలహా ఇచ్చాను, కాని సామాజిక రాజకీయ చైతన్యానికి, ఎన్నో విషయాల మీద అభిప్రాయాలు ఏర్పరుచుకోవడానికి ఈ చర్చలే చాలా మందికి ప్రామాణికం, అటువంటి చర్చల్లొ విగ్నులు కాక మూర్ఖులు పాల్గొంటే సమాజానికి చేటు తప్ప మంచి జరుగదు.

    రిప్లయితొలగించండి