నిన్న మరణించిన మిత్రుడు విష్ణుమూర్తి
గురించిన మరి కొన్ని జ్ఞాపకాలు:
నాయుడమ్మ అవార్డు తీసుకునేవాడు అల్లాటప్పా మనిషి కాకూడదు అనేది
విష్ణుమూర్తి మొదటి షరతు. దానికి కట్టుబడే ఇరవై నాలుగుమందికి ఏడాదికి ఒక్కరి
చొప్పున ఇన్నేళ్ళుగా తెనాలిలో ఇస్తూ వస్తూనే వున్నారు.
ఇక ముఖ్య అతిధి సంగతి, ఆయన ముఖ్యమంత్రి
అయినా, గవర్నర్ అయినా తెనాలి రావాల్సిందే. ఈ షరతు కారణంగా కొందరు రావడానికి
ఒప్పుకుని కూడా రాలేని పరిస్తితి. వారిని తప్పుపట్టడానికి కూడా వీల్లేదు.
ఒకసారి సామ్ పెట్రోడా కి ఇవ్వాలనుకున్నారు. కానీ ఆయన్ని
ఒప్పించడం ఎలా! సోమసుందర్ ఇత్యాది బృందం తలలు పట్టుకున్నారు. చివరికి ఓ మార్గం
దొరికింది. ప్రముఖ చిత్రకారుడు ఎస్వీ రామారావు
గారు చికాగోలో వుంటారు. ఆయనకీ, పెట్రోడా గారికీ స్నేహం. ఆయన్ని పట్టుకుని పెట్రోడా
మహాశయుల్ని ఒప్పించారు. అక్కడికి ఒక సమస్య తీరింది. అవార్డు కార్యక్రమం రోజున ఆయన
ఢిల్లీ నుంచి హైదరాబాదు వస్తారు. ఆయన్ని రోడ్డు మార్గంలో కాకుండా అదేరోజు తెనాలి
తీసుకుపోవాలంటే హెలికాప్టర్ కావాలి. మరెలా! మళ్ళీ మిత్ర బృందం ద్వారకలో భేటీ అయి మరోసారి
తలలు పట్టుకుంది. అంతే! ఓ ఐడియా తలుక్కున మెరిసింది. హెలికాప్టర్ సదుపాయం వున్న
ముఖ్యమంత్రిని ముఖ్య అతిధిగా పిలిస్తే!
ఇక్కడ తెనాలి, తెనాలి వరస కుదిరింది.
పొలోమని వెళ్లి రోశయ్యగారికి చెప్పుకోవడం, ఆయన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని ముఖ్య
అతిధిగా ఒప్పించడం చకచకా జరిగిపోయాయి. అప్పుడు మరో అవాంతరం. అది బయట వాళ్ళనుంచి
కాదు, ఏకంగా విష్ణుమూర్తి గారి నుంచి. చెప్పాకదా! ఆయనో సీతయ్య. హెలికాప్టర్
వెలుతురు వున్నప్పుడే తెనాలి నుంచి టేకాఫ్ అవ్వాలి. ప్రోగ్రాం ని కాస్త ముందుకు
జరపమంటే విష్ణు మూర్తి గారికి అభ్యంతరం. మొత్తం మీద కాస్త పట్టు సడలించేలా చేయడానికి ద్వారకలో (హోటల్లో మిత్రులతో) కాస్త ఎక్కువ సమయం గడపాల్సి
వచ్చింది.
ఇక శుభం కార్డు వేయొచ్చు అనేంతలో వై
ఎస్ ఆర్ ఆ కార్యక్రమానికి హాజరు కాలేని అర్జంటు పనేదో పడింది. అయితే ఆ సమస్యను
ఆయనే తెలివిగా పరిష్కరించారు. రోశయ్యగారయితే ప్రసంగాలు చేయడంలో దిట్ట నా బదులు ఆయన
వస్తారని చెప్పి మొత్తం మీద టెన్షన్ తగ్గించారు. ముఖ్య అతిధిగా రోశయ్యగారు, అవార్డు
గ్రహీతగా సామ్ పెట్రోడా గారు హెలికాప్టర్
లో హైదరాబాదునుంచి తెనాలి వెళ్లి వచ్చారు.
ఇన్నిన్ని పనులు చక్కబెట్టాలంటే ఆ
వ్యక్తీ వెనుక యెంత వుండాలి?
విష్ణుమూర్తి గారి వెనుక ఏమీ లేదు,
కేవలం పట్టుదల తప్ప.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి