శంకరపాదానికి జీవితం మీద విసుగు
పుట్టింది. ఏవిటీ జీవితం?
తినడం తొంగోడం ఇంతేనా జీవిత పరమార్ధం ?
సర్వస్వం త్యజించి అడవుల్లోకి
వెళ్లాడు. కింద పచ్చిక పచ్చగా పట్టు తివాచీ పరచినట్టు వుంది. పక్కన ఆకాశం అంతు
చూడాలన్నట్టు పొడవుగా పెరిగిన వెదురు చెట్లు. దూరంగా ఎవరో కనిపించారు. దగ్గరగా
వెళ్ళి అడిగాడు ఎవరు నువ్వని.
'నేనా! ఈ సృష్టి కర్తను. ఆ చెట్టూ ఈ పుట్టా అన్నీ నేనే సృష్టించాను.
ఇంతెందుకు నువ్వు నీ జాతి మనుషులు అంతా మయా సృష్టం!'
'అలానా! సంతోషం. వెదకపోయిన తీగె కాలికి తగిలింది. ఇప్పుడు చెప్పు. ఇంత
విసుగు కలిగించే జీవితాన్ని నాకు యెందుకు ప్రసాదించావు?'
'పట్టుమని పాతికేళ్ళు కూడా లేవు. నిండు నూరేళ్ళ జీవితం ముందే
వుంది. అప్పుడే నీకు బతుకు మీద రోత పుట్టిందా! దాన్ని వొదిలిపెట్టి
పోవాలన్న కోరిక కలిగిందా!'
'.....................'
'అటు చూడు. ఆ పచ్చిక యెంత బాగుందో. ఇటు చూడు ఈ వెదురు వృక్షాలు యెలా
యెంత ఎత్తు పెరిగాయో! నీకొక విషయం చెబుతా శ్రద్ధగా విను.
'కొన్ని సంవత్సరాల కిందట నేనే స్వయంగా ఈ గరిక విత్తనాల్ని, ఈ వెదురు విత్తనాల్ని ఒకే రోజు నాటాను. నారుపోసిన వాడిని కదా!
నీరు కూడా పోశాను. చిత్రం మరునాడే గరిక మొక్క నేల తల్లిని చీల్చుకుంటూ బయటకు
వచ్చింది. వెదురు విత్తనం ఏమైందో తెలియదు. గరిక మాత్రం ఏపుగా పాకి పచ్చగా అడవి
నేలనంతా మనోహరంగా పరచుకుంది. ఏడాది గడిచింది. రెండేళ్లు గడిచాయి. మూడో ఏడు దాటినా
వెదురు విత్తనం మొలకెత్తే సూచన కానరాలేదు. అయినా నేను నిరాశ పడలేదు.
నాపని వొదిలిపెట్టలేదు. మొలవకపోయినా వెదురు విత్తనం నాటిన చోట నీళ్ళు పోస్తూనే
పోయాను. నాలుగో ఏడు కూడా గడిచింది. ఐదో ఏట బహు చిత్రంగా అక్కడ ఓ చిన్న ఆకు
అపచ్చని మొలక బయటకు వచ్చింది. ఆరునెలలు గడిచాయో లేదో బారెడు పెరిగింది.
ఏడాది తిరిగేసరికల్లా అడవిలో చెట్లకు రాజల్లే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది. ఇంత
ఎత్తు పెరగాలి కాబట్టే అంత లోతుకు వేళ్ళూనుకోవాలి. కాబట్టే, అంతవరకూ వెదురు మొక్క వెలుగు చూడలేదు.
'ఈ నా సృష్టిలో వృధా అంటూ ఏమీ లేదు. ప్రతి దానికీ ఒక పరమార్ధం వుంది.
విసుగుపుట్టి వొదిలేస్తే వొరిగేది ఏమీ వుండదు. నీకంటూ ఓ కర్తవ్యం నిర్దేశించి
వుంది. అది పూర్తిచేసేవరకు విసుగును దూరంగా వుంచు'
శంకరపాదానికి జ్ఞానోదయం కాగానే
సృష్టికర్త అదృశ్యం అయిపోయాడు.
కధ కంచికి. మనం మన బ్లాగులోకం లోకి.
(శ్రీ వాసిరెడ్డి అమరనాథ్ పోస్ట్ చేసిన
ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి