5, మే 2016, గురువారం

ఆసుపత్రి వైరాగ్యాలు


ఎక్కడ చూసినా, ఎటు చూసినా ఈసురోమంటూ రోగులు. చెరగని చిరునగవులతో వారి మధ్యలో తిరుగుతుండే  నర్సులు, గంజాయి పొలంలో తులసి మొక్కల్లా. 
నీరవ  నిశ్శబ్దం. వెలుతురూ, చీకటీ కాని మధ్యస్తపు వెలుతురులో ప్రాణం కొట్టుకుంటున్నట్టుగా ఒంటికి తగిలించిన మిషన్లు  చేసే చప్పుళ్ళు. యముని మహిషపు మెడ గంటల ధ్వనుల మాదిరిగా.
డబ్బులు వద్దు, తిని హరాయించుకోలేని సిరి సంపదలు అసలే  వద్దు, నా ముద్ద అన్నం నేను తినే ఆరోగ్యం ఇవ్వు చాలు దేవుడా!
లోకంలోని రోగాలన్నీ ఆసుపత్రుల్లోనే కొలువు తీరినట్టున్నాయి. ఈ రోగాలూ,  ఈ ఆసుపత్రులూ   అమాంతం ఈ లోకంనుంచి  మాయమయిపోతే యెంత బాగుంటుందో కదా!

కన్నుకింత, పన్నుకింత, గుండెకింత, నడవని కాలుకింత, మడవని కీలుకింత. బొమికగా మారని ఎముకకింత, ఒంట్లో పారే నెత్తురుకింత. అన్నింటికీ లక్షల్లో రేట్లు.  ఖరీదు కట్టని అవయవం అంటూ  ఈ దేహంలో  ఒక్కటయినా ఉందా? ఒక్క రూపాయి  కూడా మారు  అడగకుండా,  అమ్మ కడుపులో వుండగానే  మనిషికి  అన్నీ  అమర్చి,   ఈ భూమ్మీద పడేసిన అద్భుత శక్తికి యెంత ఇస్తే ఆ రుణం తీరాలి?  (02-05-2016)       

8 కామెంట్‌లు:

  1. మాటల్లేవు, లేవ్వు అంతే! :)

    రిప్లయితొలగించండి
  2. @అజ్ఞాత: ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి
  3. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యంతో పాటు ఇక ఆసుపత్రి వైరాగ్యమా? ఈ రకం వైరాగ్యం జబ్బులు పెరిగిపోయిన ఈ రోజుల్లో తప్పించుకోలేరేమోలెండి!

    "చెరగని చిరునగవులతో" రోగుల మధ్య తిరిగే నర్సులెక్కడున్నారండీ బాబూ? లక్షలు గుంజే కార్పొరేట్ హాస్పిటల్సులో కూడా అధికభాగం నర్సులు తుమ్మల్లో పొద్దుగుంకినట్లుండే మొహాలేసుకునే ఉంటారు.

    అన్నట్లు "ఆసుపత్రి" అనకూడదటండీ, బ్లాగుల్లో చెబుతున్నారుగా. అది "హాస్పిటల్" అనే పదానికి అపభ్రంశంట. "వైద్యశాల" అనాలిట :)

    రిప్లయితొలగించండి
  4. @విన్నకోట నరసింహారావు - వెనుకటికో ప్రసిద్ధ రచయిత్రి తన నవలల్లో 'హాస్పత్రి' అని రాసేవారు. చదివినవారు హా అనుకోవాల్సిందే కానీ ఆమె తన బాణీ మార్చుకోలేదు. అయినా అపభ్రంశాలు గురించి పట్టించుకునే రోజులా ఇవి. కంప్యూటర్ లో తేలిగ్గా ఎలా రాయొచ్చు అన్న యావ తప్పిస్తే.

    రిప్లయితొలగించండి
  5. @విన్నకోట నరసింహారావు - ఆసుపత్రి అని రాయకూడదని బ్లాగుల్లో చెబుతున్నారని రాసారు. రైలు బండిని, రోడ్డుని ఎలా రాస్తారో వారిని (సరదాకు) అడిగి చూడండి.

    రిప్లయితొలగించండి
  6. నవలాకారిణులకాలంలో వాళ్ళు చిత్రవిచిత్రాలు చాలానే వ్రాసారు. 1972లో అనుకుంటాను ఒక రచయిత్రి రాజు అనే ఒక టెన్నిస్ క్రీడాకారుడి పాత్రలో చిత్రవిచిత్రం ఒకటి చేయించారు. ఆ రాజు ఆస్ట్రేలియాపోయి అక్కడ ప్రసిధ్ధక్రీడాకారుడు బ్రాడ్‌మన్ అనే అతన్ని ఓడించి కీర్తిగడించాడు!

    ఒక పాకెట్‌బుక్ డిటెక్టివ్ పుస్తకంలో ఐతే ఒక వందసార్లు విమానం టీకాఫీ తీసుకోవటం అన్న ప్రసక్తి వస్తుంది. టేక్ ఆఫ్ అన్నమాటకు తిప్పలన్నమాట ఈ‌ టీకాఫీ.

    హాస్పిటల్ అన్నమాట ఆసుపత్రిగానూ పెన్షన్ అన్నమాట ఫించను గానూ బాగా చలామణీలొ ఉన్నాయి. కంపెనీ‌ అన్నమాటకు కుంఫిణీ అన్న వాడకమూ‌ ఉండేది! హస్పత్రి అనటం కన్నా ఆసుపత్రి అనటం చాలా నయం అనుకోవచ్చును కదా.

    రిప్లయితొలగించండి
  7. @శ్యామలీయం - బాగా చెప్పారు. మీకూ గుర్తుండే వుంటుంది. ఒక ప్రసిద్ధ రచయిత్రి 'నడుము' అని రాయాల్సిన ప్రతి చోటా, కారణం తెలియదు, 'నడ్డి' అని రాసేవారు, యెంత అందమైన అమ్మాయి నడుము అయినా సరే!

    రిప్లయితొలగించండి