25, మే 2016, బుధవారం

బుధజన సందర్శనం


ఒక్కోరోజు  అంతే, మన చేతుల్లో లేకుండా  మంచి వాళ్ళతో గడిచిపోతుంది.
‘పోదామా?’ అంటాడు జ్వాలా ఫోనులో.
సహజబద్ధకం ‘నో’ అనమంటుంది. పొతే, ‘పోయొస్తే పోలా’ అంటూ వెనకనుంచి  మా ఆవిడ రాగాలు. అందుకోసమే ఎదురుచూస్తున్నట్టు వెంటనే ‘ఓకే’ అనేయడం. ఇలా  చేయడం వల్ల గతంలో కూడా  అనేకమంది  పెద్దవాళ్ళను కలవడం జరిగింది. గిరీశం అన్నట్టు  అలాంటివాళ్ళతో  మాట్లాడ్డం ఒక ఎడ్యుకేషన్.
పొత్తూరి వారు అక్షరాలా పెద్దమనుషులు. వారి వస్త్ర ధారణ, మాట తీరు, చిన్నలను మన్నించి పలకరించే పధ్ధతి, ఇవన్నీ ఎప్పుడు అలవడతాయి అనిపిస్తుంది ఆయన్ని చూసినప్పుడు. పొత్తూరి వారి వయస్సు ఎనభయ్ మూడు. నాదీ కాస్త అటూఇటూగా డెబ్బయ్యవ పడి. ఇక ఇప్పుడు ఈ అనుకరణలు ఎందుకు వృధా అని ఆదుర్తి సుబ్బారావు గారి   సినిమాలోలా లోపల నుంచి ఆత్మారాముడి గగ్గోలు.





కాసేపట్లోనే చాలా కబుర్లు చెప్పారు పొత్తూరి గారు. అవన్నీ  రాసుకుంటే సొంతంగా  ఒక  పుస్తకం వేసుకోవచ్చు. కానీ, ఆయన్ని కలవడానికి వెళ్ళిన స్వార్ధపు ఆలోచన వేరే వుంది. ఆయన రాసిన ‘అమరావతి  ప్రభువు వాసిరెడ్డి వేంకటాద్రి నాయడు’ అనే పుస్తకం ఆయనను అడిగి తీసుకోవాలనే ఉద్దేశ్యంతో వెళ్లాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ మధ్యనే  ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
(‘నాయడు’ అని నేను తప్పుగా రాయలేదు, అలా   రాయడానికి కారణం  రచయితే పేర్కొన్నారు ఆ పుస్తకంలో, అయినా నాకు ఇప్పటికీ ఆయన పేరు, వాసిరెడ్డి వేంకటాద్రి ‘నాయుడు’ అనే అనిపిస్తుంది)  


ఈ పుస్తకం పట్ల నా ఆసక్తికి  బాదరాయణ సంబంధం లాంటి మరో  కారణం వుంది. అదేమిటంటే, వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కట్టించిన శివాలయం మా వూరు కంభంపాడులో వుంది. (ఆయన ఇలా అనేక గ్రామాల్లో మొత్తం 108 గుళ్ళు కట్టించారని ప్రతీతి).
మా తాతల కాలం నుంచి మా వూరి గుడికి మా వంశస్తులే  ధర్మకర్తలుగా ఉంటూ వస్తున్నారు.

(ఆ పుస్తకం గురించి మరో సారి, అలాగే ఈ రోజు అనుకోకుండా వెళ్లి కలిసిన మా రేడియో సహోద్యోగి మాడపాటి సత్యవతి గారి గురించి కూడా)           

5 కామెంట్‌లు:

  1. https://archive.org/details/rajavasireddyven022548mbp
    interesting to read book in above link too.

    రిప్లయితొలగించండి
  2. @నీహారిక : నాయుడు, నాయడు విషయంలో రచయిత పొత్తూరి వారి వివరణ ఇలా వుంది.
    “నాయుడు అనే పదం పరిణామ క్రమంలో వాడుకలోకి వచ్చింది. పదం తొలి రూపం నాయండు. (నిజానికి ‘య’ పక్కన ‘అరసున్న’ పెట్టాలి. కానీ, నా కంప్యూటర్ పరిజ్ఞానం, ‘అరసున్న’ టైప్ చేసేంత గొప్పది కాదు కనుక ‘నాయండు’ అని రాయాల్సి వస్తోంది – శ్రీనివాసరావు)
    “వేంకటాద్రి ప్రభువుల వారిని నాటి కవులు అలానే కీర్తించేవారట. 1963 లో ‘శ్రీ రాజా వెంకటాద్రి నాయడు’ అనే గ్రంధం రచించిన కొడాలి లక్ష్మీనారాయణ కూడా ‘నాయండు’ అనే పేర్కొన్నారు. అరసున్నా కలిగిన నాయండు అంటే ప్రభువు అని అర్ధం. ఇతర నైఘంటికార్ధాలు కూడా వున్నాయి.
    ముత్తేవి రవీంద్రనాథ్ తమ ‘తెనాలి రామకృష్ణ కవి, ఒక శాస్త్రీయ పరిశీలన’ అనే గ్రంధంలో ఇలా రాశారు.
    “పలనాటిలో ఒకే హైహయాన్వయంలో కొందరు ఎక్కువ, కొందరు తక్కువ అన్న విబేధాలు వచ్చినట్టే, విజయనగర సామ్రాజ్యంలోని రాజవంశంలో కూడా కొందరు ‘రాయడు’ లేక ‘రాయలు’ అనే బిరుదు ధరిస్తూ పాలకులుగాను, మరికొందరు, ‘నాయకుడు’ లేక ‘నాయండు’ (అరసున్న) అనే బిరుదనామంతో సేనానులుగాను వ్యవహరించేవారు.
    ( ఈ గ్రంధంలో నాయండు అని కానీ, నాయుడు అనికానీ కాకుండా అరసున్న తొలగించి వాడిన శబ్దం నాయడు – గ్రంధకర్త)

    రిప్లయితొలగించండి
  3. భండారు వారూ, మీకు తెలియదని కాదు గానీ, అరసున్నాతో కలిపి "నాయఁడు" అని వ్రాయడానికి naaya@MDu అని టైపు చేస్తే వచ్చేస్తుందండి. lekhini.org లో (మీరు ఇదే ఉపయోగిస్తుంటే) కుడిపక్క క్రిందవైపు "సహాయము" అనే లింక్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చూడచ్చు.

    రిప్లయితొలగించండి
  4. @విన్నకోట నరసింహారావు గారు ధన్యవాదాలండీ. లేఖిని కాకుండా జీ తెలుగు అయితే ఏమైనా తరుణోపాయం వుంటే చెప్పండి.

    రిప్లయితొలగించండి