24, మే 2016, మంగళవారం

నరేంద్ర మోడీ - ప్రధానిగా రెండేళ్ళు

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 26-05-2016, THURSDAY)

సూటిగా....సుతిమెత్తగా....





“మోడీ లాంటి మొగాడు దేశానికి అవసరం”
ఈ మాట చెప్పింది మోడీ అభిమానీ కాదు, బీజేపీ కార్యకర్తా కాదు.
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నరోజుల్లో, ప్రత్యేకించి గోద్రా మారణ హోమం నేపధ్యంలో ఆయనను పూర్తిగా ఖండిస్తూ  పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసిన వ్యక్తి.  పేరు సుహేల్ సేథ్. 
ఈయనకు బహుముఖాలు వున్నాయి.  ప్రచారకర్త, నటుడు, న్యూస్ టీవీ  పండిట్, లాబీ ఇష్ట్, మార్కెటింగ్ గురు, ఇలా సొంతంగా తగిలించుకున్న  విశేషణాలు అనేకం వున్నాయి. ఇవన్నీ పదేపదే చెప్పుకోవడం ఎందుకని అనుకున్నారో ఏమో, సుహేల్ సేథ్ గారి ఫేస్  బుక్ పేజీలో ఏకంగా ‘సర్వజ్ఞుడు’ అని సింపిల్ గా ఒకే పదంతో అయన తనను తాను అభివర్ణించుకున్నారు.
గుజరాత్ లో గోద్రా మారణహోమం అనంతరం నరేంద్ర మోడీ అభినవ హిట్లర్ అంటూ పలు విమర్శలు చేసిన చరిత్ర ఈయనకు వుంది. ఆ సంఘటన మోడీ  జీవితంలో మాయని మచ్చ అన్నారు. అంతే కాదు, ఆ  కారణంగా భారత రాజకీయ వ్యవస్థ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.  
రెండేళ్ళక్రితం నరేంద్రమోడీ ప్రధాన మంత్రి కాగానే ఆయన తన బాణీ మార్చుకుని ఈ దేశం అవసరం మోడీకి లేదు, మోడీ వంటి మొనగాడి అవసరం దేశానికే వుందని  గొప్ప కితాబు ఇచ్చారు.
“ఆయనలో కొన్ని లోపాలు వున్నాయి, కాదనను. కానీ మోడీ వంటి మరో నేత ఈరోజు దేశంలో మరొకరు లేరు. ఇది వాస్తవం. అయన  ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి. ఇది మరో వాస్తవం’ అంటారు సుహేల్ సేథ్.
ఈయన మాటల్ని విశ్వసించాల్సిన అవసరం వుందనుకోను. ఆయనే  స్వయంగా చెప్పుకున్నట్టు  ఆయన ఒక ప్రచారకర్త. తనను తాను పెంచుకునే వ్యూహంలో భాగంగా మోడీ, సోషల్  మీడియాలో సేథ్ వంటి వ్యక్తులను ఉపయోగించుకుంటూ వుంటారని మోడీ  రాజకీయ ప్రత్యర్ధులు ఆరోపిస్తూ వుంటారు. కేవలం ప్రచార ఆర్భాటంతో మోడీ తనకులేని ప్రతిభను అలా చాటుకుంటూ వుంటారని వారి ఉద్దేశ్యం.
కానీ ఇది పూర్తిగా నిజం కాదు. గుజరాత్  ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆ రాష్ట్రం రూపురేఖల్ని ఆయన ఎలా మార్చగలిగిందీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయనలో దాగున్న  సమర్ధ రామదాసు మనకు కనబడతాడు. 
సరే! సేథ్ ఒక ప్రచార కర్త. ఆయన సంగతి అలా ఉంచుదాం.
గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మోడీ పనితీరు గురించి ఒక మిత్రుడు పంపిన సమాచారం ఇది. 
“మోడీ గుజరాత్ సీతయ్య.  కాకపొతే కొంత తేడా వుంది. మన తెలుగు సీతయ్య ఎవడి మాటా వినడు. ఈ గుజరాత్ సీతయ్య అందరి మాటా వింటాడు కానీ చివరకు తాను అనుకున్నదే చేస్తాడు.
“ఉదాహరణకు రాష్ట్రంలో చిన్నపిల్లల్ని స్కూళ్లకు పంపేలా వారి తలితండ్రులను ప్రోత్సహించడం యెలా అన్న ఆలోచన వచ్చిందనుకోండి. వెంటనే సంబంధిత అధికారుల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ల అభిప్రాయాలను సావధానంగా వింటారు. తమ మనసులో మాట స్వేచ్చగా ధైర్యంగా చెప్పేలా అధికారులను ప్రోత్సహిస్తారు. మధ్యలో భోజన సమయం అయితే పదిహేను నిమిషాల్లో ఆపని ముగించుకుని మీటింగుకు హాజరు. అందరూ చెప్పింది జాగ్రత్తగా విని తాను ఒక అభిప్రాయానికి వచ్చి ఏం చేయాలో ఆ ఆదేశాలు జారీచేస్తారు. ఆ తరహా చూసిన వారికి ఒక మిలిటరీ అధికారి తన సైన్యానికి ఆదేశాలు జారీ చేసే విధానం గుర్తుకు రాకమానదు. ఇక అప్పటినుంచి ఆ కార్యక్రమం  పురోగతి గురించి వెంట వెంటనే సమీక్షా సమావేశాలు. ఎప్పటికప్పుడు పరిస్తితిని బేరీజు వేసుకుని తదుపరి ఆదేశాలు. వేసవి సెలవుల్లో మండుటెండలను లెక్కపెట్టకుండా అధికారులను వెంటేసుకుని ఒక నెలంతా పల్లెల్లో పర్యటించి పిల్లల చదువు ప్రాధాన్యతను గురించి ప్రతి ఒక్కరికీ వివరించే ప్రయత్నం మరోపక్క. ఫలితం గురించి చెప్పే పని ఏముంటుంది. రెండేళ్లలో స్కూళ్ళల్లో చేరే పిల్లల సంఖ్య  ఇరవయ్యారు శాతం నుంచి నూటికి  నూరు శాతానికి పెరిగిపోయింది. 
అంతే కాదు, మోడీ ముఖ్యమంత్రి అయిన తరువాత రోడ్డు సౌకర్యం లేని గ్రామం ఆ రాష్ట్రంలో లేదు. మిగులు విద్యుత్ తో రాష్ట్రం వెలిగి పోయింది.”
మోడీ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన్ని గురించి వినవచ్చే కధలన్నీ ఇలాగే వుండేవి. మోడీ లాంటి నాయకులు అయిదుగురు వుంటే చాలు, యావత్ ప్రపంచంలో భారత దేశం అగ్రగామి కావడానికి ఎంతో కాలం పట్టదు’ అంటూ గుజరాత్ ని సందర్శించిన వాళ్ళు చెప్పేవాళ్ళు.
ఇదిగో, సరిగ్గా ఇలాంటి ప్రచారమే గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీని దేశ ప్రజల దృష్టిలో మొనగాడిని చేసింది. మోడీ అనే రెండక్షరాలు  ఆసేతు హిమాచలం మారుమోగి పోయాయి. రెండేళ్ళ నాడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన విజయం ఆయన ఒళ్లో పడింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు.
చూస్తుండగానే రెండేళ్ళు గడిచిపోయాయి. ఇంకా మిగిలింది మూడేళ్ళు. చివరి ఏడాది ఎటూ ఎన్నికల సంవత్సరమే. మధ్యలో రెండేళ్ళు. అందులో రెండో ఏడు కేవలం లెక్కకే.  ఏమి చేయాలన్నా, చేసింది చూపించి జనాలను ఒప్పించాలన్నా , మెప్పించాలన్నా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఈ ఒక్క ఏడాదే మిగిలివున్న వ్యవధి. సరయిన సమయం కూడా.
ప్రధానిగా మొదటి ఏడాది నిరుడు పూర్తి చేసుకున్నప్పుడు మోడీ మీద జనం అభిప్రాయాల్లో మార్పులేదు. 2014లో అఖండ మెజారిటీతో  మోడీకి పట్టం కట్టేటప్పుడు జనంలో ఆయన పట్ల ఎలాంటి నమ్మకం, విశ్వాసం వున్నాయో అవి అలాగే   ఏమాత్రం చెక్కు చెదరకుండా వున్నాయి. ఎంతటి సమర్ధుడికయినా చెప్పినవన్నీ చేసి చూపించడానికి ఒక ఏడాది కాలం చాలా తక్కువ అని జనసామాన్యంలో వున్న అభిప్రాయమే అందుకు కారణం.
అందరికీ  గుర్తుండే వుండాలి. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిరుడు ఇదే రోజుల్లో దేశ ప్రజలకు మోడీ ఒక బహిరంగ లేఖ రాసారు. 
“సేవా పరమో ధర్మః” అనే సూక్తితో మోడీ ఆ లేఖను మొదలు పెట్టారు. ప్రజలకు సేవ చేయడంలో వున్న తృప్తినీ, ఆనందాన్ని తను ఏడాది కాలంగా అనుక్షణం ఆస్వాదిస్తూ వచ్చానని ఆయన అందులో పేర్కొన్నారు.
“అంతులేని అవినీతి రాజ్యమేలుతున్నప్పుడు, నిర్ణయాలు  తీసుకోలేని అసమర్ధ పాలనతో జాతి నవనాడులు కుంగిపోయి వున్న నేపధ్యంలో మీరు నాపట్ల ఎంతో నమ్మకంతో నాకు పగ్గాలు అప్పగించారు.  మీ ఆశలను నిజం చేయడానికే గత ఏడాదిగా నేను అహరహమూ కష్టపడుతూ వచ్చాను’ అన్నారాయన ఆ లేఖలో ఆనాడు.
పేదల అభ్యున్నతికోసం ‘అంత్యోదయ’, పరిశుభ్రత, పారిశుధ్యం కోసం స్వచ్చ భారత్ మొదలయిన ప్రభుత్వ పధకాల జాబితాను ఏకరువు పెట్టారు.
“ఇవన్నీ  ప్రారంభం మాత్రమే. దేశ పౌరులందరికీ నాణ్యమైన జీవితాన్ని అందించడం మా ప్రభుత్వ లక్ష్యం. మీరు కలలు కంటున్న మంచి భారతాన్ని మనం కలిసి నిర్మించుకుందాం. ఈ విషయంలో మీ సంపూర్ణ సహకారం, మద్దతు  నాకు లభిస్తుందన్న విశ్వాసం నాకున్నది’ అంటూ ప్రధాని తన లేఖ ముగించారు.
ఈ మాటలు చెప్పిన తరువాత  మరో ఏడాది కాలగర్భంలో కలిసింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మోడీ అహరహమూ పడుతున్న కష్టం ఏమన్నా ఫలితాలు ఇచ్చిందా అంటే చప్పున  జవాబు చెప్పడం కష్టం.
లోకం చుట్టిన వీరుడు అని పేరు తెచ్చుకుంటున్న మోడీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రధానమంత్రి హోదా వున్నప్పుడు, విదేశీ ప్రభుత్వాల  ఆహ్వానాలు, దేశ విదేశాల్లో పర్యటనలు, ఎర్ర తివాచీ స్వాగతాలు, మీడియాలో ప్రచారాలు ఇవన్నీ సహజాతిసహజం. వాటివల్ల సొంతగడ్డకు యెంత మేలు జరిగిందన్నదే ప్రధానం.
ఏడాదిగా స్వచ్చమైన పాలన అందించామని ఎన్డీయే నాయకులు చెబుతున్న దాంట్లో వాస్తవం వుంది. అయితే యూపీఏ మొదటి విడత మన్మోహన్ సింగ్ పాలన కూడా ఇలాగే స్వచ్చంగా సాగిందన్న నిజాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. పతనం మొదలు కాకూడదు. మొదలయితే ఆ వేగం వడీ యెంత ఉధృతంగా ఉంటాయనేది యూపీయే రెండో విడత పాలన మనకు విడమరచి చెబుతోంది.
గత ప్రభుత్వాల  వైఫల్యాల పాత  జాబితాలను పదేపదే వల్లె వేస్తూ పొతే, ప్రజలు కొంతకాలంపాటే అరాయించుకుంటారు. ఏడాది గడిచిన తరువాత కూడా పాత పల్లవే అందుకుంటూ వుంటే,  ప్రజలు విసిగిపోయి, మరొకర్ని  పల్లకీ ఎక్కించే ఆలోచన మొదలు పెడతారు.      
రాజకీయాల్లో వున్నవాళ్ళు రాజకీయం చేయక తప్పదు. కానీ ప్రజలు, పరిపాలన కూడా పాలకులకు అంతే ప్రధానం. ఈ సత్యం ఎరుకలో వుంచుకుంటే పాలకులకూ మంచిది, ప్రజలకూ మంచిది.
రాజకీయుల దగ్గర లేని ఆయుధం ప్రజల దగ్గర వుంది. తమను ఏమార్చే పాలకులను  అయిదేళ్ళకోమారు సుతారంగా మార్చగల ‘ఓటు’ అనే బ్రహ్మాస్త్రం తమ వద్ద వుందన్న ఎరుక ఇప్పుడు జనంలో వుంది. వారికి ఈ విషయం తెలుసన్న సంగతి పాలకులే తెలుసుకోవాలి.
ఉపశృతి:
నిజాలు ఒక్కోసారి నిజమేనని నమ్మలేనంత
 విడ్డూరంగా వుంటాయి.
మోడీ గురించిన అలాంటి ఒక నిజం చెప్పుకుందాం.
1990 వ సంవత్సరం.
అంటే సుమారు కొంచెం అటూ ఇటుగా పాతికేళ్ళ కిందటి ముచ్చట.
ఇద్డరు యువతులు ఢిల్లీ వెళ్ళడానికి లక్నోలో రైలెక్కారు. ఆ మరునాడే  మళ్ళీ  అహమ్మదాబాదు వెళ్ళాలి. రైలు కదిలేముందు ఇద్దరు బడా నేతలు  అదే బోగీలోకి ఎక్కారు. వారితో పాటే బిలబిలమంటూ మరో డజను మంది వారి అనుచరులు కూడా  జొరబడ్డారు. ఆ యువతుల్ని సామాన్లమీద కూర్చోమని వాళ్ల బెర్తుల్ని  దర్జాగా ఆక్రమించుకున్నారు. రాజకీయనేతలు కదా! పక్కన ఆడవాళ్ళు వున్నారు అనే సోయి   లేకుండా పెద్ద గొంతుకతో, అసభ్య పదజాలంతో  సంభాషణ సాగించారు. వారి ధోరణితో ఆ యువతులు బిక్కచచ్చిపోయారు. ఢిల్లీ చేరేంతవరకు ప్రాణాలు అరచేతపెట్టుకుని ప్రయాణం చేశారు.
మరునాడు రాత్రి ఢిల్లీ నుంచి అహమ్మదాబాదు వెళ్లేందుకు రైలెక్కారు. మళ్ళీ 'మరో' ఇద్దరు నేతలు అదే బోగీలో తారసపడ్డారు. రాత్రి అనుభవం ఇంకా  మనసులో పచ్చిగా  వుండిపోవడంతో  యువతుల భయం రెట్టింపు అయింది. అయితే చిత్రం. ఆ కొత్త వారిద్దరూ ఆ ఇద్దరు ఆడవాళ్లని చూడగానే జరిగి సర్దుకు కూర్చుని చోటిచ్చారు. అనుచరగణం కూడా లేకపోవడంతో తరువాత  ప్రయాణం సాఫీగా సాగిపోయింది.
మరునాడు ఉదయం రైలుదిగి ఎవరిదోవన వాళ్లు వెళ్ళబోయేముందు ఒక యువతి డైరీ తెరచి పట్టుకుని ' నేనూ  నా స్నేహితురాలు ఇద్దరం రైల్వేలో ప్రొబేషనరీ అధికారులుగా పనిచేస్తున్నాము. నా పేరు లీనా శర్మ.  శిక్షణ కోసం ఈ ప్రయాణం పెట్టుకున్నాము. మీవంటి వారు తోడుగా వుండడం వల్ల  రాత్రి మా ప్రయాణం ఎలాటి ఇబ్బంది లేకుండా సాగిపోయింది. ధన్యవాదాలు' అంటూ, మర్యాదకు  వారి పేర్లు అడిగింది.
వారిలో ఒకతను జవాబు చెప్పాడు.
'నా పేరు  శంకర్ సింగ్ వాఘేలా, ఇతడు నా రాజకీయ సహచరుడు నరేంద్ర మోడీ'
అంతే ఈ కధ.
మోడీ ప్రధానమంత్రి అయిన తొలి రోజుల్లో ఆ  రైల్వే  అధికారిణి రాసిన ఈ కధనం ఆంగ్ల దిన పత్రిక  హిందూలో వచ్చింది.
ప్రధానమంత్రి హోదాలో  వున్న ఇప్పటి నరేంద్ర మోడీ గురించి కూడా అలాంటి  ఒక గొప్ప కధనం చదవాలని, వినాలని ఎవరయినా కోరుకుంటే అది అత్యాశ మాత్రం  కాదు. కానీ అలాంటి అవకాశం ఇప్పుడు వుందా అంటే ఆయన  అభిమానులకి  కూడా అనుమానమే.
మరో  మూడేళ్ళ  వ్యవధానం వుంది కదా! వేచి చూద్దాం!
(25-05-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595   




4 కామెంట్‌లు:

  1. మీరు నిజంగా అత్యద్భుతంగా విశ్లేషణ చేస్తారు. టివి ప్రోగ్రాముల్లో నేను అతి తక్కువగా చూసేది రాజకీయ విశ్లేషణల ప్రోగ్రాములు. అప్పుడు అంతగా మీగురించి తెలియదు. ఇప్పుడు ఈ మీ వ్యాసం చదివాక రాజకీయలను ఇంతబాగా కూడా విశ్లేషణ చేయవచ్చా అని ఆశ్యర్యపోతున్నాను. మోడీ గారి మీద మా స్త్రీలందరికీ చాలా ఆశలే ఉన్నాయి. ఆయనలో నిజాయితీ కూడా ఉంది...కొత్తగా నేనేమీ చెప్పనవసరంలేదు మీకూ అందరికీ కూడా ఆయన గురించి బాగానే తెలుసు మీకు ధన్యవాదాలు ఇంత మంచి వ్యాసాలతో అలరిస్తున్నందుకు.

    రిప్లయితొలగించండి
  2. రమణ గారూ,
    మోడీ మీద స్త్రీలందరికీ ఆశలున్నాయన్నారు.నాకు లేశమాత్రం కూడా లేవు.కుటుంబాన్నే ఉద్ధరించలేని వాడు దేశాన్ని ఉద్ధరిస్తాడా ? హిందువని చెప్పుకోడానికి కూడా పనికిరానివాడు హిందువులను ఉద్ధరిస్తాడా ? మీ ఉద్దేశ్యం మీరు చెప్పండి గానీ స్త్రీలందరినీ కలిపి చెప్పకండి.

    రిప్లయితొలగించండి

  3. "ఆయనలో నిజాయితీ కూడా వుంది" ?
    రమణ వామరాజు గారూ,
    ఆంధ్రా విషయంలో అన్ని నాటకాలాడుతున్న వ్యక్తిలో మీకు నిజాయితీ కనబడుతోందా ?
    ఆశ్చర్యమే !

    మీలా ఒకప్పుడు నాక్కూడా ఆయనపై నమ్మకం గౌరవం ఉండేవి. హి జస్ట్ వేర్స్ అ మాస్క్ ఆన్ హిస్ ఫేస్. కాస్తంత పరిశీలనగా చూడండి. మీరు కూడా ఒప్పుకుంటారు.

    రిప్లయితొలగించండి
  4. ఆంధ్రా విషయంలో అన్ని నాటకాలాడుతున్న వ్యక్తిలో మీకు నిజాయితీ కనబడుతోందా ?
    ఆశ్చర్యమే !

    ఆంధ్రా విషయమే కాదు అయోధ్య విషయం లోనూ నాటకాలే !My personal experience....I bet...

    రిప్లయితొలగించండి