థానే చిక్నో స్కార్పా అనే నోరు తిరగని
పేరుగల ఈ బ్రెజిలియన్ పెద్దమనిషికి కళ్ళు తిరిగే ఆస్తిపాస్తులు వున్నాయి. ఖరీదయినా
కార్లూ, విలాసవంతమయిన భవంతులు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని సంపద కలిగిన ఈ అపర
కుబేరుడు ఓ రోజు ఫేస్ బుక్ మాధ్యమంలో జనాలు
ఉలిక్కిపడే కోరిక వెలిబుచ్చాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదయిన కారు అతడి దగ్గర
వుంది. మనసుపడి కొనుక్కున్న ఆ కారుని మిత్రులు,
విలేకరుల సమక్షంలో ‘సమాధి’ చేయడం అన్నది అతడి సంకల్పం. అలా చేయడం వల్ల మరుజన్మలో
కూడా అలాంటి వాహన యోగం మళ్ళీ పడుతుందన్నది అతగాడి నమ్మకం.
యెంత పోయేకాలం వచ్చినా ఇదేమి
పోయ్యేకాలమని ఫేస్ బుక్ లో తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు నోళ్ళు
నొక్కుకుంటూ కామెంట్లు పెట్టారు. అయినా స్కార్పా గారు వెనక్కి తగ్గలేదు. కారు
సమాధికోసం తన ఇంటి పెరట్లో తవ్వుతున్న గొయ్యి ఫోటోలను పోస్ట్ చేసాడు కూడా.
ఆయన అనుకున్న రోజు వచ్చింది. కారు
అంత్యక్రియలు చూడ్డానికి జనాలు, ఈ వింతను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి టీవీల
వాళ్ళు అక్కడికి చేరారు. అంతా చూస్తుండగా స్కార్పా దొరవారి అనుచరులు సకల సమాధి లాంఛనాలతో
ఆ ఖరీదయిన కారును గోతిలోకి దింపుతున్నారు. చూడవచ్చిన వారు కన్నీళ్లు ఉగ్గబట్టిన
విస్పారిత నేత్రాలతో తిలకించడం మొదలు పెట్టారు.
ఆ సమయంలో, ఆ స్మశాన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ స్కార్పా గారి స్వరం ఖంగున మోగింది.
‘ఆపండిక ఈ కార్యక్రమాన్ని, బయటకు తీయండిక గొయ్యిలోకి దించిన కారును’.
చూడవచ్చిన వాళ్ళు నిశ్చేష్టులయ్యారు. కవర్ చేయడానికి వచ్చిన
కెమెరాల వాళ్ళు చేష్టలుడిగి నిలబడ్డారు.
స్కార్పా గొంతు పెంచి ఇలా చెప్పాడు.
‘ఇది చాలా చాలా ఖరీదయిన కారు. ఇది నేను ఎంతో డబ్బు పోసి కొనుక్కున్నాను. కానీ,
ఎలాంటి డబ్బూ డుబ్బూ లేకుండా దేవుడు మనల్ని
పుట్టిస్తూనే ఇంతకంటే ఖరీదయిన వాటిని మనకు పుట్టిన రోజు కానుకగా మనకిచ్చాడు. మనిషి
శరీరంలో వున్న ప్రతి అవయవం ఎంతో అపురూపమైనదే కాదు విలువ కట్టలేనంత విలువైనది. చనిపోయిన
తరువాత వాటిని మనతో సమాధి చేయడానికి ఇచ్చగిస్తామే
వాటి అవసరం వున్న సాటివారికి దానం చేయడానికి మనసు రాదు. డబ్బుతో తప్ప ఏవిధంగాను
విలువలేని ఈ కారును మాత్రం ఎవరికో ఒకరికి ఒదిలిపెట్టి వెళ్ళాలి. ఇదేవిధమైన దాతృత్వమో
మీరే చెప్పండి.
‘మనుషులు ఒదిలి వెళ్ళాల్సింది ఈ
ఖరీదయిన కార్లూ, విలాసవంతమైన భవనాలు కాదు. అవసరమైన వారికి కొత్త జీవితం ప్రసాదించే
మన అవయవాలను. చేతయితే, మనసుంటే వాటిని దానం చెయ్యండి’
NOTE: Photo
courtesy image owner
రిప్లయితొలగించండిథానే చిక్నో స్కార్పా !
మానాన్నే!నీ కిదేర ఆస్కార్! వేదాం
తానిట కారు కథగ లో
కానికి చాటెను జిలేబి కరుణను గనగన్
జిలేబి