సూటిగా.....సుతిమెత్తగా......
“కొన్నేళ్ళ క్రితం హైదరాబాదులోని ఒక రద్దీ కూడలిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంవల్ల కొద్దిసేపు ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం మానేశాయి. దాంతో ఎవరి హడావిడిలో వాళ్ళు పోవడంతో నది రోడ్డు మీద వాహనాలన్నీ అడ్డదిడ్డంగా నిలిచిపోయాయి. వున్న కొద్దిమంది ట్రాఫిక్ సిబ్బంది పరిస్తితిని సరిదిద్దడానికి నానా యాతన పడుతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కాని ఒక స్వచ్చంద సంస్థకు చెందిన కొందరు వాలంటీర్లు రంగప్రవేశం చేయడం, ఎంతో చాకచక్యంగా వాహనాల రాకపోకల్ని సరిదిద్దడం నిమిషాల్లో జరిగిపోయింది. ఆ క్షణంలో అక్కడి జనం అందరూ ముక్త కంఠంతో ఆ స్వచ్చంద సంస్థ సేవలను కొనియాడారు. ఆ సంస్థ పేరు లోక్ సత్తా. సీనియర్ ఐ.ఏ.యస్. అధికారి అయిన జయప్రకాష్ నారాయణ తన పదవినీ, దానితో పాటు వచ్చే అధికారాన్నీ, హంగుల్నీ, అవకాశాలనీ ఒదులుకుని రాజకీయ కల్మషాన్ని కడిగిపారేసి, పరిశుద్ధ సమాజాన్ని ఆవిష్కరించే సదుద్దేశ్యంతో నెలకొల్పిన సంస్థ అది. దురదృష్టం ఏమో గాని కొన్నాళ్ళకి దాన్ని ఓ రాజకీయ పార్టీగా మార్చి వేసారు. ఇప్పుడదే సంస్థకు చెందిన రాజకీయ కార్యకర్తలు మంచి మనసుతో ఏదయినా మంచి పని చేయబోయినా అదంతా ఓట్లకోసం ఆడే నాటకంగా కొట్టివేయడం తధ్యం. రాజకీయ మకిలి అంటుకోవడం వల్ల కలిగే దురదృష్టకర పరిణామం అది.”
“కొన్నేళ్ళ క్రితం హైదరాబాదులోని ఒక రద్దీ కూడలిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంవల్ల కొద్దిసేపు ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం మానేశాయి. దాంతో ఎవరి హడావిడిలో వాళ్ళు పోవడంతో నది రోడ్డు మీద వాహనాలన్నీ అడ్డదిడ్డంగా నిలిచిపోయాయి. వున్న కొద్దిమంది ట్రాఫిక్ సిబ్బంది పరిస్తితిని సరిదిద్దడానికి నానా యాతన పడుతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కాని ఒక స్వచ్చంద సంస్థకు చెందిన కొందరు వాలంటీర్లు రంగప్రవేశం చేయడం, ఎంతో చాకచక్యంగా వాహనాల రాకపోకల్ని సరిదిద్దడం నిమిషాల్లో జరిగిపోయింది. ఆ క్షణంలో అక్కడి జనం అందరూ ముక్త కంఠంతో ఆ స్వచ్చంద సంస్థ సేవలను కొనియాడారు. ఆ సంస్థ పేరు లోక్ సత్తా. సీనియర్ ఐ.ఏ.యస్. అధికారి అయిన జయప్రకాష్ నారాయణ తన పదవినీ, దానితో పాటు వచ్చే అధికారాన్నీ, హంగుల్నీ, అవకాశాలనీ ఒదులుకుని రాజకీయ కల్మషాన్ని కడిగిపారేసి, పరిశుద్ధ సమాజాన్ని ఆవిష్కరించే సదుద్దేశ్యంతో నెలకొల్పిన సంస్థ అది. దురదృష్టం ఏమో గాని కొన్నాళ్ళకి దాన్ని ఓ రాజకీయ పార్టీగా మార్చి వేసారు. ఇప్పుడదే సంస్థకు చెందిన రాజకీయ కార్యకర్తలు మంచి మనసుతో ఏదయినా మంచి పని చేయబోయినా అదంతా ఓట్లకోసం ఆడే నాటకంగా కొట్టివేయడం తధ్యం. రాజకీయ మకిలి అంటుకోవడం వల్ల కలిగే దురదృష్టకర పరిణామం అది.”
జయప్రకాశ్ నారాయణ్ తన సంస్థను రాజకీయ
పార్టీగా మార్చిన కొన్నాళ్ళ తరువాత నేను
ఆయనకు మెయిల్ ద్వారా తెలియచెప్పుకున్న అభిప్రాయం ఇది.
ఆయన తాను అనుకున్న పద్దతిలోనే ముందుకు
పోయారు. రాజకీయాల రంగూ రూపూ మారుద్దామన్న లక్ష్యంతో బరిలోకి దిగిన ఆయనకూ కొద్దో
గొప్పో ఈ రంగు అంటుకుందనే చెప్పాలి. మొత్తం మీద
తొందరగానే తత్వం బోధపడినట్టు వుంది. కొద్దిగా ఆలస్యం అయినా మంచి నిర్ణయం
తీసుకున్నారు. లోక్ సత్తా ఇకపై ఎన్నికల్లో పోటీచేయదని ప్రకటించారు. సంతోషం.
ఇందుగలడందులేడని సందేహము వలదు
అన్నట్టుగా రాజకీయం మకిలి సోకని రంగం అంటూ ఏదీ కనబడని రోజులివి. 'రాజకీయ రంగు'
వంటి కాస్తంత ఉదాత్తమైన పదం వాడకుండా రాజకీయ 'మకిలి' అనే పరుష పద ప్రయోగానికి పూనుకోవడానికి కూడా కారణం వుంది. ప్రజా
సంఘాల పేరుతొ ఏదయినా మంచీ చెడూ చెప్పే ప్రయత్నం జరిగినప్పుడు వారిని 'నడిపేదీ నడిపించేదీ,
కదిలేదీ కదిలించేదీ' ఏదో ఒక రాజకీయ శక్తి అని సందేహిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం.
ధర్మాధర్మవిచక్షణతో కూడిన సద్విమర్శలకు, రాజకీయ కోణంతో చేసే ఆరోపణలకు నడుమ
వున్న తేడాను గమనించకుండా వ్యవహరించడం ఈనాటి పాలకుల పద్దతిగా కానవస్తోంది.
అధికారంలో ఉన్నవాళ్ళకి తాము చేసే
ప్రతిపనీ మంచిగానే కనిపిస్తుంది. సమాజ శ్రేయస్సుకోసం తాము అహరహం కష్టపడుతున్నా
విమర్శలు చేయడం తగదన్న భావన పాలకులది. గతంలో ఆ పనుల్లోని లోటుపాట్లను పరిపాలనలో పాలకులకు తోడ్పడే అధికారులు ఎత్తిచూపి వాటిని
సరిదిద్దడానికి ప్రయత్నించేవారు. ఇప్పటికాలంలో అలాటి అధికారులూ లేరు. అధవా, ఏ అధికారి అయినా కల్పించుకుని చెప్పబోయినా చెవినబెట్టే పాలకులూ లేరు.
చెబితే విననప్పుడు చెప్పడం దండగ అనుకునే వాళ్ళు కొందరయితే, పైవారికి హితవు కాని మాటలు చెప్పి లేని తలనొప్పి తెచ్చిపెట్టుకోవడం
ఎందుకని సర్దుకుపోయే వారు మరికొందరు.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొదటిసారి
ముఖ్యమంత్రి అయినప్పుడు అధికారులకి ఆయన అంటే సింహ స్వప్నం. ఆయన మాట వేదవాక్యం. మాటకు ఎదురు చెబితే, నలుగురి ఎదుటా ఏ మాట పడాల్సివస్తుందో అని బెదిరిపోయేవారు. ఆయన పేషీలో ఎస్.ఆర్. రామమూర్తి అని నిజాయితీకి మారుపేరయిన ఓ ఐ.ఏ.యస్. అధికారి
వుండేవారు. చెన్నారెడ్డి గారి వ్యవహార శైలి విలక్షణం. నిండు పేరోలగం మాదిరిగా, మంత్రులు, శాసన సభ్యులతో కొలువుతీరి కూర్చునేవారు. తన వద్దకు పనుల మీద వచ్చిన అనుయాయులను
సంతృప్తి పరచడానికి 'ఖుద్దున ఆ పని పూర్తిచేయాల'ని అధికారులకి తక్షణ ఆదేశాలు ఇచ్చేవారు. వాటిల్లో నిబంధనల ప్రకారం చేయలేనివి కొన్ని
వుంటాయి. తన నోటి మాటే 'జీవో' అని బాహాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఆయన. అంచేత అలాటి వ్యక్తి
ఆర్డరు వేస్తె కాదనే దమ్ము ఏ అధికారికి వుంటుంది. రామమూర్తిగారు తన 'బాసు' మనస్తత్వాన్ని కనిపెట్టి తదనుగుణంగా ప్రవర్తించేవారు. చెన్నారెడ్డి గారు నలుగురిలో వున్నప్పుడు ఒక పని చెప్పీ చెప్పగానే, వెంటనే 'యస్. సర్. తప్పకుండా అలాగే చేద్దాము' అనేవారు. పని మీద వచ్చిన వాళ్ళు కూడా పనయిపోయిందన్న సంతోషంతో వెనక్కి
మళ్లేవారు. అధికారులు తన మాట 'తూచ' తప్పకుండా వింటున్నారని ముఖ్యమంత్రి అనుకునేవారు. అయితే, తీరా ఆ ఫైలు ముఖ్యమంత్రి సంతకం కోసం వెనక్కి వచ్చినప్పుడు, రామమూర్తిగారు అందులోని మర్మాలను, ఇబ్బందులను ముఖ్యమంత్రికి విడమరచి చెప్పి, ఏ పరిస్తితుల్లోనూ సానుకూల ఉత్తర్వులు
ఇవ్వడానికి వీల్లేదని చెబుతూ,
'నో సర్! ఇది కుదరదు' అని నిక్కచ్చిగా చెప్పేవారు. చెన్నారెడ్డి గారు కూడా హుందాగా తల
పంకించి ఊరుకునేవారు కానీ ఆ విషయం మీద మరింత పట్టుపట్టేవారు కాదు. ఇవన్నీ చూసిన వారు యస్. ఆర్. రామమూర్తి గారిని పరోక్షంలో 'యస్.సర్, రామమూర్తి, నో సర్. రామమూర్తి'
అని హాస్యోక్తిగా అనేవారు. అలాటి అధికారులు
ఈనాడు అసలు లేరని చెప్పలేము కానీ అరుదని మాత్రం ఘంటాపధంగా చెప్పవచ్చు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, ఈ నాటి పాలకులకు ఎదురు చెబితే తట్టుకునే సహనం తక్కువయిపోతోంది.
పాలకులే కాదు అధికార గణం సయితం ఇదే తంతు. అందరికీ మెచ్చుకోళ్ళే కావాలి తప్ప
విచక్షణతో కూడిన విమర్శ పనికిరాకుండా పోతోంది. 'ఎవరు ఎందుకు చెబుతున్నారు, అలా ఎందుకు చెబుతున్నారు' అని ప్రశ్నలు వేసుకుని సరయిన సమాధానాలు
రాబట్టుకోగలిగితే పాలనాసూక్ష్మాలు బోధపడతాయి. టీవీ చర్చల్లో కూడా ఇదే తంతు. తమకు
అనుకూలంగా ఒక్క మాట చెప్పకపోయినా అక్కడికక్కడే అసహనం ప్రదర్శిస్తున్నారు. పార్టీల
ప్రతినిధులే కాదు, చూసే ప్రేక్షకుల తీరూ అలానే వుంది. వారి మనసులో వున్న భావానికి
అనుగుణంగా ఎదుటివాళ్ళు మాట్లాడితీరాలనే పట్టుదల ఒక్కటే కనిపిస్తోంది. దాంతో ఒక్క
రోజు భాగోతానికి మూతి మీసాల సామెత గుర్తుచేసుకుంటూ చెప్పతగ్గ మాటలు, చెప్పాలని అనుకున్న మాటలు చెప్పకుండానే
సర్డుకోవాల్సివస్తోంది. విలేకరుల సమావేశాల్లో కూడా నాయకుల అసహన ప్రదర్శన ఈ
రీతిలోనే సాగుతోంది. దానితో పరిస్తితుల మీదా, పరిణామాల మీదా, అవసరమైన పరిష్కారాల మీదా సరయిన సలహాలు, సూచనలు పొందగలిగే అవకాశాన్ని రాజకీయ
నాయకులు కోల్పోతున్నారు. అధవా ఎవరికయినా అవకాశం వచ్చినా ఏలికల మనసు తెలుసుకునే
పెదవి విప్పుతున్నారు.
నిజమే. రాజకీయ నాయకులకు వారి ఇబ్బందులు
వారికి వుంటాయి. వారి రాజకీయ అనివార్యతలు వారివి. కాదనలేము. 'పీత బాధలు పీతవి'
అన్నట్టు వారి ఇక్కట్లు వారివి. అధికారం అన్న ఓ
దండం చేతిలో వున్న కారణంగా మెడలో పడే దండలు, జనాలు పెట్టే దండాలు మినహాయిస్తే వారి జీవితాలు కూడా పూలపానుపులు కావు. దీన్ని
రుజువుచేసుకోవడానికి సచివాలయానికి వెడితే చాలు. మంత్రి దర్శనం కోసం అప్పటిదాకా
పడిగాపులు పడ్డ జనం ఆయన కనబడగానే మీదపడిపోతారు. అదే ఒక చిన్న అధికారి ఆఫీసులోకి
కూడా చొరవగా జొరబడలేరు. మంత్రులు,
ఎమ్మెల్యేల కార్లలోకి నెట్టుకుదూరిపోయే చోటా
నాయకులు అన్ని చోట్లా కనిపిస్తారు. అదే అధికారులు కనిపిస్తే ఆమడ దూరంలో ఆగిపోతారు. అందుకే ముప్పయ్యేళ్ళ
క్రితమే అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య గారు అనుచరుల తాకిడి తట్టుకోలేక, తొడతొక్కిడి భరించలేక అంబాసిడర్
కారులో డ్రైవర్ పక్కన ముందు సీటుకు
మారిపోయారు.
అసలు విషయానికి వస్తే '
పాలక పక్షం ఒక విధానం ప్రకటిస్తుంది.
ప్రతిపక్షం అందులో వున్న మంచిని పక్కనబెట్టి, కోడి గుడ్డు మీద ఈకలు పీకిన చందంగా దాని వెనుక ఏదో పైకి కనిపించని రాజకీయ వ్యూహం వుందని ఆరోపిస్తుంది.
ప్రతిపక్షం ఒక ఆరోపణ చేస్తుంది. పాలక
పక్షం అందులోని హేతుబద్ధత పట్టించుకోకుండా అదంతా రాజకీయ కుట్ర అంటూ ఒక్క ముక్కలో కొట్టి పారేస్తుంది.
చెడిపోయిన గడియారం సయితం రోజులో రెండు
మార్లు సరయిన టైము చూపిస్తుంది. అలాగే ప్రభుత్వాలు చేసే నిర్ణయాలు అన్నీ సరైనవి
కాకపోవచ్చు కానీ వాటిలో కొన్నయినా జన హితంకోసం చేసినవి వుంటాయి. కానీ ప్రతిపక్షాలు
వాటిని గుర్తించవు. అభినందించవు.
ప్రతిపక్షాలు చేసే ఆరోపణలన్నీ నూటికి
నూరుశాతం ఆధారరహితం కాకపోవచ్చు. వాటిల్లో కొన్నయినా సహేతుకమైనవి కావచ్చు. కానీ అంగీకరించడానికి పాలకపక్షాలు సంసిద్ధంగా వుండవు.
కారణం ఒక్కటే. 'రాజకీయం'.
ఇక్కడే ప్రజాసంఘాల పాత్ర వస్తుంది.
రాజకీయ పార్టీలు తమ తప్పుల్ని ఎలాగూ ఒప్పుకోవు. వాటిని ఒప్పించేలా చేయగలిగే
సత్తావున్న ప్రజాసంఘాలు ఈనాడు లేవు. పత్రికలు, మీడియా ఈ పాత్ర పోషిస్తున్నాయి. కానీ, రాజకీయ మరకలు పడి,
వాటి విశ్లేషణలకు, అభిప్రాయాలకు,
సూచనలకు, సలహాలకు ఒకనాడు వున్న మంచి గుర్తింపు మసకబారి పోతోంది. ఎన్నికల్లో పోటీ
చేయకూడదన్న లోక్ సత్తా జయప్రకాశ్ నిర్ణయం వల్ల ప్రస్తుత రాజకీయ వాతావరణంలో మృగ్యంగా
వున్న ఒక మధ్యవర్తి లోటు తీరితే మంచిదే.
ఎందుకంటే బరులు గీసుకుని మొండిగా
వ్యవహరిస్తున్న నాయకులకు సర్దిచెప్పేవాళ్ళ అవసరం మునుపటికంటే ఇప్పుడు ఎక్కువగా
వుంది. కానీ, రాజకీయం చేసివచ్చిన వ్యక్తి మంచి చెప్పబోయినా వినేవాళ్ళు ఉంటారా
అనేదే సందేహం.
ఏదిఏమైనా ప్రస్తుతం వున్నవాతావరణం
మారితీరాలి. సమస్యలతో సంబంధం వున్న ప్రతి
ఒక్కరూ ఒక మెట్టు దిగాలి. బెట్టు
వీడి ముందు వినడం నేర్చుకోవాలి. విన్నదాన్ని
విశ్లేషించుకోవాలి. ప్రతి అంశాన్ని రాజకీయం చేయకూడదు. మంచిని మంచిగా చూడగలిగి, చెడును చెడుగా చెప్పగలిగే ధైర్యం అలవరచుకోవాలి.
ఇది సాధ్యమా అని ప్రశ్నించుకుంటే
సాధ్యం కాదు.
సాధ్యమే అని నిశ్చయించుకుంటే అసాధ్యం
కాదు.
ఉపశ్రుతి : టీవీ ప్రకటనల్లో ‘మరక’
మంచిదేమో కానీ రాజకీయాల్లో కాదు.
(23-03-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491
30595
Lok satta name itself is bad. JP is not cut out for politics. He should have served as IAS instead of politics. He is a confused intellectual.
రిప్లయితొలగించండిit is actual satta of jayaprakash narayan
రిప్లయితొలగించండి