మొక్కితే సాయి, తొక్కితే రాయి, అంతా
నమ్మకం.
నలభయ్ ఏళ్ళక్రితం మొదటిసారి అక్కడికి
వెళ్లాను. మధ్య మధ్య వెడుతూనే వున్నాను.
ఈరోజూ అలానే వెళ్లాను.
సాయంత్రం జ్వాలా ఫోను చేశాడు, వెడదామా
అని. ఏటా వెడుతున్నాం కదా! పద! పోదాం అన్నాడు.
నిజానికి ఒంట్లో నిస్సత్తువుగా వుంది.
ఏదో కారణం చెప్పి తప్పుకుందాం అనుకునేలోపునే మా ఆవిడ పోదాం పదండి అంది. ఏడాదికి ఒక్కరోజు. అడిగిన వెంటనే ఔనంటే పోలా!
పైగా రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా.
ఆవిధంగా సతీ సమేతంగా జ్వాలా ఇంటికి వెళ్లి అటునుంచి ఆటే వెళ్ళాము. జ్వాలా
భార్య, మా మేనకోడలు అయిన విజయలక్ష్మి, ఆవిడ పెద్దమ్మాయి బుంటీ అనబడే ప్రేమమాలిని
ఆఫ్ టీవీ – 5 ఫేం. మరో కారులో మా అన్నయ్య భండారు రామచంద్రరావు, ఒదినె విమలాదేవి,
కొడుకు జవహర్, కోడలు రేణు, వాళ్ళ ముద్దుల పట్టి మాధుర్య. మొత్తానికి యెట్లా
అయితేనేం మూడు కుటుంబాల వాళ్ళం కలిసి వెళ్లాం.
పోయేసరికి చాలామంది జనం. ఎవరి మోహంలో
చూసినా తన్మయత్వం. కావాలని మనసుపడి చేరిన వాళ్లతో కలిసి వెళ్లి భగవాన్ సాయిబాబా
దర్శనం చేసుకున్నాం. దాదాపు రెండు మూడు ఏళ్ళు అయివుంటుంది వెళ్లి. అయినా చివరిసారి
చూసినప్పుడు ఎలా వుందో అలాగే వుంది, మందిరం మధ్యన పెట్టిన సత్య సాయిబాబా ఫోటో సైజు
మాత్రం పెద్దదిగా అనిపించింది. జనంలో అదే భక్తీ. అదే తన్మయత్వం. అదే నిశ్శబ్ద
వాతావరణం. ‘సాయి రాం’ అంటూ సాయి సేవకుల పలకరింపు. సత్య సాయి ఈ లోకం నుంచి
నిష్క్రమించిన తరువాత కూడా ఏ మార్పూ కానరాలేదు. నమ్మకంలో వున్న దృఢత్వం అలాంటిది
మరి.
నమస్కారం చేసుకుని వస్తూ వుంటే ఒక సాయి
సేవకుడు జ్వాలాను పక్కకు పిలిచి ఏదో చెబుతున్నాడు. ఆయన ఎవరో జ్వాలాకు పరిచయం
ఉన్నట్టుగా అనిపించలేదు. కానీ అతడు ఒదిలిపెట్టలేదు. మమ్మల్ని అందర్నీ మళ్ళీ మందిరం
లోపలకి వెంటబెట్టుకువెళ్ళాడు. బాబా ఫోటో వెనకగా వున్న మెట్లమీదుగా పైకి
తీసుకువెళ్ళాడు. మా మొహాల్లో ఆశ్చర్యం.
పైకి వెడితే ముందు ఒక డ్రాయింగు రూము.
బాబా అంతరంగికంగా భక్తులకు దర్సనం ఇచ్చే చోటు. ఆయన కూర్చునే ఆసనం, పరిసరాలు అన్నీ
కూడా స్వామి అక్కడే మకాం చేస్తున్నారా అనేంత పరిశుభ్రంగా వున్నాయి. ఆ పక్కన ఓ గది.
పక్కగా ఓ మంచం. దాని మీద పరుపు, తలగడ. ఉతికి శుభ్రం చేసిన ఒక రుమాలు చక్కగా మడత
పెట్టి వుంది. వెనుక మరో చిన్న అంతరంగిక మందిరం.
సాయి సేవకుడు చాలా మర్యాదగా అందరికీ
విబూది పొట్లాలు ఇచ్చాడు. అలాగే మా అందరికీ, ఇదిగో కింద ఫోటోలో కనబడుతుంది చూశారు,
“90 years of
transforming humanity – you will never walk alone” అని రాసి వున్న బాబాగారి పెద్ద ఫోటో ఫ్రేములను కానుకగా ఇచ్చాడు.
అక్కడికి వచ్చిన అందరికీ ఇలా జరిగిందా అంటే లేదు. పోనీ మేము తెలుసా అంటే
అదీ లేదు. ఎవరో అనుకుని మాకు ఈ మర్యాదలు చేస్తున్నాడా అంటే అదీ కాదు. అతడి నుంచి
ఒకటే జవాబు, స్వామి అనుగ్రహం. అంతే.
మందిరం బయట వున్న విబూది బొట్టు నొసటన
పెట్టుకోకపోయినా, బొట్టు పెట్టినట్టు మర్యాదలు జరిగాయి. వెంట వచ్చిన ఆడవాళ్ళు మాత్రం మహాశివరాత్రి మహిమ
అనుకుంటూ మురిసిపోయారు. వాళ్ళ సంతోషం
బయటకి కనిపించింది. మాది కాదు, అంతే తేడా!
స్వామి హైదరాబాదు రాక దశాబ్దాల కాలం
గడిచింది. నల్లకుంటలోని ‘శివం’ లో ఆయన బస చేసిన గుర్తు కూడాలేదు. అయినా ఆయన అక్కడే
ఉన్నట్టుగా వున్నాయి అక్కడ ఏర్పాట్లు. వాటిని చూడగలగడం మాత్రం చాలా ప్రత్యేకంగా
అనిపించింది. అది నిజం. (07-03-2016)
ఓం సాయి రాం. You are blessed sir
రిప్లయితొలగించండి